Tuesday, April 29, 2014

Photo / word links పెట్టొచ్చా? - 2



Praveenjillela said...
నా బ్లాగ్ లో కొంత మంది ప్రముఖుల ఫోటొస్ పెట్టి ఆ ఫోటోస్ క్లిక్ చేస్తే వారికి సంబంధించిన విషయాలు, వారికి సంబంధించిన మరిన్ని ఫోటోస్ వచ్చేలా చేయడం ఎలా? 

ప్రవీణ్ గారూ..

బ్లాగ్ లో ఫొటోస్ పెట్టి వాటికి ఎలా లింక్ పెట్టాలో అడిగారు కదా.. ఇలా నేనెప్పుడూ ప్రయత్నించలేదు కనుక తెలీదు. మీరు అడిగారని సెట్టింగ్స్ చూసి, అలా ఏమీ లేవు అనుకొని, అలా ఏమీ లేవంటూ, సాధారణ లింక్ ఎలా పెట్టాలో తెలియచేస్తూ Photo / word links పెట్టొచ్చా ? అనే పోస్ట్ వ్రాశాను. తోటి బ్లాగర్ అయిన రాజాచంద్ర గారు అలా - ఫొటోస్ లింక్ పెట్టొచ్చు అని కామెంట్ పెట్టారు. వారికి కృతజ్ఞతలు. వారి కామెంట్ వలన నేనొక క్రొత్త విషయాన్ని శోధించి, తెలుసుకున్నాను. 

సాధారణముగా నేను వ్రాస్తున్న పోస్ట్స్ అన్నీ నా అనుభవాలు. నా అంతట నేనుగా నేర్చుకొన్న విషయాలు. ఎవరివద్దా, ఏదైనా సైట్ చూసి నేర్చుకొన్నవి కావు కనుక ఇందులో - ఈ బ్లాగులో - పెట్టే  టపాలు అన్నీ నేను స్వయానా నేర్చుకొని, మీకోసం చెబుతున్నవే.. అందువలన అలా చెప్పాల్సివచ్చింది. ఇప్పుడు కూడా తన కామెంట్ చూశాక ఎలా ఫోటో లింక్స్ పెట్టాలో స్వయంగా నేర్చుకొని, ఆ పద్ధతిని మీకు ఇప్పుడు తెలియచేస్తున్నాను. ఇది స్వోత్కర్షలా ఉన్నా నిజమే.

బ్లాగులో క్రొత్తగా టపా వ్రాస్తున్నప్పుడు గానీ, లేదా పాత టపాని మళ్ళీ ఎడిట్ చేసి, ఏదైనా ఒక ఫోటోకి లింక్ ఇచ్చి, ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే నేరుగా - ఏదైనా సైట్ / పేజీ / పోస్ట్ / ఫోటో... కి వెళ్ళేలా చెయ్యవచ్చును.

అలా చెయ్యాలీ అంటే మీరు - మీ పోస్ట్ లో ఏదైనా ఫోటోని ఎన్నుకోవాలి లేదా క్రొత్తగా ఒక ఫోటో అప్లోడ్ చెయ్యాలి. ఇప్పుడు మీకు తేలికగా అర్థం కావటానికి - మీ బ్లాగ్ ప్రొఫైల్ ఫోటో ( చేగోవేరా ) ఫోటోని ఇక్కడ ఉపయోగించుకుంటున్నాను. అన్యదా భావించరని అనుకుంటున్నాను.

1. టపాలోని టూల్ బార్ లోని - ఫొటోస్ ని అప్లోడ్ చేసే - Insert image - అనే పనిముట్టుని వాడి, చేగోవేరా ఫోటోని అప్లోడ్ చెయ్యాలి. అప్పుడు మీకు ఇలా - ఈ క్రింది ఫోటోలో మాదిరిగా కనిపిస్తుంది.


2. అలా అప్లోడ్ అయ్యాక ఇప్పుడు ఆ ఫోటో మీద - మౌస్ కర్సర్ ని ఉంచి, మౌస్ లోని ఓకే మీటని - అంటే ఎడమ క్లిక్ ని ఒకసారి నొక్కి, ఆ ఫోటోని సెలెక్ట్ చెయ్యాలి. అందాకా మామూలుగా కనిపించిన ఆ ఫోటో - ఆ ఫోటో మీద నీలంరంగు పులిమినట్లు అగుపిస్తుంది. అలా నీలిరంగు ఆ ఫోటో మీద కనిపించినట్లయితే - లింక్ ఇవ్వటానికి సిద్ధముగా ఉందన్నమాట. అప్పుడు ఈ క్రింద విధముగా ఉంటుంది. 


3. ఇప్పుడు టపా టూల్ బార్ లోని Link అనే Add or remove link అనే పనిముట్టుని ఒకసారి నొక్కాలి. ఈ Add or remove link అనేది - ఆ టూల్ మీద కర్సర్ ఉంచినప్పుడు కనిపిస్తుంది. 


4. అప్పుడు Edit link అనే చిన్న విండో వస్తుంది. అందులోని Web address వద్ద మీ బ్లాగ్ అడ్రెస్స్ ఇచ్చాను. ( క్రింద ఫోటోని చూడండి ) ఇక్కడ ఆ లింక్ అనే కాకుండా చేగోవేరా కి సంబంధించిన ఏదైనా పోస్ట్ లింక్ ని కాపీ, పేస్ట్ పద్ధతిలో ఇచ్చేసి, క్రింద ఎడమ మూలన ఉన్న OK ని నొక్కాలి. ఇక అంతే.!! ఆ పోస్ట్ ని పబ్లిష్ చేసినప్పుడు - ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే నేరుగా ఏదైతే లింక్ ఇచ్చామో అక్కడికే చేరుకుంటాం. 


ఇలా పనిచేస్తుందో, లేదో పరీక్షించి చూద్దాం. 

ఇప్పుడు మీ బ్లాగ్ ప్రొఫైల్ ఫోటో అయిన చే గెవారా ఫోటోని అప్లోడ్ చేసి, దానికి వికీపిడియా లోని చే గెవారా వ్యాసం లింక్ ఇస్తున్నాను. మీరు ఈ క్రింది ఫోటోని నొక్కితే - ఆ వ్యాసం వద్దకు నేరుగా వెళ్ళగలుగుతున్నారో లేదో మీరే చెక్ చెయ్యండి. 



