Wednesday, April 13, 2011

Social NW Sites - 25 - మనం మిత్రులకి ఆడ్ అయ్యాక..

పోయిన టపా దాంట్లో మనకి మిత్రులని ఆడ్ చేసుకున్నాక చూడాలని చెప్పానుగా.. ఈసారి మనం ఆడ అయ్యాక ఎలా ఉండాలో చెబుతాను. నేను చెప్పేవి అన్నీ ISO : 9000 మార్క్ వి కాకున్నా, అన్నీ నా అనుభవాల నుండీ తీసుకొని, తెలుసుకొని చెబుతున్నాను. ఇవి అన్నీ ప్రామాణికం కాకపోవచ్చును. కాని నాకు తెలిసినంతవరకూ చెప్పాలని నా తాపత్రయం.

చాలావరకు అన్నీ నా అనుభవాలే ఇందులో ఉన్నాయి. కొద్దిమంది వారి అనుభవాలు చెప్పారు. అవన్నీ పేర్లూ, లింక్స్ తప్ప యధాతథముగా పెట్టాను. ముందే చెప్పానుగా.. ఇది జస్ట్ క్రొత్తగా, ఇంతకు ముందే సోషల్ సైట్ల లోకి ప్రవేశించిన వారికి కాస్త ఉపయోగపడేటివి గా ఉండాలనీ.. చాలా ఇబ్బందులని తగ్గించుకొని, ఈ సోషల్ సైట్లలో జాగ్రత్తగా ఉంటారని కోరుకోవటమే. అంతే కాని ఎవరినో ఇబ్బందులపాలు చెయ్యాలని కాదు. ఇది ఫలానా వారిది కదా అని నన్ను అడిగితే కాదు అని నా సమాధానం. ఎందుకంటే వారిని ఇబ్బంది పెట్టకూడదు అని. ఒకరి అనుభవం ఇంకొకరికి పాఠం అవుతుంది. ఒకరి గెలుపు మరొకరికి ప్రేరణ అవుతుంది కూడా..

మీరు మీ మిత్రులకు ఆడ్ అయ్యాక ఈ సూచనలని గమనించండి.

1. మీరు మీ మిత్రులకి క్రొత్తగా ఆడ్ అయ్యాక వారికి, వారు మిమ్మల్ని వారి స్నేహితుల గుంపు లోకి చేర్చుకున్నందులకు ముందుగా వారికి కృతజ్ఞతలు చెప్పండి. 

2. వారితో ముందుగా కామన్ విషయాలు  మాట్లాడండి. అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఎవెనింగ్.. వాతావరణం ఎలా ఉంది?.. కులాసాయేనా? భోజనం చేశారా? టీ టిఫిన్స్ చేశారా?.. అలాంటివి.

3. తరవాత వారి వయస్సు దృష్టిలో ఉంచుకొని, ఏమని పిలవాలో అడిగి, అలాగే ఆవిధముగా పిలవండి. కాస్త పెద్దవారిని అంకుల్, ఆంటీ, అత్తా, తాత.. లాంటి పేర్లు కాకుండా మధ్యేమార్గముగా అండీ అనుకుంటూ పిలిచేస్తే సరి. ఏ ఇబ్బందీ ఉండదు.

4. వారికి ఇబ్బంది పెట్టే స్క్రాప్స్ అసలు పెట్టకండి. ఈ ఇబ్బంది స్క్రాప్స్ అనేవి ఒక్కొక్కరికీ ఒక్కొరకం. ఇందులో ఏదీ వారికి ఇది నచ్చదు అని ఒక పట్టాన తెలియదు మనకి. అలాంటి పెట్టి మనం ఇబ్బంది పెట్టొద్దు, ఇబ్బంది పడొద్దు. ఒక ఉదాహరణ చెబుతాను. నాకు ఉన్న ఇద్దరు మిత్రులు నాకు ఒక దేవుడి ఫోటో పంపి - ఈ ఫోటో పదిమందికి పంపితే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అంటే - దైవ భక్తి ఒక రేంజ్ లో ఉండే నేను ఏమి చెయ్యాలో పాలుపోక వారికే పదిసార్లు పంపాను. ఆ చర్యకి వారు బాగా ఫీలయ్యి, మాటలు తగ్గించారు. వారు ఇబ్బంది పెడితే, నేనేం చేసేది మరి. అసలు వారే నన్ను ముందు ఇబ్బంది పెట్టారు అని వారు గమనించుకోవాలి.

