Tuesday, October 20, 2009

చలికాలం - స్వెట్టర్లు

చలికాలాన్ని ఎదుర్కోవటానికి ఉపయోగించే వస్తువుల్లో స్వెటర్లు ఒకటి. చాలామంది స్వెటర్లు ధరిస్తారు కాని అవి తగిన వాటిని ఎన్నుకొని, ఉపయోగించరు. బహుశా వారికి అవగాహన లేమి అని నేను అనుకుంటాను. వారూ, వీరు చెప్పిన సూచనల ప్రకారం కొనుకొని, అవి ధరించి కూడా చలికి వణుకుతూ ఉంటారు.. అవసరమైతే ఆపైన ఇంకోటీ వేసుకుంటారు. నేను అప్పుడెప్పుడో స్వెటర్లు వేసుకున్నాను కాని, చలిని ఎదుర్కునే పద్దతులు కనిపెట్టాక స్వెటర్లు వేసుకోవటం మానివేశాను. అందులో కొన్ని మెళకువలు మీకోసం, మరికొన్ని మిగతా వ్యాసాల్లో తెలియజేస్తాను..

1. సాధారణముగా నేపాలీ వాళ్లు అమ్మే స్వెటర్లు చాలామంది ఖరీదు చేస్తారు. ఎందుకంటే నేపాల్ చలిదేశము, అందువల్ల ఈ స్వెటర్లు వేసుకొనే అక్కడివారు చలిని దూరం చేసుకుంటారనే అపోహ వల్ల వారివద్ద కొంటుంటారు. అతి తక్కువ ఖరీదు, బేరం బాగా చేయవచ్చు, సగం ధరకి అడగవచ్చు, లావుగా మందములో స్వెటర్లు వారివద్ద లభిస్తాయని... ఇత్యాది కారణాలవల్ల కొనుగోలు సాగిస్తుంటారు. వీటిగురించి మీకు ఇప్పుడు వివరిస్తాను.

2. తక్కువ ఖరీదు అన్నది ఆ స్వెటర్లులో వాడే ఉన్నిని / ఊలు బట్టి ఉంటుంది. ఊలు తక్కువ పెట్టి, మిగతాది పత్తి గాని, సింథటిక్ మెటీరియల్ గాని పెట్టి చేస్తే తక్కువకే ఆ వస్తువు తయారవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే చిక్కటిపాలధర ఒకటే ఉంటుంది. అందులో నీళ్లు కలిపినదానిబట్టే ధర తగ్గుతుంది కదా.. ఇదీ అంతే.

3. బేరం బాగా చేయవచ్చు అనేది - మీరు బేరం బాగా చేస్తారని ఆ కొట్టువాడు ఊహించి వస్తువు ధరకి ఎంతో ఎక్కువగా ధర చెబుతాడు. మీరు సగం ధరకి బేరం ఆడుతారు. అతను మనసులో పొంగిపోయి (అసలు రేటుకన్నా కొంత ఎక్కువే వచ్చింది అనుకొని) మొఖం విచారముగా పెట్టి రాదు, రాదు అంటూ కొంత ఎక్కువకే మళ్ళీ పెంచి మీకు అమ్మేస్తాడు - ఆ ధర తనకి ఖరీదు అంటూ, పైగా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని దిగాలుతో కూడిన స్వరముతో అంటాడు. మనసులో మాత్రం "పోరా పుల్లాయ్!.. నీ మొఖం" అనుకుంటాడు. ఒక్కటి మాత్రం నిజం!. "లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు".. అన్న సామెత అక్షరసత్యం.

4. కల్తీ గురించి: కల్తీ కాని వస్తువు ఈ ప్రపంచములో దొరికినా అది చాలా ధరలో ఉంటుంది. చాలా వాటిల్లో కల్తీ అన్నది తప్పనిసరి. అదెలాగో తరవాత చెబుతాను. ఇక్కడ స్వేటరులో కల్తీ కాని ఊలు వాడితే మీరు కొనడానికి సందేహించేలా రేటు ఉంటుంది. అమ్మేవాళ్ళు దాన్ని అమ్మే వచ్చిన లాభముతో బతకాలి కాబట్టి కొంత నాణ్యత తక్కువగానే ఉంటుంది.

