Friday, January 25, 2013

స్కూటీ - లాంగ్ డ్రైవ్

జీవితం చాలా చిత్రమైనది. సాధారణ విషయాలతో బాటూ, కొన్ని హాస్చర్యపడే విషయాలూ జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాలని అందరితో పంచుకోవాలనిపిస్తుంది కూడా. ఈమధ్యనే జరిగిన అలాంటి విషయమే ఒకటి మీతో పంచుకుంటున్నాను.

మా అమ్మాయికి ఈ సంక్రాంతి సెలవుల్లో - హాస్టల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు, తనకోసం తీసుకున్న స్కూటీని ఎలా నడిపించడం నేర్పించాలని అనుకున్నాను. ఈ ప్రతిపాదన ఎన్నోసార్లు ముందు పెట్టినా, నిర్లక్ష్యం చేసింది. కాసింత జ్ఞానబోధ చేసిన తరవాత తను ఓకే అంది. నయాన్నో, భయాన్నో, నచ్చచెప్పి మన బలవంతం మీద నేర్పించవచ్చు, కానీ అది ఎన్నడూ మంచిది కాదు అని నా అభిప్రాయం. ఒక సామెత మీరు వినే ఉంటారు - గుర్రాన్ని నీటి వద్దకి లాక్కురాగలం. కానీ, దానితో నీరు త్రాగించలేము. అలాగే ఇక్కడా నేను - తనకి ఆసక్తి ఉన్నప్పుడే నేర్పించాలని నా ఆలోచన. అందుకే చాలా కాలం ఆగాను.

వాహానాన్ని నడపడం చాలా ఈజీనే అనుకుంటారు. మొదట్లో చాలా ఇబ్బందులే ఉంటాయి. అది అందరికీ అనుభవమే. ఆ ఇబ్బందులన్నీ తగ్గించాలి అనుకున్నాను. తేలికగా నేర్చుకోవాలని అనుకున్నాను.

ముందుగా స్కూటీ గురించి అవగాహన చేశాను - ఏది ఏమిటో. ఆ తరవాత చెప్పాను - సాధారణముగా ఒక పని చెయ్యాలంటే - మన చేతులు, కాళ్ళు, కన్నులు, చెవులు, మెదడు.. ఇలా అన్నీ చేసే పని మీదే దృష్టి పెడతాయి. అంటే అన్నీ కలసి ఒక పనిని సమిష్టిగా చేస్తాయి. ఇక్కడ అంటే - ఈ వాహనం నడపడం అనేది - దేనికది విడిగా పని చేస్తూ, అన్నీ కలసి సమిష్టిగా పనిచేస్తాయి.. ఇదే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ఏమిటో అర్థమై, నేర్చుకుంటే అంతా తేలికనే.. అని చెప్పాను. అంటే - చేతులలో ఎడమచేయి హాండిల్, బ్రేక్ ని నిర్వహిస్తుంటే, కుడిచేయి ఎక్సిలరేట్ చేస్తూ, బండిని బ్యాలన్స్ చెయ్యడం అన్నమాట. ఇలా మిగతా భాగాలు అన్నీ దేనికదే ప్రత్యేక పనిని నిర్వహిస్తాయి అని విడమరిచి చెప్పాను. అర్థం చేసుకుంది.

అలా స్కూటీ నడపడం మొదలెట్టింది. రోజూ ఉదయాన్న లేవడం, అలా గ్రౌండ్ కి వెళ్లి రోజూ ఒక గంట క్లాస్ తీసుకోవడం మొదలెట్టాను. రెండు రౌండ్స్ వెనకాల కూర్చొని, పరిశీలించి, ఒంటరిగా నడపించమనటం చేశాను. ఈ జనవరి 16 బుధవారంన మొదలెట్టాం. నేను చెప్పిన సూత్రం వల్లనేమో గానీ త్వరగా బండి నేర్చేసుకుంది. మూడో రోజుకే ఉదయాన రోడ్డు మీద నడపడం మొదలెట్టింది. అలా రోజూ ఉదయాన ప్రాక్టీస్ కార్యక్రమం జరిగింది. బుధ, గురు, శుక్ర, శని వారాలు అలా గడిచాయి. ఆదివారాన దగ్గరలోని ఒక గుడి వద్దకి ప్రోగ్రాం వేశాను.

