Thursday, July 23, 2015

గోదావరి పుష్కర యాత్ర - 1

గోదావరి పుష్కరాలకు నేను వెళ్ళాలనుకున్నాను. ఎక్కడికి, ఎలా వెళ్ళితే బాగుంటుందీ అని ఆలోచించా.. వెళ్లొచ్చిన వారి సలహాలని పరిగణలోకి తీసుకున్నాను.. పార్కింగ్ ఒకచోట, స్నానాల ఘాట్ ఇంకోచోట, దైవ దర్శనం మరోచోట.. ఈ మూడింటి మధ్య కనీసం రెండు, మూడు కిలోమీటర్ల దూరం.. హ్మ్.. ఇలా ఉన్నాక పిల్లలతో ఎలా వెళ్ళగలను? వారిని అంత దూరం నడిపించి, కష్టపెట్టదలచుకోలేదు. అన్ని ఆలోచనలూ చేశాక - మోటార్ బైక్ మీద వెళ్ళటమే మంచిదనిపించింది. మాకు వీలయ్యే సమయం - శని, ఆదివారాలు మాత్రమే. ఆరోజులు ఎలానూ రద్దీయే. అందునా శనివారం రంజాన్ వస్తున్నది. సెలవు రోజు.. నేల ఈనినట్లుగా జనాలు తండోప తండాలుగా వస్తూనే ఉంటారు. ఈసారి ఇలా రెండురోజులూ సెలవు దినాలు కాబట్టి ఆరోజులు ప్రయాణానికి, స్నానాలకీ కష్టముగా ఉండే రోజులని ఊహించాను. కానీ ఆరోజుల్లోనే వెళ్ళాక తప్పింది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో బైక్ మీద వెళ్ళటమే మంచిదనిపించింది. Travel as you like మాదిరిగా ప్రయాణం చెయ్యవచ్చు అనీ. మా అమ్మాయి అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలన్న కోరికా తీరినట్లు అవుతుందని. తన కోరిక తీర్చడానికి ఇలా ప్రోగ్రాం పెట్టుకున్నా.. అలాగే వారికి బయట ప్రపంచం అంటే ఏమిటో పరిచయం చెయ్యాలనిపించింది. వేరే ఊళ్లు, పట్టణాలు ఎలా ఉంటాయో విండో సీయింగ్ Window seeing లా చూపించడం అన్నమాట. తండ్రి అన్నాక ఆ భాద్యత తప్పుతుందా? ( నిజానికి నా అంచనా నిజమయ్యింది.. బైక్ మీద వెళ్ళటమే మంచిదయ్యింది. విపరీతమైన రద్దీ.. )

ప్రోగ్రాం ఫిక్స్ అయ్యింది. ఇద్దరు పిల్లలూ, నేనూ కలసి వెళ్ళాలని అనుకున్నాను. ఈ పర్యటనలో ఎదురయ్యే విషయాలని ఇద్దరికీ చెప్పాను.. పుష్కరాలు అంటే ఏమిటో, పోయినసారి వెళ్ళినప్పుడు నా అనుభవాలు, అక్కడ ఎలా మసలుకోవాలో, ఎలా అక్కడ ఉండాలో, తప్పిపోయినప్పుడు ఎలా ఆ సమస్యని అధిగమించాలో అన్ని జాగ్రత్తలూ చెప్పాను. ముగ్గురికీ మూడు ఫోన్స్ ఏర్పాటు చేశా..

