Tuesday, May 30, 2017

Good Morning - 642


ఎవరినీ దూరం చేసుకోకండి. ఎందుకంటే అలా చేసుకోవడం అంటే మనకి బాగా తెలిసిన వాళ్ళలో - వారు ఒకరే కావొచ్చు. కానీ వారి ఆప్యాయత, ఆనందం, సంతోషాలని దూరం చేసుకోవడమే.. అందుకే వారిని ఉన్నప్పుడు బాధ పెట్టకండి. మీరూ బాధ పడకండి. 



Sunday, May 28, 2017

Quiz


ఈ చిత్రములో ఎన్ని త్రిభుజాలు Triangles ఉన్నాయో చెప్పండి చూద్దాం.. ?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 12


1. ABCA 
2. ABDA 
3. ADCA 
4. ABEA 
5. BECB 
6. ABFA 
7. AFCA 
8. BCFB 
9. BFDB 
10. FDCF 
11. FECF 
12. AFEA 



Thursday, May 25, 2017

Quiz


రెండు అంకెలని కూడినా, 
గుణించినా జవాబు ఒక్కటే.. 
అవేమిటో చెప్పగలరా ? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 2, 2


Tuesday, May 23, 2017

Railing Repair

అలా బాల్కానీ నుండి తొంగి చూస్తుండగా - రేయిలింగ్ Railing కి ఉన్న ఇనుప పట్టీ వదులై అసహ్యముగా కనపడసాగింది. అలాగే వదిలేస్తే మరింతగా పాడేయ్యేలా ఉంది. అప్పట్లో స్క్వేర్ ఐరన్ ట్యూబ్ Square Iron Tube కి డిజైన్ వచ్చేది కాదు. ఆ చదరపు ట్యూబ్ నీ, ఆ డిజైన్ పట్టీని విడివిడిగా వంచి, ఒక్కటిగా దగ్గరకు చేర్చి, వెల్డింగ్ చేశారు. ఈ పని బాగుంది. కానీ కాసింత శ్రద్ధ ( అంటే పట్టీకి ట్యూబ్ కీ మధ్యన ఉండే సన్నని గ్యాప్ ని లప్పం గానీ, సిమెంట్ ద్వారా గానీ పూత వేసి మూసేయ్యలేదు ) తీసుకోక అందులోకి వర్షం నీరు, ఉతికిన బట్టల నీళ్ళూ పడీ, అందులోకి వెళ్ళి... త్రుప్పు పట్టి అ రెండింటి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇలా అవుతుందని ఆ వెల్డర్ గానీ, ఇటు పెయింటర్ గానీ చెప్పలేదు.. ఎవరి స్వార్థాలు వారివి. మనకా తెలీదు. సో, చివరకు బలయ్యేది మనమే.. 

వర్షపు నీరు ఆ సందులోకి చేరి, మరింత త్రుప్పు పట్టేలా చేస్తూ, అక్కడే ఆవిరయ్యేది. ఫలితముగా ఇనుప పట్టీ తడి ఆరిపోగానే సన్నని ఇనుప రజనులా రాలిపోయి, ఆ ట్యూబ్ కీ, పట్టీకీ మరింతగా దూరం చేసింది.. ఫలితముగా అక్కడక్కడా నా చిటికెన వ్రేలు పట్టేలా దూరం జరిగాయి. 

అలా ఉండటం వల్ల వ్రేళ్ళు ఇరుక్కోవడం, త్రుప్పు పట్టడం వల్ల అది సన్నగా అయ్యి, కోసుకపోయేలా మారింది. పెద్దవాళ్ళకే ఇబ్బందిగా ఉంటే ఇక పిల్లల సంగతి..? వామ్మో..! తలుచుకుంటే భయంకరముగా తోచింది. దాన్ని బాగుచేద్దామంటే - వెల్డర్ వచ్చి, చూసి, అది పూర్తిగా తొలగించి, షాపుకి తీసుకరండి. చేసిస్తాను అని అన్నాడు. తన చార్జెస్ ఒక వేయి తీసుకుంటాను అన్నాడు. అదీ నన్ను చూసి.. లేకుంటే ఇంకో ఐదు వందలు అదనంగా చెప్పేవాడట. 

