Sunday, September 4, 2011

Social NW Sites - 40 - కృతజ్ఞతలు..

ఇన్నిరోజులుగా మీకు, ఇన్ని టపాలు అందించాను. మీరు ఆదరించినందులకు మీకు ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు. మామూలుగా పదో, పన్నెండు యో పోస్ట్స్ అవుతాయని అనుకున్నాను. కాని ఇంత పెద్దగా అవుతాయని అనుకోలేదు.

నేను నిజానికి ఈ సైట్లలోకి రెండు సంవత్సరాలు మాత్రమే ఉండాలని వచ్చాను. కాని కొన్ని కారణాల వలన ఇంకో సంవత్సరం పెరిగింది. మొదటి సంవత్సరం బాగా అల్లరిగా ఉన్నాను. (అప్పుడు ఇలా ఆడ్ అయ్యి, అలా వెళ్ళిపోయేవారే ఎక్కువ) రెండో సంవత్సరం నిజమైన స్నేహం కోసం ప్రయత్నించాను అని ఒకసారి చెప్పానుగా. ఇక అకౌంట్ వదిలేసే ముందు ఒకరు అడిగిన - ఇందులో ఎలా ఉండాలి? మీ అనుభవం చెబితే బాగుంటుంది కదా - అనే కోరిక వల్ల - ఎక్కడ చెప్పాలో తెలీక, ఇక్కడ అయితే బాగుంటుందని అనుకున్నాను. అలా ఇక్కడ వ్రాశాను. దాదాపుగా అన్నీ కవర్ చేశాను అని అనుకుంటున్నాను. ఇక చాలు అని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ హెడ్ లైన్ లాగే - నాలోనే ఉంచుకొని వెళ్ళిపోతే ఎవరికీ ఉపయోగం ఉండదు అనుకొని.. నిర్ణయానికి వచ్చి, కష్టపడి ఈ పోస్టింగ్స్ చేశాను. చాలామంది లాభం పడ్డారు. వారినుండి వచ్చిన కామెంట్స్, మెయిల్స్, ఫోన్స్.. వల్ల నేను పడిన శ్రమ మరిచాను. అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు.  

అన్నింటికన్నా ఐరనీ ఏమిటంటే - ఇలా పోస్టింగ్స్ వ్రాయమని సలహా ఇచ్చిన నా స్నేహితురాలు.. ఈ పోస్టింగ్స్ మొదట్లోనే ఈ సోషల్ సైట్స్ లలో జరిగిన మోసాల వల్ల అందరికీ దూరం అయ్యారు. ఇటు ఆర్థికముగా, అటు అర్థం పర్థం లేని మాటల వల్ల బాగా దెబ్బ తిన్నారు. తనకోసం అన్నట్లుగా వ్రాసిన ఈ పోస్టింగ్స్ చూశారో లేదో కూడా తెలీదు.   మొత్తానికి తనకే ఉపయోగపడలేదు అని నేను అనుకుంటున్నాను. తనకి కాకున్నా వేరేవారికి కూడా ఉపయోగపడాలని అలా వ్రాస్తూ పోయాను. తద్వారా చాలామందికి ఉపయోగకరం అవుతాయని అనుకోలేదు.

నిజానికి ఈ స్నేహాల మంచివే, కాని కొందరి వల్ల మిగతావారు ఇబ్బందులకి గురి అవుతున్నారు. నా విషయానికి వస్తే - ఇందులోకి రావటం వల్ల నేను చాలా చలాకీగా, ఉత్సాహముగా, ఏదో తెలీని ఒక శక్తి నాలోకి ప్రవేశించినట్లుగా అనిపిస్తుంది. నా అదృష్టం కొద్దీ ఒక యాభై మంది స్నేహితులు.. సన్నిహితులుగా, శ్రేయోభిలాషులుగా మిగిలారు. అది చాలు. నేను ఎక్కడో చదివాను.. ఒక మంచి భావం కల కవిత అనుకుంటాను.. అది బాగా నచ్చింది. అది ఇక్కడ చెబుతాను. అది ఎవరు వ్రాశారో గానీ, కొద్దిగా మార్చి చెబుతున్నాను..

