Wednesday, April 29, 2009

దేవుడి పూజా గది - మార్పులు.

మన గృహాలలో "దేవుడి గది" అంటూ ఒకటి ఉంటుంది కదూ!

సాధారణముగా పడమర వైపున, తూర్పుకు అభిముఖముగా ఉంచుకుంటాము.. మన దేవాలయాల్లో దైవ విగ్రహాల ముఖం తూర్పు వైపుకు చూస్తున్నట్లు ఉంటుంది. ఇదే పద్దతిని మన ఇంట్లోని దేవుళ్ళకూ పాటిస్తాము. కొందరి అభిప్రాయాల ప్రకారం ఈ పడమర వైపున పూజాగది కాకుండా తూర్పు వైపున పెట్టుకుంటే ఫలితాలు బావుంటాయని చెబుతారు.. నిన్న మొన్నటి వరకూ నేనూ అలాగే పడమర వైపున పెట్టిన పూజా గదిని తూర్పుకు మార్చాను - చూద్దాం ఏదైనా మార్పు జరుగుతుందో లేదోనని. ఒకటి రెండురోజులు అంతగా లేకున్నా మెల్లి మెల్లిగా మార్పు కనపడటం మొదలైయ్యింది.

ఇప్పుడైతే అద్భుతమైన ఫలితాలు రాకున్ననూ, ప్రతికూల పరిస్థితులు మాత్రం ఎదురుపడటం చాలా తగ్గాయి. ఈ పనేదో (ఇలా గదిని మార్చటం) ఎప్పటినుండో చేసేది ఉండేను -అని అనిపిస్తున్నది. ఇలాంటివి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాను. వాటిని కూడా ఆచరణలోకి తీసుకవద్దామని నిర్ణయించుకున్నాను.

ఇక్కడ ఒక విషయం గమనించవలసినది ఏమిటంటే - ఇవి నేను ఆచరిస్తున్నవి మీరు పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం.. ఎవరి సాధ్యాసాధ్యాలు వారు నిర్ణయించుకోవాల్సిందిగా నా మనవి. చర్చలూ, విశ్లేషణలూ ఇక్కడ అనవసరం.. 

1. దేవుడి గదిని ఇంటిలో, ఆఫీసు, వ్యాపారములో గాని తూర్పువైపున గాని, ఈశాన్య భాగములో గాని, ఉత్తరభాగములో గాని పెట్టుకోవడం సర్వదా శ్రేష్ఠం! అంటే సాధకుడు / మనము దైవానికి మ్రోక్కేటప్పుడు మన ముఖం ఉత్తరం వైపుకు, లేదా ఈశాన్యం, లేదా తూర్పువైపునకు ఉండేలా దేవుడి గది ఏర్పాటు చేసుకోవాలి. మిగతా దిశలు అంత శ్రేయస్కరం కావు.

2. దేవుడి గది నేలకు ఆనేలా కాకుండా మనము దేవుడికి మొక్కేటప్పుడు ఉండే భంగిమలో మన ముకుళిత చేతులకు ఎదురుగా ఉండేలా ఏర్పాటుచేసుకోవడం సరియైన పద్దతి.. ఇలా అనేది - మీరు కూర్చోనా.. లేక మోకాళ్ళ ఎత్తులోనా లేక నిలబడా అనేది మీ సౌలభ్యం, మీ ఆచరణ బట్టి ఉంటుంది.

3. రెండు దీపాలలో రెండేసి వత్తులను వేసి వెలిగించడం ఉత్తమం. ఒక వత్తి మంచిది కాదు. ఎందుకంటే సాధారణముగా ఒక వత్తి దీపాన్ని మనము చెడు కార్యక్రమాల్లో ఉపయోగిస్తాము. అంటే చావు కార్యక్రమంలో వాడుతారు. అంతేతప్ప మరేదో కారణమని నేను భావించడంలేదు. దీపాలకి ఇంధనముగా వాడిన నూనెగా ఏదో ఒక నూనెను వాడడం సరికాదు. కుసుమనూనె గాని, నువ్వులనూనె గాని వాడడం సర్వదా శ్రేష్టం!