ఇక్కడ వర్షం నీరు పడకుండా ఆపే పరిస్థితి లేదు.. బాల్కానీ కాబట్టి. ఉతికిన బట్టలు అక్కడే ఆరేస్తాం కాబట్టి దాన్నీ నివారించలేం... ఈ వెల్డర్ + పెయింటర్ ల తప్పు వల్ల ఇప్పుడు వెల్డర్ కి 1500 + రెయిలింగ్ గ్రిల్ తీయించినందులకు 350 + రానుపోను రిక్షా 200 + మళ్ళీ బిగించటానికి మేస్త్రీ ఖర్చు 650 + తన సహాయకుడికి 350 + పెయింటర్ కి 1000 + పెయింట్స్ కి 600...........( ఇక్కడి వరకే Rs. 4650 )  ఇదీ ఖర్చు. ఇవి కనిపించేటివి. ఇక కనిపించనివి - అక్కడే ఉండి నిర్వహణ చూసుకోవాలి - ఇది ఒకరోజు మన సమయం, కూలీలని, రిక్షానీ, సిమెంట్, పెయింట్స్ తేవటానికి అయ్యే ఖర్చులూ అదనం.. చూశారా !.. చిన్న పొరబాటుకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. అందుకే ఇంటి నిర్వహణ అంత వీజీ కాదు.. అన్నీ బాగుండేలా చూడాలంటే చాలా చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలి.. అవును.. చిన్న చిన్న విషయాలే.. బోర్ గా ఫీలయ్యి నేర్చుకోవటానికి ఇష్టపడం.. కానీ ఆ చిన్నపనులు మన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని మింగేస్తాయి. అందుకే ఇలాంటి పనులు ఎలా చెయ్యాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి అయిపోయాక చేయి కాలింది అని తెలిశాక అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు విచారించటం తప్ప మరేమీ చెయ్యలేం.. అందుకే ఇలాంటి విషయాల్ని మీకు తెలియాలని చెబుతున్నాను. ప్రపంచం లోని చాలామందికి ఇలాంటి విషయాలు చాలా అవసరం. ఇలాంటి విషయాలకు గూగుల్ లో వెదికితే ఏమి చెయ్యాలో తెలియడానికి ఇలాంటి పోస్ట్స్ కూడా పెట్టాల్సి వస్తున్నది. అందుకే చాలా వివరముగా వ్రాస్తున్నాను. నిజానికి ఇలాంటి పోస్ట్స్ కి బ్లాగ్ వీక్షకుల సంఖ్య బాగానే ఉంది. మామూలు పోస్ట్స్ కన్నా వీటికే వ్యూయర్ షిప్ Viewership  ఎక్కువగా ఉంది కూడా..  నా బ్లాగ్ స్టాటిస్టిక్స్ కూడా ఇది నిజమని ఋజువు చూపిస్తున్నది కూడా.. 

సరే.. ఇక అసలు విషయానికి వద్దాం.. 

ఆ గ్యాప్ లో ఏమి పెడితే బాగుంటుందో ఆలోచన చేశాను. వాల్ పుట్టీ పెడితే ?? అన్న ఆలోచన. బాగుంది కానీ అంత లావుగా అయితే పగుళ్ళు వచ్చి, ఊడిపోతుంది.. పోనీ M-seal లాంటిది పెడితే?? ఇది బాగుంటుంది కానీ అంత పెద్ద గ్యాపుల్లో దాన్ని నింపేసరికి ఖర్చు మరింతగా పెరిగిపోతుంది. మనకు తక్కువ ఖర్చులో - తక్కువ సమయంలో అంతా బాగా కావాలి. మరి ఎలా ? అని ఆలోచిస్తే - సిమెంట్ పెడితే..? వావ్.. మంచి ఆలోచన. అదే బెస్ట్ ఇది 10 - 20 రూపాయల్లో అయిపోతుంది. 

ముందుగా చదరపు ట్యూబ్ కీ, పట్టీకి మధ్యన జాగాలో ఉన్న తుప్పుని ఒక స్క్రూ డ్రైవర్ సహాయన వచ్చినంతవరకూ తొలగించాను. 

ఆ రెండింటినీ కలిపి ఉంచేలా చేసిన వెల్డింగ్ వద్ద ఉన్న త్రుప్పుని ఒక చిన్న సుత్తె సహాయన లోతుగా త్రుప్పుని రాలగొట్టాను. 

