ఇక్కడ కాడలు, కొమ్ములుగా కనిపిస్తున్నాయే - వాటిని "సంపెంగ" పుష్పాలు అని పిలుస్తారు. కొన్ని చోట్ల "మనోరంజని" అని కూడా వ్యవహారములో ఉంది. చిన్నప్పుడు మాఇంటి పెరడులో ఒక సంపంగిచెట్టు ఉండేది. నిమ్మచెట్టులా అనిపిస్తూ పెరిగే సంపంగిచెట్టు పూలు మాత్రం చాలా సువాసన వేసేది. సీతాఫలం చెట్టు పూవులా ఇది అనిపించిననూ, దానికీ దీనికీ చాలా తేడా ఉంది. పూవు వాసన మాత్రం చాలా బాగా ఉంటుంది.
మొదటి ఫోటోలో ఉన్నట్లు ఇది ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు ఏమాత్రం వాసన ఉండదు. కాని ఆకుపచ్చ రంగు నుండి పసుపుపచ్చ రంగుకి మారుతున్న క్రమములో దానికి సువాసన పెరుగుతూ ఉంటుంది. ఈ చెట్టు పూవులను మాకు తెలీయకుండా వారూ, వీరూ కోసుకుపోయేడివారు. మా ఇంటి పెరడు ఇంటి ముందు ఉండటంతో, దానికి కంచె అంటూ లేక పోవటముతో అలా పూలన్నీ పరులపాలయ్యేటివి.. మాకు ఎప్పుడో ఒకటి దొరికేవి. అదీ ఏ ఆకుచాటుల్లో ఉండిపోతే! ఈ పూలకి ఆకర్షక పత్రాలు అంటూ లేకపోయినా కీటకాలని బాగా ఆకర్షించేటివి. ఇప్పుడు ఈ చెట్టును ఇంటి విస్తరణలో కొట్టేసినా, అప్పటి గత స్మృతులు ఇంకా పదిలముగా ఉన్నాయి..