4. ఎన్ని అగరుబత్తులను వెలిగించారన్నది ముఖ్యం కాదు! "నిక్కమైన నీలము ఒక్కటున్న చాలు.." అన్నట్లు ఒకటి వెలిగించినా కాస్త సువాసనాభరితముగా ఉంటే చాలు! ఈ అగరువత్తీ నుండి వచ్చే పరిమళాలు మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుద్ధిచేస్తుంది. ఇది "అరోమా థెరపీ"లాగా పనిచేస్తుంది. ఆ పరిమళాలు సాధకునికి మానసిక ప్రశాంతత రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఖర్చు ఆదా కోసమని లావు లావు ప్యాకెట్లలో అమ్మే మామూలు అగరుబత్తిల కన్నా 9-12 రూపాయలలో దొరికే 20 బత్తీలు ఉండే సన్నని సువాసనా అగరబత్తిలు వాడితే బావుంటుంది. హోల్ సేల్ పాకెట్లో వందవరకూ బత్తీలు ఉన్ననూ సగం వాడకం అయ్యేసరికి వాసన తక్కువ అయినట్లు అనిపిస్తుంది. కంపనీ వాళ్ళే 25 బత్తిలను ఒక ప్యాక్ కాకుండా 10ని ఒక ప్యాక్ లా చేసి హోల్ సేల్ గా అమ్మితే ఇంకా తక్కువధరకే వస్తుంది - మహా అంటే ప్లాస్టిక్ ప్యాకింగ్ ఎక్కువ అవుతుంది.

5. ఎంత ఖర్చు పెట్టి పూలు పెట్టారు, ఇంతలావు పూలదండ వేసారు అన్నది ముఖ్యం కాదు. ఎంత ఆడంబరముగా పూజ చేసారు - అన్నది పాయింటు కాదు. ఎంత భక్తితో చేసాము అన్నది ముఖ్యం. పురాణాల్లో ఎన్నో కథలు గోచరిస్తాయి - భక్తితో చిన్న, ఒక్క పూవు పెట్టినా ఆ భగవంతుడు సంతోషిస్తాడని.. అలా మామూలుగా, భక్తిగా, మనసారా తాదామ్యత చెంది చేసిన వారికే - వారు మామూలు వారైననూ వారికే దేవుడు ప్రత్యక్షమై వరాలిచ్చాడు..

6. దేవుడికి మనమేమి మన కోరికల చిట్టా వినిపించనవసరం లేదు! మనకెప్పుడు ఏది కావాలో, ఎప్పుడు మనకి ఏది ఇవ్వాలో తనకి తెలుసు. ఊరికే ఇవ్వడని, ముందు కష్టాలనే పరీక్షలు పెడతాడని మనం తెలుసుకోవాలి. ఇక్కడ - ఆ పరీక్షలు ఎలా నెగ్గాలో, అందుకు ఏమి చేస్తే ఆ పరీక్షలలో ఉత్తీర్ణులవుతామో తెలుసుకొని, ఆ దిశగా తగిన చర్యలను చేపట్టాలి.

7. దేవుడి విగ్రహాలు సాధారణముగా కాగితము, రాయి, లోహము, ప్లాస్టిక్, సిమెంట్, గాజు వంటి వివిధరకాల పదార్థాలతో తయారుచేసినవి ఉంటాయిగా! వీటిలో మంచియైనవి అంటే రాయితోగాని, లోహముతో చేసినవి. రాయిలోనూ అన్ని రకాల రాళ్ళు పనికిరావు. కొన్ని రాళ్ళు మాత్రమే మూల విరాట్టు తయారీకి పనిచేస్తాయి. అయినా రాయితో తయారయిన చిన్న చిన్న సైజులోని విగ్రహాలు దొరకడం కష్టం! అందుకే లోహ విగ్రహాలే చాలా నయం. ఇక లోహ విషయంకి వస్తే ఉత్తమమైనది - బంగారం. మధ్యమమైనది వెండి. అధమమైనది అంటే సో సో అనేది రాగి - లోహాలు. సాధకులు ఎవరికి తోచినట్లుగా, వారి వారి ఆర్ధిక శక్తి మేరకు విగ్రహాలు చేసుకొని వాడగలరు. మిగితా లోహాలు, పదార్థాలతో చేసిన విగ్రహాలు వాడకపోవడమే ఉత్తమం! ఇలాంటి వేరే వాటితో చేసిన విగ్రహాలను నదీ ప్రవాహాలల్లో వదిలివేయడం మంచిది.

