Friday, May 31, 2013

Good Morning - 361


నీ వర్తమానాన్ని జరిగిపోయిన గతం ఎప్పటికీ ప్రభావితం చెయ్యలేదు. ఎందుకంటే జీవితం అంటే - కేవలం వర్తమానం.. గతం కాదు. 

Thursday, May 30, 2013

Bhadrakali Temple, Warangal - 1

 చాలాకాలముగా లాంగ్ డ్రైవ్ చెయ్యక అదోలా ఉంది. ఎటైనా వెళ్ళాలీ అనుకున్నాను. మా అమ్మాయి కూడా వెళదాం అంది. ఒకసారి లాంగ్ డ్రైవ్ అంటే ఎలా ఉంటుందో, తనకీ తెలుసుకోవాలని ఆసక్తి చూపించింది. ఎటైనా వెళదాం అంటే - సరే అన్నాను. అప్పుడే నా చిన్నప్పటి మితృడి నుంచి శుభలేఖ అందింది. అదే కాకుండా ,తప్పకుండా రావాలంటూ ఫోన్ కాల్. వెళదామా అని ఇంట్లో అడిగాను. అంత దూరమా? అన్నారు. వరంగల్ లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం గురించి విన్నాను. చాలా బాగుంటుందని, మహిమాన్వితమైనదనీ విన్నాను. చాలా రోజులుగా వెళ్ళాలనుకుంటూ, తీరిక లేక ఆగిపోయాను. ఈసారి అక్కడికే వెళదామని వారితో చెప్పాను.. 

ఇంత ఎండలో అంత దూరములో ఎలా వెళ్ళగలం? అని అంటే - వెంటనే చెప్పాను.. వేకువ ఝామునే మన ప్రయాణం మొదలవుతుంది. పదిన్నర వరకూ అవుట్ డోర్ లో ఉండి, ఆ తరవాత మూడున్నర వరకూ నీడపట్టు స్థలాలల్లో ఉండి, ఆ తరవాత మళ్ళీ ప్రయాణం. రాత్రి ఎక్కడైనా షెల్టర్. శని, ఆదివారాలు కలసి రావటముతో... ప్రోగ్రాం ఫిక్స్ చేశాను. అలా ఉదయాన ఐదు గంటలకే బైక్ మీద మా ప్రయాణం మొదలయ్యింది. 

బైక్ మీద ఎందుకూ అంటే చాలా సౌకర్యముగా ఉంటుంది. ఎలా పడితే అలా సాగిపోవచ్చును. అలాగే ఎక్కువ బాదర బందీలు ఎదురుకావు. ఇంతకు ముందు వెళ్ళిన లాంగ్ డ్రైవ్స్ లలో ఈ అనుభవం అయ్యింది. ఈసారి బంధువులది బైక్ తీసుకొని వెళ్ళాం. ఆ బైక్ కావాలనీ, ఏమైనా రిపైర్స్ ఉంటే అంతలోగా చేయించి పెట్టమని చెప్పాను.. ఇలా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనీ.. కానీ వాళ్ళు బ్రేక్ మాత్రం రిపైర్ చేయించలేదు.. బ్రేక్ షూస్ మొత్తం అరిగిపోయాయి. చివరిలో ఉన్నాయి  అవి. బండి ఇచ్చినందులకు కృతజ్ఞతగా మధ్యలో మారుద్దామని అనుకున్నాను.. కానీ సమయం లేక, వీలుగాక పోయింది. 

మేమే అనుకున్నాం. మాలాంటి వాళ్ళు చాలామంది అలా ఎదురయ్యారు. ప్రొద్దున్నే లేచి, అలా కుటుంబాలతో ఎండా పూర్తిగా కాకముందే వెళ్ళిపోవటం చేస్తున్న వాళ్ళు చాలామందే కనిపించారు. దారిలో మాకు ఎదురుగా వస్తున్న ఒక బైక్ మీద వాళ్ళు వాళ్ళ లగేజ్ ని - స్పీడ్ బ్రేకర్ దాటుతుండగా పడేసుకున్నారు. వారిని హెచ్చరించి, ఆపి, ఆ పడేసుకున్న లగేజ్ నీ తిరిగి పొందేలా చూశాం. 

