Wednesday, February 5, 2014

We miss you friend..


We miss you friend..

(మాజీ) మిత్రమా..! బాగున్నారా ? మీరు ఎప్పుడూ బాగుండాలనే అనుకుంటాము. 
రోజులెంత వేగముగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి కదూ..! 
ఏదీ మనకోసం ఆగదు కదా..! 
మీకు దూరమై అప్పుడే ఇంతకాలం గడిచిందా?.. అనిపిస్తోంది ఒక్కోసారి. 

మామూలుగా సాగిపోతున్న మా ఈ నిరుపేద చిన్నిలోకంలోకి మీ రాక ఒక ప్రత్యేకం. 
అప్పటివరకూ మీరెవరో మాకు తెలీదు.. మేమూ మీకు తెలీదు. 
చిన్నగా మొదలైన పరిచయం - స్నేహ ప్రవాహంలా కొనసాగి 
చక్కని ఆత్మీయ, మమతానుబంధం వైపుగా వెళ్ళింది..
అప్పటిదాకా మేం నలుగురం అనుకున్న మా కుటుంబం 
మీరాకతో ఒక్కసారిగా ఐదుగురిగా మారింది.. 
అంతగా మాలో ఒకరిగా కలిసిపోయారు. 
మా సంతోషాల్లో మీరూ భాగం పంచుకున్నారు. 
మీరు అందుబాటుకి రాని సందర్భాలల్లో కూడా మీకు అవన్నీ పూసగుచ్చినట్లు చెప్పుకున్నాం. 
ఇదనీ, అదనీ కాకుండా  మా ఇంటివారని ప్రతి విషయాలనీ మీకు తెలియచేసుకున్నాం..
అందాకా ఎవరోతోనూ అంతగా మమేకమై ఉండని మాకు - 
మీతో ఏదో తెలీని ఒక ఆత్మీయ బంధం, 
ఒక మమతానుబంధం, ఋణానుబంధం ఏర్పడింది. 
అది మరింతగా బలంగా రూపుదిద్దుకుంటున్నప్పుడు ఒక్క కుదుపు.. 

స్నేహబంధాలు ఎన్నెన్నో పరీక్షలకు నిలిచి నిలదొక్కుకోవాలి. 
అప్పుడే అవి కలకాలం నిలచిపోతాయి.
ఆర్థిక, మత, కుల, హోదా, లింగబేధం, అంతస్థు, వయస్సు, చాడీలు, అపోహలు, అహం, మనస్పర్థలు, వాడుకుంటున్నారేమో, మోసం చేస్తున్నారేమో, నమ్మకం...ఇలా ఎన్నెన్నో పరీక్షలు ఉంటాయి. 
వాటిలో అన్నింటికన్నా అసలైన కష్టమైనది కాలం పెట్టే పరీక్ష. 
అన్నింటిని దాటుకొని వచ్చినా, ఇక్కడే అన్ని పరీక్షలూ ఒక్కసారిగా దాడి చేస్తాయి. 
దాన్ని తట్టుకొని నిలబడాలీ అంటే మామూలు మాటలు కాదు. 
చాలా ధైర్యముగా ఉండి, స్నేహితుల మీద అంతులేని నమ్మకంగా ఉండాలి. 
అలాగే ఎన్నెన్నో అతి సున్నిత భావాలకీ విలువనివ్వాల్సివస్తుంది. 
ఈ ఒక్కటీ దాటితే - ఇక ఆ స్నేహ ప్రవాహంకి ఇక అడ్డు ఏదీ ఉండదు. 
మనం చేసే భావ ప్రకటనలు వేరొకరికి మరోలా కనిపిస్తుంటాయి
చూపించే ఆప్యాయత నమ్మించి, మోసం చేస్తున్నారేమో అనిపిస్తుంది.....
ఏది ఏమైనా - అక్కడే - అప్పుడే అన్నీ నివృత్తి చేసుకోవాలి. 