5. మరికొందరికి గుడ్ మార్నింగ్ విషేష్ చెప్పినా మళ్ళీ వారు ఎదురు విషేష్ చెప్పరు. మనం ఇలా అసలే ఏమీ బదులు చెప్పకుండా ఉండకూడదు. అలా ఉన్నామే అనుకోండి. అవతలివారు మళ్ళీ మనకి ఏమీ చెప్పరు కూడా. ఆ స్నేహం చేసినా సమయం వృధా తప్ప మరొకటి కాదు.

6. మీకు విష్ చేసినవారికి ప్రతి విష్ చెయ్యటం మర్యాద. కష్టపడి విషేష్ చెప్పితే, కనీసం మర్యాద కోసమైనా బదులు ఇవ్వండి. లేకపోతే మర్యాద తెలీని వ్యక్తిగా మీకో ముద్ర పడుతుంది. ఉదాహరణకి మీ ఆఫీస్ లో ఒకరికి విష్ చేశారు అనుకోండి. వారు అది పట్టించుకోకుండా వారి పనిలో వారే ఉన్నారే అనుకోండి. కాసేపాగి మళ్ళీ చెబుతారు.
అప్పటికీ మళ్ళీ బదులే రాలేకపోతే, మీరేం చేస్తారు.? మళ్ళీ విష్ చెయ్యటానికి మన మనసు ఒప్పుకుంటుందా..? లేదు కదా? మళ్ళీ చెప్పబుద్ది కాదు కదా.. ఇక్కడా అంతే!. ఇది ఈ సోషల్ సైట్లలో దాదాపుగా అందరూ చేసే పెద్ద పొరబాటు. మీరీ పొరబాటు చేయ్యరనే ఆశిస్తున్నాను.

7. మీ మిత్రుల నుండి ఇలా విషేష్ రావటం ఇష్టం లేకపోతే - ఒకసారి వారికి, చాట్ లోనో, ప్రైవేట్ గానో చెప్పండి. వారు మానుకుంటారు. ఒక పత్రికలో పనిచేసే ఒకతనికి నేను ఇలాగే పంపిస్తే అతను నాకు అలాగే చెప్పాడు - నాకు ఇలా రోజూ చెప్పాల్సిన అవసరం లేదు అనీ. అతని మీద నేను ఏమాత్రం కోపగించుకోలేదు. నేనూ ఇది చిన్నతనముగా ఫూలిష్ గా కూడా అనుకోలేదు. దానివలన నా పొరబాటు ఏమిటో తెలిసివచ్చింది. నేను అతని అభిప్రాయాన్ని గౌరవించాను. ఇప్పుడు అతనూ, నేనూ ఒక మంచి స్నేహితులం కూడా. ఎప్పుడో ఒకసారి తప్ప నేను అతనికి చెప్పటం లేదు. ఇలా చెప్పటం ఎలాగా కనిపించినా, ఇది చాలా మంచి పద్ధతి. రిప్లై రావటం లేదు అన్న బెంగ ఉండదు.

8. మీకు వచ్చిన ప్రతి స్క్రాప్ కీ, రిప్లై ఇవ్వటం అలవాటు చేసుకోండి. అది మీ స్నేహ బంధాలని బాగా పెంచుతుంది.

9. మీకు స్నేహితులు కానివారు కూడా మీకు వ్రాసేలా స్క్రాప్  బుక్ సెట్టింగ్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవటం ఇష్టం లేకపోవచ్చును. కాని పెట్టమనే సలహా ఇస్తాను. వారు వ్రాసినవి వారికీ, మీకూ తప్ప మూడోవ్యక్తి, మరెవ్వరికీ కనిపించవు - అలా ఆటోమేటిక్ సెట్టింగ్స్ ఆ సైట్ వాడే ఇస్తాడు. నేను ఇలా పెట్టుకుంటే నాకు ఐదుగురు మంచి స్నేహితులు ఆడ్ అయ్యారు.  

10. మీ నుండి ఏదైనా సహాయం కోరితే - ఖర్చు తక్కువలో, తక్కువ సమయములో అయ్యేది కోరుకుంటే - మీకు వెసులుబాటు ఉంటే ఖచ్చితముగా చెయ్యండి. లేకుంటే సారీ చెప్పెయ్యండి. కాని చేస్తానని చెయ్యకుండా ఆగిపోకండి. అలా చేస్తే మీ నైజం గురించి మీరే చెప్పుకున్నట్లు అవుతుంది.