అలా గుడికి వెళ్లడం ప్రోగ్రాం చెయ్యటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. తను ఒక కోరిక అడిగింది. ఆ స్కూటీ మీద అలా అలా లాంగ్ డ్రైవ్ వెళ్లాలన్నది. నేను నమ్మలేక పోయాను. మొదట్లో వద్దన్నాను. తనూ ఊరుకుంది. నేను మళ్ళీ ఏమనుకుంటానో అనుకొని, ఆ కోరిక అణిచేసుకుంది. కానీ నాకు - తన కోరిక తీర్చడమే సబబు అని అనిపించింది. తాను అలా వెళ్ళటానికి సిద్ధముగా ఉందొ లేదో చూడటానికి దగ్గరలోని (20 kms.) లోని ఒక లక్ష్మీనరసింహ స్వామి గుడికి వెళ్ళాం. మొదటి ప్రయాణం ఏదైనా దేవుని సన్నిధికి వెళ్లటం నా ఆచారముగా మారింది. అలాగే తన విషయములో అలాగే చేశాను.

మరో కారణం ఏమిటంటే - తను ఎలా బండి నడిపిస్తుంది.? శారీరకముగా లాంగ్ డ్రైవ్ కి తగినట్లుగా ఉందా?? అంత ఓపిక తనలో ఉందా???.. రోడ్డు మీద తన డ్రైవింగ్ ఎలా చెయ్యగలుతుంది? అలాగే ఇంకా ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దాలన్నది నా ఆలోచన. ఇలాంటి విషయాలు తేల్చేసుకోవడానికే ఈ పర్యటన. ఇవన్నీ ఆ ఆదివారాన్నే తేల్చేయ్యాల్సిందే. ఎందుకూ అంటే మరునాడు - సోమవారాన్నే (21 జనవరి) హాస్టల్ కి వెళ్ళాల్సింది ఉంది కాబట్టి.

గుడికి వెళ్లి వచ్చాం. దారిలో తనని గమనించాను. అంత సంతృప్తికరముగా డ్రైవింగ్ రాకున్నా ఓకే అనిపించింది.

మరునాడు తను హాస్టల్ కి వెళ్ళాల్సిన పరిస్థితి. తనని స్కూల్ / హాస్టల్ వద్ద వదలేసి వస్తాను అని చెప్పి స్కూటీ తీశాను. మా ఆవిడకి ఈ విషయం పసిగట్టి "స్కూటీ మీద వద్దు.." అని అభ్యంతరం. బస్టాండ్ వద్ద పెట్టేసి, అక్కడనుండి బస్ లో వెళతాం లే.. అని నచ్చచెప్పి, బయలుదేరాం.

దారిలో - డాడీ! ఇలాగే వెళ్ళిపోదాం.. అని బ్రతిమాలింది. ఎందుకో ఆ క్షణాన తన కోరిక తీర్చాలనిపించింది. "నాకు నడపాలని లేదు. నీవు నడిపిస్తావా? అంత దూరం.." అడిగాను. నడిపిస్తాను అంది. నేను వెనకాల కూర్చున్నాను. మా అమ్మాయి ముందుకి వచ్చి బండి నడపడం మొదలెట్టింది. కేవలం ఐదురోజుల అనుభవముతో - నాలుగులైన్ల రహదారి మీద - కొంతదూరం సింగిల్ రహదారి మీద తానే డ్రైవ్ చేసింది. అది ఎంత దూరమో సరిగ్గా గుర్తులేదు. రెండు గంటల్లో హాస్టల్ కి చేరుకున్నాం.

ఆ తరవాత నేను ఒక్కడినే తిరిగి వచ్చేశాను. అప్పుడు దూరం లెక్కించాను. ఒకవైపు దూరం - సరిగ్గా ఎనభై (80) కిలోమీటర్లు. (మొత్తం 160 kms.) అక్కడక్కడా కొన్ని పొరబాట్లు ఉన్నా చాలా బాగానే నడిపింది. తనలో - నేనూ సాధించగలను అన్న ఆత్మవిశ్వాసం ఏర్పడటానికి ఈ సాహాస కార్యక్రమాన్ని ఎంచుకున్నాను. తనకో ఒక మరుపురాని అనుభూతిని, జ్ఞాపకాన్ని ఇచ్చాను.

No comments:

Related Posts with Thumbnails