స్నేహం నుండి ప్రమోషన్ పొంది, 
నాకూ ఫలానా చోట నావాళ్ళు అంటూ ఉన్నారు.. 
వారూ నా కుటుంబములోని వారే  అని 
మీరు అనుకునేలా / చెప్పుకోనేలా ఉండాలనుకున్నాం. 
మీకు పెద్దవారిలా ఉంటూ ఆప్యాయత చూపాలనుకొన్నాం. 
ఆసరా ఇవ్వాలనుకొన్నాం...
మా స్వంతవారిలా మిమ్మల్ని భావించాం. 
అలాగే మీరు ఉండనివ్వాలని ప్రయత్నించాం. 
మీకిష్టమైనవన్నీ చేసి పెట్టాలనుకున్నాం.. 
అన్ని సపర్యలు చేయ్యాలనుకున్నాం. 
విశిష్ట అతిధిలా చూసుకోవాలనుకున్నాం.. 
అందుకే స్నేహంలో ఏకవచనంలో మాట్లాడాల్సింది - 
బహువచనంలో "మిమ్మల్ని/ మీరు" అని పలకరించాల్సి వచ్చింది. 

కానీ, 
మనమొకటి తలిస్తే - విధి మరొకటి తలుస్తుంది. 
అది పట్టే పరీక్ష చాలా కఠినమైనది. మామూలుగా ఉండదు.
అంతలోనే ఎన్నో కపటాలు, మోసాలు, తెర వెనుక రాజకీయాలు..
మాకంటే వారికెందుకు అంత మర్యాదలు, ఆతిధ్యం అంటూ.. ఈర్ష్యాసూయలు.. 
మేం చేసిన ప్రతి చర్య వెనుక ఏవేవో ఊహాగానాలు, విశ్లేషణలు. 
అవన్నీ మీవల్ల మాకు తెలుస్తూనే ఉన్నాయి. 
కానీ చేతులు ముడుచుకోవాల్సి వచ్చింది. 
కారణం : ఒకరి మీద ఏదో చెప్పి, దగ్గర అవ్వాలని లేదు. 
మమ్మల్ని అడిగినప్పుడే వాటికి సమాధానం ఇవ్వాలని అనుకున్నాం. 
మీకూ మాపై చక్కని నమ్మకం ఉంది. 
..మాగురించి అన్నీ మీకు తెలుసు.
అప్పటి  పరిస్థితుల్లో మేమేది చేసినా అవి రెట్టింపు అవుతాయని మాకు తెలుసు. 
ఆపాటికే ఆ సెగలు మిమ్మల్నీ చుట్టాయని తెలుసు. 
అయినా వాటిని ఖాతరు చెయ్యకుండా మాకోసం మీరు ఎంత ప్రయత్నించారో తెలుసు. 
ఎన్నెన్ని అవమానాలు ఎదుర్కున్నారో ఊహించగలం. 
ఏదేదో చెప్పి, ఎంత బ్రెయిన్ వాష్ చేశారో అనుకున్నాం. 
కానీ అవి నమ్మక, మీ జీవితాన లేని ఒక చిన్ని బంధం కోసం ఎంతగా తపించారో మాకు తెలుసు.
మీ తాపత్రయాన్ని గుర్తించాం. 
మాకోసం ఎన్ని విమర్శలు, మాటలు పడ్డారో ఊహించాం...
కానీ ఏమీ చెయ్యలేని స్థితిలో మేమున్నాం... 
వారికేం తెలుసు? ఒక బంధం పెరగటానికి ఎంత కష్టమో, 
దాన్ని నిలుపుకోవటానికి మరెంత ప్రయాసనో.. 
వాటికి సమాధానాలు మమ్మల్ని నేరుగా అడిగి ఉంటే అన్నీ చెప్పేవాళ్ళం. 
మహా అంటే కొంత సమయం లోనే అన్నీ తీర్చేసేవాళ్ళం. 
అలా చెయ్యని కారణాన అది చాలా దూరం వెళ్ళింది.....
వెనకటికి - ఒక బ్రాహ్మణుడు తనకి పూజల వల్ల వచ్చిన మేకపిల్లని వెంటపెట్టుకొని, అడవి గుండా వెళితే - నలుగురు దొంగలు దాన్ని కుక్కపిల్ల అని ఎలా కాజెయ్యాలని చూశారో - అన్న కథ గుర్తుక వచ్చింది. 