ఆ తరవాత మామూలు బైండింగ్ వైర్ ( ఇంటి స్లాబుల్లో స్టీలు వూచలని బంధించడానికి వాడేది ) కాకుండా GI వైర్ మీడియం మందముగా ఉన్నది తీసుకున్నాను. ఇందులో తేడా ఏమిటంటే - బైండింగ్ వైర్ కొద్ది కాలానికే త్రుప్పు పట్టి విరిగిపోతుంది. అదే GI వైర్ త్రుప్పు పట్టక అలాగే ఉంటూ గట్టిగా ఆ రెండింటినీ పట్టి ఉంచుతుంది. అందువల్ల ఇలాంటి చిన్న విషయాలు కీలకం. ఈ తీగ ఎల్లప్పుడూ అక్కడ వాతావరణానికి ఎక్స్ పోజ్ అవుతుంది. కాబట్టి ఇదే వాడమని సలహా. 

( ఇది చేసి, విజయం సాధిస్తానని నాకు తెలీదు. నా స్వంత ఆలోచన.. నిజానికి ఈ పనిలో సక్సెస్ అవుతాననీ తెలీదు. కనుక రెయిలింగ్ మొదట ఎలా పాడయ్యిందో చూపే ఫోటోలు తీయలేదు. అందులకు మన్నించండి. )

GI వైరుతో రెండు చుట్లు చుట్టి, కొనలని ముడివేసి, మెలి త్రిప్పాను. దీనివల్ల అది వాటిని దగ్గరగా లాగుతుంది. అలాగే గట్టిగా బంధించి ఉంచుతుంది. ఈ క్రింది ఫోటో చూడండి. 


ఆ తరవాత సన్నని ఇసుక, సిమెంట్, కాస్త నీరూ కలిపి చపాతి పిండిలా గట్టిగా కలుపుకోవాలి. 

ఆ రెండింటి గ్యాప్ లో ఆ సిమెంట్ వేసే ఒక నిమిషం ముందు - సిమెంట్ వేసే ప్రాంతాన్ని నీటితో తడుపుకోవాలి. ఇలా ఎందుకూ అంటే - ఆ సిమెంట్ మిశ్రమం ఆ ఇనుప రెయిలింగ్ గోడలకి గట్టిగా పట్టుకుంటుంది. చాలామంది మేస్త్రీలు ఈ చిన్న విషయాన్ని మరుస్తారు. ఫలితముగా పగుళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే కాస్త తడి ఉన్నప్పుడే సిమెంట్ వేసుకోవాలి. 

క్రింది వైపున అట్టముక్క లేదా ఎడమచేతిని వాడి, ఆ గ్యాప్ లో సిమెంట్ మిశ్రమాన్ని వేసి సన్నని తాపీతో అదమాలి. అలా పైవరకూ చేసి, కాసేపు ఆగాక ఒక చెక్క ముక్కతో లెవల్ చేసుకోవాలి. 

స్మూత్ / నునుపు ఫినిషింగ్ కావాలంటే ఒక లప్పం రేకుతో రాస్తే సరి.. నేను మాత్రం ఇక్కడ నీటిలో తడిపిన స్పాంజ్ ముక్కతో నునుపు చేశాను. ఫలితముగా గరకుగా వస్తుంది. ( అది ఆరాక వాల్ పుట్టీ ని లప్పం రేకు సహాయాన పూసి, స్మూత్ / నునుపు చేసి, ఎమరీ పేపర్ తో రుద్ది, మరీ నునుపు చెయ్యాలని నా ఆలోచన. ఆ తరవాత పెయింట్ వేస్తే ఇలా అయ్యిందని మనం చెబితే గానీ ఎవరూ తెలుసుకోలేరు..) 

అలా చేశాక నీటి తడులు చాలానే ఇచ్చాను. ఫలితముగా చాలా బాగా ధృడముగా ఆ రెయిలింగ్ మారింది. 


