Tuesday, March 27, 2012

టెంపరరీ కనెక్షన్ వైర్

మామిడి తోరణాలు  అనే పోస్ట్ లో ఒక తీగ వాడాను అని చెప్పాగా.. అది నిజానికి ఒక సన్నని ఇనుప తీగ. దాని మీద తెల్లని PVC / ప్లాస్టిక్ తొడుగు ఉంటుంది. ఈ ప్లాస్టిక్ తొడుగు కాసింత గట్టిగానే ఉంటుంది. ఈ తీగ ఎటువైపు అంటే అటు వంగుతుంది.


ఈ వైర్ ని ఎలెక్ట్రికల్ సామానులు అమ్మే దుకాణాలల్లో అమ్ముతుంటారు. నిజానికి ఈ వైర్ ని ఏమని అంటారో నాకూ తెలీదు. నేను మాత్రం టెంపరరీ కనెక్షన్ వైర్ అనే పిలుస్తాను. అప్పటికీ అర్థం కాకుంటే ట్యూబ్ లైట్ లోన కనెక్షన్ కి వాడే వైర్ అని చెబుతుంటాను. అలాని ఎందుకూ అంటే - ఈ వైర్ ని ట్యూబ్ లైట్ లలో కనెక్షన్స్ కోసం ఈ వైర్ నే వాడుతుంటారు. ఇది చుట్టలు చుట్టలుగా దొరుకుతుంది. ఒక చుట్టలో వంద మీటర్లకి పైగా ఉండొచ్చు. ఈ మొత్తం వైర్ చుట్టని మీకు తెలిసిన షాప్ వాడు అయితే ముప్పై రూపాయలకి ఇస్తాడు. ఏమీ తెలీనివాడిలా వెళ్ళి అడిగితే మాత్రం యాభై రూపాయల మీదనే చెబుతాడు.

ఇలాంటి వైర్ మీకూ పరిచయం అయ్యే ఉంటుంది. క్రొత్తగా ఎలెక్ట్రికల్ సంబంధమైన వస్తువు కొంటే, ఆ పరికరానికి వచ్చిన వైర్ ని ఒకదగ్గరగా ముడి వెయ్యటానికి చిన్నని, నల్లని వైర్ ముక్క మీకు కనిపిస్తుంది. నల్లని ప్లాస్టిక్ తొడుగు ఉన్న సన్నని తీగ అది. అది విప్పితేనే - వైర్ కార్డ్ ని పెద్దగా విప్పటానికి వీలవుతుంది.  ఇదీ అలాంటిదే. కానీ పైన ఉన్న ప్లాస్టిక్ రంగు మాత్రం వేరు. ఇది తెలుపు, అవి నలుపు. అంతే తేడా..

నేను మొదట్లో ట్యూబ్ లైట్స్ రిపేరింగ్ కోసమని తెచ్చుకోనేవాడిని. ఆ తరవాత తరవాత మిగతా పనులకీ వాడటం మొదలెట్టాను. చాలా తక్కువ ధరకి వస్తుంది కదా అనీ, బోలెడంత ఉంది కదా అనీ కావచ్చును చాలాపనులకి వాడుతుంటాను. అబ్బో! ఆ లిస్టు చెబుతుంటే చాలానే ఉంది. ఆ వైర్ తో చేసే కొన్ని పనులు :

* క్రొత్త వైర్ కనెక్షన్స్ కోసం, 
* తాత్కాలిక (తక్కువ వాటేజీ) ఎలెక్ట్రికల్ కనెక్షన్స్ కోసం, 
* కనెక్షన్స్ సాకేట్స్ నుండి పరికరాల వరకూ వ్రేలాడుతున్న వైర్స్ ని చిన్నగా, దగ్గరగా ముడి వెయ్యటానికి, 
* మొక్కల కొమ్మలు అటూ ఇటూ పోకుండా ఉండటానికి, 
* ఇళ్ళల్లో వాడే చీపురు పుల్లలు విడిపోకుండా గట్టిగా కలిపి ఉంచటానికీ, 
* ప్లాస్టిక్ కవర్స్ లలో వస్తువులు వేశాక, మడిచి ముడి వెయ్యటానికి, 
* పండుగల రోజున పూలదండలు గ్రుచ్చటానికి, 
* టెంపరరీగా కర్టెన్స్ ని కట్టుకోవటానికి, 
* పార్టీ సమయాల్లో అలంకరణ కోసం, 
* చిన్న చిన్న బల్బుల శ్రేణులని కలపటానికి, 
* ఏవైనా చిన్న చిన్న వస్తువులకి కట్టి, వాటిని మేకులకి తగిలించటానికి, 
* ఎక్కడ జనపనార త్రాడు, ప్లాస్టిక్ త్రాడు వాడటానికి ఫ్యాషన్ లుక్ గా అనిపించదో అక్కడ, 
* బెలూన్స్ లలో గాలి ఊదాక ముడివేయ్యటానికీ, 
* వ్రేలాడే ప్లాస్టిక్ కుండీలని కట్టుకోవటానికీ, 
* తాత్కాలికముగా ప్లాస్టిక్ సంచుల మూటలు కట్టుకోవటానికీ, 


... ... ఇలా చాలానే ఉన్నాయి. మీ ఓపిక. మీ ఆలోచన.

ఇవన్నీ వింటుంటే సిల్లీగా ఉంటుంది. కానీ ఒకదానికి కోసం తయారు కాబడిన వస్తువు మరోపనికి చాలా బాగా పనికి వస్తుంది అన్నదానికి ఇది చక్కని ఉదాహరణ.  

No comments:

Related Posts with Thumbnails