Sunday, April 27, 2014

ఫేస్ బుక్ లో Photos with High Quality

ఫేస్ బుక్ లో మీరు మీ ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు అవి మరింత క్లారిటీగా, క్వాలిటీతో ఉండాలని అనుకుంటున్నారా ? అయితే మీరు ఇలా చెయ్యండి. 

మీ అకౌంట్ లో ఏదైనా ఒక ఫోటో ఆల్బమ్ తెరవండి. అది ఇంతకు ముందే తెరచిన ఫోటో ఆల్బమ్ అయి ఉండొచ్చు, లేదా క్రొత్తగా తెరుస్తున్న ఫోటో ఆల్బమ్ అయినా సరే. ఫోటో అప్లోడ్ చేసే ముందు ప్రతి ఆల్బంలో ఈ ఆప్షన్ ఉంటుంది. లేదా ఏదైనా ఫోటో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఈ క్రింది ఫోటోలో మాదిరిగా మీకు కనిపిస్తుంది. 


ఇలా కనిపించిన ఆల్బం అప్లోడింగ్ సమయములో ఎడమ - క్రింద మూలన మీకు + Add more Photos అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఒక / కొన్ని ఫొటోస్ ని మీరు మీ ఆల్బం లలోకి అప్లోడ్ చేస్తున్నప్పుడు, మరిన్ని ఫొటోస్ ని ఎన్నుకొని, వాటి వెంటే అప్లోడ్ చెయ్యటానికి ఈ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది. 

ఆ ఆప్షన్ ప్రక్కన పైన స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్నట్లు ఒక చిన్న చదరపు గడి, దాని ప్రక్కనే High Quality అని కనిపిస్తుంది. ఈ గడిలో మనం ఒకసారి క్లిక్ చేస్తే, ఆ తరవాత నుండి మనం మన ప్రొఫైల్ లోని ఆల్బం లలోకి అప్లోడ్ చేసే ప్రతి ఫోటో మరింత క్వాలిటీతో అప్లోడ్ అయ్యి, మన మితృలకి, వీక్షకులకీ అగుపిస్తుంది. చాలామందికి ఈ విషయం తెలీక మామూలుగా ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటారు. 

ఇలా ఆ గడిలో ( High Quality ) ఒకసారి మాత్రమే క్లిక్ చేస్తే చాలు. మీ ప్రొఫైల్ లోని అన్ని ఆల్బమ్స్ కీ ఇది పనిచేస్తుంది. అంటే మళ్ళీ మళ్ళీ క్లిక్ చెయ్యాల్సిన అవసరం లేదు అని అర్థం. ఆ తరవాత ఫొటోస్ అన్నీ మంచి క్వాలిటితో కనిపిస్తాయి. ఇది అవసరం లేకుంటే - జస్ట్ మళ్ళీ ఆ గడిలో క్లిక్ చేస్తే - మామూలు క్వాలిటీతో ఫొటోస్ అప్లోడ్ అవుతాయి. 

Saturday, April 26, 2014

Photo / word links పెట్టొచ్చా ?

నా బ్లాగ్ లో కొంత మంది ప్రముఖుల ఫోటొస్ పెట్టి ఆ ఫోటోస్ క్లిక్ చేస్తే వారికి సంబంధించిన విషయాలు, వారికి సంబంధించిన మరిన్ని ఫోటోస్ వచ్చేలా చేయడం ఎలా? on Blog address
ప్రవీణ్ గారూ..
మామూలుగా అయితే బ్లాగుల్లో ఏదైనా ఒక పదంని పెట్టి, ఆ పదాన్ని క్లిక్ చేస్తే, ఏమని లింక్ ఇచ్చామో అది ఓపెన్ అవుతుంది. ఒక ఫోటో పెట్టి, ఆ ఫొటోస్ కి లింక్ ఇచ్చేలా బ్లాగుల్లో సెట్టింగ్స్ నాకు అగుపించలేదు. కావాలంటే ఆ ఫోటో పేరు వ్రాసుకొని ఆ పేరుకి లింక్ పెట్టుకోవచ్చును.

ఆ ఫొటోస్ ని కాపీ చేసుకొని, మీ బ్లాగులోకి అప్లోడ్ చెయ్యటం : ఈ పద్ధతిలో గూగుల్ ద్వారానే కానీ, మరే ఇతర పద్ధతుల వల్లనే గానీ మీరు సేకరించిన ఫొటోస్ ని మీ పోస్టుల్లోని టపాలలో అప్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ అలా కాకుండా మీరు ఆ ఫోటో లింక్ ఇవ్వదలచుకుంటే ఎలా ఇవ్వాలో మీకు తెలిసే ఉంటుంది. అయినా ఒకసారి వివరముగా చెబుతాను.

బ్లాగులోని క్రొత్త పోస్ట్ వ్రాయాలనుకున్నప్పుడు, క్రొత్తగా Create new post ని ఓపెన్ చేస్తాము కదా.. అందులోని టూల్ బార్ ని ఒకసారి పరిశీలనగా చూస్తే, మీకు అందులో ఒక లింక్ Link టూల్ కనిపిస్తుంది. ఈ క్రింది ఫోటోలో ఎర్రని వృత్తములో చూపెట్టబడినది - చూడవచ్చును.


ఆ లింక్ టూల్ ని నొక్కితే మీకు ఇలా క్రింద కనిపించేలా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. 


ఇందులో ఉన్న Link to క్రిందన ఉన్న Web address ప్రక్కనే ఉన్న గడిలో Which URL should link to go to లో మీరు యే ఫోటో గానీ, టపా గానీ, పోస్ట్ గానీ..... వాటిని ప్రత్యేకముగా వేరే ట్యాబ్ లో ఓపెన్ చేసినప్పుడు, అప్పుడు అడ్రెస్ బార్ లో ఉండే అడ్రెస్ ని కాపీ చేసుకొని, ఇందులో పేస్ట్ చెయ్యాలి. ( అడ్రెస్ బార్ అంటే ఈ లింక్ చూడండిhttp://achampetraj.blogspot.in/2014/04/blog-address.html ) అంటే ఈ క్రింద గడిలో అన్నమాట.


అందులో - లింక్ ని నొక్కగానే ఎక్కడికి వెళ్ళాలో ఆ సైట్ అడ్రెస్స్ / పోస్ట్ / ఫోటో.. అడ్రెస్ ని అందులో పేస్ట్ చేశాం కదా.. ఇప్పుడు దాని మీద ఉన్న మరో గడి - Text to display గడిలో - మన బ్లాగ్ టపాలో ఆ లింక్ ఏమిటో పేరు టైప్ చెయ్యాలి. 