8. విగ్రహాల సైజు అంగుష్ఠ ప్రమాణములో గాని (వ్రేలేడు సైజులో) సైజుకన్న తక్కువ ఉండునట్లుగా చూసుకోవలయును. అడుగు సైజుకన్నా ఎక్కువ ఉన్న విగ్రహాలను / ఫోటోలను పెట్టుకున్నట్లయితే మామూలుగా ఇంట్లో చేసుకునే పూజ సరిపోదు. ఆలయాల్లో చేసే పూజలు తప్పనిసరి మరియు ప్రసాద నివేదన తప్పనిసరి. అవి చెయ్యకున్నచో దోషం అవుతుందని అంటారు. ఇంకొందరు పెట్టుకోవచ్చు గాని పూజ చేయొద్దు.. ఒక వేళ చేస్తే ఎప్పటికీ చెయ్యాలని అంటారు.. మరికొంతమంది Remedie (పరిష్కారముగా) కాస్త చక్కెర, ఒక అగర్బత్తీ పెట్టాలని చెబుతారు.. ఇందులో ఏది సరియైనది అంటే నేను చెప్పలేను గాని - మీకు తోచినది పాటించవచ్చును.

9. శయనమందిరములలో అనగా బెడ్ రూములో పూజ గదిని యెర్పరచుకొరాదు. అక్కడ మడిగా / శుచిగా ఉండదు ( మైల పడుతుంది గాబట్టి ) అక్కడ పూజాగది నిషిద్దము. ఈ లక్షణము వాస్తులో బాగా చెబుతారు. ఇంటి యజమాని నైరుతిలో పడుకోవాలని, దానికి సర్రిగ్గా ఎదురు ఈశాన్యంలో దేవుడి గది ఉండాలని వాస్తు పురుషుడు చెబుతాడు.

10. ఇది ముఖ్యమైన విషయం: చాలామంది ఇళ్ళల్లో నూతన సంవత్సరం సందర్భముగా వచ్చిన దేవుళ్ళ, దేవతల కాలెండర్లు అన్నీ ఇంటి గోడలకు తగిలిస్తారు. అనక వాటికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి, కర్పూర హారతినిచ్చి.. మరీ నిష్టగా పూజ చేస్తారు. ఇంకొక నూతన సంవత్సరం వస్తే అది తీసి కొత్తది ఆ స్థానములో తగిలిస్తారు.. పాతది - అంతవరకూ పూజలు అందుకున్న పాత కేలండరు దేవుళ్ళు "చెత్తబుట్టి"లో, వీధి చివర మున్సిపాలిటి కుండీలో ఉంటారు.. ఇక్కడ చాలా మంది ( 99% మంది ) గమనించని విషయం ఏమిటంటే - వీరు చేసిన పూజవల్ల ఆ కాలెండర్ కి ప్రతిరోజూ కొంత శక్తి జమవుతూ ఉంటుంది - పూజ చేసినన్నినాళ్ళూ.. (మీకు అర్థము కాకుంటే రీచార్జ్ బాటరీ ని ఉదాహరణగా తీసుకోండి). సంవత్సరమంతా చేసిన పూజవల్ల ఆ కాలెండర్ కి వచ్చిన శక్తి అంతా మీరు దాన్ని పారేయడముతోనే పోతుంది. అంటే సంవత్సరమంతా ఛార్జ్ చేసిన శక్తిని వ్రుదాచేయడమన్న మాట! అందుకే పాతకాలము మనుష్యులను చూడండి! వాళ్ళ ఇంటిలోని కాలెండర్ ని పారేయనే పారేయ్యరు - మసి పట్టినా, చినిగినా సరే!. ఒకవేళ వాళ్ళు ఆ ఇల్లు వదలాల్సి వస్తే ఆ ఇంటిలోనే అలాగే వదిలేసి వెడతారు - కొన్ని ముఖ్య దేవతల ఫోటోలూ, విగ్రహాలూ, కులదేవతల చిత్రాలూ తమతో తీసుకెల్లుతారు.. అక్కడి శక్తిని అక్కడే వదిలేస్తారు. అందుకే కావొచ్చు! విగ్రహాలను వెండితో, బంగారం తోనో చేయిస్తే, వాటిని ఎవరూ పాడెయ్యరు కనుక ఎవరి పూజాఫలము వారిదగ్గరే ఉంటుందని పెద్దలు అలా నిబంధన పెట్టిఉండొచ్చు! వెండి విగ్రహాలు 500 - 800 వరకూ దొరుకుతాయి. బంగారువి చిన్న సైజులో చేయిస్తే 1500 రూపాయలనుండి దొరకొచ్చు. కొద్దికాలము పూజ చేసి పారేసే పటాల కన్నా, శాశ్వతముగా మనవద్దె ఉండిపోయే శక్తికి ఆమాత్రం డబ్బులు ఖర్చు చేయడం - ఖర్చు అనిపించుకోదేమో.. ఇక్కడ బంగారంతో చేయించుకోవాలంటే - బంగారు పనిచేసే వాళ్ళకు చెబితే - అరగ్రాము / 500 మిల్లీగ్రాముల బంగారంతో వెనకకు వెండి తాపడం పెట్టి చేసిస్తారు. ఇలా చేసినందులకు మీకు 2500+ రూపాయల్లో దొరుకుతుంది.