నా చిన్నప్పటి స్నేహితుని కూతురు పెళ్ళికి వెళ్ళాం. అక్కడ వాళ్ళని కలిసి (ఇక్కడో విశేషం ఉంది. అదేమిటో ఇంకో టపాలో వ్రాస్తాను. అది వ్రాశాక ఇక్కడ లింక్ పెడతాను) అక్కడ కాసింత విరామం తీసుకొని, ఈ భద్రకాళి ఆలయానికి వెళ్లాము. 

నా స్మార్ట్ ఫోన్ లో నావిగేటర్ (దీన్నే GPS - Global Positioning System అంటారు. దారి చూపిస్తుంది. ఎంత దూరం ఉంది, ఇంకా ఎంత సమయం పడుతుంది, ఆ దార్లో మనం ఎక్కడ ఉన్నాము, ఎటు వైపు తిరగాలో.. అన్నీ చూపిస్తుంది) ఆన్ చేశాను. అందులో ఆలయం పేరు టైపు చేశాను. వెంటనే దారి చూపింది. చాలా దగ్గరగానే ఉన్నాము. అసలు రహదారి ఉన్నా, మేము ఒక సందులో ఉండేసరికి ఆ సందుల గుండా దారి చూపించింది. అబ్బో! ఆ సందుల గుండా కష్టముగా వెళ్ళాం. నిజానికి అలా రాదు.. అయ్యో! ఇలా సందుల గుండా దారి చూపించేదేమిటీ ? అనుకున్నాను.. అంతా అయ్యాక ఆ సందు మొదట్లో ఉన్న రహదారి మీద ఉండి, నేవిగేటర్ ఆన్ చేస్తే, చక్కని రహదారిని చూపించింది. సో, అలా ఒక పాఠం నేర్చుకున్నాము. అదేమిటంటే  - ఇక నుండీ ఎప్పుడు దారి చూడాలన్నా, రహదారి మీద ఉండే అలా ఓపెన్ చెయ్యాలన్నది. ఈ క్రింది ఫోటో  Bing నుండి సేకరించాను. దాదాపుగా ఇలాగే నేవిగేటర్ లో దారి చూపిస్తుంది. ఇంత గజిబిజి ఉండదు.. మనకి అవసరమైన దారి మాత్రమే కనిపిస్తుంది. 




దూరాన కొండల ప్రక్కన కనిపిస్తున్నదే - శ్రీ భద్రకాళి ఆలయం. అలాగే భద్రకాళి చెరువుని కూడా మీరు ఇక్కడ చూడవచ్చును. 


మంచి ప్రకృతి సుందర ప్రదేశములో ఉండి, చాలా ఆహ్లాదకర వాతావరణములో ఈ ఆలయం నిర్మించారు. 


పెద్ద కొండల ప్రక్కన, చక్కని పరిసర వాతావరణములో, ఎంతో హాయిగోల్పుతుంది. గుడివరకూ చక్కని పెద్ద తారు రహదారి ఉంది. ప్రస్తుతం ఆలయ ముందు భాగాన్నే వాహనాల పార్కింగ్ కి వాడుతున్నారు. మేము వెళ్ళినప్పుడు అప్పుడే పెద్ద గేటు ని ఏర్పాటు చేస్తున్నారు. కనుక ఆ ఫోటో తీయలేదు. వాహన పార్కింగ్ బైక్స్ లకు రూ. 10 తీసుకొని, ఒక టోకెన్ ఇస్తారు. 


ఇదే ధ్యాన మందిరం. ఆలయానికి వెళ్ళే దారిలో కుడివైపున వస్తుంది. దీనికి ఎదురుగా చెప్పుల స్టాండ్ ఉంటుంది. అక్కడ జతకి రెండు రూపాయల చార్జీ వసూలు చేస్తారు. మధ్యలో ఉన్న దారిలో నూతన, పాత వాహనాలకు  - వాహన పూజ చేస్తారు. 


