Thursday, April 21, 2016

Heart Touching Story

( నేనొక కథని చదివాను. చాలా బాగా నచ్చింది. మనం ఒకరికి మేలు చేస్తే - మనకూ మేలు జరుగుతుంది అని తెలియజేసే ఈ కథకి రచయిత / రచయిత్రి ఎవరో నాకు తెలీదు. కొద్దిపాటి మార్పులతో ఈ కథని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. అభినందనలు అన్నీ వారికే చెందుతాయి )

:: హృదయాన్ని హత్తుకొనే చిన్ని కథ ::
****************************************
హైవే మీద వెళుతున్న కారు టైర్ పంక్చర్ అవడం వల్ల ఆగిపోయింది. ఆ కార్ నుండి దిగిన ఆమెకు 50 సంవత్సరాలు ఉంటాయి. ఆ కార్ లో స్టేఫినీ టైర్ ఉంది కానీ తనకు వెయ్యడం రాదు. కార్ ని రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం ఎదురుచూస్తోంది కానీ ఒక్కరూ ఆగడం లేదు. సమయం చూస్తే సాయంత్రం ఆరు అవుతోంది.
నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. మనసులో ఆందోళన. తను ఒక్కర్తే ఉంది. తోడు ఎవరూ లేరు. చీకటి పడితే ఎలా? దగ్గరలో ఇళ్ళు కూడా లేవు. ఫోన్ చేద్దామన్నా సిగ్నల్స్ లేవు గనుక సెల్ పనిచెయ్యడం లేదు.
ఎవరూ ఆ కారునూ, పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు. అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది. ఎలారా దేవుడా? అనుకుంటూ ముసురుకుంటున్న చీకటిని చూసి భయపడడం మొదలయ్యింది. చలి కూడా పెరుగుతోంది.
అటుగా ముందుకు వెళ్తున్న ఒక పాత కారు , పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది. అందులో నుండి నల్లగా, మొరటుగా ఉన్న ఒక వ్యక్తి దిగాడు. అతడు తన దగ్గరకు రావడం చూసి, బెదిరిపోతోంది..  
ఏమి జరుగుతుంది?
ఎందుకు వస్తున్నాడు ??
ఏమి చేస్తాడు .???
మనసులో ఆందోళన !.
అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు.. కార్ టైర్ పంక్చర్ అయ్యిందని గమనించాడు. అలాగే తనని చూసి ఆమె బెదిరిపోతోందని గ్రహించాడు. " భయపడకండి. నా పేరు బ్రియాన్ అండెర్సన్. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పనిచేస్తాను. నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను. బాగా చలిగా ఉంది కదా ! మీరు మీ కారులో కూర్చోండి. నేను స్టేఫినీ మారుస్తాను" అన్నాడు. ఆమె భయపడుతూనే ఉంది.
అతను ఆ కార్ డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని, కారు కిందకి దూరి జాకీ బిగించాడు. తారు రోడ్డు గీసుకుని చేతులు రక్తం కారాయి. జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు. సామాను తిరిగి కారులో పెట్టి చెప్పాడు.. " టైర్ మార్చడం అయిపోయింది మేడం."
ఆమె డబ్బులు తీసి ఇవ్వబోయింది. వద్దు అన్నాడు. " ఎంత అయినా ఇస్తాను ఎంతో చెప్పండి.. మీరు కనక కనబడి ఈ సహాయం చెయ్యకపోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది" అంది.
" నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎందరో సహాయ పడ్డారు. మీకు అంతగా సహాయం చెయ్యాలనిపిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారని మీకు అనిపించినపుడు నా తరపున వారికి సహాయం చెయ్యండి. బై " అని వెళ్లి పోయాడు.
మనసులోనే తనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది. అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది. తను వెళ్ళవలసిన దూరం చాలా ఉంది. ఆకలీ, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ దగ్గరకి వెళ్ళేలా చేశాయి.
అదొక చిన్న హోటల్. కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక నిండు గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది. డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి, ఆయాసంతో బరువుగా నడుస్తున్నదని గ్రహించింది, ఆమె ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వుతో అన్ని టేబుల్స్ వద్దకి వెళ్ళి, వాళ్లకు కావలసిన ఆర్డర్స్ తీసుకోవడం, సర్వ్ చెయ్యడం, బిల్ తీసుకొని చిల్లర ఇవ్వడం అన్నీ తనే చేస్తున్నది.
ఆమె తన టేబుల్ వద్దకి వచ్చి, చిరునవ్వుతో " ఏమి కావాలండి? " అని అడిగింది. 
అంత శ్రమ పడుతూ కూడా ఆమె ముఖంలో చెరిగిపోని చిరునవ్వు ఎలా ఉందో అని ఆశ్చర్యపడుతూ - భోజనం ఆర్డర్ ఇచ్చింది. భోజనం అయ్యాక ఆమెకు 1000 డాలర్ల నోటు ఇచ్చింది. ఆమె వెళ్ళి చిల్లర తెచ్చి ఇవ్వబోతే ఆ కార్ ఆవిడ లేదు అక్కడ. ఆమె కూర్చున్న టేబుల్ మీద ఒక గ్లాస్ క్రింద ఒక పేపర్ మరియు 4000 డాలర్లు నోట్లు కనిపించాయి.. ఆ కాగితం చదివిన ఆ గర్భిణీ కి కన్నీళ్ళు ఆగలేదు.
అందులో - " చిరునవ్వుతో ఉన్న నీ ముఖం చూసి, నీకు బాధలు లేవేమో అన్నట్లు ఉంది. కానీ నిండు నెలలతో పనిచేస్తున్నావూ అంటే నీకు డబ్బు అవసరం చాలా ఉందని అనిపిస్తోంది. నాకు ఇందాక ఒక మిత్రుడు - బ్రియాన్ అండెర్సన్ కార్ టైర్ మార్పిడిలో సహాయపడినట్లే అతడిని తలచుకుంటూ ఈ డబ్బుల రూపములో నేను నీకు సహాయపడుతున్నాను. ఈ గొలుసు ఇంతటితో ఆగిపోకూడదు. నువ్వూ ఇతరులకు సహాయపడు.. " అని వ్రాసి ఉంది.
ఆమె ఇంటికి వచ్చింది. అంతక్రితమే - అలసిపోయి, ఇంటికి వచ్చి పడుకున్న భర్త చేతికేసి చూసింది. గీసుకపోయిన చేతుల మీద అక్కడక్కడా రక్తం గడ్డ కట్టుకపోయింది. అతని ప్రక్కగా కూర్చుంటూ " డబ్బుల సమస్యతో నా డెలివరీ ఎలాగా అని మనం బెంగ పడుతున్నాం కదా.. ఇక ఆ బెంగ తీరిపోయింది. ఆ భగవంతుడు మనకు సహాయం చేశాడు మై డియర్ బ్రియాన్ అండెర్సన్. ఆ దేవునికి కృతజ్ఞతలు.. " అంది ప్రశాంతముగా.

No comments:

Related Posts with Thumbnails