Tuesday, October 22, 2013

Ramappa Temple - 7

Ramappa Temple - 6 తరవాయి భాగం. 

ఆ గుడి చుట్టూరా ఉన్న మరికొన్ని నాగిణి, యక్షిణి రూపాల శిల్ప సౌందర్యాన్నీ, ముగ్ధత్వాన్నీ, సుకుమార తత్వాన్నీ, హోయలూ, బింకాలు, పొంకాలు, నునుపుదనమూ, గాలిలో తెలినట్లుండే నగలూ, వస్త్రాలూ, దేహ అవయవాలు.... ఇవన్నీ వర్ణించడం కష్టం. ఇంత నాజూకు పనితనం, అద్భుత శ్రామిక సౌందర్యాన్నీ - కేవలం ఇక్కడి శిల్పాలలోనే చూడగలం. అందుకే ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. 







గుడి తూర్పు ద్వారం వద్ద కుడివైపున ఉండే గణపతి విగ్రహం. 







పై శిల్పాన్ని చూడండి. ఆ శిల్పం మీదనున్న తీగల్ని చూడండి. ఎంత లోతుగ్గా, గాలిలో తేలినట్లుండే ఆ తీగల్ని విడివిడిగా చెక్కడం ఎంత కష్టమో ఆలోచించండి. అంత సన్నని పనితనాన్ని చెక్కడం లో చూపించడం ఈ కాకతీయుల శిల్పులకే చెక్కింది. ఈ శిల్ప పనితనం అంచనా వెయ్యడానికే చాలా సమయం ఈ శిల్పం వద్దే తీసుకున్నాను. కేవలం నల్లని గ్రానైట్ రాతిలోనే ఈ పని సాధ్యం. అలాగే చాలా కఠినమైన ఈ రాయిని నునుపు చెయ్యడం మరింత కష్టం కూడానూ..






మరికొన్ని తరవాయి భాగం లో.. 

Monday, October 21, 2013

Ramappa Temple - 6

Ramappa Temple - 5 తరవాయి భాగం.. 

ఇదే రామప్ప ప్రధాన ఆలయము - శ్రీ రామలింగేశ్వర స్వామీ వారి ఆలయం. ఇది ఆలయానికి ఎడమవైపున ఉన్న ద్వారం. ద్వారం వద్ద రెండు భారీ శిలా ఏనుగులు స్వాగతం పలుకుతాయి. 

ఆ ఆలయం ముందు భాగం. చక్కని శిల్పకళతో ఆకట్టుకుంటుంది. మనం చూడాల్సిన ప్రధాన శిల్పకళ ఇదొకటి. చక్కని శిల్పాలతో మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. 

రామలింగేశ్వర గర్భగుడి వెలుపల ఎడమ భాగం. 

ఆలయ వెలుపల ఎడమ స్వాగత ద్వారం వద్ద ఉన్న తొండం విరిగిన శిలా ఏనుగు. 

రామప్ప గుడిలో మనల్ని బాగా ఆకట్టుకోనేది - ఈ యక్ష నాగినుల శిలా విగ్రహాలే. నలసరం గ్రానైట్ రాతితో, సూక్ష్మ పనితనం వీటిల్లో కనిపిస్తుంది. ముత్యాల దండలనీ, గాలికి ఎగురుతున్న పమిటనీ, వ్రేలాడుతున్న ఆభరణాలనీ ఇక్కడ చూడవచ్చును. అది ఈ ఆలయ ప్రత్యేకత. ఇంత అందముగా, నిజమా అని అబ్బురపరిచేలా ఉన్న ఈ శిల్పాలు మన కాకతీయుల కళా నైపుణ్యానికి మచ్చుతునకలు అని ప్రశంసించక తప్పదు. 

ఆలయం పై భాగం అంతా ఇసుకరాతితో నిర్మాణం అయి ఉంటే - వాటిలో కాంట్రాస్ట్ గా నల్లని రాతితో - అదీ నూనె పూసి మెరిసేలా చేసారా అనేలా అగుపించే ఈ శిల్పకళ నునుపుదనానికి నిజముగా జోహార్లు అర్పించక తప్పదు. కటి భాగాన ఉన్న ఆభరణాల మీద ఉన్న పూసలు, ముత్యాలు నిజమైనవా అన్నంత సూక్ష్మముగా చెక్కారు.  

మీకోసం అనీ ఆ నాగినుల శిల్పాల ఫోటోలని 
చాలా పెద్దగా చూపిస్తున్నాను. 
అలా సెట్టింగ్స్ మార్చాను. 
బాగా పరిశీలనగా చూడండి. 
మీరు కూడా అద్భుతం అని అంటారు. 