11. మీరు ఉదయాన ఓపెన్ చెయ్యగానే - పది గుడ్ మార్నింగ్ విషేష్ ఉన్నాయే అనుకోండి. విసుక్కోక వాటన్నింటికీ రిప్లై ఇవ్వండి. "హమ్మో! వాటన్నింటికే.." అని బరువుగా ఫీల్ అవకండి. దీనికో మార్గం చెబుతాను. నేను చేసేదీ ఇలాగే. ఒక వర్డ్ పాడ్ ఓపన్ చేసి డెస్క్ టాప్ మీద సేవ్ చెయ్యండి. అందులో గుడ్ మార్నింగ్.. గుడ్ ఎవెనింగ్ అంటూ ముందే, వరుసగా అందముగా వ్రాసుకోండి. అందులోంచి కాపీ, పేస్ట్ చేసెయ్యండి. చాలు. లేకపోతే ఒక్కరికి వ్రాసి, అది కాపీ చేసి అందరికీ పోస్ట్ చెయ్యండి. నిమిషములో పని అయిపోతుంది కూడా!.. ఈ ఐడియా నాది కాదు. నా మిత్రునిది. అది నా జీవితాన్ని కొద్దిగా మార్చేసింది కూడా. అబ్బో!.. అన్ని మార్నింగ్ విషేష్ కి రిప్లై ఇస్తాడు అని పేరు వచ్చింది. (ఇప్పుడు ఇది తెలుసుకొని - మీరు ఇలా చేస్తారా అని కోప్పడకండి. నావీ చెప్పక తప్పదుగా.)

12. వారి స్క్రాప్స్ బుక్ మొదట్లో - అదీ ఎలాంటివారో చూడటానికి చూడండి కానీ, అందులోని విషయాలని ఇతరులకి స్ప్రెడ్ చెయ్యకండి. దానివలన మీకు అనవసర మానసిక క్లేశాలు ఉంటాయి. ఇలా అందరికీ అంటించే "స్పామర్" (SPAM) అనే బిరుదు రావచ్చును.

13. ఎవరైనా వారితో ఎలా ఉండాలో మీకు చెబితే, అలాగే ఉండటానికి, ప్రయత్నించండి. అలా వీలుకానప్పుడు వారికి దూరం గా ఉండటమే బెస్ట్. ఆ విషయం చెప్పండి. అలా నలుగురు చెబితే వారు వారి పద్ధతి మార్చుకోవచ్చును కూడా.. కాని ఇది ఓపెన్ గా చెప్పకండి. చాట్ లోనో, ప్రైవేట్ గా చెప్పండి.

14. వస్తూ, పోతుంటేనే బంధువులు ఎలాగో, స్క్రాప్స్ వ్రాస్తూ ఉంటేనే స్నేహాలు అని బాగా తెలుసుకోండి.. లేకపోతే మన ఫ్రెండ్స్ లిస్టు లో వేయి మంది ఉన్నా, మనకి వచ్చే స్క్రాప్స్ పదికి మించకపోవచ్చును.

15. మిత్రులకి చిన్నగా విషేష్ చెప్పే అలవాటు ఉంటే మానుకోండి.  GM (గుడ్ మార్నింగ్), GE (గుడ్ ఎవెనింగ్) hpy b'day అంటూ వ్రాయకండి. అది మీలోని ఎదుటివారి పట్ల ఉన్న నిరాసక్తత ని తెలియచేస్తుంది. పైన ఒకటి కిటుకు చెప్పానుగా గుడ్ మార్నింగ్ ఎలా చెప్పాలో.. అలాగే ఇదీ ఫాలో అవండీ.

16. మిత్రులు మనకి పుట్టినరోజు విషేష్, ఏదైనా విజయం సాధిస్తే విషేష్ చెబితే - ప్రతిగా వారికి థాంక్స్ చెప్పటం నేర్చుకోండి. అలా మీ స్నేహబంధాలు బాగా దృడం అవుతాయి. నేను అలా చెప్పటం నేర్చుకున్నాక, నాకు కనీసం యాభై మంది మిత్రులు బాగా దగ్గర అయ్యారు. వారికీ నా కృతజ్ఞతలు.

