Tuesday, December 11, 2012

Bloggers meeting - 2012

తెలుగు బ్లాగర్స్ గ్రూప్  వారు ఈ డిసెంబర్ రెండవ ఆదివారం న ఉదయం 10 గంటలకు బ్లాగర్స్ మీటింగ్ ఉంది అని గ్రూప్ మెయిల్లో చెప్పారు. ( లింక్ : గ్రూప్ మెయిల్ ) చాలాకాలముగా ఆ గుంపులో కొనసాగుతున్నానే కానీ, ఎప్పుడు కూడా ఆ మీటింగ్స్ కి వెళ్ళలేదు నేను. కారణాలు మామూలువే. బీజీ జీవితం, సమయాభావం, దూరాభారం.. వల్ల ఒక్కసారి కూడా ఆ సమావేశాలకి వెళ్ళలేదు. ఈసారి సమావేశం ఉంది అని నాకు గ్రూప్ మెయిల్ రాగానే, అనుకున్నాను - ఈసారి ఎలాగైనా ఆ సమావేశానికి వెళ్లాలని. జీవితములో ఏదీ మిస్ అవద్దని నా భావన. ఒకసారి వెళ్ళి చూద్దాం. క్రొత్తగా బ్లాగుల గురించి ఏమైనా నేర్చుకోవచ్చును. లేదా అక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరికైనా నా సలహా సహాయం అవసరం ఉండొచ్చు - అని వెళ్లాను.

కానీ, ఆరోజు ఎన్నెన్నో పనులు.. ఆరోజు వీలు కానంత బీజీ షెడ్యూల్. ఇంకా ఆరోజే బాగుందని క్రొత్త తినడం కార్యక్రమం ఇంట్లో ఉంది. నేను ఇలా గ్రూప్ సమావేశం వెళుతున్నాను అని శ్రీమతి నాకోసమని ప్రొద్దునే అన్నీ చేసి పెట్టింది. ఆ కార్యక్రమం కానిచ్చేసి, నా పనులూ + ఈ-బ్లాగర్స్ మీటింగ్ కి బయలుదేరాను. 

దూరాభారం మూలాన కాసింత ఆలస్యం అయినా, ఒక్కొక్కరినీ దారి అడుగుతూ ఆ సమావేశ స్థలానికి బయలుదేరాను. ఆ ఏరియా నాకు అంతగా తెలీదు. ఆవైపుకి వెళ్ళనే లేదు నేను. అంతా క్రొత్త. అయినాసరే సమావేశానికి ఈసారి తప్పక వెళ్ళాలి అని నా నిర్ణయం. అడ్రస్సు కూడా చాలా ఈజీగా ఉంది. తేలికగా వెళ్ళొచ్చు. (ఒకసారి వెళ్ళొచ్చాక అంతా ఈజీగానే ఉంటుంది. ఎవరికైనా మొదటి అడుగు ఎప్పుడూ కాసింత భయం, బెరుకుగానే ఉంటుంది )


అప్పుడే గుర్తుకు వచ్చింది. GPRS ని వాడుకుంటే? అని. వెంటనే స్మార్ట్ ఫోన్ లో నావిగేషన్ ని ఓపెన్ చేసి చూశాను. వెళ్ళాల్సిన ప్రదేశాన్ని టైపు చేశా. కొద్ది సెకన్ల తరవాత నేనున్న చోటు నుండి, నేను వెళ్ళాలనుకున్న చోటుకి దారి చూపింది. దాన్ని చూసుకుంటూ వెళ్లాను. అలా చాలా ఈజీగా ఆ అడ్రస్ కి చేరుకున్నాను. అప్పుడు సమయం ఉదయం పదకొండున్నర అయ్యింది. లేటుగా వెళ్ళినా, క్రొత్త అనుభవాన్ని చవి చూడోచ్చును అలాగే క్రొత్త పరిచయాలు పెరుగుతాయని - ఆలస్యం అయినా కూడా వెళ్లాను.  ... ... ...

సమావేశం జరిగే గది వద్దకి వెళ్ళగానే, ప్రముఖ బ్లాగర్స్ వీవెన్ గారూ, C. B. రావ్ గారూ ఎదురయ్యారు. వారికి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. వారి పరిచయాలు అయ్యాయి. ఆ ఆఫీస్ లో మరికోద్దిమంది బ్లాగర్స్ కూడా ఉన్నారు. అప్పటికి ఇంకా సమావేశం మొదలుకాలేదు. లక్కీ గా ఫీలయ్యాను. అప్పుడే కశ్యప్ గారు సమావేశం కోసం ఒక కేకు, కూల్ డ్రింక్స్, తిను భండారాలు తీసుకవచ్చారు. 

ఇంకా వచ్చేవారికోసం మరో ఐదు నిమిషాలు ఎదురుచూసి, సమావేశం మొదలు పెట్టాం.


