Saturday, December 15, 2012

Good Morning - 207

 
ప్రతి ఒక్కరూ ఎదుటివారిని తప్పు పడుతూ ఉంటారు. ఓ పెద్ద.! వారేమీ తప్పులు చేయనట్లు. తప్పుని తప్పు చేశావు అన్నట్లు చెప్పాలి గానీ, అలా చెప్పి వారే తప్పు చేసేలా ఉండకూడదు. అవతలి వారిలో తప్పు ఎంచటం చాలా తేలిక. వారి చర్యలని వ్రేలేత్తి చూపటం చాలా సులభం. కానీ అలా తప్పుని ఎంచే ముందు - మనం అలాంటి తప్పులు చేశామా? లేమా? అని ఒకసారి ఆలోచించుకోవాలి. అలాంటి తప్పులు మనం చేయనప్పుడే - అవతలివారికి ఇది తప్పు అని చెప్పే హక్కు ఉంటుందని నేను నమ్ముతాను. "నేరం నాది కాదు ఆకలిది" ఎన్టీ రామారావు గారి సినిమాలో ఒక పాటలో - " ..మనలో పాపం చెయ్యనివాడు ఎవడో చెప్పండి. యే దోషం లేనివారు ఆ శిక్షని విధించాలి.." అని అంటారు. 

ఒకరిని వ్రేలేత్తి దోషిగా చూపెట్టినప్పుడు - మిగతా మూడు వ్రేళ్ళు మనకేసి చూపిస్తాయి. వాటిని చూశాక ఎవరైనా తగ్గాల్సిందే. అయినా కొందరు మూర్ఖులు మాత్రం మారరు. వారెప్పుడూ ఇతరులలో తప్పులని ఎంచుతూ ఉంటారు. అలాంటి వారికి దూరముగా ఉండండి. లేదా వారి మాటలని వారికే అప్పజేప్పండి. అప్పుడు వారికి ఎదుటివారి బాధ ఏమిటో తెలుస్తుంది. 

ఇలాంటి సంఘటనల్లో నా జీవితములో జరిగిన ఒక సంఘటన చెబుతాను. 

నా బండి పాడయితే - తాత్కాలికముగా అన్నట్లు సెకండ్ హ్యాండ్ లో ఇంకో బండి తెచ్చుకున్నాను. ఆ బండి చూసి, ఒకరు " ఏమన్నా.. సెకండ్ హ్యాండ్ తెచ్చేశావు.. ఫస్ట్ హ్యాండ్ బండి కొనద్దా.? డబ్బులు లేవా?" అన్నాడు. నాకు చిరాకు వేసింది. అతనెప్పుడూ నాకు అడ్డు వస్తుంటాడు. ఇలా కాదు అనుకుంటూనే గట్టిగా షాక్ ఇచ్చేద్దామని నిర్ణయం తీసేసుకున్నా.. నవ్వుతూనే " అది కాదు భయ్యా!.. మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళే - అన్నీ సెకండ్ హ్యాండ్ వి వాడుతున్నప్పుడు, మా బోటివాళ్ళు ఏదో అలా  సెకండ్ హ్యాండ్ వాడక తప్పుతుందా..? " అన్నాను. అంతే!. అలా అంటాను అని అతను ఊహించలేదు.. అప్పుడు నోరు మూత పడిందీ అంటే - ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది.. నాతో మాటలు లేవు. నా వైపు చూడటానికి తల త్రిప్పటం లేదు. అంటేనే ఎంత లోతుగా నా మాటలు తగిలాయో చూడండి. అంత లోతుగా తగలటానికి కారణం - అతను వాడుతున్న బండి, కారు, ఇల్లూ, షాపు, ఫర్నీచర్.. ఇలా చాలావరకు సెకండ్ హ్యాండ్ వే. మాటకి మాట అన్న నేను అయితే మామూలుగానే ఉన్నాను. 

అందుకే ఎవరినీ గెలక్కండి.. గెలికి, వారితో తిరుగుమాట అనిపించుకొని, బంధాలు, స్నేహాలు, మనసులు పాడుచేసుకోకండి. ఒకసారి మనకి ఆపోజిట్ వాళ్ళు ఏదైనా అంటే భరించలేం అని మన గురించి మనకి తెలిసినప్పుడు, అవతలి పక్షం వారితో ఏ మాటా రాకుండా చూసుకోండి. మీరు బాగుంటారు. మనసులో ఆ మాట పదే పదే వెంటాడకుండా ఉంటుంది. 

No comments:

Related Posts with Thumbnails