ఇందులో వ్రాశాక - మామూలుగా ఆ టపాని పోస్ట్ చేస్తే చాలు.. అలా పబ్లిష్ అయిన టపాలో మనం ఇచ్చిన పేరుని క్లిక్ చేస్తే లింక్ ఓపెన్ అయ్యి, వీక్షకులకు మరింత సౌకర్యముగా ఉంటుంది. 

ఉదాహరణకి : ఇలా టెస్టింగ్ కోసం అనీ కొన్నింటిని చూద్దాం. ఇందులో నీలం రంగులో చూపెట్టినవి ( పబ్లిష్ అయినప్పుడు ఆటోమేటిక్ గా నీలం రంగులో వస్తాయి ) లింక్స్ అని గుర్తించండి. అవి నిజమా కాదా అని ఒకసారి చెక్ చేసి, ఎలా పనిచేస్తున్నాయో నిర్ధారించుకోండి. 


2. మహాత్మాగాంధీ గారు చరఖా మీద నూలు వడుకుతున్నప్పుడు 


ఇప్పుడు మీకు ఎలా లింక్స్ పెట్టాలో అర్థం అయిందనుకుంటాను. 

Friday, April 25, 2014

Good Morning - 559


నటనలో జీవించు, 
జీవితములో నటించకు.. 

నటనలో జీవిస్తే - చాలా గొప్పగా ఆ పాత్రకి తగిన న్యాయం చేశాడు అని పేరొస్తుంది. దానివల్ల కీర్తీ, కనకం, కాంతం.. కూడా వస్తుంది. మరి జీవితములో (ఎప్పుడూ) నటిస్తే - దానివల్ల మనమే దెబ్బతింటాం. ఏదో ఒకసారి అదృష్టం బాగుండి, ఏదో ఫలితాన్ని పొందుతాం. చాలాసార్లు దారుణముగా బుక్కవుతాం. ఎలా అంటే - మనమేమీ ఆస్కార్ అవార్డుల స్థాయి నటీనటులం కాము. మనకున్న నటన చాతుర్యం అంతంత మాత్రమే. ఎదుటివారికి తేలికగా దొరికేస్తాం.. అప్పుడు బంధాలు బలహీనమై దారుణాతి దారుణముగా దెబ్బతింటాం. 

Tuesday, April 22, 2014

Good Morning - 558


కస్తూరి తిలకం, 
లలాటే ఫలకే, 
వక్షస్థలే కౌస్తుభం, 
నాసాగ్రే నవమౌక్తికం, 
కరతలే వేణుం, 
కరే కంకణం, 
సర్వాంగే హరిచందనంచ కలయన్, 
కంఠేచ ముక్తావలీం, 
గోపస్త్రీ పరివేష్టితో, 
విజయతే గోపాల చూడామణి. 

Sunday, April 20, 2014

Good Morning - 557


స్నేహమేరా జీవితం.. 
స్నేహమేరా శాశ్వతం..

ఈ సృష్టిలో అతి మధురమైన వాటిల్లో స్నేహం కూడా ఒకటి. మనిషికి అవసరమైన చక్కని తోడూ, గురువు, ఆటగాడు, నమ్మకమైన వ్యక్తి, సంతోషాలనే కాదు బాధల్నీ పంచుకొనే వ్యక్తీ ఈ స్నేహంలోనే మనకి లభిస్తాడు. చాలామంది తమకి మంచి స్నేహితుడు ఇంకా దొరకలేదని ఫిర్యాదు చేస్తుంటారు. నిజానికి అది వారి తప్పే. 

తాము ఎలా ఆశిస్తున్నామో, ఎదుటివాడూ అలాగే ఆశిస్తుంటాడు అని తెలుసుకోరు. ఇక్కడే స్నేహాలు అపనమ్మకముగా, అపనమ్మకముగానే కొనసాగి... ముగిసిపోతాయి. ముందుగా మనమే ఒక మంచి స్నేహితుడికి ఉండే లక్షణాలతో మనమే ఎదుటివారితో ఎందుకు గొప్ప స్నేహితుడిలా కాకున్నా, ఒక మంచి స్నేహితుడిలా ఎందుకు ఉండలేక పోతున్నారో ఆలోచించరు. " స్నేహాలలో ఇతరులని తమ అవసరాల కోసం వాడుకుంటారు వారితో ఎలా నేను ఉండగలను..? అనుకుంటాం కానీ, మొదటగా మనమే ఒక మంచి స్నేహితుడిలా - మంచి స్నేహితుడి లక్షణాలని ఒంటపట్టించుకొని, ఎదుటివారితో సఖ్యతగా ఉందామని అనుకోం. ఇలా అనుకోని రోజులూ మన మనసుకి హత్తుకోనేంత దగ్గరగా యే ఒక్క స్నేహితుడూ కాలేరు. మనమూ ఇతరులకు ఆత్మీయ స్నేహితులం కాలేం. 

నేనూ మొదట్లో స్నేహితుల వల్ల బాధలు పడ్డవాడినే. అవసరార్థ స్నేహాలు చూసి, చూసీ స్నేహమంటేనే ఒకలాంటి విరక్తి వచ్చింది. స్నేహాల్ని నమ్మక ఒకలాంటి నిర్వేదంతో - మెటీరియలిస్టిక్ గా ఉంటూ, పైపైనే స్నేహం చేస్తూ ఉండేవాడిని. నిజమైన స్నేహాలు దొరికే స్థాయిని ( జీవనోపాధి లోకి రాకముందు ) దాటాక - ఇక అన్నీ అవసరార్థ స్నేహాలే. ముందు తేనెపూసిన మాటలు, చాటున వెక్కిరింతలు. అవన్నీ చూసీ, వినీ మెటీరియలిస్టిక్ గా మారాను. ఈ ఆన్ లైన్ లోకి వచ్చాక, కొద్దిమంది పరిచయస్థులు - స్నేహితులుగా మారారు. వారిలో ఒకరికోసం సోషల్ సైట్స్ గురించి ఈ బ్లాగ్ లోనే విపులముగా వ్రాశాను ( లింక్ : http://achampetraj.blogspot.in/search/label/Social%20Networking%20Sites ) 

