Tuesday, December 16, 2014

రాతి గోడల నిర్మిత బావి. ( Step well )

కొన్నిసార్లు మనం ఎక్కడికైనా వెళ్ళి, మనం చూడవలసింది చూద్దాం అనుకునేలోగా అక్కడ మరికొన్ని అద్భుతమైనవి కనిపిస్తాయి. వాటిని చూసినప్పుడు ఎంతగానో హాశ్చర్యానికి గురి అవుతుంటాం.. ఇలా నేనూ గురయ్యాను. ఆ విషయం మీతో పంచుకుంటున్నాను. 

సాధారణముగా వ్యవసాయ బావులని మనలో చాలామంది చూశారు. మహానగరవాసులకైతే అవి ఎలా ఉంటాయో కూడా తెలీక పోవచ్చును. వ్యవసాయం, గ్రామీణ నేపధ్యమున్న వారికి ఇవి బాగా ఎరుక. పెద్దగా, ఎంతో విశాలముగా ఉండి, లోతుగా, లోయలా అనిపించేవిగా ఉంటాయవి. వాటిలోకి తొంగి చూడటానికే భయపడుతాం. అలాంటి బావుల్లోన - వాటికి చుట్టూతా రాతి గోడలు కట్టి, అందులోకి దిగటానికి మెట్లూ ఉంటే - మనం సంభ్రమానికి గురి అవుతుంటాం. ఇలాంటి బావిని నేనీమధ్యే చూశాను కాబట్టి ఆ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ మధ్యనే అంటే నిన్న మొన్న కాదు.. ఈ సంవత్సరం - 2014 ఫిబ్రవరి 12 న.. ఇప్పుడైతే అన్నీ బోరు వేసి, నీటిని మోటారుతో తోడి, వ్యవసాయానికి వాడుకుంటున్నారు. 

ఈ క్రింది ఫోటోలలో ఉన్న రాతి గట్టు నిర్మిత బావి - తెలంగాణా రాష్ట్రం లోని నిజామాబాద్ జిల్లాలోని భిక్కనూర్ గ్రామ సరిహద్దుల్లో ఉన్న సిద్దిరామేశ్వర స్వామి ఆలయానికి ముందున, ఎడమభాగంలో  ( Near Siddhi Rameshwara Temple, Bhiknoor, National High way no. 44, Nizamabad dist. ) ఉంటుంది. కాసింత లోతుగా ఉండి, పెద్ద పెద్ద గ్రానైట్ బండలతో, అందముగా ఉండి, లోపలికి వెళ్ళటానికి వీలుగా రాతితో మెట్లు, అదీ కూడా సులభముగా దిగటానికి, విశాలముగా ఉన్నాయి. ఇప్పుడు అయితే బోర్లు ఉంటున్నాయి కానీ అప్పట్లో అందరూ మెట్లు లేని బావుల్లోకి దిగి నీరు త్రాగటానికి కష్టపడేవాళ్ళు. అలా చెయ్యటములో ఒక్కోసారి ప్రాణాల మీదకి వచ్చేవి కూడా.  

కాకపోతే - ఒకే ఒక బాధ. ఇంత బాగున్న ఈ బావిని అలా నిర్లక్ష్యానికి వదిలివేయ్యటం చాలా బాధించింది. ఇంత అందమైన బావిని పొందిన ఆ దేవాలయం వారూ, ఆ ఊరి గ్రామ పంచాయితీ వారు ఆ బావిని శుభ్రపరిచి, లోపల ఉన్న మురికి నీళ్ళని బయటకి తోడివేసి, అవసరమైతే ఆ బావిలో బోర్ వేసి, పునరుద్ధరణ చేపడితే, ఒక ఆహ్లాదకర ప్రదేశం చేసినవారు అవుతారు. ఇలా చేస్తే ఆ ఆలయానికి వచ్చే వాళ్ళు, ఆ ప్రక్కనే ఉన్న ఆయ్యప్ప గుడి భక్తులూ, ఆ ఊరి గ్రామప్రజలూ, ఆఖరికి ఆ నేషనల్ హైవే మీదుగా వెళ్ళే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా తక్కువ ఖర్చులో ఇది సాధ్యమవుతుంది కూడా.. 

ఇప్పుడు మీకు - బావి తాలూకు ఫొటోస్ ని చూపిస్తున్నాను. కాస్త చూసి పెట్టండి మరి. 









4 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

ఇటువంటివి రాజస్థాన్ , గుజరాత్ లో ఉంటాయంటారు. ఇక్కడే ఉన్నాయి. బాగుంది. ఫేస్ బుక్లో పెడితే పంచుకోవచ్చు గదా!

Raj said...

హా.. ఆ పని కూడా ఎప్పుడో చేశానండీ.. ఫేస్ బుక్ లో షేరింగ్ చెయ్యటానికి మీకోసం ఎదురు చూస్తున్నదీ ఆల్బం. :) లింక్ చూడండి : https://www.facebook.com/achampet.raj/media_set?set=a.663747080402324.1073741864.100003011152156&type=3

hari.S.babu said...

నేను ఈమధ్యనే గూగుల్ లో "Baoli India stepwells" అని గుజరాతులో వున్నట్టు చూశాను!
యెంత బాగున్నాయో అనిపించింది,మన తెలంగాణా లోనూ వున్నాయన్న మాట.

Raj said...

హా.. అవునండీ.. మన తెలంగాణాలో ఉన్నాయి. ఇలాంటిది మరొకటీ చూశా.. వీలు చేసుకొని, అక్కడి ఫోటోలు తీసి పోస్ట్ పెడతాను.

Related Posts with Thumbnails