కురిసే ప్రతి వర్షపు బిందువు స్వాతిముత్యము కాలేదు !
విరిసే ప్రతి పువ్వు పరిమళాన్ని వెదజల్లలేదు !
ప్రవహించే ప్రతి వాగు సెలయేరు కాలేదు !
కనిపించే ప్రతి రాయీ విగ్రహం కాలేదు !
ఎదురయ్యే ప్రతి మనిషీ స్నేహితులు కాలేరు !!
అందుకే నా మనసు మధనపడుతోంది -
ఎవరితో చేయాలి స్నేహం అని ?..

వర్షం కోసం ఎదురుచూసే చకోరపక్షిలా ఉన్న నాకు
ఇంతలోనే మీరు ఎదురయ్యారు..
పరిచయమయ్యారు..
నా స్నేహితులయ్యారు -

కృతజ్ఞతలు. 

ఇది ఈ జన్మకు చాలు మిత్రమా!..  

నిజమే కదూ.. నాకైతే చాలా బాగా నచ్చేసింది.

నేను ఈ సైట్లలోకి ప్రవేశించిన తొలినాళ్ళలో తెలుగులో వ్రాయటం నేర్చుకున్నాను. అలాగే కొనసాగించాను. చాలామంది ఇబ్బంది పడ్డనూ, రోమన్ ఇంగ్లీష్ లో తెలుగుని వ్రాయటం ఎందుకో నచ్చక, తెలుగులో వ్రాశాను. తెలుగువారిమై ఉండి, తెలుగులో వ్రాయలేకపోవటం మన దురదృష్టకరం.. అలా వ్రాయటం ఇబ్బందిగా ఉన్ననూ, (ఇప్పుడు సాంకేతికముగా చాలా మార్పులు వచ్చాయి. మొదట్లో అయితే చాలా కష్టముగా ఉండేది. తెలుగు బ్లాగర్స్ గ్రూప్ లో పాల్గొనేవారు ఉద్దండులు అయినా, ఉన్నత విద్యలున్నా తెలుగులోనే వ్రాస్తారు. అలా వారిని చూసి స్ఫూర్తి పొంది, నేను కూడా) అలాగే వ్రాస్తూ పోయాను. ఇబ్బందులు పడ్డవారు కాస్త నన్ను మన్నించండి.

* ఎక్కడైనా ఏదైనా పోస్ట్ ఇబ్బందిగా ఉంటే చెప్పండి.. మారుస్తాను. లేదా తీసేస్తాను. *

మూడు సంవత్సరాల క్రిందట సోషల్ సైట్, బ్లాగ్ అంటే ఏమీ తెలీని వాడిని. నాలుగు సంవత్సరాల క్రిందట అయితే కంప్యూటర్ వాడకమూ తెలీదు. అలాంటి నాకు చాలా తెలియచేసిన వారికి కృతజ్ఞతలు చెప్పెందుకై ఈ పోస్ట్ వ్రాస్తున్నాను. నన్ను ఇంతటి వాడిని చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఈ సీరీస్ ని ముగిస్తే - నేను క్రుతఘ్నుడిని అవుతాను. ఇక్కడ కొన్ని ఇబ్బందుల వల్ల అన్నివివరాలు బయటపెట్టలేను.

కంప్యూటర్ అంటే ఏమిటో పరిచయము చేసిన అమెరికా, ఇండియా లో ఉండే రాకేష్, చందూ, పవన్ లకీ,

సోషల్ సైట్స్ ని పరిచయం చేసిన మా బంధువుల అమ్మాయికీ, అందులో నాతో కొనసాగి నాకు బాగా మధురానుభూతులు కలిగించిన నా స్నేహితులకీ, నా స్నేహితురాళ్ళ కీ,