ఈ స్నేహితుల గుంపుతో - స్నేహితుడిగానే ఉన్నాను. ఎక్కడా లేనిపోని భేషజాలకి పోలేదు. అక్కడే ఆస్థి, అంతస్థులు, వయసూ, ఎలాంటి తారతమ్యాలు లేకుండా చిన్నపిల్లల్లా మంచి మనస్సుతో ఉన్నాం. ఒకరకముగా చెప్పాలీ అంటే - బాగా పరిచయం ఉన్నవారందరినీ ఒక గదిలో వేస్తే ఎలా ఉంటుందో అలా.. మా స్నేహాన్ని చూసి, బయట నుండి వచ్చిన ఒకరు మా స్నేహాన్ని దారుణముగా, కావాలని అబద్ధాలు ఆడి విడగొట్టారు... వాటిని నమ్మినవారు దూరమయ్యారు. నమ్మనివారు మరింత దగ్గర అయ్యారు. అదీ ఒకరకముగా నాకు చాలా మేలే కలుగచేసింది. నా జీవితాన ఒక మంచి టర్నింగ్ పాయింట్ అయ్యింది. అలా కావాలని, ఏమి ఆశించి చేశారో కానీ, నాకంటూ బలమైన స్నేహాలు ఏర్పడి, ఒక మలుపుదిశగా  స్నేహబంధాలు కొనసాగాయి.. కొనసాగుతున్నాయి కూడా. అసలు వారికోసమే ఈ ఆన్లైన్ కి రావటం...ఇంతా చేసిన ఆ ఒకరికి వేవేల కృతజ్ఞతలు. తన ఋణం ఎలా తీర్చుకోగలనో ..!! తను చాలా బాగుండాలని కోరుకోవటం కన్నా ఇంకేమీ చెయ్యలేను. నేనేమిటో, నన్ను పూర్తిగా నమ్మినవారు ఎందరున్నారో, ఎందరు నాకు సపోర్ట్ గా ఉన్నారో, నామీద వచ్చిన పుకార్లని, అవి పుకార్లే అని తెలుసుకొని, ఆ ఒకరికి దూరముగా ఉండి, నాకు మద్దతు ఇచ్చారు. కొందరేమో - వారేదో చెబితే - నిజమేమిటో తెలుసుకోక, అవే నిజమని నమ్మారు. నిజానిజాలు ఏమిటో తెలుసుకోలేదు.. కనీసం ప్రయత్నించలేదు.. అవే నిజాలు అనుకొని, ఏదేదో చాటుగా చెప్పుకున్నారు. దూరమయ్యారు. నాకు తెలిసినా అన్నింటికీ మౌనముగానే ఉన్నాను. 

ఎందుకిలా మౌనంగా ఉండటం అంటే - 
అప్పుడే - నా స్నేహితులెవరో, కానివారు ఎవరో తెలుసుకోవటం మొదలెట్టాను. 
ఎవరెవరికో నా నిజాయితీ ఏమిటో చెప్పి, నా దగ్గరే ఉంచేసుకోవాలని అనుకోలేదు. 
ఇన్నేళ్ళ నా నాతో చేసినది స్న్హేహమేనా ? కాదా ? 
ఎవరు అసలు నా స్నేహితులు ? 
ఎవరు నన్ను ఎంతగా నమ్మారు ? 
నామీద ఎంత నమ్మకం ఉంచారు ? 
అసలు జరిగినది ఏమిటీ ? అందులో నా పాత్ర ఎలాంటిది ? అనేవి చూశారా ?
ముఖ్యముగా - 
ఇన్నేళ్ళ స్నేహములో వారు నన్ను పూర్తిగా విశ్వసించారా  ? లేక అపనమ్మకముతోనే ఉన్నారా ? జీవితాన సగదూరములో ఉన్న నాకు ఇక శేష జీవితాన ఎవరి మీద సమయాన్ని కేటాయించాలో, ఎవరిని అస్సలు పట్టించుకోవద్దో - తెలుసుకోవటానికి వచ్చిన చక్కని అవకాశం అనుకున్నాను. 
అలాగే తీసుకొన్నాను. నా మిత్రులలో ఎవరు ఎలా స్పందిస్తారో - ఇతరుల మీద ఆధారపడక, అన్నీ స్వయాన తెలుసుకుంటూ ఎవరేమిటో తెలుసుకున్నాను. 
ఓపెన్ గా ఉండే నా ప్రొఫైల్, నా అన్ని వివరాలు అన్నీ వారికి తెలుసు. వారికి నామీద నమ్మకం ఉంటే వారు నన్ను వీడరు. కొద్దిమందికి సందేహం వచ్చినా, నేరుగా అడిగారు. అడిగినవాటికి వివరణలు ఇచ్చాను. నిజమా, కాదా అని వేరేవాళ్ళ పేర్లు చెప్పి, వారిని నిజాలేమిటో తెలుసుకోమన్నాను. తెలుసుకున్నారు. స్నేహబంధం ధృడమయ్యింది. ఇదంతా ఒకెత్తు. 

మరొక స్నేహితురాలి వలన - స్నేహములో నిజాయితీగా ఉంటే - అంటే - అసలు స్నేహితుడి లక్షణాలని ఒంటబట్టించుకొని ఉంటే, ఎంత మధురమైన స్నేహ మాధుర్యాన్ని అనుభవిస్తామో తెలుసుకున్నాను. నేను చేసిన గొప్ప, మరచిపోలేని స్నేహాల్లో ఇదీ ఒకటి. కొన్ని బలమైన కారణాలవల్ల ఆ స్నేహం దూరం చేసుకోవాల్సి వచ్చింది.. గుళ్ళో ప్రసాదంలా కొద్దిగా దొరికినా, ఆమాత్రం దానికే మరచిపోలేని స్నేహ మాధుర్యాన్ని రుచి చూశాను. తనకి బాగా ఋణపడిపోయాను. అది ఈ జీవితాన తీర్చుకోలేనేమో.. 