17. ఈ లోకములో ఎవరూ పరిపూర్ణమైన వ్యక్తులు లేరు. ఈవెన్ నేను కూడా. ఉన్నారు అనుకున్నవారు వారు భ్రమలో ఉన్నారు అన్నమాట.

18. మీకు ఏదైనా సూచన చేస్తే కొట్టిపారేయ్యకండి. శ్రద్ధగా వినండి. ఆసాంతం వినండి. కాదని చెప్పకండీ, అవుననీ చెప్పకండీ!. చూసి ప్రయత్నిస్తాను అని చెప్పండి. ఆ తరవాత ఒంటరిగా ఉన్నప్పుడు వారు చెప్పింది నిజాయితీ గా ఆలోచించండి. ఒప్పు ఉంటే వారికి - థాంక్స్ చెప్పేసి పాటించండి. తప్పు ఉంటే వెంటనే మరచిపోండి. అంతే కాని వారితో గొడవ పడకండి. ఈరోజుల్లో మనకు మేలు చేసే విషయాలు చెప్పేవారు చాలా తక్కువగా ఉన్నారు. పనికిరాని సోది చెప్పేవారు ఎక్కువ అయ్యారు. అవి ఎంత విన్నా బాగుపడం. ఇలా బాగుపడే విషయాలు చెప్పేవారి మీద కసరించుకుంటే / కోప్పడితే  ఇక ఏమీ చెప్పలేరేమో!. మన అభివృద్ధిని మనమే ఆపుకున్నవారిమి అవుతాము.

19. మీ స్నేహితుల పుట్టినరోజులని మరచిపోకుండా చెప్పటం నేర్చుకోండి. ఒకవేళ మరిస్తే మీ మీద ఒక నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. మిత్రుల పుట్టినరోజులు పదిహేను రోజుల ముందుగానే మీ ప్రొఫైల్ లో కనిపిస్తాయి. ఆ పదిహేను రోజులుగా అలా వస్తున్నప్పుడు ఎలా మరచిపోతారు? అని వారు అడిగితే మనదగ్గర సమాధానం ఉండదు. ఏదైనా అబద్ధం చెప్పినా అది అబద్ధం అని ఏదో ఒకరోజు తెలిసిపోతుంది. ఇక్కడో ఉదాహరణ : నాకు బాగా దగ్గరి స్నేహితురాలు నా గత సంవత్సరం పుట్టినరోజుకి సాయంత్రం విషేష్ చెప్పారు. నేను మరచిపోయానూ, ప్రొద్దున నుండీ ఆన్లైన్ కి రాలేదు అనీ!. నిజమా ఆనుకొని తను చెప్పిన దాంట్లో నిజమెంత ఆనుకొని ఇన్వెస్టిగేషన్ లా చేస్తే (అది తప్పే) - ఆ రోజు ఉదయాన తను వేరేవారికి గుడ్ మార్నింగ్ విషేష్ చెప్పారు. ఆన్లైన్ కి రాలేదూ అన్నవారు ఇలా కూడా మనకు చెవిలో పూలు పెడుతుంటారు. ఇలాంటివారిని కాస్త దూరంగా ఉంచుకుంటే సరి.

20. మీమిత్రుల ఇబ్బందులని అర్థం చేసుకోండి. నేను తెలుగులో స్క్రాపింగ్, చాటింగ్ చేస్తుంటాను. అంతా తెలుగే ఉంటుంది. అయినా బ్రెజిల్ నుండి ఒకావిడ నాకు ఆడ్ రిక్వెస్ట్ పెట్టారు. ఓకే చేశాను. చిత్రం ఏమిటంటే ఆవిడకి తెలుగు అసలే రాదు. ఇంగ్లీష్ కూడా. పోర్చుగీస్ భాష తప్ప మరేమీ రాదు. ఆవిడ పోర్చుగీస్ లోనే సమాధానం ఇస్తారు. నేను దాన్ని గూగుల్ ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ లోకి మార్చుకొని,  అర్థం చేసుకొని, జవాబుని ఇంగ్లీష్ లోనే వ్రాసి, పోర్చుగీస్ లోకి మార్చి పంపాల్సివస్తున్నది. అయినా ఇబ్బంది అనుకోకుండా ఇష్టముగా చేస్తున్నాను. అదొక అందమైన మరపురాని అనుభవం. స్నేహం ఎన్నడూ భాష, దూరం, జాతీయత చూడలేదు. ఈ క్రింది ఫోటో చూడండి. ఇలా మార్క్ చేస్తే చిన్న బాణం గుర్తు ఉన్న డబ్బా వస్తుంది. దాన్ని నొక్కితే ఒక సబ్ మెనూ వస్తుంది. అందులో ఉన్న Translate with Live Search అనే దాని మీద కర్సర్ పెట్టగానే, ఆ భాష ఏమిటో.. ఆ వాక్యానికి అర్థం ఏమిటో వస్తుంది. అప్పుడు ఆ వాక్యానికి అర్థం ఏమిటో సర్వర్ లోని, డాటా బేస్ లో చూసుకొని, చెప్పేస్తుంది. ఇది కేవలం ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 8 లో మాత్రమే వస్తుంది. గూగుల్ క్రోం లో రాదు.