ముగ్గురు అమ్మాయిలతో (అందులో ఒకరు తనకి ప్రాణం) చాట్ చేస్తూ బీజీగా ఉన్ననూ, నేను ఒక చిన్ని సమస్యకి సమాధానం అడగగానే, వెంటనే తన పాస్ వర్డ్ ఇచ్చి, తన అకౌంట్ చూపి, నా ప్రాబ్లెం ని తీర్చిన మహేష్ కీ, వేవేల కృతజ్ఞతలు.. ఇతను అలా చేశాక బాగా మారాను. స్నేహములో ఇంత నమ్మకం అంటూ ఉంటుందా అని నిజముగా హాశ్చర్య పడ్డాను. ఈ సంఘటన జరిగాక అలా నేనూ లేనందులకి సిగ్గుపడి, జెన్యూన్ గా ఉండటానికి ప్రయత్నించాను. అసలు అంతకి ముందు ఎప్పుడు ఉన్నానని?.. అల్లరి చిల్లరిగా తిరిగేవాడిని.. అక్కడి నుండి (రెండో సంవత్సరం) బాగా మారుతూ వచ్చాను. మారక ముందు ఉన్న (అనుకున్న) గొప్ప గొప్ప ఎంజాయ్మెంట్స్ అన్నీ - మారాక నేను పొందిన అనుభూతుల ముందు పీపీలికముగా అగుపించసాగాయి. ఇప్పుడు నేను పొందిన మధురానుభూతులు నా జీవితకాలానికి సరిపడే అంతగా దొరికాయి.. అవి చాలును.

ఇక ఇలా పోస్టింగ్స్ పెట్టమని అడిగిన స్నేహితురాలికి మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. కానీ తనకే ఉపయోగపడకపోవటం అన్నింటికన్నా దురదృష్టకరం.

ఇక ఇంతగా తెలుసుకొని, వివరముగా వ్రాశానుగా.. అందులో ఒకరి పరోక్ష సహాయం చాలా ఉంది కూడా. నాకంటే చిన్నవారు అయిన తను నాకు పరిచయం అయి కొంతకాలమే అయిననూ, చాలా విషయాలు తనవల్లనే నేర్చుకున్నాను. ముందే శ్రీకారములో చెప్పానుగా.. నాకేమీ తెలీనివాడిగా, అజ్ఞానిగా ఇందులోకి వచ్చాను. అందుకే అక్కడక్కడా చాలా పొరబాట్లు చేశాను. చేస్తున్నాను కూడా. కొద్దిగా మారాను. ఇంకా మారాలి. నేను గోప్పవాడినేమీ కాను. మీలాగే సగటు మనిషినే! ఇక్కడి నుండే సోషల్ గా మూవ్ అవటం నేర్చుకున్నాను. తనేమీ నాకు క్లాసులుగా చెప్పలేదు. కానీ బాగా గమనించి నేర్చుకున్నాను. ఈ పోస్టింగ్స్ లలో పాతిక శాతం కి పైగా తన వల్ల నేర్చుకున్నవే కావటం విశేషం. ప్రేరణ తనే! తనకి హృదయపూర్వక ధన్యవాదములు.

ఇన్ని స్నేహాల్లో మీకు నచ్చినది ఏమిటంటే అని అడిగితే ఏదని చెప్పను.. ఒక్కోటి ఒక్కోరకం. ఒక్కో పాఠం. మన చేతి వ్రేళ్ళూ ఐదూ ఐదు రకాలు.. ముందే మన గురించి క్లారిటీ ఉంచుకొని వీటిల్లోకి వెళితే చాలా మంచిది. నేనూ అలాగే అనుకొని, కొన్ని నియమాలు పెట్టుకొని వెళ్లాను.. అందరినీ గారూ.. అని సంభోదిస్తూ, వారి పర్సనల్స్ లోకి వెళ్లక, వారి  డిటైల్స్ ఏవీ అడగక, వేరేవారినీ తెలుసుకోక, అవతలివారు నమ్మకంగా అనిపిస్తేనే - స్నేహం చేస్తూ పోయాను. నాకు తోచిన సహాయాలు చేశాను.. తీసుకున్నాను కూడా (వీరికి బాగా ఋణపడిపోయాను.).