ఇదిగో, ఈ పై ఫోటోనే వాహన పూజ స్థలం. ఇక్కడే టోకెన్ తీసుకొని, వాహన పూజకి అన్ని ఏర్పాట్లు చేసి, పూజ చేస్తారు. ఇక్కడనే కొబ్బరికాయలు, పూల మాలలు అమ్ముతారు. అవి ఇక్కడే ఖరీదు చెయ్యాలి. లోపల ఎక్కడా దొరకవు.. దీన్ని దాటి ముందుకు వెళ్ళితే - ఒక మూడడుగుల వెడల్పు గల నీటి మడుగు కనిపిస్తుంది. ప్రక్కన పైపుల గుండా వచ్చే, పాదాలని స్పృశిస్తూ వెళ్ళే ఆ నీటిలో  పాదాలని కడుక్కొని, లోనికి వెళ్ళొచ్చును. కానీ, ఎండాకాలం అనే కారణమేమో  - ఆ నీరు రాలేదు. ముందు ఉన్న కుళాయిల వద్ద కడుక్కున్నాం. ( ఆ కుళాయిలు శ్రీ గోకులం - అనే ఆవుల పాక వద్ద ఉన్నాయి . క్రింద ఫోటోలో ఎడమవైపున గుడిసె లా ఉంది చూడండి.. అక్కడ కుళాయిలు ఉన్నాయి. )


ఇదిగో ఈ దారి గుండా ఆలయ పరిసరాల్లోకి ప్రవేశిస్తాం. దీనికి ఒక అడుగు ముందుగానే ఇందాక చెప్పిన - కాళ్ళు కడుక్కునే మడుగు వస్తుంది. ఇలా వెళ్ళే దారిలో ఎడమ వైపున భద్రకాళి చెరువు, కుడివైపున  - చెట్లు, చేమలూ, పెద్ద కొండ కానవస్తాయి. 


ఆ కొండ ప్రక్కన పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలని ఇక్కడ చూడవచ్చును. విశాఖ లోని కైలాసగిరి కొండ మీద ఉన్న శివపార్వతుల్లా తీర్చి దిద్దారు. ఇంకా చుట్టూ తీర్చిదిద్దుతున్న ఉద్యానవన పనులు సగములో ఆగిపోయాయి. 


ప్రక్కనే పెద్ద జలాశయం ఉన్నా, ఆ నీటి సహాయముతో ఆ గుట్ట మీద పచ్చని పచ్చికని నాటితే - అది చాలా ఆకర్షణీయముగా ఉంటుంది. బహుశా త్వరలో చేస్తారు అనుకుంటాను. 


శివపార్వతుల విగ్రహాలు. 


ఎడమ ప్రక్కన ఉన్న భద్రకాళీ చెరువు. చెరువులో చెట్టు ప్రక్కన కనిపిస్తున్నది వరంగల్ నగర త్రాగునీటి పంప్ హౌజ్. దాని ప్రక్కన కనిపిస్తున్నది వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం ( Link :  వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం. )

Wednesday, May 29, 2013

Sree Veera Brahmendra Swamy temple. Warangal.

మొన్న నా మిత్రుని కూతురి వివాహం సందర్భముగా వరంగల్ కి వెళ్లాను. అక్కడ కొన్ని చారిత్రాత్మక, స్థానిక ప్రదేశాలని సందర్శించాను. అవి ఇప్పుడు మీకోసం చూపిస్తాను. ( పెద్దగా చూసేందుకై ఆ ఫోటోల మీద క్లిక్ చెయ్యండి. అలాగే ఈ ఫోటోల సైజులు అన్నీ - త్వరగా తెరచుకోవటానికి కుదించబడ్డాయి.)

ఇదే ఆ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం. రెండు అంతస్థుల మీద మూడో అంతస్థులో ( అంటే గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్థు మీద ఉండే మరో అంతస్థు లో ) ఈ ఆలయాన్ని నిర్మించారు. వరంగల లోని భద్రకాళి ఆలయ దారిలో, మొదటగా వచ్చేది ఈ ఆలయమే. భద్రకాళి ఆలయానికి క్రొద్ది అడుగుల దూరములో ఈ ఆలయం ఉంది. నల్లని గ్రానైట్ మెట్ల మీదుగా వెళ్ళితే, పాలరాతి బండలున్న మంటపానికి చేరుకుంటాం. గుడి ముందు మెట్ల వరకూ నేరుగా వాహనములో  వెళ్ళవచ్చును. 


ఇలా పాలరాతి గచ్చు ఉన్న ఆలయం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి అటూ, ఇటూ మరోరెండు చిన్న ఆలయాలు కనిపిస్తాయి. 


