Friday, July 10, 2015

Good Morning - 585


భగవంతుడు సృజించిన ఈ జీవితంలో మన పాత్ర ఏమిటో ముందు గుర్తెరగాలి. ఇతర పాత్రలన్నీ కొన్ని పరిమితులకు లోబడి ఉంటాయి. ఎంతవరకూ ఆ పాత్ర పోషించాల్సి ఉంటుందో, అంతవరకు పోషించి, హుందాగా, మర్యాదగా అందులోంచి వైదొలగడంలోనే గొప్పదనం దాగి ఉంది. 

మనం జీవిస్తున్న జీవితం ఆ భగవంతుని కృపనే.. ఆయన ఇచ్చిన ఈ చిన్ని మానవ జన్మలోని మన పాత్ర ఏమిటో ముందుగా బాగా తెలుసుకోగలగాలి. జీవితమే నాటకరంగం అయినప్పుడు - మనం అందులో ఎలాంటి పాత్ర వెయ్యబోతున్నాం, ఎలా నటించబోతున్నాం, ఎప్పుడు వచ్చి, ఎప్పుడు ఆ నాటకము నుండి వైదొలగుతున్నాం అన్నది బాగా గ్రహించగలగాలి. అప్పుడే మన పాత్ర ఏమిటో, మన పరిధి ఏమిటో చక్కగా తెలుస్తుంది. మన పాత్రే కాదు.. ఇతరత్రా పాత్రలూ, వేషాలూ అన్నీ కొన్ని కొన్ని పరిధులల్లో ఉంటాయి. అంటే వాటికి కొన్ని హద్దులు అంటూ ఉంటాయి. ఏ పాత్ర ఎక్కడ మొదలెట్టి, ఎక్కడ ముగిసిపోవాలో అన్నమాట. ఇదంతా ఆ సృష్టికర్త అయిన ఆ భగవంతుని అదుపాజ్ఞలలో జరుగుతుంది అన్నది ఒక విశ్వాసం. 

కొన్ని విషయాల వరకూ వస్తే - అది బంధమే కావొచ్చు, మన తాలూకు ఒక బాధ్యతనే కావొచ్చును.. అది తండ్రియో, భర్తయో, అన్నయ్యగానో , స్నేహితునిగానో.. లేదా మరేదైన రూపములో  ఉండొచ్చు. దాన్ని ఎంతవరకు పోషించాల్సి ఉంటుందో అంతవరకే దాన్ని పోషించి ఆ పాత్రని ముగించేసేయ్యాలి. అలా ముగించటం అన్నది హుందాగా, దర్పముగా, మన బాధ్యతలేమిటో నిర్వర్తించి, అన్నీ చేశాక ఆ పాత్రల నుండి బయటకి రావడం అన్నమాట. ఎప్పుడైతే ఇలా మనం చేస్తామో అప్పుడే మన పాత్రకి సరైన న్యాయం చేకూర్చినట్లు. 

మొదట ఈ విషయాన్ని నేను తెలుసుకోలేక పోయాను. దూరమైన నా స్నేహితుని వల్ల ఈ విషయాన్ని చక్కగా తెలుసుకున్నాను. నా పాత్ర ఏమిటో, నా బాధ్యత ఏమిటో, ఎలాంటి బాధ్యతలు ఇప్పుడు నిర్వహించాలో, ముందు ముందు ఎలాంటివి ఎత్తుకోవాల్సి ఉంటుందో, ఎప్పుడు ఎలా ఉండాల్సి వస్తుందో.. ఇత్యాది విషయాల్ని తెలుసుకున్నాను.. నా వంతు పాత్ర వేస్తున్నాను. తనకు ఇచ్చిన మాట ప్రకారం - చాలావరకు నా పాత్రని సరిగ్గానే చేస్తున్నాను అని అనుకుంటున్నాను. ఇంకా చాలానే చెయ్యాల్సింది ఉన్నా - నా పాత్రని సరిగా నిర్వహించేలా తగిన శక్తిని ఇమ్మని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. 



No comments:

Related Posts with Thumbnails