బయలుదేరే ముందు రోజున నా బైక్ సాయంత్రం పాడయ్యింది. బాగు చేయిద్దామనునుకున్నా సమయం లేదు. వేరేవారిది అడగాలని మనసొప్పలేదు. ఎవరి అవసరాలు ఎలా ఉంటాయో తెలీదు. వాళ్ళని ఇబ్బంది పెట్టదల్చుకోలేదు. టూర్ వాయిదా వేద్దామని అనుకుంటున్నపుడు - స్కూటీ ఉన్నది కదా. దానిమీద వెళితే ఎలా ఉంటుంది అని ఆలోచన... మాఅమ్మాయి నేనే లాంగ్ డ్రైవ్ చేస్తానూ అని కోరిక. ఈ స్కూటీ అంత లాంగ్ డ్రైవ్ కి పనికి వస్తుందా? అనే ఆలోచన. ప్రస్తుతానికి ఆ బండి తప్ప మరేమీ ప్రత్నామాయాలు లేవు. పోనీ.. తర్వాత వెళదాం అంటే వీలుకాదు.. సో, తప్పనిసరిగా దాన్ని వాడక తప్పింది కాదు. సరే దానిమీదే వెళ్లాలని నిర్ణయించాం. వారం రోజుల క్రిందటే కొన్ని బాగాలేని పార్ట్స్, ఆయిల్ మార్పించాను. ( ఇలా అన్నీ విడిగా, వివరంగా వ్రాయటం ఎందుకూ అంటే - నా జ్ఞాపకాలను గ్రంధస్థం చేసుకోవటానికి - ట్రావెలాగ్ లా అన్నమాట. మీకందరికీ ఉపయోగపడేలా ఉండాలనీ  )

ఆరోజు అంతా నిద్రపట్టలేదు.. టూర్ కి అలా స్కూటీ మీద వెళితే ఎలాంటి అనుభవాలు ఎదురవ్వవచ్చో అనీ.. దాని ఇంజన్ కెపాసిటీ తక్కువ. ఏదో లోకల్ గా వెళ్ళటానికి సరిపోతుంది.. ( అని నా భ్రమ అని తరవాత తెలిసింది ) అలాంటిది లాంగ్ డ్రైవ్ అంటే మామూలు విషయం కాదనుకుంటా. చూద్దాం. సక్సెస్ అయితే ఇక అంతకన్నా కావాల్సింది ఏముందీ.. ఎలా వెల్లోస్తామూ అన్న ఆలోచనలతో - ఒక అరగంట తప్ప తెల్లారి వరకూ నిద్రపట్టక అలాగే మేల్కోండిపోయాను. ఉదయాన్నే ఆరింటికే ప్రయాణానికి సిద్ధమయ్యాము. అన్నీ ఒకసారి చెక్ లిస్టు తో సరిచూసుకొని బయలుదేరాం. కాళ్ళ వద్ద ఉండే లెగ్ స్పేస్ లో - స్నానాలు చేశాక వేసుకొనే బట్టలున్న బ్యాక్ ప్యాక్ ని ఉంచాం.

వెళ్ళిన దారిలోనే రావటం ఎందుకూ అనీ - క్రొత్తదారిలో వెళ్లాలని అనుకున్నాను. అలా ప్రయాణం రూట్ మార్చాను. ఇప్పుడు వెళ్ళేది స్టేట్ హైవే. అది ఎలాగూ గతుకులు గతుకులుగా ఉంటుంది. ఏదైనా జరిగినా పగలు పూట ఎక్కువ ఉంటుందని, అంతలోగా ఆ సమస్యని దాటొచ్చుఅనుకున్నాను. వచ్చేదారి ( Return ) నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే. ఇక ఈరోడ్డు విషయమై యే ఇబ్బందీ ఉండదు. నిజానికి లాంగ్ టూర్ అంటేనే - ఎపుడు ఏది జరుగుతుందో తెలీదు.. అన్నింటినీ ఎదురుక్కొనే సత్తా మీదే ఆ టూర్ విజయం ఆధారపడుతుంది. ( ఈ విషయం చివరిలో వస్తుంది ) ఇలా విజయం సాధిస్తుంటేనే - మరెన్నో విజయాలని సాధించాలన్న ప్రేరణ కలుగుతుంది.