ప్రధాన ఆలయములో - శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామీ వారు, సతీమణి గోవిందమ్మ గార్ల నల్లని శిలామూర్తులు కనిపిస్తాయి. 


ఆలయం లోని గచ్చు మీద ఉన్న పాలరాయి బండ డిజైన్. 


సమయాభావం వల్ల క్రింద అంతస్థులలోకి వెళ్ళలేక పోయాను. 

Tuesday, May 28, 2013

Good Morning - 360


మీ మనసు అనే ఆకాశాన ప్రేమ ఉదయిస్తే - ఆ భావనతో మది ఆవర్ణమవుతుంది. 

Saturday, May 25, 2013

Good Morning - 359


కర్రు లేని నాగలి ఎలాగైతే భూమిని దున్నలేదో, అలాగే మనసు లేని ఇంద్రియాలు ఏ పనీ చెయ్యలేవు. 

Thursday, May 23, 2013

Good Morning - 358


మనసు అదుపులో ఉంటే ఆనందమే.. 

Wednesday, May 22, 2013

Good Morning - 357


ఎప్పుడూ మన మనసు చెప్పిన మార్గములో సాగిపోవాలి. 
ఏ దారిలో వెళ్తున్నా, ఎన్ని అవరోధాలు వచ్చినా పట్టుదలను మాత్రం వదలకూడదు. 
సాధించడంలో ఉండే ఆనందం ఇంకెందులో ఉంటుంది. 

Tuesday, May 21, 2013

Good Morning - 356


నా కన్నీళ్ళు దోసిళ్ళలో పట్టే చేతులు నాకొద్దు, 
అవి తుడిచే వ్రేళ్ళు చాలు, 
కలకాలం బ్రతికించే అమృతం నాకొద్దు, 
ఆ క్షణమే జీవితం అనిపించే ఒక్క క్షణం చాలు.. 

Monday, May 20, 2013

Good Mornin - 355


మన పుట్టుకకు దేవుడిని నిందించవచ్చునేమో గానీ, మన అపజయాలకు మాత్రం నిందించకూడదు. 

Sunday, May 19, 2013

Your comment will be visible after approval

ప్రశ్న : [తెలుగుబ్లాగు:21116] నేను ఒక బ్లాగ్ లో కామెంట్ పొస్ట్ చెద్దమని ఎంత ప్రయత్నించినా నా కామెంట్ పోస్ట్ కాకుండా -  Your comment will be visible after approval అని వస్తుంది, ఎందుకు అలా వస్తుంది, ఆ బ్లాగ్ లో  కామెంట్  పోస్ట్ చేయాలి అంటే ఎలా?  ప్లీస్.......... దయచేసి ఎవరైనా నా సమస్యని తిర్చగలరూ. ప్లీస్....... 

జవాబు : మీరు ఆ బ్లాగ్ లో కామెంట్ వ్రాసి, పోస్ట్ చేస్తే, అలా  Your comment will be visible after approval అని ఎందుకు వచ్చిందీ అంటే - మీరు వ్రాసిన కామెంట్ ఆ బ్లాగ్ లో ప్రచురించటానికి / ప్రదర్శించటానికి అర్హత ఉందొ లేదో అని చూడటానికి ఒక విధమైన సెట్టింగ్. ఇది ఆ బ్లాగ్ ఓనర్స్ కి మాత్రమే ఉంటుంది. ఎవరైనా కామెంట్ పెడితే ఆ బ్లాగ్ ఓనర్స్ వద్దకి వెళుతుంది. మీ కామెంట్ పబ్లిష్ చెయ్యటానికి అర్హముగా ఉంటే, పబ్లిష్ ని నొక్కి, తమ బ్లాగ్ లో కనబడేలా చేస్తారు. ఒకరకముగా చెప్పాలంటే - కామెంట్ సెన్సారింగ్ లాంటిది ఈ ఆప్షన్. 

Saturday, May 18, 2013

Good Morning - 354


జీవితం అంటే నిన్ను నువ్వు వెతుక్కోవటం కాదు. నిన్ను నువ్వు సృష్టించుకోవటం. 