5. మందముగా ఉన్నా స్వేటర్ల గురించి: ఎంత మందముగా ఉంటే అంత చలిని ఆపుతాయి అనుకుంటారు కాని వాటిని వేసుకున్నాక ఇంకా చలివేస్తూనే ఉంటుంది.. కారణం: మందముగా రావటానికి గళ్ళు గల్లుగా, కొద్దిపాటి సందులు పెట్టి అల్లుతారు. ఆ సందుల్లోంచి శరీర వేడి బయటకి వెళ్ళిపోయి, అందుల్లోంచే చల్లగాలి మనకి తగులుతూ ఉంటుంది.. వణుకుతూ ఉంటాము..

అందుకే ఎలాంటివి కొనాలంటే -

# స్వేటరు కాటనా? నైలానా? పాలీస్టారా? అనేది కాదు ముఖ్యం.. మనం వేసుకున్నప్పుడు మనకి గుచ్చుకున్నట్లు, ఇరిటేషన్ కలిగించేలా అసలు ఉండకూడదు.. చాలా మెత్తగా, మృదువుగా, హాయిగా ఉండాలి.

# మన శరీరానికి మరీ బిగుతుగా కాకుండా, లూజుగా కాకుండా "హత్తుకునేలా" ఉంటే చాలు. మీ నుండి వేడిని బయటకి పంపదు.

# స్వెటర్ మందముగా ఉందా, పలచగా ఉందా అని కాదు చూడాల్సింది.. పగలు అయితే ఆ స్వేటరుని సూర్యుడి వైపు పట్టుకొని అందులోంచి సూర్యున్ని చూస్తే, సూర్యుడు ఎంతగా కనిపించక పోతే అంత మంచిది. రాత్రిపూట అయితే ప్రకాశవంతమైన బల్బు కేసి చూడాలి. అంటే - ఉన్ని అల్లిక ఎంత దగ్గరగా ఉందో అంతగా మీకు చలినుండి రక్షణ కలగజేస్తుంది. అంటే ఒక అంగుళం బట్టలో ఎంత దగ్గరగా ముడులు ఉన్నాయో అంత మంచి నాణ్యతగా ఉంటుంది అన్నమాట.

# కప్పుకునే రగ్గు విషయములో కూడా ఈ సూత్రం పనిచేస్తుంది. అది ఎంతమందముగా ఉందన్నది కాదు. ముడులు ఎంత దగ్గరగా ఉందన్నది చూడాలి. పలచని కాటను వస్త్రము అల్లిక దగ్గరగా ఉంటే అదీ చలినుండి కాపాడుతుంది. నాకు తెలిసిన వారింట్లో ఒకసారి అంగుళానికి 400 ముడులున్న పలుచని బట్ట కప్పుకున్నాను. అసలు చలే వేయలేదు. అప్పుడు అర్థమయ్యింది. చలిని ఎదురుకోవాలో..

# చలికాలములో లోదుస్తులుగా బనియన్లని వాడుతాముగా.. అవిచేతుల్లేనివి కాకుండా చేతులున్న బనియన్లని మీ శరీరానికి అతుక్కునేలా ఉన్నవి వేసుకోండి. పైన ఫుల్ షర్టు / చేతులున్న చొక్కా వేసుకోండి. పగలు సమయములో చేతులు ముడుచుకున్నా రాత్రి సమయాల్లో కిందకి లాగి గుండీ పెట్టుకుంటే మంచిది. మరీ చలిగా ఉంటే కాలరు గుండీ పెట్టుకోవటం మంచిది. అప్పుడు చూడండి చలి, గిలీ ఉండదు. ఈ సూచన వయసుమళ్ళినవారికి, వృద్ధులకి చాలా ఉపయోగకరం.

# వయసుమళ్ళినవారికి, వృద్ధులకి ఓ సూచన: మీరు షర్టు పైన స్వేటరు వేసుకునే బదులు స్వేటరు మీద షర్టు వేసుకోండి. ఆ తేడాలోని మర్మమేదో మీరే తెలుసుకుంటారు..

# ఒకవేళ మీ దగ్గర స్వేటరు అంటూ లేకపోతే లోపల ఒక టీషర్టు వేసుకొని పైన మామూలు ఫుల్ షర్టు వేసుకొని గుండీలు పెట్టుకుంటే సరి.. స్వెటర్ వేసుకున్నట్లుగా ఉంటుంది. ఈ పద్దతులు పాటించి ఈసారికి, ఎల్లప్పటికినీ చలిని దూరం చేసుకుంటారని ఆశిస్తున్నాను.. 

No comments:

Related Posts with Thumbnails