Saturday, June 15, 2013

తొలకరి వర్షం.

వారం క్రిందట నా స్నేహితుని ఇంటికి వెళ్లాను. అక్కడ తనతో కాస్త మాట్లాడి బయటకి వచ్చేశాను. అప్పటికే ఆకాశం మేఘావృతం అయ్యింది. అప్పటిదాకా ఎంతో భీకరమైన ఎండలతో ఉన్న వాతావరణం ఉక్కపోతగా ఉంది. వాతారణ కేంద్రం సూచన మేరకు వర్షాలు పడటానికి ఇంకో వారం రోజుల సమయం ఉంది.

నా స్నేహితుడు " గొడుగు తీస్కెళ్ళరా వర్షం వచ్చేలా ఉంది! లేదా కాసేపు ఉండు.." అన్నాడు.

" కానీ ఇంటికేగా వెళ్ళేది. తొందరగానే వెళ్ళిపోతాను.." అన్నాను.

" ఉండు.. ఎందుకైనా మంచిది గొడుగు తెస్తాను.. " అని లోపలి వెళ్లాడు. అలా వెళ్ళాడో లేదో, చిన్నగా వర్షం మొదలయ్యింది. ఆకాశం వంక చూశాను. నల్లగా ఉంది. ఒకవైపు అంతా నల్లని మసి పట్టినట్లుగా మబ్బులు. ఇప్పట్లో వర్షం తగ్గదు. అక్కడే కాసేపు ఉండిపోవాల్సి వస్తుంది.. అనుకున్నాను.

అప్పుడే చప్పున ఒక చిన్న ఆలోచన. అర్థం అయ్యేసరికి పెదాల మీద చిన్నగా చిరునవ్వు. వావ్! మంచి ఐడియా అనుకున్నాను. వెంటనే " ర్రేయ్!.. గొడుగేమీ వద్దురా! అంతలోగా వెళ్ళిపోతాను.." అన్నాను. అతడి సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటకి వచ్చేశాను.

అప్పటికే వర్షం పెద్ద పెద్ద వర్షం చుక్కలుగా మొదలయ్యింది. నా బైక్ తీశాను. బలంగా కిక్ కొట్టేశా. ఒకే ఒక కిక్ కి స్టార్ట్ అయ్యింది. వర్షం పెద్ద చినుకుల నుండి సన్నని చినుకులుగా మారింది. అప్పటికన్నా ఇంకా బాగా కురవసాగింది. రోడ్డు మీదున్న జనం అంతా ప్రక్కనే ఉన్న షాపుల, ఇళ్ళ అరుగుల మీదకి చేరుకున్నారు. సో! రోడ్డు మీద నేనొక్కడినే. అందరూ నన్నే చూస్తున్నారు. వెనక నుండి స్నేహితుని కేక - కాసేపు ఆగరా ! అనీ.

ఒకమాదిరి వేగముతో, జాగ్రత్తగా నడుపుతూ, స్కిడ్ కాకుండా చూసుకుంటూ బండి నడిపాను. ( మాములుగా అయితే కొద్దిపాటి వర్షానికి నేల, బండి టైర్ సగం మాత్రమే తడిచి, రోడ్డు మీదున్న ఇసుక సరిగ్గా వెళ్ళిపోదు.. కాబట్టి స్కిడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ )

మామూలుగా ఎప్పటిదారిలో ఇంటికి వెళ్ళకుండా - చుట్టూరా వెళ్ళే దారిని ఎంచుకున్నాను. అలా రోడ్దేమ్మట హాయిగా ఆ వర్షం లో నానుతూ, మట్టి వాసన పీలుస్తూ వెళ్ళుతున్నాను. రోడ్డు మీద ఎవరూ లేరు. అందరూ ప్రక్కనున్న అరుగుల మీద నిలబడి నన్నే చూస్తున్నారు.

అలా వర్షాన్ని ఆస్వాదిస్తూ, అలా దూరపు రహదారి గుండా సాగిన నా ప్రయాణం - ఇంటికి చేరుకోనేసరికి నేను వర్షములో తడిసి ముద్దయ్యాను.

మా ప్రక్క పోర్షన్ పెద్దావిడ " ఏం! బాబూ.. తొలకరి వర్షములో నానావా? అదృష్టవంతునివి.." అన్నారు.

అవును! అదృష్టవంతుడినే !.. ఈ సంవత్సరంలో కురిసిన తొలి వర్షములో కావాలని, నానిన అదృష్టవంతుడినే. తొలకరి వర్షంలో నానాలని ఉండి కూడా, ఏదో తెలీని బిడియం వల్ల చిన్న చిన్న ఆనందాలకి దూరం అయ్యే అభాగ్యులు ఎందరో!..

No comments:

Related Posts with Thumbnails