Friday, May 17, 2013

Good Morning - 353


కొందరు - మీకు ఎంతో సహాయం చేస్తున్నానని అనిపించేలా నటిస్తారు. వారితో కాసింత జాగ్రత్తగా ఉండండి. 

అవును.. మనకు జీవితములో ఎందరో సహాయం చేస్తారు.. చేస్తుంటారు. అందులో కొందరు మనకి ఎంతో సహాయం చేస్తున్నామని అందరి ముందటా చేస్తున్న తమ సహాయాన్ని ప్రదర్శిస్తుంటారు. నిజానికి అది చాలా చిన్నది. కానీ పెద్దగా చేస్తున్నామని  / ఎంతో చేస్తున్నామనే అర్థం వచ్చేలా చేస్తారు. ఒక మాటలో చెప్పాలీ అంటే - పావలా సాయం చేసి, వంద రూపాయల సాయం చేసినట్లుగా ఉంటుంది. 

పై ఫోటో లోనే చూడండి. గోతిలో ఉన్నవాడిని పైకి లాగటానికి, పైన ఉన్నవాడు చేయి అందిస్తున్నాడు.. కానీ ఆ చేయి దూరం సరిపోదు. అయినా అందిస్తూనే ఉన్నాడు. అతని ప్రక్కన ఒక నిచ్చెన కూడా ఉంది. అది ఆ గోతిలో ఉన్నవాడిని పైకి తేలికగా వచ్చేలా చేస్తుంది. అయినా అది ఇవ్వక ఏదో సహాయం చేస్తున్నట్లుగా బిల్డప్. క్రిందవాడికి ఆ నిచ్చెన కనిపించదు. పైన ఉన్నవాడు తనని రక్షించటానికి శాయశక్తులా కృషి చేస్తున్నాడు అని అనుకుంటున్నాడు.. అచ్చు ఇలాగే ఉంటుంది - కొందరి సహాయం. వీరితో కాసింత జాగ్రత్తగా ఉండండి. 

Thursday, May 16, 2013

Good Morning - 352


నీతో స్నేహం నా జీవిత విలువని పెంచింది. 
దీనిని ఏనాటికీ తరగనివ్వను నేస్తం.. !

అవును నేస్తం..! 
అనుకోకుండా పరిచయం అయినా నా ఆప్త మిత్రుడివిగా మారావు. 
చిన్న చిన్న ఆనందాల నుండీ, బ్రహ్మానందాల వరకూ నీవల్ల పొందాను. 
మామూలుగా గడిచిపోతున్న నా జీవన శైలిని మార్చి, చాలా విలువైనదిగా మార్చావు. 
ఎన్నాళ్ళుగా వేచిన మధురక్షణాలు నీవల్ల నాకు కలిగాయి. 
నీవు నేర్పిన జీవిత విలువలని ఎప్పటికీ వదులుకోలేను. 
వాటిని నేనున్నంతకాలం పదిలముగా కాపాడుకుంటాను. 
నీ స్నేహం వల్ల ఇంతగా లబ్దిని పొందాను. 
నీ జ్ఞాపకాల గుర్తుగా - నీవల్ల వచ్చిన ఈ జీవిత విలువని భయముతో, భక్తిగా కాపాడుకుంటాను. 

Wednesday, May 15, 2013

Good Morning - 351


పుట్టిన ప్రతివాడికీ - ఓటమి జీవితంలో ఒక భాగం. 

Tuesday, May 14, 2013

ఫేస్ బుక్ లో పుట్టినరోజు నోటిఫికేషన్ - 2

ఫేస్ బుక్ లో పుట్టినరోజు నోటిఫికేషన్ - 1 తరవాత మిగిలిన ఆ రెండో టెక్నిక్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.


1. మీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చెయ్యండి. 

2. మీ ప్రొఫైల్ హోమ్ పేజీ ఓపెన్ చెయ్యండి. 

3. మీ ప్రొఫైల్ ఫోటో క్రింద ఉండే Favorites లో Events మీద క్లిక్ చేసి, ( పైన ఫోటోలో వృత్తములో చూపినట్లుగా ) ఓపెన్ చెయ్యండి. అప్పుడు ఇలా ఈవెంట్స్ పేజీ ఓపెన్ అవుతుంది. 