నిద్రలేని కారణాన మా అమ్మాయికే డ్రైవింగ్ ఇచ్చాను. పెట్రోల్ బంక్ లో టాంక్ ఫుల్ చేయించాను. అంటే 5 లీటర్ల టాంక్ ని మూతివరకూ నింపించాను. మరో లీటర్ ఖాళీ నీళ్ళ బాటిల్ లో స్పేర్ గా పెట్టుకున్నాను. ఆరింటికి బయలుదేరామా.. కాసేపట్లోనే నా నాలుక వేడి వేడి టీ అడగటం మొదలయ్యింది. ప్రొద్దున్నే మొహం కడగగానే వచ్చే వేడి తేనీరు బాగా అలవాటయ్యింది. మధ్యలో త్రాగుదామని అనుకున్నా ఆ సమయానికి ఎక్కడా ఒక్క హోటల్ కూడా తెరవలేదు.. కొన్నిఉన్నా అంత బాగోలేక ఆగలేదు. నేను ఒక్కడిని త్రాగాలనుకున్నా - పిల్లలకి టిఫినీ అయినా తినిపించాలి కదా అని చూశా.. ఊహు.. ఆ దారిలో హోటల్స్ సరిగా లేవు.. క్రొత్తగా వెళుతున్న దారి కదా.. ఎక్కడ ఏముంటాయో తెలీదు. మొదటి 41 కిలోమీటర్లు మా అమ్మాయి బండి నడిపింది. ఆ తర్వాత నేను నడిపాను.. GPS పనిచెయ్యక పోతే, దారిలో వారినీ, వీరినీ అడుగుతూ అలా సాగిపోయాను. ఎన్నడూ ఆ దారిలో అంత దూర ప్రయాణం చెయ్యలేదు. మామూలువ్యక్తులూ, పోలీస్ సిబ్బందీ, తోటి వాహనాల వారినీ, మధ్యలో కనిపించిన RSS వాలంటీర్ల వారినీ... ఇలా వెళ్ళే దారిని అడుగుతూ, అలా ఏకబిగిన మొత్తం 165 కిలోమీటర్ల దూరాన్ని నాలుగున్నర గంటల్లో వెళ్ళాం.. అంత దూరం ఎక్కడా ఆగకుండా వెళ్లడం - అంత చిన్న (88 cc) సామర్థ్యపు బండి మా ఉత్సాహానికి మద్దతు పలికి అంత దూరాన్ని ఏకబిగిన సహకరించటం.. నిజముగా హాస్చర్యం వేసింది. చెబితే నమ్మరుగానీ, మోటార్ బైక్ కన్నా ఇదే చాలా సౌఖ్యముగా అనిపించింది. నిజానికి అంతదూరం ఏకబిగిన వెళ్ళకూడదు కానీ, మంచి హోటల్స్ కనపడక పోయేసరికి అలాగే కొనసాగాల్సివచ్చింది.

ఇక్కడ స్కూటీ లోని కొన్ని సౌకర్యాలు చాలా బాగా నచ్చాయి. మొబైల్ చార్జింగ్, లగేజ్ కంపార్ట్మెంట్, అందులో ఒక డబ్బాలో ఎక్స్ ట్రా పెట్రోల్, లగేజీ హుక్స్, పెట్రోల్ ఇండికేటర్, గ్లవ్ కంపార్ట్మెంట్, లాంగ్ సీట్.. ఇలా చాలానే నచ్చాయి. కొన్ని ( టైర్ సైజు, స్పీడ్ లిమిట్, రఫ్ & స్పీడ్ డ్రైవింగ్ కి సరిపోక పోవడం..) అననుకూలతలు ఉన్నా ఇదే బెస్ట్ అని నాఅభిప్రాయం.

TVS scooty ( Google image) ఇది మా బండి కాదు.. 

చివరకి బాసరకి Basara చేరాం. బాసర మొదట్లో ఏమైనా హోటల్స్ ఉన్నాయో చూశా.. లేవు. ఒక షాప్ లో బిస్కట్ ప్యాకెట్స్  కొన్నాను. అవే టిఫినీగా కానిచ్చాము. పనిలోపనిగా అక్కడ సౌకర్యాల్నీ, రద్దీ గురించి అడిగాను. కొనుగోలు చేశానని కాబోలు అన్ని వివరాలు చెప్పాడు ఆ షాప్ వాడు. లాంగ్ టూర్ లో ఇలాగే చెయ్యాలి. చేస్తే - చాలా వివరాలు తెలుస్తాయి. రద్దీలేని షాపులో చిన్ని షాపింగ్ చేస్తే చాలు.. అక్కడి విషయాలు చాలానే తెలుస్తాయి. ఇది ఉభయతారకం. వారికి కొనుగోలు అవుతుంది. మనకి వివరాలు తెలుస్తాయి. వారు చేసిన సహాయానికి ఇలా కృతజ్ఞతలు చెప్పడం అన్నమాట. ఇంటివద్దనుండి తెచ్చుకున్న నీళ్ళని త్రాగేసి, మళ్ళీ ప్రయాణం మొదలెట్టాం. కొద్దిదూరంలో ఉన్న బాసరకి చేరుకున్నాం.