అలాగే ఇంకొన్ని కూడా ఉన్నాయి. తక్కువ స్నేహితులని ఎన్నుకోవాలని అనుకున్నాను. ఎన్నుకున్నాను కూడా. కొన్ని గమ్మత్తు నియమాలూ పెట్టుకున్నాను కూడా. ముందే చెబుతున్నాను నవ్వొద్దు మరి.. ఎవరినీ ఏవీ అడగవద్దని అనుకున్నాను.. చెబితే వినాలి. విన్నది అక్కడే అలానే ఇంకిపోవాలి. ఎవరికీ చెప్పొద్దు.. అంతే కానీ, ఆరా తీయవద్దనీ అనుకున్నాను. అలాగే నేను వ్రాసిన ఐదు స్క్రాపులకి సమాధానం ఇవ్వనివారికి, నేనూ సమాధానం ఇవ్వక దూరం గా ఉండాలని, అలా అలా ఉంటూ, దూరం అవుతూ ఒకరోజు వారిని నా లిస్టు నుండి తీసెయ్యటం చెయ్యాలని - ముందే అనుకున్నాను. అలాగే చేశాను కూడా. చేస్తున్నాను కూడా. ఇక ముందు కూడా చేయబోతాను కూడా.

అలాని ఎందుకూ అంటే - ఇక్కడికి వచ్చేదే స్నేహితులతో రిలీఫ్ అవటానికి. అంతేకాని వారివీ, వీరివీ విషయాలు, గొడవలూ తెలుసుకోవటానికి కాదు. ఎవరైనా చెబితే విని వారి సమస్యలు తీర్చటానికి ప్రయత్నించాను. వారి బాధలూ విన్నాను. దాదాపు అన్నీ తీర్చాను... ఇక చాలు అని అనుకుంటున్నాను.. ఇక నెమ్మదిగా దూరం జరగాలి. నా మిత్రులు, శ్రేయోభిలాషుల కోసం అప్పుడప్పుడు రావాలని అనుకుంటున్నాను.

ఈ సీరీస్ లో మిగిలినవి ఏమైనా ఉంటే వేరే పోస్ట్స్ లలో చెబుతాను.

ఈ సైట్స్ లోని స్నేహాల గురించి నా అభిమతం ఏమిటో కూడా ఇక్కడే చెబుతాను. అది ఈ సైట్స్ లలోకి వెళ్ళే ముందే అనుకున్నాను.

నా స్నేహం అనేది లోపల వాల్వో, బయటకి ఆర్డినరీ బస్ లా కనిపించే బస్ అని అనుకుంటాను. నాలుగైదు బస్సులు (ప్రోఫైల్స్) మైంటైన్ చేసే సామర్థ్యం ఉన్నా ఒకటే ఉంచుకున్నాను. నా స్నేహమనే బస్ కి కొన్ని రూల్స్ అంటూ ఉన్నాయి. నాకు నచ్చిన దారిలో నేను స్వేచ్చగా వెళుతుంటాను. నా బస్ ఎక్కే అర్హత ఉందీ అనుకున్న వారు లిఫ్ట్ కోసం చేయి (ఆడ్ రిక్వెస్ట్) చాచితే, వారికి అర్హత ఉంది అనుకుంటే - ఎక్కించుకుంటాను. వారికి అన్నీ చేస్తాను. అన్నీ పంచుతాను. వినోదం చేస్తాను, చాట్ చేస్తాను.. నాతో బాటు వారూ ఉంటే నేనూ సంతోషముగా ఉంటాను. కాని ఇలా లోనికి వచ్చేసి, అలా చివరి సీట్ లో ఉండి, జరిగేది చూస్తాను.. నేను ఏమీ అనను.. మాట్లాడను.. పలకరించను.. నామీద చెడుగా అన్నవారినీ, నాతో దూరముగా ఉన్నవారినీ ఒక కంట కనిపెడుతుంటాను. చూసీ చూసి వారిని ఒక స్టేజిలో నిర్దాక్షిణ్యంగా దించేసి, అలా సాగిపోతుంటాను. మళ్ళీ వారి గురించి ఇక ఆలోచించను. నా బస్ ఇక మళ్ళీ వారికోసం వెనక్కి వెళ్లి, మళ్ళీ ఎక్కించుకోను. ఎందుకంటే రిప్లై ఇవ్వని వారికోసం ఎదురుచూసి, మిగతావారి మీద సమయం కేటాయించలేక నేను ఉన్నవారినీ దూరం చేసుకోలేను. ముందే - నాకున్న సమయం చాలా తక్కువ. 