ఇక తప్పదు అనుకున్నాం.. ఇక చాలు ఇక్కడితో అనుకున్నాను నేను. 
" మిమ్మల్ని ఇక నుండీ బాధ పెట్టను"   అని మాటిచ్చిన నేను - మాట తప్పాల్సి వచ్చింది. 
మిమ్మల్ని దూరం చేసుకోవాలని అనుకున్నాను. 
అప్పటికీ ఎన్నెన్నో సార్లు ప్రయత్నించాను.. 
ప్రతిసారీ ఏదో విధముగా రాజీ పడ్డాను.. మీరూ అంతే. 
ఇవన్నీ మనిద్దరికీ తెలుసు. 
అప్పటికీ మీరు దూరం కానే కారనీ తెలుసు.  
..................... 
.................. 
......................
అప్పటివరకూ బలంగా నిర్మించిన స్నేహ బంధాన్ని ముక్కలు చెయ్యాల్సి వచ్చింది. 
వయస్సులో, అనుభవంలో పెద్దవాడిని నేనే కదా.. బలమెక్కువ.  
ఎలాగూ తప్పుకోవాల్సింది కూడా నేనే కదా..
మీలోని బలాలే కాదు, మీలోని లోపాలేమిటో స్నేహితునిగా తెలుసు.
వాటిని ఉపయోగించి, నా బలంతో మీ మనసుని ముక్కలు చేశాను. 
నేను కట్టుకొన్న అందమైన, అపురూప స్నేహ బంధాన్ని నాచేతులతోనే నాశనం చేసుకున్నాను.
నాకున్న ఏకైక ఆత్మ మిత్రుడు Soulmate అయిన మీతో - 
" షటప్..! నోర్మూయండి.. మళ్ళీ మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు.. మొహం చూపించకండి "
- అని నన్ను కసరించుకోనేలా ప్రేరేపించాను..
ఫోన్ ఎత్తడానికి మనసొప్పకుండా ఉండేలా చేశాను. 
బాధపడేలా చేశాను. 
అది - ఇలాంటి వాడితోనా స్నేహం చేశానా..? 
నేనొక పీడకలగా మిగలాలని - మీకు అగుపించేలా చేశాను. 
స్నేహం అంటేనే ఇలాంటి మోసగాళ్ళు ఉంటారా అనుకొనేలా చేశాను. 
ఆ క్రమంలో - మరికొందరూ ఆయాచితంగా కలిశారు. 
వారు ఏదేదో చెప్పిన వాటినీ (అవి నిజాలు కాకున్నా ) నిజమని అనుకొనేలా చేశాను. 
పరిస్థితులని తెలివిగా వాడుకున్నాను... 
మా గురించి మీకు నిజం చెప్పేవారినీ, మళ్ళీ కలపాలని అనుకున్నవారినీ ఆపాను. 
నా జీవితాన ఎన్నడూ చెయ్యని పనులని ఇందుకోసం చేశాను. 
మొత్తానికి నా నుండి మీరు దూరమవ్వాలని ఇదంతా చేశాను. 
అందులో అద్భుత విజయం సాధించాను.. 
కానీ స్నేహంలో, మీ మనసులో స్థానాన్ని దారుణంగా ఓడిపోయాను. 
దూరం చేశానని సంతోషం ఒకవైపు, దూరం చేసుకొని మాట తప్పానని బాధ ఒకవైపు.. 
ఈ రెండూ ఏకకాలంలో అనుభవించా.. 
అదో సరిక్రొత్త అనుభవం. 
నా జీవితాన రెండోసారి కన్నీళ్ళు పెట్టాల్సివచ్చింది. 
ఇలా చేసినందులకు మనసారా క్షమించేసేయ్యండి. 
కానీ నన్ను మీరు ఎప్పటికీ క్షమించరనీ తెలుసు.