4. అప్పుడు ఇలా ఈవెంట్స్ పేజీ ఓపెన్ అవుతుంది. మీరు పైన ఎడమ మూలన ఉన్న Events ప్రక్కన ఉన్న List ని నొక్కితే మీకు ఈవెంట్స్, పుట్టినరోజులు అన్నీ ఇక్కడ ఎప్పుడెప్పుడు ఉన్నాయో అన్నీ తెలిసిపోతాయి. ఇలా ఇంకో సంవత్సరము కి పైగా వచ్చే రోజులలో ఏమేమి ఈవెంట్స్, పుట్టినరోజులు, ఆహ్వానాలు.. ఉన్నాయో తెలిసిపోతుంది. 

5. Calender ని నొక్కితే ఒక నెల పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఏ ఏ రోజుల్లో - ఏమేమి ఈవెంట్స్, పుట్టినరోజులు, ఆహ్వానాలు ఉన్నాయో తెలిసిపోతుంది. 

ఇలా చూసుకొని, మీ ఫ్రెండ్స్ పుట్టినరోజులు ఎప్పుడో తేలికగా తెలుసుకోవచ్చును. 

Monday, May 13, 2013

Good morning - 350


మనతో ఏకీభవించే వాళ్ళతో సౌఖ్యముగా ఉండగలం కానీ, ఏకీభవించని వాళ్ళ వల్లే ఎదుగుతాము. 

అవును.. మనం చెప్పే ప్రతివాటితో అవుననే చెప్పి మనతో మెప్పు పొందే వారితో మనం చాలా సౌకర్యముగా ఉండగలం. కానీ జీవితాన ఎదుగుదల, మార్పు, క్రొత్తదనం రావాలంటే - మనతో ఏకీభవించని వాళ్ళ వల్లే మనం ఎదుగుతాం. నమ్మలేకున్నా ఇది నిజం. 

మనం చెప్పే అన్నింటికీ అవుననే వారితో కన్నా, కాదు అనే అన్నవాళ్ళతో " ఎందుకు..? ఏమిటీ..? అలా ఎలా అవుతుంది..? " అని ప్రశ్నిస్తాం. అప్పుడు వారు మనతో ఎందుకు ఏకీభవించాలేకున్నారో వివరిస్తారు. దాని వల్ల మనకి ఒక క్రొత్త కోణాలు తెలుస్తాయి. ఫలితముగా కొద్దిగా మనలో మెచ్యూరిటీ వస్తుంది. 

Sunday, May 12, 2013

Good Morning - 349


జీవితం చాలా విలువైనది. మన నమ్మకం ఆ విలువను పెంచుతుంది. 

Saturday, May 11, 2013

Good Morning - 348


జీవితానికి హద్దులు ఉండవు.. నువ్వు గీసుకుంటే తప్ప..! 

జీవితానికి ఎలాంటి హద్దులు ఉండవు. అది స్వేచ్చగా ఉంటుంది. ఆకాశం అంచులు దానికి హద్దు కాదు.. అలాంటి పరిమితులు అంటూ ఏమీ లేవు. ఆ అంచులని దాటి ఇంకా సాగిపోవచ్చును. జీవితానికి పరిమితులు అంటూ ఎప్పుడూ అంటే - మనంతట మనం హద్దులు గీసుకున్నప్పుడు తప్ప మరెప్పుడూ ఉండవు. 

Friday, May 10, 2013

ఫేస్ బుక్ లో పుట్టినరోజు నోటిఫికేషన్ - 1

ఫేస్ బుక్ లో మీ ఫ్రెండ్ లిస్టులో ఉన్న మీ స్నేహితుల పుట్టినరోజుల తేదీలు ఎప్పుడో తెలుసుకోవాలని ఉందా? వారి వారి వాల్ మీద - ఇతరులు చెప్పిన శుభాకాంక్షలు చూసేదాకా మీకు తెలీదా..? అయితే మీరు ఈ ఇబ్బందిని రెండు రకాలుగా తొలగించుకోవచ్చును. చాలామంది " బర్త్ డే రిమైండర్ " ని వాడుతారు. ఆ అప్లికేషన్ ని చాలామంది వాడరు. ఆ అప్లికేషన్ ని తమ ప్రొఫైల్ లో ఆడ్ చేసుకున్న వారికే - తమ స్నేహితుల పుట్టిన రోజుల నాడు " ఈరోజే మీ ఫలానా మితృడి పుట్టినరోజు.." అంటూ ఒక నోటిఫికేషన్ అందుకుంటారు. అదీ ఆ అప్లికేషన్ ని వాడుకుంటున్న వారిది మాత్రమే.