స్నేహమంటే బాపూరమణ గార్ల స్నేహములా అరవై సంవత్సరాల పాటూ కొనసాగాలి. వారిలో కూడా ఎన్నో పొరపొచ్చాలు ఉన్నా, దూరం కాలేదు. సర్దుకపోయారు. ఒక్కటై నడిచారు. అలా మీ మనసుకి దగ్గరగా వచ్చినవారితో ఒక మెట్టు దిగి అయినా ఆ స్నేహాన్ని నిలుపుకోండి. లేకుంటే తీరికగా బాధపడతారు. 

చివరిగా మీకందిరికీ + నాకు తెలిసిన ఒక గొప్ప పురాణ మరియు पुराना స్నేహం గురించి చేబుతూ - ఈ సీరీస్ ని ముగిస్తాను. 

శ్రీ కృష్ణుడు, కుచేలుడూ ఇద్దరూ బాల్య స్నేహితులు.
ఒకరేమో కారణ జన్ములూ, మహిమాన్వితులూ.. ఇంకొకరు బడుగు వ్యక్తి.
ఒకరికి అష్టమహిషులూ, అష్టైశ్వర్యాలూ - వేరొకరికి గంపెడు పిల్లలూ, కటిక దారిద్ర్యం.
ఒకరేమో రాజప్రసాదం లో, మరొకరు పూరి గుడిసెలో.
అయినా ఎవరూ అవేవీ చూసుకోక, స్నేహం మాత్రమే చేస్తూ పోయారు.
పెద్దవారు అయ్యారు.. జీవితాల్లో చా.....లా దూరం వచ్చారు.
కాని ఒకరినొకరిని ఏమీ చేయిసాచి అడగలేదు. అడగాలని అనుకోలేదు కూడా..
అడిగితే కాదని అనరు. అయినా అడగలేదు..
స్నేహితులుగా, స్నేహం కోసమే ఉన్నారు.
.... .... .... ....
కుచేలుని భార్య ఆ కృష్ణుడు మీ బాల్య స్నేహితుడేగా.. మీకు ఏమైనా సహాయం చేస్తాడేమో అడగమని పోరితే,
వద్దు వద్దు స్నేహితుడిని అడగను అని వాయిదా వేస్తుంటాడే కాని, వెళ్ళటానికి ఇష్టపడడు...
ఇక తప్పని పరిస్థితుల్లో - శ్రీ కృష్ణుడి వద్దకి, ఈ బీద కుచేలుడు వెళతాడు.
ఖాళీ చేతులతో వెళ్లొద్దని, వెళ్తూ వెళ్తూ తన బాల్య స్నేహితునికి ఇవ్వటానికి ఇంట్లో మిగిలి ఉన్న కాసిన్ని అటుకులు - ఉన్నదాంట్లో కాస్త మంచిగా ఉన్న చింకి గుడ్డలో మూట గట్టుక వెళతాడు.
శ్రీ కృష్ణుడు ఎదురేగి, సాదరముగా అతన్ని ఆహ్వానిస్తాడు.
అంతఃపురానికి దగ్గరుండి తీసుకెళ్ళుతాడు.
అష్ట రాణులకీ పరిచయం చేస్తాడు.
తన చిన్ననాటి స్నేహితుడుని - తనింటికి వచ్చిన అతిధిగా చెబుతాడు.
సింహాసము మీద కూర్చోపెట్టి అతని పాదాలు కడుగుతాడు.
ఆ కడిగిన నీటిని తలపై చల్లుకుంటాడు..
తరవాత తన సింహాసనము పై కూర్చోపెట్టుకొని, తనకోసం తెచ్చిన - అతను దాచిన అటుకుల్ని అడుగుతాడు.
రోజూ పంచభక్ష్య పరమాన్నాలతో తినే ఆ దేవదేవుడు, తనకోసం తన మిత్రుడు తెచ్చిన ఆ చప్పటి అటుకుల్ని అడిగి, తీసుకొని, మరీ కడుపారా తింటాడు.
ఆ రాత్రి తన వద్దే ఉంచుకొని, మరుసటి రోజున పంపిస్తాడు.
వీడ్కోలు తీసుకున్న ఆ కటిక దారిద్ర్య విప్రమోత్తముడు - దారిలో "నా స్నేహితుడిని సాయం చెయ్యమని ఏమీ అడగలేదే!.. మా ఇల్లాలికి ఏమి సమాధానం చెప్పాలి?.. ఇలా రిక్త హస్తాలతో పంపాడని ఎలా చెప్పగలను.." అనుకుంటూ తన ఇంటికి వెళ్ళితే..
పట్టు బట్టలతో, బంగారు నగలతో పిల్లలూ, భార్యా తన ఊరిలోని ఒక భారీ భవంతి ఎదుట ఎదురవుతారు.
వారు చెప్పగా - అప్పుడు తెలుసుకుంటాడు. ఆ బాల్య స్నేహితుడు రిక్త హస్తాలతో ఎందుకు పంపాడో అనీ..
అదంతా ఆ కృష్ణుడి అనుగ్రహమనీ..

