అబ్రహాం లింకన్ తన కుమారుడిని స్కూల్ లో చేర్చినప్పుడు ఆ స్కూల్ టీచర్ కు రాసిన ఉత్తరం చదివితే బాలలను ఎలా తీర్చిదిద్దాలో తెలుస్తూంది...
"ఈ ప్రపంచంలో అందరూ ధర్మాత్ములు కాదని చెప్పండి. అయితే ప్రతి స్వార్థపరునికీ ఒక నిస్వార్థ నాయకుడు ఈ సమాజంలో ఉన్నాడని చెప్పండి.
ప్రతి శత్రువుకూ ఒక మిత్రుడున్నాడని చెప్పండి. ప్రతి అబద్దాలకోరుకూ ఒక నిజాయితీపరుడు ఉంటాడనీ బోధించండి.
ద్వేషాన్ని వాడి దరి చేరనివ్వకండి. హాయిగా మనసు నిండా ప్రశాంతంగా నవ్వుకోవడంలోనే దైవత్వముంటుందని వివరించండి..
పుస్తకాల్లో లభించే విజ్ఞానగని గురించి అతడిని ప్రేరేపించండి. అదే సమయంలో ఆకాశంలో ఎగిరే పక్షులు, ప్రకృతిలో పరుగులు పెట్టె తుమ్మెదలు, సుగంధభరిత పుష్పాలు, గంభీరముగా ఉండే పర్వతాలను గురించి కూడా వాడు అనుభవించి, ఆలోచించేలా చేయండి.
మోసం చేసి గెలవటం కంటే సన్మార్గం లో పరాజయం పాలవటం మేలని చెప్పండి. తన ఆలోచనలపై గట్టి నమ్మకాన్ని పెంపొందించుకోనేలా అతన్ని ప్రోత్సాహించండి.
ఎంతమంది వ్యతిరేకించినా తాను మంచి అనుకున్నది సాధించేవరకూ విశ్రమించవద్దని చెప్పండి.
మ్రుదువైనవారితో పుష్పంలా, కఠినమైనవారితో వజ్రంలా ప్రవర్తించమని బోధించండి.
అందరూ ఒక గుంపుగా ప్రవాహంలో పడిపోతుంటే వారిని అనుకరించకుండా.. అలోచించి తన మార్గం ఎంచుకునేలా ప్రోత్సాహించండి.
ఎవరేమి చెప్పినా సహనంగా వినమని, అయితే విన్నదాన్ని సత్యం అనే ఫిల్టర్ తో ఒడగట్టి.. వచ్చిన మంచిని మాత్రమే స్వీకరించమని చెప్పండి.
మీరు చెప్పగలిగితే అతడు విచారముగా ఉన్నప్పుడు ఎలా నవ్వుకోవాలో నేర్పించండి. కన్నీళ్లు పెట్టటం సిగ్గుపడాల్సిన విషయం కాదని చెప్పండి.
నిత్య శంకితుల పట్ల, అతి వినయం చూపేవారి పట్ల, అవసరాన్ని మించి తియ్యగా మాట్లాడేవారి పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పండి.
తన శ్రమను, మేధస్సును అతి ఎక్కువ ధరకు అమ్మమని చెప్పండి. అయితే తన హృదయానికీ, ఆత్మకు వెల కట్టవద్దని బోధించండి.
అసత్యాన్ని, సత్యంగా మార్చటం కోసం ఎలుగెత్తి అరిచే స్వార్థ సమూహాల మధ్య ధైర్యంగా నిలబడి తను నమ్మిన సిద్దాంతాన్ని ధైర్యముగా చెప్పే పోరాటపటిమను అతనిలో రగిలించండి.
అతన్ని జాగ్రత్తగా చూడండి కానీ సున్నితంగా ఉంచకండి. ఎందుకంటే, అగ్నిలో కాలితేనే నాణ్యత కలిగిన ఉక్కు తయారవుతుంది. అవసరమైనప్పుడు అసహనంతో కూడిన సాహాసాన్ని, సహనంతో కూడిన ధైర్యాన్ని కలిగిఉండేలా తీర్చిదిద్దండి.
అన్ని వేళల్లోనూ వాడి మీద వాడికి నమ్మకం ఉండేలా ప్రోత్సాహించండి. ఎందుకంటే అప్పుడే మానవాళిపై అచంచలమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని అతడు పెంపొందించుకోగలడు.
ఇవన్నీ చాలా ఎక్కువ శ్రమతో కూడినవని నాకు తెలుసు. కానీ ఆ బాలుడు (ప్రతి బాలుడూ) పై వాటన్నింటికీ అర్హుడు.. "
-అబ్రహాం లింకన్.
Thursday, November 13, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment