Thursday, November 24, 2016

Good Morning - 621


భగ్న ప్రేమ గురించి వ్రాసే వారంతా భగ్న ప్రేమికులు కారు.. 

అవును.. భగ్న ప్రేమ గురించి సామాజిక సైట్లలో పోస్ట్స్ పెట్టేవారిని, రచనలు చేసేవారినీ.. వీక్షకులు తరచూ అడిగే ప్రశ్న - మీరు లవ్ ఫెయిల్యూరా? అనీ.  అలాంటి పోస్ట్స్ పెట్టేవారిని వారు అలాని అనుకుంటే, హత్యల గురించి పోస్ట్స్ పెట్టేవారిని - మీరు హత్యలు చేస్తారా ? అని అడగాల్సిందే.. అప్పుడు ఆయా పోస్ట్స్ పెట్టేవారికి "కాలితే " ఇక మరొక హత్య జరుగుతుందేమో... హ హ్హ హ్హా  

ఈ లవ్ ఫెయిల్యూర్ పోస్ట్స్ పెట్టాలంటే - ప్రేమలో ఓడిపోయి, గడ్డాలు పెంచేసుకొని, ఏదో లోకములో విహరిస్తున్నట్లు ఉంటూ, కాసింత భావుకత రంగరించి, ఒకింత పాలు తనకు తెలిసిన ప్రేమ వియోగపు / విరహ వేదనను అక్షరాలల్లోకి మార్చి పోస్ట్ పెడితే - అందులోని భావనని అభినందించాల్సింది పోయి, మీరు ఇదా? అంటూ కామెంట్ చెయ్యడం ఏమైనా బాగుందా ? నాకైతే అలా అడగటం నచ్చదు. 

నా చిన్నతనంలో - ఒక ప్రఖ్యాత వారపత్రికలో ఒక రచయిత్రి సీరియల్ వచ్చేడిది. అందులో ఈ ప్రేమ తాలూకు భావనలు అందముగా వర్ణించి వ్రాసేడివారు. రవి గాంచని చోట కవి గాంచున్... అన్న చందాన ప్రేమ తాలూకు ఆకర్షణ, వియోగం, చిలిపి ముచ్చట్లు, ఒకింత పాలు శృంగారంగా, అద్భుతముగా వ్రాసేడివారు. తన పర్సనల్ లైఫ్ గురించి బయటకు ఏమీ తెలీని కారణాన అందరూ ఆవిడ చాలా పెద్దావిడ గాబోలు అనుకున్నారు. నేనూ అలాగే అనుకున్నా. కానీ ఆవిడ చాలా చిన్న వయసు అమ్మాయని ఆ పత్రికలోనే ఒక ఇంటర్వ్యూ వల్ల బయట ప్రపంచానికి తెలిసింది. తను శ్రీమతి కాదు - కుమారి అని తెలిసింది అందరికీ. ఇక ఆ అమ్మాయికి ఎన్నో ప్రశ్నలు... మీకు ప్రేమ "ఇంతగా " ఎలా తెలుసు, ఎవరినైనా ప్రేమించారా ? భగ్న హృదయులా? అవి సరే.. ఆలుమగల శృంగారం, చిలిపి ఘటనలు బాగా వ్రాస్తున్నారు.. పెళ్లయిన మాకే తెలీని ఈ విషయాలు మీకెలా తెలుసు? ఏమైనా అనుభవాలా?.. అంటూ. ఆ సీరియల్లోనే ఒక సగం పేజీలో ఆయా రచయిత(త్రు)లతో - పాఠకులతో ముఖాముఖి ఉండేడిది. అలా ఆ ప్రశ్నలూ అచ్చయ్యాయి. ఇలాంటి ప్రశ్నలు ఎక్కవ కావడంతో ఇక ఆ రచయిత్రికి ప్రశ్నల ముఖాముఖి శీర్షికని నిలిపివేశారు. ( ఆ సీరియల్ తరవాత ఆ రచయిత్రికి పెళ్లి జరిగిపోయింది ) ఇలాంటి బాధలు ఉంటాయి.

అదేమిటో కానీ, వాళ్ళ విషయాల గురించి పట్టింపులు ఉండవు కానీ ఎదుటివారిని ఇలాంటి ప్రశ్నలతో వేధించేవారిని చూస్తే అసహ్యం వేస్తుంది. అందమైన కాల్పానిక, ఊహాజనితమైన భావనని తమ ప్రజ్ఞతో అద్భుతముగా వర్ణించి, రచింప చేసే వారిని, తమ పిచ్చి కామెంట్లతో వారిని ఇబ్బందుల్లోకి నెట్టడం ఎంతవరకు సబబు? ఆ రచనని రచనలాగా తీసుకోవాలి గానీ అవి వారి వారి "అనుభవాలుగా " పరిగణిస్తే ఎంతవరకు న్యాయం? 

No comments:

Related Posts with Thumbnails