ఆపదలో ఆదుకొనేవాడే స్నేహితుడు.
అవును.. ఆపదలోనే కాదు.. అన్నింట్లో ఆదుకొనే వాడు స్నేహితుడు. అలా ఆదుకొనే స్నేహితుడే మనకి ఉండాలి. గంగిగోవు పాలు గరిటడైనను చాలు.. కడవడైనను నేమి ఖరము ( గాడిద ) పాలు .. అన్న వేమన సూక్తి ప్రకారం - మనకి ఎంతమంది స్నేహితులున్నారు అన్నది ముఖ్యమైన విషయం కాదు.. ఎంతమంది మనతో అక్కడికీ, ఇక్కడికీ వస్తున్నారు అని కాదు. మనవాళ్ళు అనుకున్నవారు మన ఆలోచనలకి వత్తాసు పలుకుతున్నారు అన్నదీ కూడా కాదు.. ఇవన్నీ పై పై మెరుగుల స్నేహాలే. నిజానికి మనం ఆపదల్లో చిక్కుకున్నప్పుడు మనకు ధైర్యవచనాలు చెప్పి, కర్తవ్యన్మోఖుడిని చేసి, లక్ష్యం దిశగా తీస్కెళ్ళగలిగే వాడే మన స్నేహితుడు.
ఇట్టి స్నేహితుడు మనకి ధైర్యం చెబుతాడు.
మన కష్టాల్లో తన వంతు తోడ్పాటుని అందిస్తాడు.
మన సంతోషాల్లో పాలుపంచుకొంటాడు.
మన అవసరాలని ముందే గమనించి, వాటిని సమయానికి అందిస్తాడు.
మన విజయాలని పది మంది ముందూ ప్రశంసిస్తాడు.
మనం చేసే తప్పులని ఒంటరిగా ఉన్నప్పుడు విమర్శిస్తాడు.
దారి తప్పి ప్రయాణిస్తుంటే ముందుండి దారి చూపిస్తాడు.
మనం ఏదైనా తప్పు చేస్తే, మొహమాటానికి వెళ్ళి, అబద్దం చెప్పడు.. మనతో విభేదించి అయినా మనం చేసింది తప్పే అని చెబుతాడు.
లక్ష్యానికి దూరముగా జరిగినప్పుడు, మందలించి లక్ష్య దిశగా వెళ్ళేలా చేస్తాడు.
మీ మిత్రుల్లో ఎవరు మీకు సన్నిహితులో, ఎవరు మీకు వెన్నుపోటుదారులో చెబుతాడు.
మీకు వచ్చే ఆపదలని మీకంటే ముందే ఎదురుకుంటాడు..
....... ఇలా చేసేవాడే మీ అసలైన మిత్రుడు. అంతే కానీ, కాకమ్మ కబుర్లు, ఏది చెప్పినా జై / తాన తందానా అంటూ వంతపాడే స్నేహితులు మన మిత్రుల్లో ఉంటే వారికి దూరముగా ఉండటం మంచిది.