Monday, July 25, 2011

ఆరుద్ర పురుగు

ఆరుద్ర పురుగు - దీనినే కొన్ని చోట్ల పట్టు పురుగు అనీ, చందమామ పురుగు అనీ, లేడీ బర్డ్ అనీ, ఇంద్రగోప పురుగు అని కూడా అంటారు. ఇలా చాలా నామధేయాలు ఉన్న ఈ పురుగు చూడటానికి అరంగుళం సైజులో ఉండి, ఎర్రని మఖ్మల్ బట్ట తో చేసిన బొమ్మలాంటి పురుగుయా ఇది అనేలా ఉంటుంది. ముట్టుకుంటేనే - అత్తిపత్తి చెట్టు ఆకుల్లా ముడుచుకు పోయే స్వభావం ఉన్న ఈ పురుగులు నేలమీద కాసింత ఇసుక నేలల్లో, పచ్చగడ్డి కాసింత ఉన్న చోట్లలో విరివిగా కనిపిస్తాయి.

ఈ అందమైన, మెత్తనైన పురుగులు వర్షాకాలం తొలకరి వర్షాలు కురవగానే, బిల బిల మంటూ కుప్పలు కుప్పలుగా కనిపిస్తాయి. నేను చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళిన రోజుల్లో, అక్కడ ఇలాంటి పురుగుల్ని చాలా చాలా చూసేవాడిని. నేనూ, నా మిత్రులము కనీసం తలా పది పురుగులవరకూ పట్టేసేవాళ్ళం. వాటి చర్మముతో అందమైన పరుగుని కుట్టిన్చుకోవాలని అప్పట్లో తెగ కలలు కనేసేవాళ్ళం. ఇంతవరకూ అలా వాటి మెత్తని, ఎర్రని చర్మముతో పరుపుని ఇంతవరకూ కుట్టించుకోలేకపోయాం.

ఇసుక నేలల్లో, బొరియలు చేసుకుంటూ, అందులోనే జీవిస్తూ తొలకరి వర్షాలకి బయటకి వచ్చేసేటివి. ఇవి నేలలోని సూక్ష్మ క్రిముల్ని పట్టి భోంచేస్తూ, రైతులకి మేలు చేసేటివి. ఇవి అలా బయటకి వచ్చినప్పుడు వర్షానికి తడిచిన నల్లని భూమి మీద, ఆకుపచ్చని గీతల్లాంటి గడ్డి మీద ఎర్రని చుక్కలు అద్దినట్లుగా అనిపించేటివి. ఆ దృశ్యం ఎంతో హృద్యముగా అగుపించేడిది.

మొన్న ఆ స్కూల్ కి ఉదయాన వెళ్ళాల్సివచ్చింది. అప్పుడు ఈ ఆరుద్ర పురులు గుర్తుకువచ్చి, వీటి కోసం చూశాను. చిత్రం ఒక్కటీ కనిపించలేదు. దాదాపు పదిహేను రోజులు వెదికాను. నేను చిన్న్నప్పుడు బాగా చూసిన ప్రదేశాల్లో వెదికాను. ఊహు.. ఒక్కటీ లేదు. ఇక లాభం లేదు అనుకున్న తరుణాన - ఒకరోజు ఒకే ఒక్క ఆరుద్ర పురుగు కంటికి కనిపించింది. పోయి పోయి ఆరోజే కెమరా వెంటపెట్టుకరాలేదు. అలా దానిని ఫోటో తీసే అవకాశం పోయింది. దానిని ఇలా పట్టుకొని, కాసేపటి తరువాత వదిలేశాను. జస్ట్ ఒక నిమిషం తరవాత నేను దానిని వదిలిన చోటులో వెదికాను. ఆశ్చర్యం.. - లేదు. ఆ పురుగు మంత్రం వేసి మాయం అయినట్లుగా - వెళ్ళిపోయింది. దగ్గరలో దానికి చాటు అంటూ ఏమీలేదు. బహుశా భూమిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చును.

ఇవి వర్షాకాలములో వచ్చే ఆరుద్ర కార్తె సమయాన మాత్రమే కనిపిస్తాయి కాబట్టి ఆరుద్ర పురుగులు అని పేరు పడిపోయింది. మనిషి వెదజల్లుతున్న కాలుష్యం, పురుగుల మందుల వల్ల - ఊరపిచ్చుకల వల్లే ఇవి కూడా కనిపించకుండా పోయేలా ఉన్నాయి. మనిషి తనకి మేలుచేసే వాటిని కూడా ఒక్కొక్కదాన్నీ నిర్మూలించుకుంటూ వస్తున్నాడు అనేదానికి ఇది ఒక చక్కని ఉదాహరణనేమో..

2 comments:

Anonymous said...

Wav! after a long time I am hearing of this beautiful insect. I used to collect these insects when I was a kid.

Your Mr.Bean is blocking the post, move him to a corner.

Raj said...

మీ కామెంట్ కి ధన్యవాదములు..

మిస్టర్ బీన్ ప్రక్కకే - గోడ చాటు నక్కినట్లుగానే ఉంటున్నాడు. చాలా సార్లు చూశాను. అతను పోస్ట్ లకి అద్దం రావటం లేదు . అలాని ఇంతవరకూ ఒక్క ఫిర్యాదూ రాలేదు. అయినా మీ మాట మన్నించి, త్వరలోనే మారుస్తాను..

Related Posts with Thumbnails