సమావేశం గదిలో - అందరం సమావేశం అయ్యాం. మొదటగా వీవెన్ గారు సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశం ఎందుకు జరుపుకుంటున్నామో క్లుప్తముగా చెప్పారు. ఆ తరవాత ఒక్కో బ్లాగర్ ముందుకు వచ్చి, తమ గురించీ, తమ బ్లాగ్ గురించీ వివరించారు. అలాగే సభ్యుల సందేహాలకు కూడా సమాధానాలు ఇచ్చారు. చివరిగా నా వంతు వచ్చింది. నేను లేచి - నా పేరూ, నా బ్లాగ్, పరిచయ వివరాలు చెప్పాను. అలాగే సభ్యులు అడిగిన వివరాలకి చక్కగా సమాధానం ఇచ్చాను.

నిజానికి ఇలా అందరి ముందూ నిలబడి మాట్లాడటం నిజముగా నాకు క్రొత్త. నాలో స్టేజి ఫియర్ చాలా ఎక్కువ. అలా ఉండటం మూలాన నా చుట్టుప్రక్కల వారికి ఎవరికీ తెలీకుండా ఇన్నాళ్ళూ చీకటిలోనే ఉండిపోయాను. లేచి నిలబడి మాట్లాడమంటే - కాళ్ళు వణికేవి. ఇంకా ఇలాగే భయపడుతూ ఉంటే అలాగే చీకట్లోనే కలిసిపోతాను అని భయమేసింది. సోషల్ సైట్ల పరిచయాల... ... వల్ల నాలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. కాసింత అజ్ఞాతం వీడాలనుకున్నాను. అలా ఆ సమావేశములో నా పరిచయ కార్యక్రమం జరిగింది. అలా మాట్లాడాక నన్ను నేనే నమ్మలేకపోయా. ఇంతగా ఏమాత్రం బెరకు లేకుండా మాట్లాడాను అంటే - సోషల్ సైట్స్ మిత్రుల సహకారమే. వారందరికీ కృతజ్ఞతలు.

తోటి సభ్యుల ప్రశ్నలూ, మాట విరుపుల వల్ల సమావేశం చక్కని ఆహ్లాద వాతావరణం ఏర్పడింది. ఆ తరవాత బ్లాగర్స్ సందేహాలకి సమాధానాల కార్యక్రమం జరిగింది. తెలుగుభాషని ఎలా ఇంకా వ్యాప్తిలోకి తీసుకరావాలి, తెలుగు బ్లాగులు ఇంకా అభివృద్ధిలోకి రావాలి, వీకీపీడియాలో తెలుగు భాష సమాచారం, వ్యాసాలు, అంతర్జాలములో తెలుగు భాషని ఎలా అభివృద్ధి చెయ్యాలి, క్రొత్త బ్లాగర్స్ కి తెలుగు భాష టైపింగ్ ని ఎలా అందుబాటులోకి తీసుకరావాలీ, వారికి వర్క్ షాప్ ఎలా నిర్వహించాలి... అనే ఇత్యాది విషయాల మీద చర్చ జరిగింది. నాకు తోచిన సలహాలు ఇచ్చాను. సమావేశంవి కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. వాటిని జ్ఞాపకాలుగా భద్రపరుచుకుంటాను. వాటిని ఇక్కడ షేర్ చేయ్యోచ్చును.. కానీ వారి వారి అనుమతి తీసుకోవటం మరిచాను.


ఆ తరవాత, కేకు కటింగ్ జరిగింది. సమోసాలు, కూల్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ అయ్యాయి.. ఆ తరవాత కొందరు నాతో మాట్లాడారు. ఆ తరవాత వారి నుండి సెలవు తీసుకొని, బయటకి వచ్చేశాను. అలా తొలిసారిగా బ్లాగర్స్ మీటింగ్ కి వెళ్ళివచ్చాను.

నిజానికి ఇలాంటి సమావేశాలు ప్రతి రంగములో, నెలకొకసారి మీటింగ్స్ జరగాలి. ఇక్కడ - నూతనముగా బ్లాగ్ రంగములోకి అడుగిడుతున్న వారికి ఇలాంటి సమావేశాలు చాలా మేలుని కలుగచేస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వారిచ్చే సలహాల వల్ల బ్లాగ్ ని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చును. వచ్చే సమావేశాలకి దగ్గరలో ఉన్నవారు తప్పక హాజరు అయ్యేలా ప్రయత్నించండి.


2 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

బ్లాగర్ల సమావేశంకి వెళ్ళడం,మీ అనుభవాలు పంచు కోవడం చాలా బాగుంది.

Raj said...

సమావేశ వివరాలు తెలియచేస్తే - నూతన బ్లాగర్స్ గానీ,ఎవరికైనా ఏదైనా సందేహం ఉన్నవారూ సమావేశములో పాల్గొని తమ సందేహాలు తీర్చుకొని, తమ తమ బ్లాగులని అభివృద్ధి చేసుకుంటారు అని చెప్పటానికి - ఇదొక చిన్న ప్రయత్నం.

Related Posts with Thumbnails