అప్పటికే నేల ఈనినట్లుందా? అన్నట్లు జనం. చాలామంది సాయంత్రం బయలుదేరి, రాత్రి ఆ పుష్కర ఘాట్ల వద్ద పడుకొని, మరుసటి రోజు ఉదయాన్నే స్నానాలు కానిచ్చేస్తున్నారు.. ఈ ఐడియా బాగుంది కానీ ఒక్కోసారి మనకి కుదరవు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడేవారు అయితే ఈ పద్ధతి బెస్ట్. కానీ భద్రత విషయంలో కాసింత కష్టమే. అక్కడ ఉన్న ప్రధాన ఘాట్ కి చేరుకున్నాం. బైక్ మీద వెళ్ళటమే మంచిదయ్యింది. స్నానాల ఘాట్ కి దూరముగా కార్లు, వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. పుష్కరాలు సరిగా జరగాలంటే ఆ ఏర్పాటు తప్పదు. మేము గనుక అలాగే వచ్చి ఉంటే - నడక తప్పేది కాదు. అందుకే ముందే వెళ్లొచ్చిన వారి సూచనలు తీసుకోవడం మంచిది. 


పై ఫోటోనే - బాసర ప్రధాన ఘాట్ తోరణం / ప్రవేశ ద్వారం. లోపలి వెళ్ళి చూశాం,  నదీ పూజలూ, పిండ ప్రదానాలు, భక్తుల స్నానాలతో చాలా రద్దీగా ఉంది. ప్రధాన ఘాట్ కాబట్టి చాలామంది అక్కడే స్నానాలు చెయ్యటంతో నదీ జలాలు చాలా బురదగా మారాయి. ఈసారి వర్షాలు కాసింత ఆలస్యం అవటంతో ( తొలకరి తప్ప ఇంకా వర్షాలు పడలేదు ) నదీ ప్రవాహం అస్సలు లేదు.. చెరువు నీళ్ళలా తోచింది. ప్రధాన ఘాట్ లో బాగుంటుందని అవతలి గట్టు నుండి ఈ గట్టుకి వచ్చాం.. ఇక్కడ కన్నా అక్కడే నీళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయి.. కానీ, బోటింగ్ వాళ్ళు, రక్షణ సిబ్బంది లేని కారణాన రిస్క్ తీసుకోక - ఇక్కడే పుష్కర స్నానం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాను. క్రొత్త ప్రదేశాలకి వెళ్ళినప్పుడు అత్యుత్సాహంతో ఏదైనా చేస్తే - ఏదైనా జరిగే కాపాడే నాథుడు ఎవడూ ఉండడు. ఎవడి బీజీ వారిది. 


పై ఫోటోలో కుడి మూలన కనిపిస్తున్న ఇన్టేక్ వెల్ పంప్ intake well pump house యూనిట్ వద్ద అటువైపున ఉన్నది ప్రధాన ఘాట్. దానికి ఇటువైపున మేము స్నానాలు చేసాం. ఇక్కడ గట్టు వరకూ నీళ్ళు ఉన్నాయి. స్నానాలు అయ్యాక బట్టలు మార్చుకోవటానికి రేకులతో చాటులని ( ఫోటోలో ఉన్న నీలం రంగు నిర్మాణాలు ) నిర్మించారు. బురద నీటితో స్నానం అయ్యాక కడుక్కోవటానికి షవర్ స్నానాలు కూడా ఇక్కడ ఉన్నాయి. రోడ్డు ప్రక్కన పార్క్ చేసిన మా బండిని ఇక్కడినుండే అప్పుడపుడు చూసుకోవచ్చు. ఇక్కడ జనం రద్దీ తక్కువగా ఉంది. ( వీడియో చూడండి ) తడిసిన బట్టలు ఆరబెట్టుకోవటానికి వీలుగా ఉంది కూడా. అన్నింటికన్నా మించి - నదిలో మోటార్ బోటు మీద, తెప్పల మీద సహాయక సిబ్బంది ఉన్నారు. ఏమైనా జరిగితే కాపాడటానికి ఉంటారు. ఒకవేళ వారి నుండి మిస్ అయినా ఇంకో రెండు మూడు ఘాట్స్ వద్ద ఉన్న భక్త జనం, సిబ్బంది వల్ల క్షేమం గానే ఉంటాం. అందరూ - " జాగ్రత్త జాగ్రత్త.." అని చెబుతారు కానీ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పరు. అందుకే ఇలా వివరంగా చెప్పాను.. చెబుతున్నాను. పిల్లలకీ ఇదే చెప్పాను. అందుకే అన్నివిధాల అనువైన ఆ స్థలంలో స్నాన కార్యక్రమాన్ని మొదలెట్టాం. అక్కడి స్నానాల ఘాట్ ని ఈ వీడియోలో చూడండి. 