21. ఇతరుల పుట్టిన రోజులకి మీరు ఆరోజు అందుబాటులో లేకుంటే - ముందే గ్రీటింగ్స్ చెప్పేసి, ఆరోజు అందుబాటులో ఉండకపోవటానికి గల కారణం చెబితే బాగుంటుంది. వారు మంచి అభిప్రాయముతో బాగా గుర్తుపెట్టుకుంటారు. గత సంవత్సరములో నా స్నేహితురాలు వారి ఫ్యామిలీతో కూలూ, మనాలికి వెళుతూ ఇలా అడ్వాన్సుగా చెప్పేసి వెళ్ళిపోయారు. (ఇలా ప్రతివారి నుండీ ఒక్కో విషయం నేర్చుకోవచ్చును.)

22. మీరు కొద్దిరోజులు ఆన్లైన్ కి దూరముగా ఉంటే - ఆవిషయం స్టేటస్ మెస్సేజ్ లో చెప్పండి. అది అందుకోసమే ఉద్దేశించింది.

23. మీకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ తయారు చేసుకోండి. అది చూస్తే మీరే గుర్తుకురావాలి. గుంపులో గోవిందలా ఉండకండి. నా మిత్రుడు ఒకరు తెలుగులో ఈస్ట్ గోదావరి యాసని టైపింగ్ లో చూపిస్తాడు. నిజానికి ఈ స్టైల్ అలా మైంటైన్ చేయటం చాలా కష్టమే అయినా నిజానికి చాలా గోప్పవిషయమే!. ఇలా మనలోని ఒక ప్రత్యేకత మనకి ఒక పాపులారిటీ తెస్తుంది. అది ఇచ్చే కిక్కు - అనుభవిస్తేనే గానీ తెలియదు. చిన్న సైజు సెలెబ్రిటీ హోదాగా ఉంటుంది.

24. మీరు బీజీ గా ఉన్నప్పుడు ఎవరైనా చాటింగ్ కి పింగ్ చేస్తే - సున్నితముగా చెప్పండి ఇలా బీజీ అని. వారు అర్థం చేసుకొని వెళ్ళిపోతారు. ఆ తరవాత గుర్తు పెట్టుకొని వారితో మాట్లాడండి.. ఏమిటా అవసరం అనీ.

25. మిత్రులు ఏదైనా సాధించాము అన్నట్లు ఏదైనా ఫొటోస్ పెడితే - మరచిపోకుండా అభినందించండి. నిజానికి మీ స్పందన కోసమే కదా వారు ఆ ఫొటోస్ ని అప్లోడ్ చేసేది. ఇబ్బందిగా ఉండి, చెప్పేది బాగోలేనప్పుడు వారికి ప్రైవేట్ లో చెప్పండి.

26. మీకు మంచి చేసేవారిని, మీ మేలు కోరేవారిని ఎప్పుడూ కాపాడుకోండి. వారిని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోకండీ!. (ఈరోజుల్లో) అలాంటివారు దొరకడం మీ అదృష్టముగా భావించండి.

27. స్నేహాలని తెంచుకోవటం చాలా ఈజీ. జస్ట్ వారి హోమ్ పేజీలోకి వెళ్లి, రెజెక్ట్ చేస్తే చాలు. కాని స్నేహాన్ని నిలుపుకోవటమే కష్టముగా ఉంటుంది. కాస్త కష్టపడితే ఈజీగానే ఉంటుంది.

