Wednesday, April 6, 2011

Social NW Sites - 24 - మిత్రులు మనకి ఆడ్ అయ్యాక..

ఎన్నెన్నో వడపోతల తరవాత మనం మిత్రులని ఆడ్ చేసుకుంటాము కదా.. అలా వడపోసి ఆడ్ చేసుకోవటం ఈరోజుల్లో తప్పనిసరి అయ్యింది కూడా! మన దైనందిక జీవితాల్లో స్నేహాలని ఎదురుగా, కంటితో చూసి, మాట్లాడి, పరిశీలించి స్నేహముగా మెలగాలో, వద్దో నిర్ణయించుకుంటాము. కాని ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ మనిషి కనపడదు. మాటలూ వినపడవు. దగ్గరగా ఉండరు కూడా. అయినా ఇది ఇక్కడ తప్పదు. వెనకట్లో కలం స్నేహాలు ఉండేవి. ఉత్తరాలల్లో ఊసులు చెప్పుకుంటూ, ఆ ఊసులని భద్రముగా చేతికి ఇచ్చే ఉత్తరాన్ని, అది తెచ్చి ఇచ్చే పోస్ట్ మ్యాన్ నీ బాగా ఆత్మీయముగా చూశారు. కాలం మారింది. ఇప్పుడు ఆ పోస్ట్ మాన్ స్థానాన్ని ఈ సోషల్ సైట్లూ, ఉత్తరాల స్థానాన్ని స్క్రాప్స్ పూర్తిగా ఆక్రమించుకున్నాయి.

ఈ ఆన్లైన్లో ముక్కూ, మొహం అంతగా కనిపించవు. లేని పోనీ భేషజాలకి పోతుంటారు. కొందరు ఇంకా 1947 కాలం నాటి భావాలని చూపిస్తుంటారు. వారు చెప్పే వివరాలని బట్టే వారు ఎలాంటివారో గమనిస్తూ, స్నేహం చెయ్యాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ క్రొత్తగా, వింతగా ఉంటుంది. అది అంతకు ముందు ఎన్నడూ చవిచూడని అనుభవం. అక్కడే కొన్ని పొరబాట్లు చేస్తుంటాము. తెలీని విషయములో పొరబాట్లు మానవ సహజం. కాని అది ఎంత తొందరగా తెలుసుకొని, తప్పు దిద్దుకుంటామో అనేది అంతా మన చేతుల్లో ఉంటుంది. ఇక్కడ మీకు ఎవరూ సహాయం చెయ్యరు. వారంతట వారుగా ఎవరూ సహాయం చెయ్యరు. అంతా మనంతట మనం గానీ, ఇతరుల సహాయముతో మన సమస్యలకి సలహాలను తీసుకొని బాగుపడాలి. ఇక్కడ ఏర్పడే సమస్యలన్నింటికీ మనం ప్రవర్తించే పద్ధతి బట్టి, ఎంచుకున్న స్నేహాలని బట్టీ ఏర్పడుతుంటాయి. కాబట్టి ముందే స్నేహితుల విషయములో కాస్త జాగ్రత్తగా ఎంపిక ఉంటే స్నేహ మాధుర్యాన్ని, చాలా బాగా ఆస్వాదించవచ్చును.

మొదట్లో నేనూ అంతే!.. అంతా క్రొత్త.. ఎదురుదెబ్బలు బాగా తగిలాయి. కొన్ని అందమైన స్నేహ మాధుర్యాలని పొరబాట్లు చేసి వదులుకున్నాను. కొన్నింట్లో అనవసర స్నేహాలు చేసి ఎదురు దెబ్బలూ తగిలించుకున్నాను. అప్పుడు నేను ఈ సోషల్ సైట్లలో ఎలా ఉండాలో తెలీని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేను చెబుతున్న విషయాలంటివి నాకు ఎక్కడా అగుపించలేదు. అలాగా ఆరోజుల్లో ఎవరైనా చెబితే శుభ్రముగా ఫాలో అయిపోయేవాడినే! నాలాంటి పొరబాట్లు ఇతరులు ఎవరూ చేయొద్దని, నాలాంటి వారికి ఒక చిన్న సూచిక లా ఉంటుందని, ఇదంతా కష్టపడి చెబుతున్నాను. అది తరవాత ఈ టపా చివర్లో మాట్లాడుకుందాము.  

ఇప్పుడు మనం ఒక మిత్రుడిని మన స్నేహ హస్తం అందుకోవటానికి అంగీకరించాము కదా!. ఇలాంటి నూతన మిత్రుడిని ఓకే చేశాక, వారి గురించి కాస్త తెలుసుకోండి. ఆడ్ అయ్యే ముందు కన్నా, ఆడ్ అయ్యాక వారి వారి ప్రొఫైల్ లో డిటైల్స్ ఇంకా బాగా కనిపిస్తాయి. ఇక్కడ వారి గురించి తెలుసుకోవాలంటే వారిచ్చే సమాచారము మీదే ఆధారపడాల్సి ఉంటుంది. కాస్త ప్రయత్నం చేస్తే, ఇంకా బాగా తెలుసుకోవచ్చును. అది మీ టాలెంట్ బట్టి ఉంటుంది.