గట్టువద్ద సామాను వద్ద ఒకరు ఎప్పుడూ ఉండేలా జాగ్రత్త తీసుకున్నాను. ముందుగా నేనూ, మా బాబు.. ఆ తరవాత అమ్మాయి, నేనూ గోదావరి నదిలో నీళ్ళు లేని కారణాన నది మధ్యలోకి వచ్చి అక్కడ స్నానాలు చేశాం. అంత మధ్యలోకి వచ్చి స్నానం చెయ్యటం ఇదే ప్రథమం. అయినా సరే చుట్టూరా భద్రతా సిబ్బంది, తోటి యాత్రికులు ఉన్నది చూసుకొన్నాను. వర్షాలు లేని కారణాన - ఉన్న కాసిన్ని నీళ్ళని గట్టువద్దకి రావాలని - ప్రోక్లైనర్ తో మట్టి తీసేసరికి అక్కడక్కడా గోతులు ఉండిపోయాయి. ఆ తీసిన మట్టీ ఆ నదిలోనే ఉన్నట్లుంది.. పైగా నదీగర్భం మట్టి అంతా నల్ల రేగడి మట్టి. ఇక చూసుకోవాలి భక్తుల అవస్థలు. కాళ్ళు లోపలికి కూరుకపోతున్నాయి. అలా అవటం మూలాన ఆ మట్టి పిసికినట్లు అయ్యి, ఆ నీళ్లన్నీ బురదగా మారాయి. నీళ్ళు బురదగా ఉండటానికి గల కారణం అదీ. 

నీటిలో మునిగి, క్రిందన ఉన్న మట్టిని తీసుకున్నాను. మడ్ బాత్ Mud bath లా వంటికి ఆ బురద రుద్దుకొని, ఆ తరవాత నీటిలో మునకలేశాను. మా అబ్బాయికీ అలాగే ఆ బంకమట్టి బురదతో వళ్ళు రుద్దాను. ఇదంతా ఒకరు తన మొబైల్ తో ఫొటోస్ తీశారు. నేను చూసినప్పుడు వారివి తీసుకుంటూ, నేను నా పనిలో ఉన్నపుడు -మా ఫొటోస్ తీశాడు. స్నానాలు అయ్యాక, నా మెయిల్ ఐడీ అడిగారు. ...చెప్పాను. ఇంత ఈజీ మెయిల్ ఐడీనా? అన్నారు. అవునన్నాను. ఆ ఫొటోస్ పంపిస్తాను అన్నారు. (నాకు నమ్మకం లేదు ఫొటోస్ మెయిల్ చేస్తారని ) సరే ని, ఆ మెయిల్ ఐడీ మరచిపోతే ఫేస్ బుక్ అకౌంట్ కి మెస్సేజ్ చెయ్యమనీ, లేదా మా బాబు ఫేస్ బుక్ అకౌంట్ కి మెస్సేజ్ లో పోస్ట్ చెయ్యమని చెప్పాను. సరే అన్నారు. ఫోన్ లో మెమో / నోట్ ప్యాడ్ / SMSలో ఫీడ్ చేస్కోమని చెప్పాను. నాకు గుర్తు ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పటివరకూ వారు నాకు నా ఫొటోస్ పంపలేదు. 