ఆ తరవాత ఈ రెయిలింగ్ గోడకి కలిసే చోట అక్కడ నీటి తేమ వల్ల పూర్తిగా పాడయ్యి, సన్నని పోచ మీద ఆగింది. ఇక్కడ నిలబడితే ఆధారం లేక పడిపోతామేమో అన్నంతగా భయం వేసేది. అంత ధృడమైన రెయిలింగ్ నీటి తేమ వల్ల త్రుప్పు పట్టి, సన్నని పోచలుగా మారింది.. రెండు పోచల తీగలా మారి దాని ఆధారముగా గోడకి ఫిక్స్ అయ్యింది. ( ఇది ఫోటో తీయటం మరిచా.. తీసుంటే అది ఏ మేరకు త్రుప్పు పట్టి పాడయ్యిందో తేలికగా తెలిసేది. అది గనుక మీరు చూసుంటే అది ఖచ్చితముగా క్రొత్త రెయిలింగ్ ని మార్చాలి అని అనేవాళ్ళు. నేను చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతం అవుతుందని నాకే నమ్మకం లేక... అలా ఫోటో తీయటం మరిచా. ఎందుకంటే ఇలా నేనెప్పుడూ చెయ్యలేదు. వేరేవారు చెయ్యగా నేనెప్పుడూ చూడలేదు ) దీనికీ చక్కగా సిమెంట్ వేశాను. వేశాక తడి స్పాంజ్ తో ఎక్కువైన  సిమెంట్ ని తొలగించాను. 

వారం రోజులు చక్కని నీటి తడులని ఇచ్చాను. బాగా గట్టిపడిపోయింది. బలముగా నెట్టినా ఏమాత్రం కదలనంతగా గట్టిగా మారింది. దూరం నుండి చూస్తే అది ఆ గ్రిల్ లోని భాగమే అన్నట్లు కుదిరిపోయింది. ఇలా వెయ్యక ముందు అక్కడ నిలబడాలంటేనే భయముగా తోచేది.. ఇప్పుడు మాత్రం చాలా గట్టిగా ఉండి, నమ్మకముగా ఆనుకొని ఉండేలా మారింది. 


ఇక కొద్దిరోజుల తరవాత వాల్ పుట్టీని లప్పం రేకుతో వేసి, ఎమరీ పేపర్ సహాయాన నునుపు చేసి, రంగు వెయ్యాల్సిన పని మిగిలింది. అదీ త్వరలోనే ముగిస్తాను. అప్పుడు ఈ గ్రిల్ అలా రిపేర్ చేశా అంటే ఎవరూ నమ్మకుండా తయారవుతుంది. క్రొత్త రెయిలింగ్ మాదిరిగా కనిపిస్తుంది. 

చూశారా ! ఎంత ఖర్చుని తప్పించి, తక్కువ ఖర్చులో బాగుచేసుకున్నాను కదూ.. మొత్తం ఖర్చు అంతా ఇరవై Rs. 20 రూపాయలకు మించలేదు.. ఇక వాల్ పుట్టీ, రంగులూ వంద లోపే అయిపోతాయి.. అవీ నేనే వేసుకుంటే. మొత్తానికి నా కాసింత శ్రమ, ఆలోచనతో  పెద్ద ఖర్చుని తొలగించుకున్నాను.

ఈ పద్ధతిని ఆరుబయట ఎండకు ఎండీ, వానకు నానే పాఠక్ / గేట్లు / జాలీ గేట్లు / గ్రిల్స్ కి శుభ్రముగా వాడుకోవచ్చును.

Railing repair

మీకు తేలికగా అర్థం కావటానికి  ఫోటోలు అన్నీ Extra Large మోడ్ లో అప్లోడ్ చేశాను. 

Friday, May 19, 2017

Good Morning - 641


ఇదిగో.. ఇప్పుడే.. 
నువ్వటు వెళ్ళావో లేదో - 
నా మనస్సంతా ఏదో చెప్పలేని వెలతి, 
అంతా శూన్యం.. 
భరించలేని శూన్యం.. 


Tuesday, May 16, 2017

Repairing of Cheppal Stand

మొన్న ఖాళీగా ఉన్నప్పుడు - ఇల్లు సర్దుతూ ఉంటే మూలన ఉన్న చెప్పుల స్టాండ్ Cheppal stand కనిపించింది. దాని ఒక కాలు నీటి తేమ వల్ల తుప్పు పట్టి విరిగిపోయింది. ఇదే స్టాండ్ ని గతం లో ( 2012 సం.) బాగు చేసుకొని, రంగులు వేశాను. అదెలా చేశానో ఈ బ్లాగ్ పోస్ట్ లో http://achampetraj.blogspot.in/2012/01/blog-post_07.html లో వివరముగా వ్రాసాను. అప్పుడు తరవాత ఇన్నాళ్ళకు ఇప్పుడు పని పెట్టింది. ఒక మామూలు ఇనుప చెప్పుల స్టాండ్ ఇన్ని సంవత్సరాల కాలం పనిచెయ్యడం చాలా గొప్ప విషయమే.. బహుశా నేను దాన్ని 2008 - 2009 లో కొని ఉండొచ్చు. అంతగా గుర్తులేదు. 