ఇలా కాకుండా మీరంతట మీరుగా ఏ రోజుకారోజు - ఆ రోజున ఏ మితృడి పుట్టినరోజు ఉందో తెలుసుకోవటానికి అతి సులభముగా తెలుసుకోవచ్చును. అది ఎలా అంటే - మీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి, ఫెస్బూక్ హోమ్ పేజీలోని రండి. అంటే మీ ప్రొఫైల్ పేజీ మీద ఉన్న ముదురు నీలం రంగులో ఉన్న టూల్ బార్ మీద ఉన్న Facebook అనే గుర్తు మీద క్లిక్ చెయ్యండి. అప్పుడు మీ మిత్రుల వద్ద నుండి వచ్చిన పోస్ట్స్ అన్నీ అప్పుడు కనిపిస్తాయి.

అప్పుడు ఈ క్రింది ఫోటోలో చూపించినట్లుగా కుడి మూల వైపున చూస్తే - ఆ రోజు ఏ మితృడి పుట్టిన రోజు ఉందో, ఆ మితృడి పేరూ, లింక్ ఉంటుంది. దాన్ని నొక్కి, వచ్చిన మినీ మెస్సేజ్ బాక్స్ లో మెస్సేజ్ వ్రాసి పోస్ట్ చేస్తే చాలు..



Thursday, May 9, 2013

Good Morning - 347


జీవితం లోని శక్తి, మాధుర్యం అంటే ఇదే.. 

జీవితం యొక్క శక్తీ, జీవనం లోని మాధుర్యం చాలా గొప్పది. పైన ఉన్న చిత్రమే చూడండి. ఎంత ప్రేరణగా ఉంది కదూ.. ఎక్కడో రోడ్డు మీదున్న చెట్టుని కొట్టేసి, ఆ చెట్టు మొదలు మీద నుండి తారు రోడ్డు వేసి, బలముగా లెవల్ మెషీన్ తో త్రోక్కించినా, ఆ చెట్టు జీవితం మీద ఆశ కోల్పోలేదు. తగిన వనరులు, సమయం రాగానే తన మీద ఉన్న బలమైన తారు బంధాన్ని కూడా అవలీలగా బ్రద్దలు కొట్టి, వాటి మధ్యనుండే తలెత్తుకొని సగర్వముగా ఎదిగింది. అదీ  జీవితానికి ఉన్న గొప్ప బలం. 

కాబట్టి - పరిస్థితులు ఎంతగా మనల్ని అణగద్రొక్కినా, జీవితములో సర్వం కోల్పోయినా, ఇంకా నాకు ఏమీ మిగల్లేదు నాకు... అని అనిపించినా సమయాల్లో పై చిత్రాన్ని ప్రేరణగా తీసుకోండి. మీ మనసులో ఏర్పడిన భయాలు పటాపంచలు అవుతాయి. మీలో తెలీని శక్తీ, ఉత్సాహం కలుగుతుంది. 

Wednesday, May 8, 2013

Good Morning - 346


తనని తాను తెలుసుకోవడం చాలా కష్టం. దానికి తీవ్ర సాధన కావాలి. 

అవును..! మనిషి తన గురించి తానుగా - తానెవరో, తన వ్యక్తిత్వమేమిటో, తన పయనం ఎటో.. ఇత్యాది విషయాలని తెలుసుకోవడం చాలా కష్టమే. అలా తెలుసుకోవాలంటే - బాగా తన గురించి తాను అభ్యాసం చెయ్యాల్సిందే. నిజానికి ఇలా చెయ్యటం చాలా కష్టమే. 

Tuesday, May 7, 2013

Good Morning - 345


ఒప్పుకున్న తప్పు - చీపురులా దుమ్మును చిమ్మి, మనసును శుభ్రం చేస్తుంది. 