13. "శక్తి" ఉందా లేదా అని మీమాంస ఉన్నవారికి ఎన్నో ఉదాహరణలు ఇవ్వొచ్చును. ఇంధన శక్తి, విద్యుచ్ఛక్తి, పవన శక్తి, రసాయన శక్తి... ఇవేవీ వాటి శక్తిని భౌతికముగా చూపెట్టలేవు.. ఉదాహరణకు విద్యుచ్ఛక్తి తన శక్తిని బల్బు ద్వారానో, మోటార్ త్రిప్పడం ద్వారానో.. చూపుతుంది. ఇక్కడ వాటి ఫలితము మాత్రమే కనపడుతుంది.

12. మంత్రాలు బిగ్గరగా చదవటం వల్ల సాధకునికి ఒరిగేదేమీ ఉండదు. మననం (మనస్సులో చదువుకునేట్లుగా) చేసుకుంటేనే ఆ మంత్ర శక్తి ఉపయోగపడుతుంది. ఆ సమయంలో సాధకునికి ఎటువంటి అడ్డంకులు, పిలుపులు, అంతరాయాలు రాకుండా చూసుకోవాలి.

13. కళ్ళు మూసుకున్నాక సాధకులకు చీకటిగా, ఏవేవో ఆకారాలు కదులుతున్నట్లుగా అగుపిస్తాయి. మనము ఏ తామరపూవునో, ఓంకారమునో, ఒక బిందువునో ( బిందువే సరియైనది ).. ప్రయత్నిస్తే... చివరికి మన దేహముపై చీమల బారు పోతునట్లుగా అన్పిస్తుంది. అలా ఆ దశకి వచ్చాక సాధకుడు ఓ దశకి చేరుకున్నాడని అనుకోవచ్చును. అక్కడి నుండి అతడికి ఇహలోక వాంఛలు తగ్గుముఖం పట్టడం ఆరంభిస్తాయి... (మన అసలు విషయం పక్కదారి పట్టినట్లుందే)

14. "సాలిగ్రామాలు" ( ప్రకృతి సహజసిద్ధముగా నదులలో, కాలువలలో దొరికే గుండ్రని, గుడ్డు ఆకారములో దొరికే నునుపైన రాళ్ళు ), శ్రీ చక్రమూ.. పెట్టుకొనే వారు మరికొంత శ్రద్ధతో పూజ చేయాల్సిందే! ప్రతిదినమూ వాటికి చెయ్యాల్సిన పూజలూ, పునస్కారాలూ తప్పనిసరి. మరింత శుచి, సమయం, చేసే శ్రద్ధ ఉన్నవారు వాటి జోలికి పోవటం ముఖ్యం! వీటికి పెట్టే నైవేద్యాలు, ఉపాసనలు ఎప్పుడూ ఒకేలా ఉండాలి. డబ్బులు ఉన్నప్పుడో, లేక శక్తి ఉంది అనీ... లేని ఆర్భాటాలకు పోయి, గొప్పగా మొదలెట్టి అలాగే చేస్తూ వెళ్లి, చివరకు ఆర్థికముగా దెబ్బ తినో, సమయం లేక పూజించడం కుదరదో అప్పుడు వారికి ప్రతికూలతను / తేడా చూపించడం జరగవచ్చు. అందుకే పూజల్లో ఒకేలా చేస్తూ వెళ్ళడం చాలా ప్రధానం. 