ఇప్పుడు ఒక కాలు విరిగి - కదులుతూ పైన పెట్టిన చెప్పుల జతలు పడిపోవటం మొదలెట్టాయి. అయినా దాన్ని చెత్తలోకి పారెయ్యటం నాకు మనసొప్పలేదు.. ఇంకొంత కాలం దాని సేవలని పొందాలనిపించింది. బాగు చేసుకోవాలని అనుకున్నాను. కొద్దిసేపు ఆలోచిస్తే చాలా తేలికైన పరిష్కారం కనిపించింది. అది చాలా తక్కువ ఖర్చులో చేసుకోనేదిగా ఉంది. కేవలం 10 - 20 రూపాయల్లో అయిపోతుంది. ఇది గనుక సక్సెస్ ఐతే మరో ఐదేళ్ళు తేలికగా పనిచేస్తుంది అనిపించింది. చెప్పుల స్టాండ్ మరొకటి రెండొందలు పెట్టి కొనొచ్చు, కానీ 10 - 20 రూపాయల్లో బాగయ్యి, మరింతకాలం ఉపయోగానికి వస్తుందీ అంటే ఒక ప్రయత్నం చేయడం మంచిదే కదా.. అదీ చాలా తక్కువ ఖర్చు, తక్కువ సమయం, తక్కువ శ్రమ వల్ల. చూద్దాం ఈ ప్రయత్నం చేసి చూద్దాం అనుకున్నాను. బాగయితే వాడుకుందాం.. లేకుంటే చెత్తలోకి పంపడమే.. ఒకసారి ట్రై చేస్తే - నాకున్న సాంకేతిక నైపుణ్యాన్ని మరింతగా అప్డేట్ చేసుకున్నట్లూ అవుతుంది కదా.. అని అనుకున్నాను. 

ముందుగా స్టాండ్ ని బయట పెట్టి శుభ్రం చేసాను. ఇలా ఈ క్రింది ఫోటోలో ఎర్రని వృత్తాల వద్ద చూపిన చోట్ల తుప్పు పట్టి పాడయ్యింది. ఒక రంధ్రం పడింది, ఒక కాలు విరిగింది. 



నిజానికి ఇలా జరగకుండా చెయ్యటానికి ఒక మార్గం ఉంది. అదేమిటంటే - ఆ స్టాండ్ ని బిగించే ముందు ఆ పైపుల్లో ఎనామిల్ పెయింట్ గానీ, వేడి చేసిన క్రొవ్వొత్తి మైనం గానీ పోసి, లోపల ఒక పూతలా చేస్తే చాలు. కానీ అంత ఓపిక ఎవరికి ఉంది? తక్కువ ఖర్చులో మరొక స్టాండ్ వస్తుంది కదా.. అనుకొని ఆ ఆలోచనని అమలు చెయ్యరు.. ఇప్పుడు నేను బాగుచేసుకున్న పద్ధతిని చూద్దాం.  

ముందుగా ఆ స్టాండ్ కాళ్ళు దూరేంతగా వెడల్పు ఉన్న ప్లాస్టిక్ పైపుని వెదికాను. ఒకరివద్ద కనిపించింది. వారు దాన్ని వృధాగా పడేశారు. ఒకరికి వృధా అన్నది మరొకరికి అవసరం. అది PVC పైపుల్లో హెవీ గేజ్ ది. ఇప్పుడు క్రొత్తగా నిర్మించే ఇళ్ళకు వాడే వాటర్ పైపులు అయితే మరింత ధృడంగా ఉంటాయి. హెవీ గేజ్ Heavy gauge అంటే - పైపు గోడలు మందముగా / లావుగా ఉంటాయని అర్థం. ఆ పైపుని తీసుకోచ్చేసి, ముందుగా ఒక కాలు సైజు తీసుకొని, ఆ సైజుకి హెక్సా బ్లేడ్ సహాయన కోశాను. అదే సైజుని ప్రామాణికముగా పెట్టుకొని, ఈ క్రింది విధముగా పెట్టి, మరో మూడు కాళ్ళు కోశాను. వాటి అంచులని, వెలుపలి భాగాల్ని ఎమరీ పేపర్ / సాండ్ పేపర్ మీద రుద్ది నునుపు / శుభ్రం చేశాను. 


