మనమందరమూ మన మన లక్ష్యాల కోసం జీవితాలలో..సాగిపోతూ ఉంటాం కాని, మనకు నిజంగా మనకు అవసరమైనవి తెలుసుకొని, అందుకు తగ్గట్లుగా మన జీవితాలను తీర్చుకోము.
చాలా నిర్లక్ష్యముగా ఉంటాము.. మనకొచ్చే ఆపదలన్నీ చెప్పిరావుగా!.
ఉదాహరణకు- మనమొక గుహలోకో, అడవిలోకో.. వెళ్తున్నమే అనుకోండి. చేతిలో కట్టెనో, వీలైతే కత్తియో పట్టుకొని వెలతాముగా - మన భద్రత కోసమని. అదే తెలివిని - మనం కాలమనే / జీవితమనే గుహలోకో, అడవిలోకో వెళుతున్నప్పుడు /ప్రయానించేటప్పుడు మన భద్రత గురించి మాత్రం ఆలోచించము. మనపైన ఒక్కరో, ఇద్దరో, ముగ్గురో.. ఆధారపడి ఉండివుంటే- మనకేమైనా జరిగితే.. వారిని రోడ్డుపైన నిలబెట్టాల్సి వస్తే.. అబ్బో-ఆ ఆలోచన వస్తే మాత్రం చెమటలు పడతాయి. తల్లడిల్లుతాము. కాసేపయ్యాక ఏదో పనిలో పడి మరచి పోతాము. రేపు, ఎల్లుండి అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటాము.
నేనూ అంతే! నాలుగు సంవత్సరాల కిందటి వరకూ నేనూ అందరిలాగే వాయిదాలూ + నాకిప్పుడు ఏమైందని? తర్వాత చూద్దాములే అనుకుంటూ ఉండేవాన్ని..
ఒకరోజు- మధ్యాహ్నం వరకూ బాగున్న మా పెదనాన్న కొడుకు, అరగంట వ్యవధి లో ఆరోగ్యం పాడై (హై బ్లడ్ ప్రెజర్) చనిపోయాడు.. ఆయనకు భార్య, ఇద్దరు ఎదిగిన ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. వారి జీవితాలు సెటిల్ అయ్యే దశలో ఆయన పోవడంతో.. ఇన్సూరన్స్ చేయకపోవటముతో అంత వరకూ సుఖంగా పెరిగిన ఆ కుటుంబము ఉన్న ఇల్లు అమ్మారు.. ఇప్పుడు అందరూ కష్టపడుతున్నారు. ఒకరి పెళ్లి అయింది.. వారి జీవితాలను కొద్దిరోజులుగా చాలా దగ్గరి నుండి చూసానుగా..నాకు కూడా ఇలాగే జరిగితే? అమ్మో! చాలా భయం వేసింది.. నా పరిస్థితి గురించి ఆలోచించాను.. వెంటనే ఇన్సూరన్స్ చేయాలని నిర్ణయించుకున్నాను. అంతవరకూ నా పేరుపైన కేవలం 50,000 రూ" పాలసీ మాత్రమే ఉంది. (నేను ఆ పాలసీ చేసేనాటికి లక్ష రూపాయల పాలసీ అంటేనే అబ్బో.! అంటూ గొప్ప పేరుండేడిది.) ఆ డబ్బులతో నా అంత్యక్రియలు, కర్మకాండలు, వర్ధంతులు.. జరుగుతాయి కాని నా కుటుంబానికి? అలా ఆలోచించాక వెంటనే ఎజంట్లనూ, స్నేహితులనూ.. సంప్రదించాను.ఎవరూ సరిగ్గా చెప్పలేదు.. ఇలా కాదనుకొని.. నేనే అన్వేషిస్తే చాలా విషయాలు తెలిసాయి..
మనమెందుకు ఇన్సురన్సు చేయాలి?
# మనమీద ఆధారపడి బతుకుతున్న భార్య / భర్త, పిల్లలు, తల్లి తండ్రులో.. మనకేదైనా అనుకోని ప్రమాదం జరిగితే.. మనమీద ఆధారపడ్డ వీరిని రోడ్డు పైకి తీసుకరాకుండా, ఆర్థిక ఇబ్బందులు కలగకుండా, వారి భవిష్య జీవనం సాఫీగా గడవడానికి ముందు జాగ్రత్త చర్యగా మనము చేయాలి.
# మనం చేసే కొన్ని అప్పులు (ఉదా: గృహ నిర్మాణం, బ్యాంక్ లోన్లూ..) ఉంటే మన తదంతరం మన వారసుల మెడకు చుట్టుకోకుండా ఉంటాయి.
# జోక్ గా చెప్పాలంటే- " వీడు పైకి పోయి మాకు ఈ పరేషాన్లు పెట్టాడు కదా.." అని అనుకోకుండా ఉండేన్డుకై.
ఎంత మొత్తానికి పాలసీ చెయ్యాలి?
