Tuesday, July 23, 2013

పనీపాట లేదా?

సోషల్ సైట్లలలో ఒక్కోసారి మనం పెట్టే స్టేటస్ మెస్సేజెస్ కి మనమే అన్నీ అయి చూసుకోవాల్సి ఉంటుంది. ఉన్న కొద్దిపాటి నిముషాలలోనే బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలా అయితేనే కొన్ని విలువైన స్నేహాలు కాపాడుకున్న వారిమి అవుతాము. అలాగే భవిష్యత్తులో - ఒక మంచి నిర్ణయం వేగముగా తీసుకున్నాం అనుకొనేలా ఉండాలి.

ఇలాంటిదే నాకు జరిగిన ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఎవరు? ఏమిటీ? వారి పేర్లేమిటీ అనేది అప్రస్తుతాలు.

ఒకసారి నేను నా ప్రోఫైల్ లో ఒక స్టేటస్ మెస్సేజ్ పెట్టాను. నిజానికి స్టేటస్ మెస్సేజెస్ పెట్టడం నాకు ఇష్టముండదు. కారణం - అలా పోస్ట్ చేశాక వచ్చే కామెంట్స్ కి రిప్లై తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చుకుంటూ పోతుంటే - నాకున్న అమూల్య సమయం దెబ్బతింటుంది.. తిన్నది కూడా. ఇక నా కాన్సెంట్రేషన్ అంతా ఈ పోస్ట్ మీదే కేటాయించాల్సి వస్తుంది. ఫలితముగా నేను పొందేదానికన్నా, కోల్పోయేదే ఎక్కువ. ఇది మొదట్లోనే అనుభవం లోకి వచ్చేశాక - ఇక స్టేటస్ మెస్సేజెస్ పెట్టడం మానుకున్నాను. అందుకే ఎప్పుడో అరుదుగా పెట్టేస్తుంటాను.

ఒకసారి సరదా స్టేటస్ మెస్సేజ్ పెట్టాను.. అది పోస్ట్ చేశాక నేను వేరే పని చూసుకున్నా. అరగంట తరవాత చూస్తే ముగ్గరు కామెంట్స్ పెట్టారు. లైక్ చేసి, సైనౌట్ అయ్యాను. సాయంత్రం వచ్చి చూశా.. నాలుగో కామెంట్ గా ఇంకో ఫ్రెండ్ కామెంట్ పెట్టాడు - " పైన వ్రాసిన వారికి పనీ పాట లేదు.. " ఇంకా ఏదో అంటూ ఆ కామెంట్ పెట్టాడు. నిజానికి కామెంట్ వ్రాయాల్సి వస్తే - ఆ పోస్ట్ పెట్టిన వారిని ఉద్దేశ్యించి వ్రాయాలి కానీ, వారినీ వేరేవాళ్ళనీ గెలుక్కుంటూ వ్రాస్తే ఇలాగే ఉంటుంది. అసెంబ్లీ లో అధ్యక్షుడిని ఉద్దేశ్యించి, అధ్యక్షా.. అని అన్నింటినీ చెప్పటం లాగా ఉండాలి. ఆ మిత్రులు కూడా తనకి మిత్రులు కూడా కారు. అంత చనువూ లేదు వారి మధ్య.

నేను లాగిన్ కాగానే - నా రాక కోసం ఎదురుచూస్తున్న ఆ పెట్టిన మొదటి మూడు కామెంట్స్ లో ఒకతను ( మిగతా రెండూ స్నేహితురాళ్ళు పెట్టినవి ) చాట్ లోకి వచ్చేశాడు. " అన్నా..! ఆ కామెంట్స్ చూశావా? మీ రెస్పాన్స్ ఏమిటీ? మీ స్పందన కోసం ఆగాను. మీతో ఒకమాట చెప్పి, నేనే వాడికి సమాధానం చెప్పాలని అనుకుంటున్నా.. మీతో కాకుంటే నేనే వాడి కామెంట్స్ నా సమాధానాలతో ఎదురుక్కుంటాను.. " అన్నాడు.

నేను ఆలస్యం చేస్తే ఇది ముదిరి పెద్ద గొడవ అయ్యేలా ఉంది అనుకున్నాను.. ఆ స్టేటస్ మెస్సేజ్ పెట్టింది నేనే కాబట్టి ఏదో సర్దుబాటు చెయ్యాలి అనుకున్నా. " నేనే ప్రయత్నిస్తాను.. స్టేటస్ పెట్టింది నేను కదా.. నేనే ఆ సంగతి చూసుకుంటా. మధ్యలో మీరు కల్పించుకోకండి.." అతనితో అన్నాను. అతడు ఆవేశములో ఎలా మాట్లాడుతాడో తెలీదు. ఏదైనా తప్పుగా మాట్లాడితే - ఇద్దరికీ సర్దిచెప్పే ( తలనొప్పి ) బాధ్యత మళ్ళీ నాదే. అందుకని అలా చెప్పా.

ఐదో కామెంట్ గా నా సమాధానం పెడుతూ " # ( అతడి పేరు) : మీరు అలా పనీ పాట అనడం ఏమీ భావ్యముగా లేదు. వారు మీకేమీ స్నేహితులూ కారు. అంతగా అనే చనువూ మీ మధ్య లేదు. మీకు ఏదైనా అనాల్సి వస్తే నన్ను ఉద్దేశ్యిస్తూ వ్రాయండి. లేదా ఊరుకోండి. మీ కామెంట్ ని మీరు వెనక్కి తీసుకోండి. లేకుంటే నేనే ఆ కామెంట్ రిమూవ్ చేసి, మిమ్మల్ని దూరం పెట్టేవరకూ చూడకండి.. " అని చెప్పా.

అప్పుడు ఆన్లైన్ లోనే ఉన్నట్లున్నాడు. వెంటనే సమాధానం ఇచ్చాడు. పెట్టిన కామెంట్ నీ తీసేశాడు. మన్నించమని కోరాడు. ఎప్పటిలా స్నేహం కొనసాగించాను.

నిజానికి అప్పటి స్థితిలో - ఇతని కామెంట్ అలాగే ఉంచేస్తే - ఆ ముగ్గురూ దూరమయ్యేవారే. ఇలాంటి గొడవలు ఎదురవుతుంటాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాల్సి ఉంటుంది. 

No comments:

Related Posts with Thumbnails