ఇపుడు ఆ స్టాండ్ ని ఒక పేపర్ మీద తిరగేసి పెట్టి, పైకి వచ్చిన కాళ్ళకి ఆ పైపులని తొడిగాను. ఒక గిన్నెలో కాస్త సన్నని ఇసుక + సిమెంట్ ని జారుడుగా కలుపుకోవాలి. ఒక ప్లాస్టిక్ గరాటు తీసుకొని ఆ ప్లాస్టిక్ కాలులో పెట్టి, అందులోకి ఈ సిమెంట్ మిశ్రమాన్ని పోయాలి. బాగా కుదురుకోనేందుకు ఒక సన్నని స్క్రూ డ్రైవర్ తో లోపలికి అదమాలి. అలా ఆ కాలులో నిండుగా సిమెంట్ వేసుకోవాలి. ( క్రింది ఫోటోని చూడండి ) ఇలా స్టాండ్ నాలుగు కాళ్ళలో వేసుకోవాలి. సిమెంట్ వేశాక ఎలా ఉంటుందో మరొక కాలుని ఫోటోలో చూడండి. 


ఆ తరవాత ఆ సిమెంట్ మిశ్రమం గట్టి పడ్డాక - కారిన సిమెంట్ మిశ్రమాన్ని హెక్సా బ్లేడ్ తో గీసేసుకోవాలి. 
ఒక తడి స్పాంజ్ తో తుడిచినా శుభ్రమవుతుంది. ఇది జాగ్రత్తగా చెయ్యాలి. 
ఎందుకంటే లోపల పోసిన సిమెంట్ మిశ్రమం గట్టిపడలేదు. పౌడర్ లాగే ఉంటుంది.
అందువల్ల కదిపితే పగుళ్ళు వచ్చి, ఎక్కువ కాలం నిలబడదు. 
రెండు మూడు సార్లు నీటి తడి ఇవ్వాలి. అప్పుడు కాస్త గట్టి పడుతుంది.
అలా తడి ఇచ్చాక ఆ స్టాండ్ ని మాములుగా పెట్టుకోవాలి. 
ఆ తరవాత నాలుగు ప్లాస్టిక్ గ్లాసుల్ని తీసుకొని, వాటిల్లో ఈ సిమెంట్ పోసిన స్టాండ్ కాళ్ళని పెట్టాలి. 
ఆ గ్లాసుల్లో నీటిని పోయాలి. ( మన్నించాలి.. ఈ ఫోటోని తీయడం మరిచాను ) 
ఇలా కొన్ని రోజులు ఉంచాలి. 
ఇలా చేస్తే ఆ సిమెంట్ మిశ్రమం చాలా గట్టిగా తయారవుతుంది. 
ఆ తరవాత మామూలుగానే ఆ స్టాండ్ ని వాడుకోవచ్చు. మరింత ఎక్కువ కాలం వస్తుంది. 
పైపులు ఊడిపోయినా, సిమెంట్ రాడ్ లా ఉంటుంది. 
ఈ సిమెంట్ వేసేటప్పుడు GI / ఇనుప వైర్ ముక్క అందులో పెట్టి, 
సిమెంట్ వేస్తే - పగుళ్ళు వచ్చినా గట్టిగా ఆపుతుంది. 
ఇంతే.. 
ఆ స్టాండ్ ని మరో ఐదేళ్ళు లేదా ఇంకా ఎక్కువ కాలం నిరభ్యంతరముగా వాడుకోవచ్చును. 


Sunday, May 14, 2017

Happy Mother's day


మాతృదినోత్సవ శుభాకాంక్షలు. 



Friday, May 12, 2017

Quiz


మొత్తం ఎన్ని చదరాలు / చతురస్రాలు ఉన్నాయో చెప్పండి చూద్దాం..! 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

జవాబు  : 


చిత్రములో మొత్తం తొమ్మిది చదరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. నాలుగు చదరాలు కలిపితే వాటి బార్డర్ మరో చదరం. ఇలా మరో నాలుగు చదరాలు అవుతాయి. అన్ని చదరాల బార్డర్ ని చూస్తే మరొక చదరం.. వెరసి 9 + 4 + 1 = 14 చతురస్రాలు అవుతాయి. 
అదెలాగో వివరముగా ఈ క్రింది విధముగా పరిశీలిద్దాం.. 