పై రెండు విషయాలూ ఎందుకు చెప్పానూ అంటే - ఆ రెండూ నా అనుభవాలే. 
ఆ రెండూ స్నేహం విషయంలోనే జరిగాయి. 
ఒక స్నేహం వలన ఇబ్బందులు ఎదురుకున్నా, ఒక మంచి మలుపు పొందాను. 
మరో స్నేహం వల్ల స్నేహితుడిగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. అలా మలుపు తీసుకున్నాను.
ఆ రెండూ భిన్నమైనవే. కానీ రెండింటి వల్లా నేర్చుకున్నాను.. 
నేనేమిటో, నా బలాలు, బలహీనతలూ తెలుసుకున్నాను..
నన్ను నేను మార్చుకున్నాను. 
ఎలా ఉండాలో, ఉండకూడదో అనుభవం ద్వారా నేర్చుకున్నాను. 
ఇవన్నీ స్నేహం కాక మరేమి నేర్పిస్తుంది ??

స్నేహాల్లో అప్పుడప్పుడు పెను తుఫానులు ఉండాల్సిందే. దానివల్ల మనమేమిటో, మన బలబలాలు ఏమిటో అన్నీ అర్థం అవుతాయి. 

చిన్నప్పుడు చదివిన ఒక కథ గుర్తుకువస్తున్నది. అది చెప్పేసి, ముగిస్తాను. 

అడవిలో ఒకసారి గాలి దుమారం వస్తుంది. బలంగా నిలబడిన చెట్లు కేవలం ఆకులు మాత్రమే కోల్పోతాయి. అదే బలహీనమైన వ్రేళ్ళు గల చెట్లు అడ్డముగా నేలకొరుగుతాయి. ఇది చూసి, ఒక చెట్టు మరొక చెట్టుతో అంటుంది కదా - " వాటిని చూశావా! అవి ఎలా కుప్పకూలాయో కదా.. ఈ పాడు గాలిదుమారం. మనలోని కొన్నింటిని పాడుచేసింది.." అంటే - అప్పుడు మరో చెట్టు అంటుంది కదా - " అది గాలిదుమారం తప్పుకాదు. మనం నేలతల్లి తో మన వ్రేళ్ళని కౌగిలిలా ఎంత ధృడంగా పెనవేసుకొని ఉన్నామో బట్టి (స్నేహ)బంధం ఉంటుంది. అక్కడ ధృడంగా లేనప్పుడు, మీద మీదనే అన్నట్లు ఉంటే - ఇలాగే నేలకొరగక తప్పదు.. " అంది నిజమే కదూ.. 

Friday, April 18, 2014

Blog address

రాజ్ గారూ నమస్కారం,
నా బ్లాగ్ లో నేను పోస్టు చేసిన టఫా లు ఒక సైటులో అప్ డేట్ కావటం లేదు. దానికోసం ఆ సైటు వారిని సంప్రదించగా వారు క్రింది సమాధానం ఇవ్వటం జరిగినది. 

" సమస్యను మా దృష్టికి తీసుకువచ్చినందుకు చాలా ధన్యవాదములు.
మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము.
మీ బ్లాగును పలుమార్లు పలు జాబితాలకు జోడించాము కానీ మీ ఫీడు చిరునామా వేరుగా ఉండటం వలన మా సైటులో టపాలు నవీకరించబడుటలేదు.
దయచేసి మీ బ్లాగు ఫీడు చిరునామాను మార్చే అవకాశం ఉంటే మార్చి తెలియజేయగలరు.
దయచేసి మీ బ్లాగు ఫీడు చిరునామా డీఫాల్టుకు మార్చితెలియజేయగలరు." 

పై విధంగా వారి వద్ద నుండి సమాధానం రావటం జరిగినది. దయచేసి మీకూ పై సమస్య యందు అవగాహన అంటే బ్లాగు ఫీడు చిరునామా డీఫాల్టుకు మార్చే విధానం తెలిసి ఉంటే సహాయం చేయగలరు .

శ్రీనివాస్ 

*************
ఇక్కడ బ్లాగ్ ఫీడు చిరునామా అంటే బ్లాగ్ అడ్రెస్ అన్నమాట. అంటే http://www.  అని మొదలయ్యే మా బ్లాగ్ చిరుమానా కాదండీ.. అక్కడ - http:// అని కాకుండా www. తో మీ బ్లాగ్ అడ్రెస్ ని పూర్తి చెయ్యాలి. అంతే. మీకు మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి. 

ఈ క్రింది ఫోటోలో నా బ్లాగ్ స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను. 



ఇందులో బ్లాగ్ అడ్రెస్ గా achampetraj.blogspot.in గా ఉంది. దీన్నే బ్లాగ్ అడ్రెస్ అని పిలుస్తారు. ఆ అడ్రెస్ ఉన్న డబ్బాని - అడ్రెస్ బార్ address bar అని పిలుస్తారు. ఎవరికైనా బ్లాగ్ అడ్రెస్ ఇవ్వాలన్నా, బ్లాగ్ అగ్రిగేటర్స్ కి మన బ్లాగ్ అడ్రెస్స్ పంపాలన్నా ఆ అడ్రెస్ ముందు www. ని జత చెయ్యాలి. అంటే ఇప్పుడు బ్లాగ్ అడ్రెస్ - www.achampetraj.blogspot.in అవుతుంది. ఇలా లింక్ ని ఎవరికైనా పంపిస్తే - అందుకున్నవారు ఆ అడ్రెస్ మీద క్లిక్ చేస్తే - నేరుగా మన బ్లాగ్ కి వస్తారు. కావాలంటే ఈ నీలిరంగులో ఉన్న నా బ్లాగ్ అడ్రెస్ ని నొక్కి చూడండి. నేరుగా నా బ్లాగ్ లోనికే వస్తారు. 

కొన్ని అగ్రిగేటర్ల సర్వర్స్ - బ్లాగ్ ని వాటికి జత చేసేముందు - పంపే అభ్యర్థన ఫారంలో మన బ్లాగ్ అడ్రెస్ ని http:// అని జత చేస్తే అవి అంగీకరించవు. వాటికి www. తో మాత్రమే పంపాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా టెక్నికల్ ఇబ్బంది. మొదట్లో నాకూ అలాగే జరిగింది. పైన చెప్పినట్లు మార్చి పంపిస్తే అప్పుడు అంగీకరించింది ఆ అగ్రిగేటర్ సర్వర్.
  
ఇక్కడ మీరు మరో రెండు ముఖ్య విషయాలనీ గుర్తు పెట్టుకోవాలి. అవి ::

1. సైటు అడ్రెస్ అంతా చిన్న అక్షరాలలో అంటే English భాషలోని Lower case letters లలో ఉండాలి.

2. సైట్ అడ్రెస్ లో ఎక్కడా ఖాళీ ఉండకూడదు. అంటే పదాల మధ్య స్పేస్ రాకూడదు. ఒకే ముక్కలా అడ్రెస్ ఉండాలి. 


Thursday, April 17, 2014

గూగుల్ నుండి నా పుట్టినరోజు శుభాకాంక్షలు.

నిన్నటి రోజు ( ఏప్రిల్ 16 ) నా పుట్టినరోజు. ఎప్పటిలా రోజు మాదిరిగానే ఆన్ లైన్ కి వచ్చేశాను. నెట్ కనెక్ట్ చేసి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చెయ్యగానే, డిఫాల్ట్ గా ఉన్న ( నేనలా సెట్ చేసుకున్నాను ) గూగుల్ సెర్చ్ కనిపించింది. ఎప్పడూ ఏదో ఒక విశేషముతో ఒక డూడుల్ ( ఏదో ఒక గ్రాఫిక్ / పెయింట్ / వీడియో / స్కెచ్..... తో ఉండే బొమ్మ ని Google Doodle అని అంటారు ) కనిపిస్తుంది. దాని క్రిందన గూగుల్ వారి సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది. 

ఇక్కడ విశేషమేమిటంటే - ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతతో ఉండే ఈ డూడుల్ - ఈరోజు ఇలా కప్ కేకులూ, క్యాండిల్స్ లతో ఉన్నదేమిటా అని అనుకున్నాను. ఆ కేకులూ, మిఠాయిలతో గూగుల్ వారి చిహ్నం కనిపిస్తుంది. ఇలా కష్టపడి ఏర్పరిచారు అనుకొని, మౌస్ కర్సర్ ని దానిమీదుగా తీస్కేళ్ళాను. 

ఆశ్చర్యం.. అద్భుతం.. 

ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాను. కర్సర్ ని ఆ బొమ్మ మీద ఆపగానే, ఒక చిన్న మెస్సేజ్ బాక్స్ కనిపించింది. అందులో  Happy Birthday RAJ  అనీ. ఒక అనుకోని పలకరింపులా తోచింది. నమ్మలేక పోయాను. మళ్ళీ అలాగే కర్సర్ పెడితే - నిజమే - మళ్ళీ అలాగే వచ్చింది. 

ఇలా రావటం మనకి క్రొత్తగా కనిపించవచ్చు. గూగుల్ వారి దగ్గర నుండి ఇలా అందుకోవటం ఒక మరపురాని అనుభూతిగా అనిపిస్తుంది. వారికెలా తెలుస్తుంది ? ఈరోజు మన పుట్టినరోజు అనీ..? ఏమైనా మాయనా?? అని అనుకుంటాం. 

నిజానికి Google+ అకౌంట్ లోని పుట్టిన రోజు బట్టి ఇలా జరుగుతుందనీ, దాన్ని బట్టి గూగుల్ సర్వర్లు ఇలా ఆటోమేటిక్ గా పుట్టినరోజు విషెస్ తెలియచేస్తాయని తెలుసుకున్నాను. మీకూ ఇలాగే అనుభవం అయి ఉండవచ్చును. అలా అందుకోలేనివారు మీ మీ పుట్టిన రోజుల నాడు అలా గూగుల్ సర్చ్ హోం పేజీలో వచ్చేవరకూ ఎదురుచూడండి. 


Tuesday, April 15, 2014

బ్లాగులో శతకాన్ని ఎలా చేర్చటం ?

[తెలుగుబ్లాగు:22250] naa telugu dhira niti satakanni pettali  ella - ఈ ప్రశ్నకి నేను ఇచ్చిన జవాబు

మీ తెలుగు ధీర నీతి శతకాన్ని పెట్టాలీ అన్నారు కదా.. అది ఎక్కడనో మీరు తెలియచెయ్యలేదు. బహుశా మీ బ్లాగులో అనుకుంటాను. ఒకవేళ మీ బ్లాగులో అయితే మీరు మీ శతకాన్ని ఈ క్రింది పద్ధతుల్లో పెట్టవచ్చును..

1. మీ బ్లాగులో నేరుగా లేదా తెలుగు టైపింగ్ ఉపకరణాలను వాడి, తెలుగులో టైపు చేసి, పబ్లిష్ చెయ్యటం. 

2. మీ శతక అచ్చు ప్రతిని స్కాన్ చేసి, ఫోటోల రూపముగా మీ బ్లాగులోకి అప్లోడ్ చేసి, పబ్లిష్ చేసుకోవడం. 

3. మీ శతకాన్ని మీ గొంతుతో లేదా వేరొకరి స్వరాన MP3 ఫార్మేట్ లో రికార్డ్ చేసి, Divishare లాంటి ప్లేయర్ల ద్వారా వినిపించడం. 

4. మీరు ఆ శతకాన్ని చెబుతున్నప్పుడు వీడియో తీసి, దాన్ని youtube లోకి అప్లోడ్ చేసి, ఆ వీడియో లింక్ ని మీ బ్లాగ్ లో ఇచ్చి, ఆ వీడియోని అక్కడ ప్రదర్శించటం. 

5. అలా కాకుంటే నేరుగా మీ వీడియోని బ్లాగ్ లోకి అప్లోడ్ చేసి, ప్రదర్శించడం. 

6. PDF రూపములో మీ శతకాన్ని తయారుచేసి, దాన్ని ఏదైనా షేరింగ్ సైట్ లోకి ఎక్కించి, ఆ పోస్ట్ లింక్ ని మీ బ్లాగ్ లో పబ్లిష్ చేసుకోవడం. 

7. మీ Google drive గూగుల్ డ్రైవ్ లోకి ఆ శతకాన్ని ( MP3, ఆడియో, వీడియో, PDF, ఫోటోలు.. ) ఎక్కించి, ఆ లింక్ ని మీ సైట్ లో పోస్ట్ చెయ్యడం వల్ల మీ శతకాన్ని నలుగురికీ అందేలా చేసుకోవచ్చును. 

Sunday, April 13, 2014

Good Morning - 556


ఏది కావాలనుకొని వదిలేస్తామో, 
అది మన వెంబడి వస్తుంది. 
ఇది జీవిత సత్యం. 

Friday, April 11, 2014

Good Morning - 555


ఆడదంటే - అర్థం - పరమార్థం. 
ఆడదంటే - అందం - ఆనందం. 
ఆడదంటే - ఆత్మీయత - అభిమానం.
ఆడదంటే - అనురాగం - అనుబంధం. 
ఆడదంటే - సహనం - సంతోషం. 
ఆడదంటే - అంబరం - ఆగాధం. 
ఆడదంటే - సమూలం - అమూల్యం. 