ఆ తరవాత గట్టు మీద ఉన్న షవర్ బాత్ వద్ద మళ్ళీ ఒకసారి స్నానం చేసాం.. వంటికి మిగిలిపోయిన బురదనీ లా కడుక్కున్నాము. ఈ షవర్ బాత్ కి వచ్చే నీళ్ళు ఆ గోదావరి నీళ్ళే. మోటార్లు పెట్టి, ఆ నీటిని ఇలా షవర్ జల్లుగా మార్చి పెట్టారు. రెండు షవర్స్ మాత్రం తీసేసి, నీరు ధారగా పడేలా చేశారు. దానికి 4 బాటిల్స్ పట్టి ఇంటికి గోదావరి నీటిని పట్టుకొచ్చాం. అంతలోగా మా బట్టలని ఆ గట్టు మీద ఆరబెట్టేసి, వాటిని ఒక ప్రత్యేకమైన బ్యాగులోకి సర్దేశాం. 

పుష్కరాలకి ఈసారి బాగా సెక్యూరిటీ పెంచారు. మీటర్ కి ఒక సిబ్బంది అన్నట్లుగా ఉంది. గట్లూ, ఏర్పాట్లూ, భక్తులకు మరింత సౌకర్యాలను కలగచేయటంలో ఈసారి బాగా శ్రద్ధ వహించారు. వచ్చిన భక్తజనం కూడా క్రమ పద్ధతిలో రావటం నాకు బాగా నచ్చేసింది. గుడిలో దర్శనం కోసమని తోపులాటలు లేకుండా దర్శనం చేసుకోవడం బాగుంది. పార్కింగ్ స్థలం నుండి ఆలయాల వరకూ ఒక ఉచిత ప్రయాణ బస్ పెట్టడం చాలా బాగుంది. కాకపోతే ఆ బస్ గురించి అంతగా ప్రచారం చెయ్యలేక పోవడం ఒక లోపం. అలా చేస్తే భక్తులకు ఇంకా సౌకర్యముగా ఉండేది. లైటింగ్, రహదారుల నిర్మాణం ఇంకా పూర్తవలేదు. మొత్తానికి పోయిన పుష్కరాల కన్నా ఈసారి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. 

స్నానాలు అయ్యాక - గుడికి బయలుదేరాం. బయట చెప్పుల స్టాండ్లో చెప్పుల్ని పెట్టి టోకెన్ తీసుకున్నాం.. అలాగే మొబైల్, కెమరాల పార్కింగ్ కోసం మరో స్టాండ్. ఇది క్రొత్తగా చూశాను. నిజానికి ఇందులో పెట్టడం అవసరం లేదనిపించింది. ఏమో.. ముందు చెకింగ్ అయితే మళ్ళీ వెనక్కి రావటం ఇష్టం లేక ఇందులో పెట్టాను. వాటి సర్వీస్ చార్జ్ మొత్తం ముప్పై రూపాయలు. 

గుడిలో స్వచ్చంద సేవకులూ, పోలీసు వారి సహాయాన దర్శన క్యూ త్వరగా సాగింది. చాలామంది ఉన్నా, ఇట్టే దర్శనం అయ్యింది అనిపించింది. దర్శనం అయ్యాక - ప్రసాదాలు తీసుకొని బయటకి వచ్చాం.. అప్పటికి సాయంత్రం నాలుగు పావు అయ్యింది. చెప్పుల కౌంటర్ కి వెళితే అన్నీ ఉన్నాయి కానీ ఒక చెప్పు లేదు.. ఎంత వెదికినా దొరకలేదు. ఇలా గుళ్ళకి వెళితే - ఒక త్రాడు ముక్క తీసుక వెళ్లడం మంచిది. అన్ని చెప్పుల్ని ఒకే దగ్గర ఉంచేలా ఆ త్రాడు వాటిగుండా దూర్చి మన బ్యాగ్ కి ముడి వెయ్యటం మంచిది. ఇక నుండీ ఈ పద్ధతి పాటించడం మంచిది. ఒక చెప్పు దొరకటం మూలాన, రిటర్న్ ప్రయాణానికి సమయం ఎక్కువ లేదు, ఇంటికి చేరేసరికి చీకటి పడేలా ఉందని ఇంకో కాలిది అక్కడే వదిలేసి వచ్చాం - దొరికిన వారు వాడుకుంటారు అనీ. స్టోర్ లో పెట్టిన మా మొబైల్, కెమరా తీసుకొని ఇక అక్కడ నుండి బయలుదేరాం. 


( ఇంకా ఉంది.  http://achampetraj.blogspot.in/2015/07/2.html లో చూడండి ) 

No comments:

Related Posts with Thumbnails