1. ABEFA 
2. BCGFB 
3. CDHGC 
4. EFJIE 
5. FGKJF 
6. GHLK 
7. IJMNI 
8. JKONJ 
9. KLPOK 
10. ACKIA 
11. BDLJB 
12. EGOME 
13. FHPNF 
14. ADPMA 



Tuesday, May 9, 2017

Good Morning - 640


ఏ మిత్రుని వద్దనైతే - మీ హోదా, దర్పం, ఆర్ధిక అసమానతలు, వయసు తేడా, స్త్రీయా, పురుషుడా అని చూడకుండా వారివద్ద మాత్రమే చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తూ, ఎవరిని చూస్తే మీ మొహాన కోటి వెలుగులు వెలుగుతాయో, వారి వద్దకి వెళుతుంటే మీ మనసు సంతోషముగా ఉంటుందో, వారితో  మాట్లాడుతుంటే మీరు మీ భావాలని మరింతగా పంచుకోవాలని అనిపిస్తుందో, వారు బాధపడుతుంటే మీ హృదయానికి బాధ కలుగుతుందో, వారికోసం ఏమైనా చెయ్యాలనిపిస్తే - వారే మీ ప్రాణ స్నేహితులు. 

వారిని ఎన్నడూ కలలో కూడా వదులుకోకండి. వదులుకొని ఉంటే - అవసరమైతే ఒక మెట్టు దిగి ప్రయత్నం చెయ్యండి. 



Monday, May 8, 2017

Quiz

? గుర్తు వద్ద వచ్చే సంఖ్య ఎంతో చెప్పండి..  
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 


Saturday, May 6, 2017

తృప్తినిచ్చిన చిన్ని సహాయం.

పోయిన నెలలోని (ఏప్రిల్) ఒకరోజు మధ్యాహ్నం మా ఇంటివద్ద ఎవరో భార్యాభర్తలు తచ్చాడుతున్నట్లు అనిపిస్తే - బయటకు వెళ్ళి చూసా.. గుర్తుపట్టి పిలిచా.. ఏమిటీ? ఇక్కడ అని వాకబు చేశా.. వారు నా ఇంటి గురించే వెదుకుతున్నారు.

వారిద్దరూ రోజువారీ కూలీపని చేసుకొనే భార్యాభర్తల జంట. ఒకసారి లేబర్ అడ్డ మీద ఆయనతో లేబర్ పనికి పిలుచుకొని వచ్చి, పనిచేయించుకున్నాను... అలా గుర్తుపెట్టుకొని వచ్చాడు. తను నాక్కావలసిన పనిని చాలా బాగా చేసిచ్చాడు. అలా గుర్తున్నాడు తను. ఏమిటని అడిగా.

ఏమీ మాట్లాడకుండా - చేతిసంచీ లోనుంచి కాళ్ళ పట్టీలు తీసి, నాముందు పెట్టాడు. నాకు అర్థం కాలేదు.. ఎందుకిలా అని అనుకోబోతుండగా తానే చెప్పాడు.. వాళ్ళబ్బాయికి బాగా జ్వరం వచ్చిందనీ.. హాస్పిటల్ కి తీసుకెళ్ళితే అప్పటివరకూ రూ. 15,000 రూపాయలు దాకా ఖర్చయ్యాయనీ.. ఇంకా జ్వరంగానే ఉందట.. మరికొన్ని డబ్బుల కోసం అవసరం వచ్చి.. స్థానికముగా ఎవరూ తెలీకపోతే - నేను గుర్తుకవచ్చి వచ్చాడుట.

" ఎంత డబ్బు కావాలి? " అన్నాను.

" ఒక ఐదు వందలు " అన్నాడు. దాదాపు రూ. 4,500+ నికర విలువ చేసే పట్టీలని పెట్టుకొని కేవలం ఐదు వందలు (500) కోసమే వచ్చాడా? నాకూ ఆశ్చర్యముగానే ఉంది. నేనెప్పుడూ అలా వడ్డీలకు డబ్బులు ఇవ్వలేదు. ఇక వస్తువులని పెట్టుకొని ఇవ్వడం అనేది మరీ క్రొత్త అనుభవం. తానెవరో, ఏమి పేరో, ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలీదు.