Wednesday, April 9, 2014

how can i save the matter i typed?

[తెలుగుబ్లాగు:22230] how can i save the matter i typed? అనే ప్రశ్నకి నేను ఇచ్చిన సమాధానం. 

బ్లాగుల్లో మనం ఏదైనా టపా వ్రాస్తున్నప్పుడు, సమయం లేకనో, లేదా ఏదైనా పని మీద ఆ టపాని వ్రాయడంని కాసేపు తాత్కాలికముగా ఆపాలనుకునప్పుడు, పనిమీద బయటకు వెళ్లాలని ఉండాల్సి వచ్చి, లేదా మరే ఇతర కారణాల వల్లనే కానీ, అప్పటిదాకా టైప్ చేసిన దాన్ని భద్రపరచాలని అనుకుంటున్నారా? అలా చేసేందుకు ఒక ఆప్షన్ ఉంది. 

నేను బ్లాగుని మొదలు పెట్టిన సమయాన - బ్లాగ్ పోస్ట్ వ్రాస్తున్నప్పుడు విషయం టైపు చేస్తూ, మధ్య మధ్యన Save బటన్ ని నొక్కాల్సివచ్చేది. అలా చేసే పద్దతిని మాన్యువల్ సేవ్ ఆప్షన్ అంటారు. ఈ పద్ధతిన మనం టైప్ చేసాక సేవ్ ని తప్పనిసరిగా నొక్కాల్సిఉంటుంది. విద్యుత్తు అర్ధాంతరంగా ఆగిపోతే, అప్పటిలోగా మీరు సేవ్ బటన్ నొక్కక పోతే అప్పటిదాకా మీరు టైపు చేసినదంతా పోయినట్లే. 

ఆ తరవాత - ఆటో సేవ్ Auto save ఆప్షన్ సెట్టింగ్స్ లలో ఉండేది. దాన్ని ఎంచుకొని, సేవ్ చేస్తే, మనం టైప్ చేసినందంతా ప్రతి నిమిషం తరవాత సేవ్ అయ్యేది. ఒక్కోసారి ఈ సేవ్ బటన్ ( నెట్ డ్రాప్ వల్ల ) పనిచేసేది కాదు. 

ఇపుడు మాత్రం మనం టైప్ చేశాక ఆటోమేటిక్ గా - ఎలాంటి సెట్టింగ్ అవసరం లేకుండా భద్రపరచడం జరుగుతున్నది. మనం టైపు చేసినందతా భద్రంగా ఉంటుంది అన్నమాట. 

ఇంతకు ముందు Auto save అనే ఆప్షన్ ఉండేడిది. ఇప్పుడు అయితే ఆ ఆప్షన్ ని తీసేశారులా ఉన్నారు. అందులో అయితే మీరు నొక్కే ప్రతి పదం కొన్ని సెకనుల తరవాత ఆటో పద్ధతిలో సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆ పద్ధతి తీసేసి, అన్నింటికీ ఆటో సేవ్ పెట్టారు. అంటే ఆ ఆప్షన్ లేకున్నా ఆటోమాటిక్ గా Save అవుతుందన్న మాట. 

ఒకవేళ ఆటోమేటిక్ గా సేవ్ అయ్యిందో లేదో, అన్న అనుమానం ఉంటే ఇప్పటికీ మాన్యువల్ గా వ్రాస్తున్న పోస్ట్ ని సేవ్ చేసుకోవచ్చును. అలా మాన్యువల్ గా చెయ్యాలీ అంటే ఈ క్రింది ఫోటోలో చూపినట్లుగా - టపా పోస్ట్ లో ఉన్న Save ని మీరు చేస్తే భద్రముగా ఉండిపోతుంది. ఫోటో మీద క్లిక్ చేస్తే, పెద్దగా చూడవచ్చును. 


Tuesday, April 8, 2014

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.


మితృలందరికీ,
వారి కుటుంబ సభ్యులకీ, 
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. 

Saturday, April 5, 2014

Quiz


.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ఇదిగో జవాబు. 



Thursday, April 3, 2014

Good Morning - 554


కొన్నిసార్లు మనం పరిస్థితులకి తలొగ్గాల్సి వస్తుంది. 
అంతమాత్రాన లొంగిపోయినట్లు కాదు.. 

జీవితాన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిలా ఉంటాయి అవి. ఆ పరిస్థితుల్లో ఎదిరించాలని చూస్తాం. కానీ ఏవేవో బంధాల వల్లనే కానీ, కారణాల వల్లనే కానీ, చెప్పలేని భావాల వల్ల కానీ... ఎదిరించలేకపోతాం. అందరి ముందూ ఒక దోషిలా తలొంచుక నిలబడాల్సి వస్తుంది. మనకీ, మన ఆత్మకీ తెలుసు - మనదేమీ తప్పు / పొరబాటు లేదనీ. కానీ అలా తలొగ్గినట్లు ఉంటే - మనం అనుకున్న విధముగా ఆ పరిస్థితి చక్కబడుతుంది అన్నట్లుగా మనం భావిస్తాం. కానీ ఎదుటివారు ఎలా భావించినా సరే.. లొంగిపోయాడు అని వెక్కిరించినా సరే.. నిజానికి అలా చెయ్యడం లొంగిపోయినట్లు కాదు. మనకంటే ఎదుటివారు / పరిస్థితులు బలంగా ఉంటే తప్పదు కదా.. 

దీనికో చక్కని ఉదాహరణ ఇస్తాను. తనలో కలిసే నదీప్రవాహాలని సముద్రుడు అడుగుతాడు ఒకరోజు. ఏమనీ అంటే - మీరు మీ మీ ప్రవాహాలల్లో ఎన్నెన్నో వాటిని తీసుకవస్తారు, కానీ తుంగని ( గట్ల వెంట సన్నగా పుల్లల్లా పెరిగేది )మాత్రం తీసుకరారు అనీ.. 