28. మన గురించి బాగా తెలిసినవారిని దూరం చేసుకోవటం అవివేకం. మళ్ళీ క్రొత్తగా వేరేవారిని పరిచేసుకొని అందులో వీరిని వెదుక్కున్నా వారిలా మనకి దగ్గరగా ఉండొచ్చు, ఉండకపోవచ్చును. పొరబాట్లు అందరూ చేస్తారు. ఎన్నెన్నో ప్రశ్నల తరవాత కూడా వారి స్నేహం మీకు అనవసరం అని మీకు అనిపించినప్పుడు, అప్పుడు దూరం చేసుకోండి. అలా దూరం చేసుకునే ముందు - వారితో ఒకసారి మాట్లాడండి. లేదా వారికి ఒక అవకాశం ఇవ్వండి. వారలా ఎందుకు, ఏ పరిస్థితుల్లో చేశారో తెలుసుకోవటానికి ప్రయత్నించండి. అప్పటికీ తిన్నగా సమాధానం మీకు దొరకలేదూ అనిపిస్తే ఇక గుడ్ బై చెప్పెయ్యాల్సిందే!. చివరి క్షణాల్లో కూడా ఒక అవకాశం ఇచ్చాం అన్న తృప్తి కలుగుతుంది.

29. పుట్టుకతో ఎవరూ పర్ఫెక్షనిష్టులు అవరు. మాట తేడాలూ, స్క్రాప్ తేడాలూ జరిగి ఉండొచ్చు. దాన్ని హేళనకి గురిచేయ్యకండి. ఎలా మార్చుకోవాలో వారు అడిగితే - మీకు చేతనైనంత సహాయం చెయ్యండి.

30. మీ మిత్రులకి కొన్ని స్క్రాప్స్ వ్రాశాక, వాటికి జవాబు రాలేదే అనుకోండి. వారినేమీ నిందించకండి. మీతో వారికి స్క్రాపింగ్ ఇష్టం లేదులా అనుకోండి. కాస్త దూరం మైంటైన్ చెయ్యండి చాలు. ఆ దూరం అనేది మీ మీ స్నేహాన్ని బట్టి, మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం బట్టి ఉంటుంది.

31. మీ పరోక్షములో మీ గురించి మాట్లాడేవారిని ఏమీ అనకండి. వారి గుణం ఏమిటో, వారు ఎలాంటివారో వారే మీకు తెలియజేస్తున్నారు అనీ, అది మీకు అడగక ఇచ్చిన గొప్పవరం అనీ అనుకోండి. దానివలన మీకు విలువైన  సమయం వృధా కానందులకు బాగా సంతోషించండి.

32. ఎవరైనా క్రొత్తవారు మిమ్మల్ని సహాయం అడిగితే చెయ్యండి. ఇది ఆసక్తికర విషయం. ఎవరో తెలీదు ఒకరోజు ఒక స్క్రాప్. మీకు దగ్గరలోని ఫలానా ప్రదేశం చూడటానికి వస్తున్నాము. అక్కడ ఏమైనా A/C హోటల్స్ ఉంటే చెప్పండి. నెట్ లో ఎక్కడా దొరకక అడుగుతున్నాను అంటే - ఆ సాయంత్రం వాకింగ్ కి బయలుదేరి నాలుగు హోటల్స్ వివరాలు కనుక్కొని, రెంట్ ఎంతో + ఫోన్ నంబర్స్ తీసుకొని.. వారికి చెప్పాను. దీనివలన నాకు లాభం ఏమిటంటే - వాకింగ్ వల్ల ఆరోగ్యం, ఆ హోటల్స్ ఎలా ఉంటాయో, టారిఫ్ ఏమిటో అన్న కాస్త జెనెరల్ నాలెడ్జీ. వారితో కాస్త పరిచయం, కాస్త అరగంట సేవ. అంతే!. ఇది జరిగి రెండు సంవత్సరాలు అవుతున్నది. నాకూ ఏదైనా సమస్య వస్తే నెట్లో అడుగుతాను. దానికి ముక్కూ,మొహం తెలీనివారు చాలా మంది జవాబులు ఇస్తారు. వారే అంతగా సహాయం చేస్తున్నప్పుడు ఆఫ్ట్రాల్ నాదెంత -  పీపీలికం.