# మన ఆదాయానికి 40, 50 రెట్లుగా మనము చేసే పాలసీ ఉండాలి. అలా ఉంటేనే మన అవసరాలు తీరతాయి. ముందే చెప్పు కున్నట్లు యాభయో, లక్షకో పాలసీ చేస్తే కర్మకాండలకి, దినాలకి, సంవత్సరాలకి సరిపోతాయి కాని మన, మనమీద ఆధారపడ్డవారి అవసరాలు తీరవు.
# తక్కువ మొత్తానికి (ప్రీమియం కి) ఎక్కువ మొత్తములో రాబడి ఉండాలి.
# మనము కట్టే ప్రీమియం మనకు గానీ, ఇన్సురన్సు సంస్థలకు గాని లాభం ఉండాలి (ఇది ప్రతి పాలసీలో ఉండేదే) కాని మూడే వ్యక్తికి ( ఏజెంట్ కి ) లాభం చేకూర్చే పాలసీలు వద్దు. దురదృష్టవశాత్తు మనలో చాలామంది చేసే పొరపాట్లివే..
# ఏజెంట్ లు చెప్పే తీయని మాటలకి, చూపే ఆదరణకి, వారు చేసే పనులకి..మొహమాటమో, అభిమానమో, కృతజ్ఞత కోసమో, మరెందుకైననూ .. మనము ఇరుక్కపోవాల్సి వస్తుంది. అప్పుడు ఒక పని చెయ్యండి.
@ నాకు పాలసీ వద్దని చెప్పండి.
@ నాకు ఇంతకు ముందే కమిట్ అయిన పాలసీలు చాలా ఉన్నాయని చెప్పండి.
@ ఆ పాలసీ ప్రేమియం లే అతికష్టముగా కడుతున్నాను.. ఇక ఇదొకటా అని వద్దని చెప్పండి.
@ మా బాబాయి లేదా మా మామయ్యా వారూ ఎజేంటే వారికి చేసాక మీకు చేస్తానని మృదువుగా చెప్పండి.
@ అప్పటికి వినకపోతే బ్రహ్మాస్త్రం తీయండి. " నాకు అన్ని రకాల పాలసీలు ఉన్నాయి. ఈ మధ్య టర్మ్ పాలసీ గురించి విన్నాను. నాకు తెలిసిన వారు చేసారు. చాలా బాగుంది+లాభం కూడానటగా.. వాటి వివరాలు చెప్పమనండి." అంతే! ఇక మిమ్మల్ని ఏ పాలసీలు అడగరు.
@ ఒకవేళ పాలసీ చేసినా అవసరము లేదు అనుకుంటే 15 రోజులలో బాండ్ వాపస్ ఇచ్చేయవచ్చు. మనము కట్టిన ప్రీమియం మనకు వాపస్ వస్తుంది. ఇది చాలా మందికి తెలియకపోవడం విచారకరం.
టర్మ్ పాలసీ అంటే ఏమిటి?
ఆరోగ్య భీమా, ఎండోమెంట్ పాలసీ, మనీబ్యాక్ పాలసీ, హొల్ లైఫ్ పాలసీ.. అంటూ ఎన్నో పాలసీలు ఉన్నాయి. అటువంటిదే ఇది..
ఈ పాలసీలో అతి తక్కువ ప్రీమియం కి ఎక్కువ భద్రతని ఇస్తుంది. పాలసీ ముగింపురోజున మనకేమీ డబ్బులు రావు గానీ.. పాలసీ దారుడు మధ్యలో మరణించినట్లైతే ఆ పాలసీ మొత్తాన్ని ఇస్తారు. చాలా సులభమైన, ఆచరణీయమైన, AAA+ రేటింగ్ పాలసీ ఇది నా దృష్టిలో.. మీకేన్ని పాలసీలు ఉన్ననూ, ఇది చెయ్యడం మాత్రం మరవకండి.. కనీసం ఒక్క పాలసీ అయినా చేసి ఉంచండి ఈ రోజునే.. భవిష్యత్తులో - నేడు చేసిన ఈ పనిని అప్పుడు తెలివైన పనిగా ఎలా మిమ్మల్ని మీరు ఎలా మెచ్చుకుంటారో చూడండి..
లాభ నష్టాలు:
ముందుగా నష్టాలు గురించి చెప్పుకుందాము..
నష్టాలు:
@ మనము కట్టే ప్రీమియం మాత్రం తిరిగి రాదు అన్న ఒకే ఒక నష్టం నాకు కనిపించింది.
@ సర్వీసు tax కూడా మరొక ఇబ్బంది.. కొద్దిగా ఎక్కువైనా లాభాలతో పోలిస్తే - అంత ఇబ్బంది అనిపించదు.
లాభాలు:
ఇలా చెప్పెదానికన్నా మిగతా పాలసీలతో పోల్చిచూస్తే ఇంకా బాగా అర్థమవుతుందనుకుంటాను.