ఇప్పుడు మనం వారి ఆడ్ రిక్వెస్ట్ ఒప్పుకునే ముందు - కొన్ని తెలుసుకుంటాముగా. ఇప్పుడు అవి నిజమా కాదా అనేది బాగా పరిశీలించాలి. కొన్ని సోషల్ సైట్ల సెట్టింగ్స్ వల్ల వారి వివరాలు అన్నీ చీకటిలో ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయితేనే చూసే పద్ధతిలో సెట్టింగ్స్ పెట్టి ఉండోచ్చును. నిజానికి అలా పెట్టడములో వివరాలు జాగ్రత్తగా కాపాడుకోవటం అన్నమాట. మీ పర్సనల్ వివరాలు కాపాడుకోండి. అది ఎక్కడైనా, ఎప్పుడైనా సమ్మతమే.. కాని ప్రొఫైల్ లో ఉండే అభిరుచులు, ఇష్టమైన సినిమాలు, ఇష్టమైన వంటకాలు మొదలైన విషయాలు కూడా నింపేయకుండా ఖాళీగా ఎందుకు వదిలేస్తారో.. అవి బయటకి తెలిసినా ఏమీ ఇబ్బంది ఉండవు. అలాంటి వివరాలు హాయిగా వ్రాసేసుకోవచ్చును. ఇలాంటి వివరాలని మీకు క్రొత్తగా ఆడ్ అయిన మిత్రుల ప్రొఫైల్ లలో చూడండి. మీ రుచులకీ, వారి రుచులకీ ఎంత దగ్గరగా కలసిపోయాయో ఇందులో తెలుస్తుంది. దాని వల్ల భవిష్యత్తులో ఎంత దగ్గరగా మీ స్నేహం ఉండబోతుందో ఇందులోని వివరాల వల్ల చూచాయగా చెప్పవచ్చును.

మీ రుచులూ, అభిరుచులూ, ఇష్టాలూ, అయిష్టాలూ ఒక వృత్తం అనుకుంటే - అవతలి వారి అభిరుచులూ, ఇష్టాయిష్టాలు.. అదొక వృత్తముగా తీసుకొంటే - ఈ రెండు వృత్తాలూ ఎంతగా కలసిపోయాయి అన్నది చూసుకుంటే ఇక మీరు భవిష్యత్తులో అంతగా దగ్గరగా ఉండబోతున్నారు అన్నమాట. ఈ విషయములో మీకు కాస్త అనుభవం ఉంటే ప్రొఫైల్ చూసిన కాసేపట్లోనే ఒక నిర్ణయానికి రాగలరు. ఈ క్రింది పటం చూడండి. ఈ పటం లోని వంకాయ రంగు ఎంతగా ఎక్కువగా ఉంటుందో అంతలా మీ స్నేహం ఉండబోతుంది అన్నమాట. ఒక్కోసారి పరిచయం అయిన మొదట్లో చాలా తక్కువగానో, ఎక్కువగానో ఉండొచ్చు. ఆ తరవాత ఆ భాగం పెరిగేలా చేసుకోవటం ఆ ఇద్దరి మీదా ఉంటుంది. ఒకవేళ అది అలా పెరగలేకపోవటానికి గల కారణం - ఏ ఒక్కరి వల్లనో, ఆ ఇద్దరిమీదనో ఉండవచ్చును.


కొన్ని సోషల్ సైట్స్ సెట్టింగ్స్ వలన ఎదుటివారి విషయాలు అంతగా తెలియక పోవచ్చును. ఆడ్ అయ్యాక - visible to friends అనే సెట్టింగ్ వల్ల ఇప్పుడు వారికి మరింతగా కనిపిస్తాయి. ముందుగా మీరు వారికి స్నేహ హస్తాన్ని మీ నుండి ఇవ్వటం మొదలెట్టండి. "మీ స్నేహాంగీకర అభ్యర్ధన ని మన్నించాను. నేను మిమ్మల్ని నా స్నేహితుల గుంపులోకి చేర్చుకున్నాను.." అని అర్థం వచ్చేలా మీకు వచ్చిన భాషలో చెప్పండి. దీని వలన మీరు కలుపుగోలు మనిషి అంటూ అని కాస్త ఒక లుక్ వస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని అన్నట్లుగా ఉంటుంది. దీని వలన అతనికి ఎప్పుడు పరిచయం అయ్యామో అతని స్క్రాప్ బుక్ లో ఒక మైల్ స్టోన్ లా ఉంటుంది.