సరిగ్గా ఇదే రోజున - ఇదే తేదీన మిమ్మల్ని దూరం చేసుకున్నాను. 
దూరమైతే చేసుకున్నాను కానీ, మా మనస్సులో నుండి ఇంకా దూరం కాలేదు. 
స్నేహం నిలవడానికి మీరు ఎంతగానో కష్టపడ్డా, నేనే పిరికివాడిలా బెంబేలెత్తిపోయి, 
నా వంతు ప్రయత్నం నేను చెయ్యక ఆగిపోయాను. 
అందుకు గల కారణాల్లో ఒకటి మహా బలమైనది. 

మన స్నేహాన్ని త్రెంచానేమో కానీ, మా కుటుంబం నుండి మిమ్మల్ని వేరు చెయ్యలేకపోయా. 
అంత శక్తి నాలో లేకపోయింది. నిజానికి లేదు కూడా. 
కలుపుకోవడం చాలా తేలికనే, కానీ విడిపోవడం చాలా కష్టమే.. 
ఒక్కోసారి అసాధ్యమే. ఇప్పుడూ అంతే. 
వారి మదిలోనుండి మిమ్మల్ని బయటకు నెట్టేయలేక పోయాను. 
మీ గురించి చాలా గొప్ప అభిప్రాయాన్ని చెప్పా. 
తానేమిటో, తన మనసేమిటో, తన చుట్టూ ఉన్న పరిస్థితులేమిటో, అవి ఎలా చుట్టుముట్టాయో, అవి ఎలా బలంగా మారాయో, ఎవరి నుండి ఎవరికీ ఎలా చేరిపోతూ ఇంకా చిక్కుముడిగా మారాయో, తన ఆశలూ, మననుండి ఏమి కోరుకుంటున్నారో... అన్నీ చెప్పా. అలాగే మీ మనసుకి ఇంత బాగా దగ్గరకి వచ్చి, నేనెందులకు మీనుండి దూరం అవ్వాలని నిర్ణయించుకున్నానో, అదీ వివరముగా చెప్పాను. ( ఇది మీతో చెప్పాలనుకున్నాను. అంత అవకాశం రాలేదు. ప్రతిసారీ ఏదో అడ్డంకి ) 
అప్పటిదాకా నన్ను ఏదో అనుకున్న వారు - 
మిమ్మల్ని మిస్ చేసుకున్నందులకు వారూ ఫీల్ అవుతున్నారు. 
కానీ ఒకటిమాత్రం చెప్పా.. ఏదో ఒకరోజు మళ్ళీ కలుస్తారు అనీ. 
అప్పుడు మావైపు నుండి మాత్రం మాకెలాంటి అభ్యంతరాలూ ఉండవు.. 
సదా ఆహ్వానమే.. (మది) తలపులు తెరచి మరీ ఉంచాం.. 

బాధ పెట్టనన్న ఒక్క మాట తప్పానేమో గానీ, మీకిచ్చిన మిగతా మాటల్నీ నిలుపుకుంటున్నా..
రోజూ ఏదో రకముగా మీ గురుతులే. 
రోజూ మరీ జ్ఞాపకం చేసుకుంటాం - మీ మాటలూ, ప్రశంసలూ, మంచిమాటలూ, మా నుండి మీరు కోరిన మార్పులూ..
ఎక్కడ కోప్పడతారేమో అని ప్రతిరోజూ టిఫిన్స్ తప్పదు. 
కనీసం బిస్కెట్స్ అయినా తప్పటం లేదు. 
ఒకటే దోశ తినే నేను ( ఈసంగతి మీకు తెలుసు ) - 
తింటారా లేక తనకి చెబుతా  అని మీ అక్కయ్య బెదిరింపు వల్ల నాలుగు తినాల్సి వస్తున్నది. 
మీతో మాట అనిపించుకోవద్దు అనే భయం నాది. 