1.మిగతా పాలసీలలో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
టర్మ్ పాలసీలలో ప్రీమియం తక్కువగా ఉంటుంది.
ఏజంట్లకు కమిషన్ ఎక్కువగా ఉంటుంది. ఏజెంట్ కి 15%, డెవలప్మెంట్ అధికారికి 5% ఉంటుంది. ఈ మొత్తం 20% మొత్తాన్ని మనవద్దె వసూలు చేసి, వారికిస్తారన్న మాట. అంటే లక్ష రూపాయల పాలసీ కి ఇరవైవేలు ఈ మధ్యవారికి ఇస్తామన్న మాట! సాధారణముగా ఇదులక్షల పాలసీ చేస్తే లక్ష రూపాయలు ఏజెంట్ కేనన్నమాటే!అవే డబ్బులు మనకొస్తే ఎంత ఉపయోగకరం. [ఉదా: ఆ లక్షతో మంచి హెవీగేజ్ ఇనుపబీరువా (8 వేలు), టి.వి డివిడి వాల్ ఫర్నీచర్ (10 వేలు), వాషింగ్ మెషిన్ (9 వేలు), డివిడి (3 వేలు), పెద్ద ఫ్రిడ్జు (17 వేలు), రైస్ కుక్కర్ (2 వేలు), నాలుగుబర్నర్ల గాస్ స్టవ్ (3,500 వేలు ), సోడా మేకర్ (2,500 వేలు), నలుగురికి నాలుగు మొబైల్ ఫోన్లు (6,000*4=24,000 వేలు), కంప్యూటర్ (20,000 వేలు), ఇంకొక వేయి ఖర్చులకు అనుకున్నా.. ఇన్ని కొనుక్కోవచ్చు..]
అదే టర్మ్ పాలసీలో ఏజెంట్ కి నామమాత్రం గా ఆదాయం ఉంటుంది.
మీకు ఎన్ని పాలసీలు ఉన్ననూ ఈ టర్మ్ పాలసీని తీసుకోవడం మాత్రం మరవకండి! మీరు తీసుకున్న సాధారణ పాలసీల కాలవ్యవధి బహుశా 20 సంవత్సరాలు ఉండొచ్చు.. ఈ సంవత్సరాలలో మీకు ఏ ఒక్కసారైనా ఆర్ధికముగా ఇబ్బంది రావచ్చును. రావని మాత్రం చెప్పకండి.! తర్వాతి నిముషములో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలుసు? అప్పుడు కొంతకాలము ప్రీమియములు చెల్లించటానికి తగిన స్థోమత లేకుండవచ్చునప్పుడు. అప్పుడు మీకు ఏమైనా ----- జరిగితే? మీమీద ఆధారపడ్డ మీ చిన్నికుటుంబం సంగతి? అప్పుడు ఇలాంటి పాలసీ గనుకే ఉంటే - ప్రీమియం తక్కువ గనుక ఎవరి వద్దనైనా అప్పు చేసైనా (వడ్డీ ఎక్కువగా కట్టాల్సిన అవసరం ఉండదుగా)పాలసీని కొనసాగించవచ్చును. అదే మిగతా పాలసీలయితే వడ్డీ ఎక్కువగా కట్టాల్సి ఉంటుందిగా.. ఇక్కడ ముఖ్యముగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే - జీవితభీమా అనేది మన ఆర్థికభద్రత కోసమే గాని మన పెట్టుబడి కోసమో / పన్ను ఆదా కోసమో పాలసీ చేయడం తెలివైన ఆలోచన అనిపించుకోదు. నా బ్లాగ్లో ఇదంతా చదివి ఒకతను టర్మ్ పాలసీ వాళ్ళ ఆవిడ పేరు మీద తీసుకున్నాడు (తనమీద ఇప్పటికే ఐదారు పాలసీలు ఉన్నాయని - అవన్నీ మధ్యలో ఉన్నాయని). వాల్లావిడకి వయస్సు 30 సంవత్సరాలు. ఆవిడపేరు మీద 20 సంవత్సరాల కాలానికి 15 లక్షల పాలసీని - సంవత్సరానికి 3,600 రూపాయల ప్రీమియంతో టర్మ్ పాలసీని తీసుకున్నాడు. నెలకు ఇంచుమించు కేబుల్ టీవీ బిల్ (300), లేదా రోజుకు ఓ కప్పు కాఫీ డబ్బుతో ఆమెకు 20 సంవత్సరాలవరకూ ఆర్ధిక భద్రత ఉంటుందిగా. ఈమధ్యలో తనకు ఏమైనా జరిగితే ఆ వచ్చే డబ్బుతో పిల్లల పెళ్ళిళ్ళు కాని, వారి చక్కని భవిష్యత్తుకు తోడ్పాటు ఉంటుందిగా.. Continued..
updated on 17-May-2009 9:00am