నామటుకు మాత్రం కొద్దిగా తెలిసినవారైనా అడిగితే - ఒక వంద వరకూ తిరిగిరాని ఋణం గా భావించి ఇస్తుంటాను.. అలాంటిది ఇక్కడ ఐదు వందలు అంటే హ్మ్ కష్టమే..

నా మది భావాలు చదివినట్లున్నాడు.. " ఇది దగ్గర పెట్టుకొని ఐదు వందలు ఇస్తే చాలు.. ఎల్లుండి డబ్బులు తెచ్చి ఇచ్చి, పట్టీలని తీసుకెల్లుతాను " అన్నాడు. ఈసారి తన మాటల్లో ఆపుకుంటున్న దుఃఖం, పిల్లవాడిని బ్రతికించుకోవటానికి నాకున్న ఇదే ఆఖరి అవకాశం అన్న నిస్సహాయత కనిపించింది. ఆ మాటల్లో ఎంతో నిజాయితీ ఉందనిపించింది. వాళ్ళావిడని చూసా... తలపై మేలి ముసుగు వేసుకొని నాకు మొఖం కనిపించకుండా మౌనముగా రోదిస్తున్నట్లు ఉంది.

ఇక ఆలస్యం చెయ్యలేదు. వెంటనే ఐదు వందల రూపాయల నోటు ఇచ్చాను. తను నా చేతికి ఆ పట్టీలని ఇచ్చాడు. అలా చేస్తాడని నేను ఊహించలేదు. వారెవరో నాకు తెలీదు కాబట్టి నా జాగ్రత్త కోసం ఆ పట్టీలని తీసుకొన్నాను. వెళ్ళొస్తాను అంటూ వెళ్ళాడు.

మరుసటి రోజున మళ్ళీ వచ్చాడు. ఇంకో ఐదు వందల రూపాలు తక్కువ అవుతున్నాయని. ఈసారి కాస్త ధైర్యముగా వాటిని తీసి ఇస్తే, తీసుకొని తను వెళ్ళిపోయాడు. ఇలా రోజూ వస్తాడా? అలా అయితే ఏమైనా సరిక్రొత్త సమస్యలని తలకెక్కించుకుంటానా ? చూద్దాం.. వెయిట్ అండ్ సీ అనుకున్నా...

మరుసటి రోజు కాదు కానీ నాలుగో రోజున వచ్చాడు. వచ్చి నా చేతుల్లో రెండు వేల నోటు పెట్టాడు. అది తీసుకొని లోపల పెట్టేసి, తన పట్టీలు + మిగిలిన చిల్లర వేయి రూపాయలు ఇచ్చాను. హమ్మయ్యఅ డబ్బులు నాకు వచ్చాయని ఒక వైపు.. ఒకరి జీవితాన్ని కాపాడటం లో ఒక చిన్న సహాయం చేశానని మరోవైపు సంతోషం..

అలా ఉన్న నా ముందు వంద నోటు పెట్టి, వడ్డీ తీసుకోమని అన్నాడు..
నేను అడగలేదు.. తానే నిజాయితీగా చెప్పాడు.
నాకు ఆ డబ్బుని ముట్టాలనిపించలేదు. వద్దన్నాను.
తీసుకోమని గట్టిగా ప్రాధేయపడ్డాడు.
నేను లేకపోతే డబ్బులు అందక ఎలా ఉండేదో.. అందుకే వడ్డీ తీసుకోమని అన్నాడు. నాకు నచ్చలేదు. నాకిచ్చే ఆ వడ్డీ ఏదో మీ బాబుకి నా తరపున ఇవ్వు.. దేనికైనా పనికి వస్తాయని చెప్పా.. వడ్డీ ఎంతనో కూడా నేను ఇప్పటివరకూ లెక్క కట్టలేదు. నా చిన్న సహాయం వల్ల ఒకరి జీవితం నిలబడింది అన్న తృప్తి చాలు నాకు.




Tuesday, May 2, 2017

Good Morning - 639


కొందరు మన జీవితములోకి వచ్చి, మనల్ని సంతోషముగా ఉంచుతారు. మరికొందరు మన జీవితము నుండి వెళ్ళిపోయి మనల్ని సంతోషముగా ఉంచుతారు. 
జీవితములో ఏమి జరిగిన మన మంచికోసమే అని ముందుకు సాగాలి. 




Related Posts with Thumbnails