15. మీకు ఇంట్లోనే కాక ఇంటిబయట కూడా బావుండాలని అనుకుంటున్నారా? మీరు మీ ఆఫీసు, వ్యాపార, ఉద్యోగమునకు ఇంటినుండి బయలుదేరుతున్నారా..? మీ ఇంటిప్రవేశద్వారము లోపలిభాగాన - అంటే గడప దాటితే బయటకి వస్తాము అనేదానికి ముందు లోపలిభాగాన ద్వారానికి పైభాగాన శ్రీలక్ష్మి సహిత గణపతి విగ్రహమును గాని, ఫోటోని గాని ఉంచి చిన్నగా పూజ చేయండి ( రోజూ అక్కడ ఒక పూవునూ, ఒక అగరబత్తిని ఉంచితే చాలు ). ఇది ద్వారానికి / ఇంటికి ఈశాన్య మూలన ఉండాలి. అంటే మీరు ఇంట్లోంచి బయటకి వెళ్ళుతున్నప్పుడు ఆ దేవుళ్ళు ఎదురవుతున్నట్లుంది.! వారి ఆశీస్సులూ మనకూ అందుతాయన్నమాట! మనము వెళ్ళే పనిలో విఘ్నాలు రావోద్దనీ ఆ గణాదిపతిని, లాభం కలగాలనీ ఆ మహాలక్ష్మినీ కోరుకోవడం ! మామూలుగా మనము బయటకి పోతున్నప్పుడు, మనకు అదృష్టవంతులనో, అభిమానించేవారినో, బిందెడు నీళ్ళతో - కలశము నీళ్ళతో ఎదురురమ్మని చేబుతామే - వాటికన్నా ఇది ఉత్తమమైనదీ, తేలికైనదీ. నేను ఇలా పెట్టుకుని,మొక్కి బయటకి వెళ్ళాకా.. (మీకు కామెడీగా ఉండొచ్చు గాని) ..చాలా పనుల్లో పురోగతి కనిపించింది. ( దారిలో దేవాలయం కనిపిస్తే ఎలా మొక్కుతామో అలాగన్నమాట ).. ఇప్పుడు చాలా సంతోషముగా ఉంటున్నాను..

16. నిష్ఠగా పూజ చేసుకునే వాళ్ళు - పొరపాటుగానైనా ఇతరుల పాదాలకు మొక్కరాదు.. ఇలా మ్రొక్కటం వల్ల వారికి అప్పటివరకు లభించిన పుణ్యఫలం, శక్తి.. అన్నీ అవతలివారికి చెందుతాయి. చాలా మందికి ఈ విషయం తెలీక అందరి కాళ్ళు మొక్కుతారు.. ఒకవేళ తప్పని పరిస్థితి అంటూ వస్తే - పరిష్కారముగా ముందుగా మన ఇంటి వారి పాదాలు మొక్కితే మనశక్తి వారికి బదిలీ అవుతుంది, తరవాత అవతలి వారికి మ్రొక్కి.. తరవాత ఇంటివారితో మళ్ళీ మొక్కించుకుంటే సరి.. ఈ పాత పద్ధతి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చూడవచ్చును మనం..

17. ఒక్కసారి పురాణగాధల్ని చూడండి.. దేవుడిని నిష్కల మనస్సుతో ప్రార్థించాలని అవేన్నో ఉదాహరణలని చెబుతాయి. ఎంత ఆడంబరముగా, ఎంతో ఘనముగా పూజచేసినా నిష్ప్రయోజనమే నని.. దేవుడి ముందు మన కోరికల చిట్టా చదవకుండా, మంచి మనసుతో - నీ అండతో ఇన్ని రోజులూ సంతోషముతో గడిపాను.. ఇకముందూ ఇలానే గడిపే వరమివ్వమని చేసే ప్రార్థనలకి దేవుడు తొందరగా జవాబిస్తాడట. అయినా తనకు తెలుసు ఎవరికీ ఏది ఎప్పుడు ఇవ్వాలో..