33. చాటింగ్ వల్ల, స్క్రాపింగ్ వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా అభివృద్ధి చేసుకోవచ్చును. ఒకప్పుడు ఇంట్రావర్ట్ ని అయిన నేను ఇప్పుడు బాగా మారాను. "కాస్త" కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చాయని అనుకుంటున్నాను. ఈ ఆన్లైన్ స్నేహాల వల్ల అదొక నాకు ప్లస్ పాయింట్.

34. ఇక్కడికి వచ్చింది ఎందుకో బాగా గుర్తుచేసుకుంటూ ఉండండి. స్నేహం కోసం అయితే స్నేహమే చెయ్యండి. ఫన్నీ కోసం అయితే ఫన్నీ గా ఉండండి.

35. నిజమైన స్నేహం చేసేవారితో నిజమైన స్నేహితునిలా ఉండండి. వారిని మోసగించేలా చూడకండి. ఎక్కడైనా పొరబాటు చేశారో మీరు వారికి దూరం అవుతారు.

36. మీకూ, మీ మిత్రుల మధ్య స్నేహం ఎంత ఉందో సంవత్సరానికి ఒక్కసారైనా పరిశీలించుకోండి. ఇది మీకు క్రొత్తగా ఉండొచ్చును. కాని ఈ సూచన మీకు బాగా ఉపయోగపడుతుంది. నిజానికి పరిచయం అయ్యాక నెలలోగా బాగా పెరిగి ఉండాలి. ఆ స్నేహం నిజాయితీతో కూడినది అయిఉండి, మీకు ఆహ్లాదాని, నమ్మకాన్ని కలుగచేయ్యాలి. అలాంటి మిత్రులు దొరికితే మీరు అదృష్టవంతులే. ఆరునెలలైనా ఆ స్నేహం రొటీన్ గా, ఇంకా హాయ్ అనేలా ఉందీ అంటే అంత మంచి స్నేహం కాకపోవచ్చును. ఇలాంటివాటిల్లో కాస్త మీ పాత్రా కాస్త ఉంటుంది. కాని మీరు వారికి తగిన స్క్రాప్స్ పంపాక కూడా ఇంకా అలాగే ఉంటే - అది నిశ్చయముగా గుంపులో గోవింద అన్నట్లుగా ఉండే స్నేహం అన్నమాట. ఇలాంటి వాటితోనే స్నేహం అంటే తెగ బోర్ అనే ఫీల్ వస్తుంది.

37. మనం ఎవరితో సవవాసం చేస్తే వారి గుణాలు మనకీ వస్తాయి. అందుకే వారిని జాగ్రత్తగా ఎంచుకోండి. కవిత్వం వ్రాసేవారితో స్నేహం చేస్తే - కవితలు వ్రాయకున్న కవితలని విని / చదివి భరించే శక్తి వస్తుంది. హ హ హ్హ..

38. వాదనలు ఎప్పుడూ పెట్టుకోకండీ! అది స్నేహం మధ్య పెద్ద లోతైన అఘాతాన్ని సృష్టిస్తుంది. దానివల్ల మునపటిలా స్నేహం ఇకముందూ కుదరకపోవచ్చును.

39. సారీ చెప్పటం పెద్ద నేరం కాదు. అలా చెప్పటం వల్ల మీ ఆస్థులు ఏమీ కరిగిపోవు, మీ వ్యక్తిత్వం ఏమీ దెబ్బ తినదు. అలా చెబితే - మీ స్నేహం మరీ బాగుంటుంది. అలాగే మీ వ్యక్తిత్వం ఇంకా బాగుంటుంది.

updated on 17-April-2011

2 comments:

vanajavanamali said...

yentha opika andee!! chalaa viluvaina vishayaalu nerchukuntunnanu. naalaa yendharo!! dhanyavaadhamulu.mee blog ni mudranaa doopamloki maarchi yeppudainaa yekkadainaa chadhuvukune veelu kalginchandi..plz..

Raj said...

మరీ అంతగా ఓపిక లేదు లెండి.. ఏదో చిన్నగా!.. చాలా విషయాలు నేర్చుకుంటున్నందులకు సంతోషం. మీకు అంతలా ఉపయోగ పడుతున్నందులకు నాకు చాలా ఆనందముగా ఉంది. మీరిచ్చిన సూచన బాగుంది. ముద్రణా రూపం లోకి మార్చటానికి ప్రయత్నిస్తాను.

Related Posts with Thumbnails