గతంలో సాధించిన విజయం చూసుకొని, మురిసిపడితే - భవిష్యత్తులో వచ్చే విజయాలు అన్నీ దూరం అవుతాయి.
అన్నింటినీ సమానముగా పరిగణిస్తూ ముందుకు పయనం చేసినప్పుడే - మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాము.
మనం ఎప్పుడో సాధించిన విజయాలను జ్ఞాపకం చేసుకుంటూ - నేనిలా చేశా, అలా చేశా, ఫలానా వారు మెచ్చుకున్నారు, నాతో ఇలా అన్నారు అనుకుంటూ ఉంటుంటే - ఆ మానసిక తృప్తితో ఇక ముందున్న కాలములో అంత కష్టపడలేని, నిరాశాపూరిత వాతావరణాన్ని మనమే మనకు తెలీకుండా కల్పించుకున్నవారిమి అవుతాం. అలా అనుకోవడం - ఒక సంతృప్తికరమైన ( Saturated సాచురేటేడ్ ) భావన. అది మన భవిష్యత్తు ఎదుగుదలని ఆపేస్తుంది. ఫలితముగా మనం ఎక్కడో ఒకచోట మన అభివృద్ధి ఆగిపోతుంది. అది ఆగింది అని తెలుసుకొనేలోపు మన జీవితాలలో ఎదుగుదల ఆగిపోతుంది. ఇది ఎక్కువగా - ఒకప్పుడు నేనిలా చేశా, ఇంతగా సంపాదించా, ఈ పని మొదటగా నేనే చేశా, ఈ ప్రాంతములో మొదటగా నేనే మొదలుపెట్టా... ఇలా చెప్పుకొనే వారి జీవితాలు చక్కని ఉదాహరణ.
ఉదాహరణకు : ఒకతను బ్యాంక్ క్లర్క్ కావాలని - రాత్రింబవళ్ళు కష్టపడి ఆ ఉద్యోగం సాధిస్తాడు. పదే పదే నేను ఇంతలా కష్టపడ్డా అని అనుకుంటూ పోతుంటే - ఇక మేనేజర్ స్థాయికి ఎదగాలన్న లక్ష్యం మీద అంతగా దృష్టి పెట్టలేకపోతాడు. ఫలితముగా సాంఘికముగా మరింత హోదా, పలుకుబడి, సౌకర్యాలు, జీవన ప్రమాణాలు వచ్చేవి అలాగే నిలిచిపోతాయి. అందుకే మన లక్ష్యాన్ని ఒకటి తరవాత ఒకటి పెట్టుకుంటూ ఎదుగుతూ కష్టపడుతూ అభివృద్ధిలోకి రావాల్సిందే. అలా చేస్తే మన జీవితం మరింత బాగా అగుపిస్తుంది.