18. అగరుబత్తీలను సాధారణముగా దీపాలతో వెలిగిస్తాముగా! అలా చేయకూడదు. ఇక్కడ పిసినారితనం కూడదు! తప్పకుండా అగ్గిపుల్లతో విడిగా వెలిగించాలి.

19. నోటితో చదివే పదాలు, మంత్రాలు, బీజాక్షరాలు, పాటలు, శ్లోకాలు.. ఇవన్నీ పైకి వినిపించేలా కాకుండా మననం చేసుకునేలా చదివితే ఫలితం ఎక్కువగా ఉంటుంది.


updated on 12-September-2009

Friday, April 10, 2009

భారతీయులు - కాలగణన

(ఈ రచన నేను రాసినది కాదు - అయినా భారతీయుల విజ్ఞానం ఎంత గొప్పదో తెలియచేయటానికి తిరిగి రాస్తున్నాను.)

కాలం ఎవరికీ అర్థం కాని పదము. కాలము ఎప్పుడు ఆరంభ మైనదో చెప్పలేం కానీ కాలాన్ని ఎలా మానవులు ఎలా లేక్కించారో చెప్పగలము. ఈ సృష్టి పుట్టినరోజే కాలము పుట్టినది. అదే ఉగాది / యుగాది. నిజానికి ఉగాది అంటే - యుగానికి ఆరంభము -అర్థము. "ఉగాది" అన్న పదానికి మరో అర్థం కూడా ఉంది. "ఉ" అంటే నక్షత్రము, "గ" అంటే గమనము. ఈ "ఉగ" అంటే నక్షత్రగమనము అని అర్థము కదా! ఈ నక్షత్రగమనానికి "ఆది" = ఉగాది - ఇదీ శాస్త్రీయ అర్థము.

ఈ సృష్టిలో "శక్తి" అగోచరనీయము. అంటే శక్తి కనపడదు.. కాని దాని తాలూకు ప్రదర్శనని అనుభవముగా చూస్తాము. ఉదా: విద్యుక్చ్చక్తి మనకు కనిపించదు కాని దాని తాలూకు శక్తిని "షాక్" రూపములోగాని, యంత్ర పరికరములు వాడుటలో గానీ చవి చూస్తాము.. శక్తి పదార్థముగా మారిన దశనుంచి "కాలగణన" మొదలవుతుంది. పదార్థము నశించి శక్తిగా మారటముతో కాలగణన ముగుస్తుంది.

ఈ " కాలగణన " విషయములో ప్రపంచములోని అన్ని దేశాలకన్నా మన భారతదేశము చాలా ముందుంది. ఖచ్చితమైన కాలగణన విధానము కనిపెట్టినది కేవలము - ఒక్క భారతదేశమే.

ఈ కాల స్వరూపాన్ని మనము వీక్షించడమే - విశ్వరూప సందర్శనమే! మనము కాల మహాస్వరూపాన్ని లెక్కించడం ఒక మహా సముద్రములో చిన్న చేపపిల్ల సముద్ర పరిమాణాన్ని లెక్కపెట్టేందుకు చేసే ప్రయత్నములా ఉంటుంది. మనము కాలములో ఉన్నామా లేక కాలము మనలో ఉన్నదా అన్న ప్రశ్న అర్థము కాదు. మన శరీరం నశిస్తేగాని కాలము తెలియదు. అదియే "కాలధర్మము".

ఈ చరాచర సృష్టి మొదలై 195 కోట్ల, 58 లక్షల, 85 వేల, 110 సంవత్సరాలని ఋషుల పంచాంగము చెబుతున్నది. అందులో ఇప్పుడు నడిచే కల్పము పేరు శ్వేతవరాహ కల్పం. మన్వంతరం పేరు వైవసత్వ మన్వంతరం. జరిగే యుగము పేరు కలియుగము. ఈ కలియుగము పరిమాణము మొత్తము 4 లక్షల 32 వేల సంవత్సరాలైతే - ఇప్పటిదాకా 5,110 సంవత్సరాలు గడిచాయి. ఇంకా 4 లక్షల 27 వేల 889 సంవత్సరాలు గడవాలి. గడుస్తుంది కూడా. కానీ అప్పటివరకూ మనము ఈ శరీరాలతో ఉండము.