దానికి అవి అంటాయి కదా " మా ప్రవాహాలు బలంగా ఉన్నప్పుడు ఆ మొక్క ఎదురు నిలవక తలొగ్గి, అణుకువగా ఉంటుంది. అప్పుడు మా ప్రవాహ బలం దానిని ఏమీ చెయ్యజాలదు. అదే మిగతా వృక్షాలు, రాళ్ళు వాటికి  ఉన్న శక్తి మా ప్రవాహ బలం ముందు తక్కువ అయినా - విర్రవీగి, ఎదురు నిలుస్తాయి. అందుకే వాటిని కూకటి వ్రేళ్ళతో పెకిలించుకొని వస్తాం. మా ప్రవాహ బలం తక్కువగా ఉన్నప్పుడు అదే తుంగ ఠీవిగా నిలబడి ఉంటుంది.. " 

అందుకే - జీవితాన ఒక్కోసారి మనకన్నా బలమైన వాటి ముందు తలొంచాల్సి వచ్చినా - అది కేవలం అప్పటి పరిస్థితుల ప్రభావమే అని అనుకోవాలి. అంతేకానీ  లొంగిపోయినట్లు కాదు. 


Tuesday, April 1, 2014

మీ బ్లాగ్ ని Google+ లో Automatic share

బ్లాగ్ లో టపా పోస్ట్ చెయ్యగానే మీకు ఆ పోస్ట్ మీ గూగుల్ ప్లస్ లో కూడా ఆటోమేటిక్ గా కనిపించాలి అని అనుకుంటున్నారా ? అయితే మీరు ఈ క్రింది పద్ధతులను పాటించండి. 

గూగుల్ ప్లస్ అకౌంట్ మీకు ఉండి, బ్లాగ్ ని మీరు నిర్వహిస్తుంటే - ఈ పద్ధతి అమలవుతుంది. ఈ పద్ధతిలో మీరు మీ బ్లాగ్ లో వేసిన పోస్ట్ - వెనువెంటనే మీ గూగుల్+ లో కనిపిస్తుంది. Google+ సోషల్ అకౌంట్ లోని మీ మిత్రులు మరియు మీరు ఎవరెవరి సర్కిల్ లలో ఉన్నారో వారు ఈ పోస్ట్ యొక్క నోటిఫికేషన్ / లింక్ ని చూడగలరు. దీనివలన లాభం ఏమిటీ అంటే - మీ గూగుల్+ సోషల్ అకౌంట్ లోని మీ మిత్రులు ఆ పోస్ట్ ని చూస్తే మీ బ్లాగ్ వ్యూయర్ షిప్ పెరుగుతుంది. మీ బ్లాగ్ ర్యాంక్ కూడా పెరుగుతుంది. అలా మీ బ్లాగ్ పాపులారిటీ ని పెంచుకోవచ్చును. 

ఇంతకు ముందు ఇలా లేకుండెను.. మనమే మాన్యువల్ గా అలా షేర్ చెయ్యాల్సి ఉండేది. కొద్దికాలం క్రిందట ఇలా సెట్టింగ్ వచ్చింది. మన ప్రమేయం లేకుండా, ప్రతిసారీ అలా మాన్యువల్ గా చెయ్యకుండా - మనం నిర్ణయించుకున్న సెట్టింగ్స్ వల్ల - ఇలా పోస్ట్ కాగానే షేర్ లింక్ మన Google+ టైం లైన్ మీద కనిపిస్తుంది. ఆ లింక్ ని చూసిన మిత్రులు - ఆ లింక్ ద్వారా మన బ్లాగ్ లోని పోస్ట్ ని నేరుగా చేరుకుంటారు. ఇప్పుడు ఆ సెట్టింగ్స్ ఎలాగో ఇప్పుడు చూద్దాం. 

ముందుగా మీ బ్లాగ్ హోం పేజీ ఓపెన్ చెయ్యండి. అంటే www.blogger.com ని ఓపెన్ చెయ్యాలి. అప్పుడు మీకు బ్లాగ్ ఉంటే ఆ బ్లాగ్ తెరచుకుంటుంది. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. ఈ క్రింది ఫోటోలోని Click here వద్ద ఉన్న చిన్న చదరపు గడిలో ఉన్న త్రికోణాకారాన్ని నొక్కాలి. 


ఇప్పుడు మీరు ఇలా  1 వద్ద నొక్కాక, ఒక డ్రాప్ మెనూ వస్తుంది. అందులో ఉన్న Google+ ( 5 వ ఆప్షన్  ) ని 2 వద్ద డబల్ క్లిక్ చెయ్యండి. 


ఇప్పుడు ఆ Google+ సెట్టింగ్స్ ఇలా మీ గూగుల్+ ప్రొఫైల్ ఫోటోతో తెరుచుకుంటుంది. ఇందులో 3 వద్ద ఉన్న మూడు ఆప్షన్స్ లలో మొదటి రెండింటినీ టిక్ చెయ్యండి. ఇలా చెయ్యడం వలన మీరు మీ బ్లాగ్ లో ఇలా పోస్ట్ చెయ్యగానే, అలా మీ గూగుల్+ అకౌంట్లో ఆ పోస్ట్ లింక్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ప్రత్యేకించి మళ్ళీ చెయ్యాల్సిన అవసరం లేదు. 

 4 వద్ద టిక్ చెయ్యడం అనేది అది మీ ఇష్టం. నా సలహా అయితే మీరు టిక్ చెయ్యకుండా ఉండటమే మేలు. 


అలా చెయ్యకుండా ఉంటే - మీ బ్లాగ్ ని నేరుగా దర్శించేవారు ఏదైనా అభినందనో, విమర్శనో, సూచననో కామెంట్ పెట్టడానికి Post a comment అనే ఆప్షన్ / లింక్ కనిపిస్తుంది. దాన్ని వాడి - మీరు చేసిన పోస్ట్ గురించి కామెంట్ పెడతారు. కానీ గూగుల్+ వారి మితృల కామెంట్స్ మీ బ్లాగ్ పోస్ట్ లో కనిపించే అవకాశం లేదు.

అక్కడ టిక్ చేసి ఉంటే - మీ గూగుల్+ మిత్రులు మాత్రమే కామెంట్స్ చెయ్యగలరు. వారికి మాత్రమే కామెంట్ పోస్ట్ చెయ్యడానికి లింక్ వస్తుంది. బయట నుండి / నేరుగా మీ బ్లాగ్ ని సందర్శించే వారికి మాత్రం ఆ ఆప్షన్ ఉండదు. కొద్దిరోజులు ఈ ఆప్షన్ ని కొన్ని కారణాల వల్ల వాడాల్సి వచ్చింది. 


Related Posts with Thumbnails