తానేమీ అడగకకుండానే, స్నేహితునికి ఏమి కావాలో, మనసు తెలిసి, చేసే సహాయం ఎంతో గొప్పది. నాకు సరిగా వివరించరాకున్నా సాధ్యమైనంత వరకూ చెప్పాను. అలా ఉండాలి స్నేహమంటే.. 

అలాంటి స్నేహితులు మీకు కూడా లభించాలని ఆశిస్తూ..

ఈ పోస్ట్స్ ఆదరించిన మీకు ఇక సెలవు..

ఇక ఉంటాను.

మీ రాజ్. 

12 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

ఒక స్నేహితుని అంతరంగం స్నేహం పై.. ఓ. నమ్మకమైన స్తిరమైన అభిప్రాయం వెరసీ ఈ..టపా కనులు చెమరింప..మాటలు రాక.. రాతలు వ్రాయలేక..

వనజ తాతినేని/VanajaTatineni said...

ఎంత ఓపిక, ఒద్దిక అభినందన మందారమాల రాజ్ గారూ...అందుకోండీ!!

శశి కళ said...

చాలా బాదగా ఉంది మీ వీడుకొలు చదివి.
కాని మీరు మంచి పని చెసిన త్రుప్తి యెన్దరికొ
స్పూర్తిని ఇస్తుంది.మీ పొస్ట్ లు నాకు చాలా ఉపయొగపడ్డాయి.థాంక్యు.

Raj said...

వనజ గారూ.. మీకు చాలా ధన్యవాదములు.. మీరు కామెంట్స్ పెట్టి, వెన్ను తట్టి మరీ నన్ను ప్రోత్సాహించినందులకు మీకు బాగా ఋణపడిపోయాను. మీరు అలా కామెంట్స్ పెడుతూ ప్రోత్సాహించకుంటే ఇంత వివరముగా వ్రాసేవాడిని కానేమో!.. మీకు మరొక్కసారి కృతజ్ఞతలు.

Raj said...