భారతీయుల కాలగణన :


ఒక లేత తామరాకులో చాలా వాడియైన సూదిని గుచ్చితే ఆ సూదిమొన ఆ తామరాకులో దిగడానికి పట్టే కాలాన్ని "కాష్ఠ" అంటారు. అలాంటి కాష్టలు ఒక "త్రుటి". ఈ 12 త్రుటులు కలిపితే ఒక "కళ". 60 కళలు ఒక నిముషము, 24 నిముషములు కలసి ఒక "ఘడియ". రెండున్నర ఘడియలు కలసి ఒక "ఘంట". 24 ఘంటలు కలసి ఒక రోజు, 30 రోజులు కలిపితే ఒక నెల. 12 నెలలు కలిపితే ఒక సంవత్సరము. ఈపాటికే మీకు అర్థమైఉండవచ్చును - మన భారతీయుల కాలగణన సామర్థ్యం ఏపాటిదో!! ఇదంతా "కాల సూక్ష్మగణన" అంటారు.

ఇక "మహా గణన"కి వస్తే - 365 రోజులు గడిస్తే ఒక సంవత్సరం, ఇలాంటివి 60 సంవత్సరాలు కలిస్తే ఒక సంవత్సర చక్రం. ఇది భూమి సూర్యునిచుట్టూ 60 సార్లు తిరగటానికి పట్టే కాలము. ఎవరైనా 60 సంవత్సరాలు బతికితే వారు సూర్యుని చుట్టూ 60 సార్లు తిరిగారని అర్థం. (అలా అరవై సంవత్సరాలు గడిచినవారికి షష్టిపూర్తి ఉత్సవము చేస్తాము) 4 లక్షల 32వేల సంవత్సరాల కాలాన్ని కలియుగం అంటాము. కలియుగానికి రెట్టింపు అంటే 8 లక్షల 64 వేల సంవత్సరాలు ఉండే కాలము ద్వాపర యుగము. కలియుగానికి మూడురెట్లు అంటే 12,96,000 సంవత్సరాలు ఉండే కాలము త్రేత్రాయుగము. కలియుగానికి నాలుగు రెట్లు అంటే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. ఈ నాలుగు యుగాలు కలిస్తే ఒక "మహా యుగం" అన్నమాట. అంటే ఈ మహాయుగానికి 43,20,000 సంవత్సరాలన్న మాట. ఇలాంటి 71 మహాయుగాలు ఒక మన్వంతరం. అలాంటి 14 మన్వంతరాలు కలిస్తే ఒక "కల్పం". రెండు కల్పాలు కలిస్తే గడిస్తే "బ్రహ్మకి" ఒకరోజు. అనగా బ్రహ్మదేవుడికి ఒకరోజు ఎంతంటే 43,200*71*14*2 అన్నమాట. అనగా 8,58,81,600 సంవత్సరాలు అని తెలుస్తున్నదిగా.. అలాంటి బ్రహ్మకి 1000 సంవత్సరాల ఆయుష్యు. (అంటే 85881600*365*1000 = 3134678,40,00,000 మానవ సంవత్సరాలని తెలుస్తున్నదిగా) అందులో ఇప్పటికి ఆయనకీ 50 ఏళ్ళు నిండి 51 వ సంవత్సరం, తొలి నెల, తొలిరోజు, తొలి ఘడియలో, తొలి త్రుటిలోని కళలో సగం నడుస్తున్నదంట!

అంతటితో ఆగలేదు మనవాళ్ళు! విష్ణువుకి సంవత్సరాలు గడిస్తే శివునికి ఒకరోజు. అలాంటి శివుడికి సంవత్సరాలు గడిస్తే ఆదిపరాశక్తికి ఒక కనురెప్పపాటు!! చూసారా - మన పోర్వికులు ఎంత దూరము వరకూ లేక్కగట్టారో!.. ఇంత ఖచ్చితముగా, ఇంత దూరముగా ఎవరూ కాలాన్ని అంచనా వేయలేదు.. మనము గర్వించదగ విషయం ఇది..
Related Posts with Thumbnails