అక్షరాల నిజం.. అవును.! మనం ఏదైనా తెలీకనో, తెలిసో తప్పు / పొరబాటు చేసుంటే - ఆ తప్పుని ఒప్పుకోవటం చాలా మంచి పని. నిజానికి ఇలా ఒప్పుకోవటానికి అహం అడ్డు వస్తుందేమో గానీ, ఆ అహాన్ని ఒక నిమిషం పాటు ప్రక్కన పెడితే నిజాయితీగా ఆ తప్పు ఒప్పుకుంటే మనసులో ఏర్పడిన అహం, నేను సరిగానే చేశాను అన్న ఆలోచన, నాదే కరెక్ట్.. లాంటి ప్రతికూల ఆలోచనలు అన్నీ - తప్పు ఒప్పుకున్నప్పుడు అవన్నీ మన మనసునుండి తొలగిపోతాయి. ఫలితముగా మనసు శుభ్రంగా ఉంటుంది. అది ఎంతలా అంటే - ఇల్లు కడిగినట్లుగా ఉంటుంది. ఇక్కడ మీది నిజముగా తప్పు ఉంటేనే. అంతే గానీ మీది తప్పు లేకున్నా ఒప్పుకోమని కాదు. 

Monday, May 6, 2013

Good Morning - 344


నీ అంగీకారం లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు. 

నిజమే ! గౌరవం వేరు.. ఆత్మ గౌరవం వేరు. గౌరవం అనేది ఇతరులు మనకి ఇచ్చేది. ఉదాహరణకి ఒక ఇంటికి గానీ,  సభకి, సమావేశానికి గానీ వెళితే అక్కడ మనకి సముచిత స్థాయిలో మర్యాద దొరికితే / ఇస్తే అది గౌరవం. అదే ఆత్మ గౌరవం అంటే - మనకి మనం గౌరవం ఇచ్చుకోవడం. అంటే మనలోని మనిషికి మనం మర్యాద ఇచ్చుకోవడం. ఈ రెండింటికీ ముఖ్యమైన తేడా ఏమిటంటే - మన ప్రమేయం లేకుండానే ఇతరులు మన గౌరవం తగ్గించగలరు. కానీ మన ఆత్మ గౌరవాన్ని మనం తప్ప ఎవరూ తగ్గించలేరు. 

ఉదాహరణకి : మనం ఒక సమావేశానికి వెళ్ళితే అక్కడ ఎవరో మన తప్పు లేకున్నా మనల్ని కించపరిచినట్లు మాట్లాడితే - అది విని తగు సమాధానం ఇవ్వక అలాగే భరించామే అనుకోండి.. అప్పుడు మన ఆత్మ గౌరవాన్ని మనమే తగ్గించుకున్నవారిమి అవుతాం. 

అలాని ఈ ఆత్మ గౌరవం విషయంలో కాసింత అతిగా చేస్తే - అంటే బాగా పట్టించుకుంటే దెబ్బ తినేదీ మనమే అని బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా బాగా చేసి దెబ్బతిన్న చక్కని ఉదాహరణగా మహాభారత గాధ లోని దుర్యోధనుడు @ సుయోధనుడు కానవస్తాడు. 

Saturday, May 4, 2013

Good Morning - 343


పడింది మనమే!.. 
ఎవరినీ నిందించకు..

Friday, May 3, 2013

Good Morning - 342


విశ్వమంత ప్రేమని ఇరుకు హృదయములో ఎలా దాచగలం.. ?

Thursday, May 2, 2013

Good Morning - 341


నువ్వు ఏ పనిని ప్రారంభించినా అడుగడుగునా నిరుత్సాహపరిచే మిత్రులని దూరముగా ఉంచు. 

Wednesday, May 1, 2013

Good Morning - 340


అబద్ధానికి వేగమెక్కువ. నిజానికి ఓపికెక్కువ ! 

అబద్ధానికి ప్రచారం వేగం ఎక్కువ.. అదే నిజానికి నెమ్మదనం ఎక్కువ. నిజం చెప్పులేసుకొని ఇల్లు దాటేసేలోగా, అబద్ధం ఊరంతా తిరిగేసి వస్తుందని నానుడి. నిజాలేప్పుడూ నెమ్మదిగా తెలుస్తాయి. అందుకే తొందరపడి అబద్ధాలని విశ్వసించ కూడదు. నిజమేమిటో తెలుసుకోండి.