శశికళ గారూ.. మీ కామెంట్ కి సర్వదా కృతజ్ఞతలు. నాకూ బాధగానే ఉంది. కాని నాకోసం అక్కడ కొందరు మిగిలారు. వారికి నా అవసరం / నా స్నేహం కావాలి అన్నంతవరకూ రావాలని ఉంది. వారివల్ల నాకంటూ కొన్ని మధురానుభూతులు మిగిలాయి. నేను ఇలా పొందేసి అలా దూరం అయిపోతే నేను వారిని మోసం చేసినట్లే లెక్క. అప్పుడు ఈ సీరీస్ వ్రాయటానికి నాకు అర్హత లేనివాడిని అవుతాను. అందుకే మెల్లమెల్లగా దూరం కావాలి అనుకుంటున్నాను - అని చెప్పాను.
స్ఫూర్తి అనేది నేనూ ఇతరుల నుండి పొందాను. అలా పొందేసి నేను ఇతరులకి పంచక దూరం అయ్యుంటే - నేను క్రుతఘ్నుడిని అవుతాను. స్ఫూర్తి పంచితే నా విలువనే కదా పెరిగేది.

వనజ తాతినేని/VanajaTatineni said...

రాజ్ గారు అలవాటుగా మీ ఠపా కొరకు.. చూసాను.. వెతికాను.. రాలేదేమిటబ్బా అనుకుంటూ .. గూగూల్ సెర్చ్ లొ..బ్లాగ్ పట్టి తీసుకుని ఇలా వచ్చాను. చూడండీ యెంత కష్ట పెట్తారో.. స్నేహితులని ఇలా కష్ట పెట్టడం తగునా?త్వరగా వచ్చేయండి. విలువైన పాఠాలు చూడ కుంటే అమవాస నింగిని చూసినట్లు ఉంది.మీ అనుభవ పాఠాల కోసం వేచి ఉన్న విద్యార్ధులం. చాలా నేర్చుకోవాలి. గురువుగారు..యెక్కడైనా గురు పూజోత్సవం రోజు వీడ్కోలు చెపుతారా.? విన్నపాలు ఆలకించండి..గురు వర్యా!

Raj said...

తప్పకుండా వస్తాను..వస్తున్నాను కూడా..

నీహారిక said...

తానేమీ అడగకకుండానే, స్నేహితునికి ఏమి కావాలో, మనసు తెలిసి, చేసే సహాయం ఎంతో గొప్పది. అలా ఉండాలి స్నేహమంటే..

అలాంటి స్నేహితులు మీకు కూడా లభించాలని ఆశిస్తూ..

ఒక్కరైనా దొరికితే ఎంత బాగుంటుంది.

మీ బ్లాగ్ చాలా బాగుంది. నేను చూడనే లేదు.

Don't leave blogs, Happy Blogging!!

Raj said...

అవును కదా.. కనీసం ఒక్కరైనా దొరికితే అదే సంతోషం. అంత సమయమూ, ఖర్చూ పెట్టాక కూడా మనం మనసు దగ్గరి దాకా వచ్చే స్నేహం పొందలేక పోతే - మన ప్రయత్న లోపమూ ఉంటుంది..

ఇకనుండీ మీకు వీలున్నప్పుడల్లా చూస్తూ ఉండండి. చదవండి. కృతజ్ఞతలు..

Madhurima said...

Sneham meeda meekunna abhiprayaaniki tala vanchi namakaristunnaa..mee lanti great persons ilanti social sites lo vundali..ubhayatarakam ga ela masalalo telisina vallaki peddaga nastam em ledu...sensitive..and konchem burra takkuvunna vallake problms anni. useful blog..plz continue.

Madhurima said...

Sneham meeda meekunna abhiprayaaniki tala vanchi namakaristunnaa..mee lanti great persons ilanti social sites lo vundali..ubhayatarakam ga ela masalalo telisina vallaki peddaga nastam em ledu...sensitive..and konchem burra takkuvunna vallake problms anni. useful blog..plz continue.

Raj said...

ధన్యవాదములు మధు గారూ! నా బ్లాగ్ లోని పోస్ట్స్ నచ్చినందులకు కృతజ్ఞతలు. నా బ్లాగ్ ని వీక్షకుల కోరిక మేరకి అలాగే కొనసాగిస్తూనే ఉన్నాను.

Related Posts with Thumbnails