మునపటి కన్నా బాగా ఆత్మీయ బంధాలు మాలో పెరిగాయి.. 
ఔటింగ్స్, వాకింగ్స్, ఒకరి సమస్యలని మరొకరు మోటివేట్ చేసేలా మారుతున్నాం..
స్నేహితుల్లా ఉంటున్నాం. 
అవి ఎంతగా అంటే - ముగ్గురికి సరిపడే అంత ఆహార పదార్థాలు ఉంటే - 
నాకు ఆకలి అస్సలు లేదు.. నాకు వద్దు అని నలుగురం అనేలా.. 
బాధల్ని పంటి క్రింద దాచేసి, పైకి మాత్రం నవ్వుల్నీ పంచేస్తున్నాం. 
ఇదంతా మీ చలవే. 

ఆన్లైన్ కూడా బాగా తగ్గించా.. ఏదేదో అప్లోడ్ చేసుకుంటూ, పాత మిత్రులతోనే బాగుంటున్నాను. 
క్రోత్తవారితో అంతగా కలవలేకపోతున్నా.. 
ఎందుకూ అంటే - 
మీకన్నా గొప్ప స్నేహం పరిచయమై, ఆ స్నేహం వల్ల మీ స్నేహం తాలూకు అనుభూతులు ఎక్కడ చెరిగిపోతాయేమో అనీ.. మీ స్నేహం తాలూకు పరిమళాల్ని అలాగే కలకాలం ఆఘ్రాణించాలని నా కోరిక. 
మీరిచ్చిన పరిమళాల డబ్బాలని అలాగే తెరవక దాచుకున్నా.. 
తెరిస్తే - అవి అయిపోతే - మళ్ళీ ఎవరు ఇవ్వగలరు..? 
నాకంటూ మరోలోకం సృష్టించుకున్నా.. దైనందిక కార్యకలాపాల్లో బిజీగా మారుతున్నా.. 

ఇంకా చాలానే చెప్పాలని ఉంది.. కానీ చెప్పలేకపోతున్నా. 

ఇదంతా ఎందుకోసం చేశానూ.. ఎందుకు దూరమయ్యారూ అంటే 
చెప్పేది ఒకే ఒక మాట. 

మీరు సంతోషముగా ఉంటే చాలు.. 
మేము మరింత సంతోషముగా ఉంటాం. 
మీరు ఆనందముగా ఉంటే మాకది అంతే చాలు. 
అంతకన్నా మాకేమీ అవసరం లేదు. 
దూరాన ఉన్నా ఎప్పుడూ మీ క్షేమమే మేము కోరుకుంటాం. 

తప్పని పరిస్థితుల్లో  మిమ్మల్ని దూరం చేసుకోవాల్సివచ్చింది. 
కారణం ఎన్ని ఉన్నా, అవేవీ బలమైన కారణాలు కావు. పాసింగ్ క్లౌడ్స్ లాంటివి. 
స్నేహంలో అవన్నీ తేలికగా తీసుకోవచ్చును. 
ఉన్నది ఒకేఒక కారణం - 
అదీ ప్యూర్ పర్సనల్ కాబట్టి మా ముగ్గురు మధ్యే దాచేశాం. 
దాన్ని ఎవరికీ చెప్పలేం.. చెప్పం కూడా.. 
అందుకే ( ఈ జన్మలోనైనా ) నన్ను క్షమించు మిత్రమా.. 
మీరు ఇది ఎప్పటికైనా చూస్తారన్న చిన్న ఆశతో ఇక్కడ చెబుతున్నా.. 
ఒకవేళ చూడకుంటే - వచ్చే సంవత్సరాన ఇదేరోజున ఇక్కడే మళ్ళీ కలుస్తాను. 

Re-edited on 18-February-2014 10:45a.m

1 comment:

Anonymous said...

Really nice....
mee baadha padaallo vyakthamainadi.

Related Posts with Thumbnails