Tuesday, February 28, 2012

మిరపకాయల కొనుగోలు

త్వరలో రాబోతున్న ఆవకాయ పచ్చళ్ళ సీజన్ కి కావలసిన మిరపపొడి చేసుకోవటానికి ఎండు మిరపకాయలు తీసుకోవటానికి తోడుగా వెళ్లాను నేను. (వార్నీ!.. ఇది కూడా పోస్ట్ వ్రాయాలా? అనుకోకండి..) మార్కెట్లో అప్పుడప్పుడే దుకాణాలు తెరుస్తున్నారు. ఎప్పుడూ వెళ్ళే దుకాణం ఇంకా తీయలేదు. ఆ ప్రక్కనే ఉన్న దుకాణంకి వెళ్ళాం.

అక్కడ క్రింద కుప్పగా పోసిన మిరప కాయలని చూశాం.. ఆశ్చర్యం.!! ఆ ఎండిన కాయల మీద వర్షం కురిసిందా అన్నట్లుగా నీళ్ళు. అర్థం అయ్యింది. ఆ కొట్టువాడే అలా నీరు పోసి, తూకం ఎక్కువ రావాలని చూస్తున్నాడు అనీ. కొద్ది దూరం వెళ్ళి, మేము రెగ్యులర్గా వెళ్ళే షాప్ వాడు ఓపెన్ చేసేదాకా ఆగాం. 

ఆ నీళ్ళు చల్లిన షాప్ అతను, వాటి పైన మరిన్ని ఎండిన కాయలని గుట్టగా పోసి, వాటినన్నింటినీ బాగా కలపసాగాడు. అంటే - ఆ చల్లిన నీరు అన్ని కాయలకీ పట్టేలా అన్నమాట. ఒకరకముగా చెప్పాలంటే - అతనిదీ తప్పు కాదు. బేరాలు బాగా చేసి, బాగా తక్కువకి అడిగే కొనుగోలుదారుల కోసం అలా చేస్తుంటారు. వారికోసం చేస్తుంటే - నిజాయితీగా కోనేవారూ బలవుతూ ఉంటారు.

కాసేపట్లో మేము ఎదురుచూస్తున్న షాప్ వాడు కొట్టు తెరిచాడు. అక్కడే కొనుగోలు చెయ్యటానికి వెళ్ళాం. మమ్మల్ని గుర్తుపట్టి, మాకోసం అనీ చాలా బాగున్న కాయల సంచీ విప్పాడు.

కారప్పొడి కాసింత ఘాటుగా ఉండాలని, ఎక్కువరోజులు రావాలని అనుకొని, సన్నని, ఎర్రని ఎండు మిరపకాయలని ఎన్నుకున్నాము. 


ఇలా అయితే, మరింత ఘాటుగా, ఎక్కువరోజులుగా, కూరల్లో తక్కువ వేసినా సరిపోయేలా ఉంటుంది. 


సన్నగా ఉండి, ఆ కాయలని చెవిదగ్గర పెట్టుకొని ఊపితే, ఆ కాయ లోపల ఉన్న గింజల చప్పుడు వినిపించితే, అవి బాగా ఎండిన కాయలు. అలా వినిపించలేదు అంటే - ఇంకా పచ్చిగా ఉన్నవే (లేదా వాటిపై నీళ్ళు చల్లిన కాయలు) అని అర్థం. 


ఇలాంటి కాయలని కొని, వెంటనే గిర్నీలో పొడి చేయించినా, అందులోని తేమవల్ల ఆ కారంపొడి ఎక్కువ రోజులు రాదు. 


కొద్దిరోజులలో ఘాటు దిగిపోయి, చప్పగా కారం ఘాటు లేకుండా, కూరల్లో వేసినా ఎరుపురంగులో కర్రీలు ఉండవు. 


ముఖ్యముగా మాంసాహారం అయితే - రుచి లేకుండా ఉంటుంది. 


బాగా ఎండిన కాయలని మధ్యగా వ్రేళ్ళతో తుంచితే, రెండు ముక్కలుగా విరిగిపోతుంది. పచ్చివి అయితే వంగి, విరిగిపోతుంది. 


అలాగే వీటిల్లో పసుపు, ఎరుపు రంగులో మచ్చలుగా ఉన్న కాయలని తీసేయ్యాలి. అవి తెగులు సోకినవి. ఆ కాయలని వీటిల్లో వేసి, కారం పొడి పట్టిస్తే , ఈ మచ్చల కాయల లోని తెగులు వల్ల మిగతా కారం పొడి పాడయ్యే ప్రమాదం ఉంది. 

డెబ్బై రూపాయలకి కిలో ఎండు మిరపకాయలు చెప్పిన అతను, నేనేమీ మాట్లాడకపోయేసరికి తనంతట తానుగా కిలో యాభై ఐదుకి చొప్పున అమ్మాడు. ఆ రేటుకి ఆరు కిలోలు తీసుకున్నాం. వాటిని ఎండలో ఆరబెట్టేసి, పొడి చేయించాలి. ఇక పచ్చళ్ళ మామిడికాయల కోసం ఎదురుచూడాలి.

ఈ క్రిందున్న ఫోటోలోనివే - మేము ఈసారి తీసుకున్న ఎండు మిరపకాయలు. ముందుగా " దిష్టి " తగలకుండా - ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి.. అన్నీ.. పోవాలి.. (అతిగా ఉన్నా, తప్పదు కదా.. )


No comments:

Related Posts with Thumbnails