నేను అన్నది నిజమే అని మీరూ అనుకుంటున్నారు కదూ.. 




ఈ రెండు పిల్లర్లూ పైనున్న శిలా పైకప్పు భారం మోయడానికి అదనముగా ఏర్పరిచినవి. 









( మిగతా మరో భాగములో చెప్పుకుందాం.. ) 

Sunday, October 20, 2013

Ramappa Temple - 5

నాలుగో భాగం Ramappa Temple - 4 తరవాయి భాగం. 

ఇదే ఆ శిథిల మందిరం గర్భగుడి. లోనికి వెళ్ళకుండా ఇనుప గ్రిల్ పెట్టారు. లోపల రెండు గదులుగా గర్భ గుడి ఉంటుంది. కాసింత చీకటిగా ఉంటుంది. ఉదయం పూట నేరుగా వచ్చే సూర్యకాంతిలో లోపల ఏముందో కాసింత చూడగలం. మిగతా వేళల్లో లోపలున్నది చూడలేము అనుకుంటాను. లోపల శుభ్రముగా ఊడ్చినట్లు ఉన్నా, పైకప్పు నుండి కారుతున్న నీటివల్ల నేల, గోడలు అపరిశుభ్రముగా ఉన్నాయి. అంతగా పట్టించుకోవటం లేదు అన్నట్లుగా ఉంది. ఈ లోపలి గర్భగుడి కాసింత క్రిందుగా ఉంటుంది. లోపల నుండి గబ్బిలాల కంపు వాసన వస్తుంది. భరించలేం. 

ఇది గర్భగుడి ద్వారం మీద ఉండే అందమైన నిగిషీ పనితనం. కానీ కారుతున్న నీటి చారికల వల్ల, ఆలయ అధికారుల అలసత్వం వల్ల సరిగా కనిపించదు. 

ఇది లోపలి గర్భగుడి. ముందున్న ఇనుప గ్రిల్ గుండా కెమరాని లోపలి పెట్టి తీసిన ఆరు ఫోటోలలో ఇదొక్కటే బాగా వచ్చింది. నిజానికి కెమరా సెట్టింగ్స్ మార్చాలి. కానీ ఆ సమయాన మరిచాను. అలా చేస్తే ఇంకా బాగా వచ్చేది. 

కాకతీయుల శిల్పుల ప్రతిభకి మరో తార్కాణం - ఈ నగిషీ పనితనం ఉన్న రాతి జాలి. ఇది ఆ గర్భగుడికి ఇరువైపులా ద్వారానికి అటూ ఇటూ ఉంటాయి. గులాబీ రంగు రాతిలో నలుచదర రంధ్రాలతో, అన్నీ సమాన దూరాలలో, ఎలాంటి సాంకేతిక పనిముట్లు లేని ఆ కాలాన అంత ఖచ్చితముగా - చక్కనైన, చిక్కని డిజైన్ ని ఆకాలం లోని శిల్పులు సాధించగలిగారూ అంటే - ఎంత అద్భుతమైన పనితనమో మీరే ఊహించుకోండి. 

ఇదే రాతి జాలి కిటికీ. ఈ ఫోటోని మీకోసమని కెమరా లో ఫీడయిన Actual Size లో చూపిస్తున్నాను. పెద్దగా చేసి చూడాల్సిన శ్రమ తప్పిస్తున్నాను. నా మదిని దోచిన శిల్ప కళ ఇది. సాంకేతికముగా లావాటి బండకి ఇలా రంద్రాలని చేసి, వాటిపై అందమైన శిల్పకళ చెయ్యడం నిజంగా అద్భుతం.  

గర్భగుడి పైకప్పు. వర్షపు నీరు కారి, ఉప్పూరిన నీటి చారికల వల్ల అసహ్యముగా కనిపిస్తున్నాయి. 

ఆలయం ముందున్న నందీశ్వర విగ్రహం. 

ఆ వర్షపు నీటి ఉప్పూరిన చారికలు ఈ అద్భుత నందీశ్వరునికీ తప్పలేదు. ఇలా ఆ నందికి ఎడమ వైపు కనిపిస్తుంది. వర్షం పడే వేళల్లో ఈ విగ్రహం మీద ప్లాస్టిక్ షీట్ కప్పితే బాగుండేది అనిపించింది. 

( మిగతా విశేషాలు మరో టపాలో..)

Related Posts with Thumbnails