ఇప్పుడు అతను ఏమిటో ఒక అవగాహనకి రావటానికి వారి వివరాలు అన్నీ మరొక్కసారి పరిశీలించండి. ఫ్రెండ్స్ కి మాత్రమే చూపే వివరాలు కూడా ఇప్పుడు కనిపిస్తాయి కాబట్టి ఇప్పుడు ఒక స్పష్టమైన అవగాహనకి రావచ్చును. ఇప్పుడు మరొక్కసారి వారి వివరాలు గమనించండి. మీ మ్యూచువల్ స్నేహితులని అడిగి తెలుసుకున్న వివరాలు, అలాగే మీరు అంచనా వేసుకున్న వివరాలు - ఆ ప్రొఫైల్ లోని వివరాలతో సరిపోలాయో చూసుకోండి.   

ఆ తరవాత వారికి కొద్దిరోజులు మరచిపోకుండా పలకరించండి. చాలామంది ఇక్కడే పప్పులో కాలు వేస్తారు. ఈ విషయాన్ని బాగా నిర్లక్ష్యం చేస్తారు. ఆడ్ చేసుకున్నాక మనవంతుగా కొన్ని స్క్రాప్స్ అంటూ వ్రాయాలి. వాటికి జవాబులు ఎలా వస్తున్నాయో గమనించండి. అవన్నీ మామూలుగా, జెనరల్ విషయాల మీద మాట్లాడాలి. చాలామంది మాత్రం వెంటనే పర్సనల్ విషయాలు అడిగేస్తుంటారు. అలా మొదట్లో అడిగితే ఎవరూ చెప్పటానికి ఇష్టపడక పోవచ్చును. ఒకవేళ మిమ్మల్ని ఇలా అడిగారు అనుకోండి. అప్పడే అనుకోండి - ఎదుటివారు తమకి ఏ విధముగా ఉపయోగపడతారు అన్న కోణములోంచి చూస్తున్నవారై ఉంటారు అనీ. నన్ను ఇలా అడిగినవారిలో చాలామంది ఇప్పుడు అంతంత మాత్రమే - ఏదో ఉన్నారా అంటే ఉన్నారు అన్నట్లుగా ఉన్నారు. వారితో నా స్నేహం అంతగా పెరగలేదు. ఏదో హాయ్ అంటే హాయ్. అంతే!. ఇదే విషయం మీద ఎప్పుడో ఒక టపా కూడా వ్రాశాను - పరిచయం అయిన క్రొత్తలోనే రెండో మాటగా మీరేం చేస్తారూ అని అడిగితే ఆ పరిచయం లో ఆర్ధిక లబ్ది మాత్రమే కనిపిస్తుందని. అది ఇక్కడ కూడా అన్వయించుకోవాలి.

వారు అడిగారు కదా అని మీరూ అప్పుడే అడగండి. వారు ఏమి అడుగుతున్నారో అవే ప్రశ్నలని మీరూ వారిని అడగండి. అలా చేస్తే మేమూ వారిలా అవుతాం కదా అనే అనుమానం పెట్టుకోకండి. మొదట ఆ పద్దతి వారు పాటించాక మనమూ వారి దారిలో వెళ్ళటం ఏమీ తప్పుకాదు. నేను ఈ పద్ధతిని బాగా ఫాలో అవుతాను. అలా అడిగాక ఏ సమాధానాలు వచ్చాయో చూడండి. వాటిని కాస్త విశ్లేషించండి.  

ఏదో ఒక స్క్రాప్ వ్రాసేసి వెళ్లిపోయేవారికి - స్నేహాన్ని ఎలా పెంచుకోవాలో తెలీదు అన్నమాట. వారికి ఎలా ఇతరులతో వ్యవహరించాలో కూడా సరిగా తెలీని పరిస్థితుల్లో ఉంటారు. ఏమి మాట్లాడాలో తెలీని వారు కూడా చాలామంది ఉన్నారు. ఇందులో ఏముందీ! కాస్త టీవీ చానల్ ప్రోగ్రామ్స్ చూస్తే చాలు - ముక్కూ మొహం తెలీనివారితో ఆ టీవీ యాంకర్స్  ఎలా మాట్లాడుతున్నారో కాస్త గమనించండి. ఎలా మాట్లాడాలో మీకు కాస్త అర్థం అవుతుంది. అలా కంటిన్యూ చేస్తూ పోతూ ఉంటే స్నేహం అలా దృడం గా మారుతుంది. ఇది తెలియక చాలా స్నేహాలు మొదట్లోనే ఆగిపోతాయి. కొద్దిరోజుల తరవాత చూస్తే - మన ఫ్రెండ్ లిస్టులో చాలామంది ఉంటారు కాని, మాట్లాడేవారు తక్కువగా ఉంటారు. స్నేహం అనేది కేవలం ఆడ్ చేసుకుంటేనే పెరిగేది కాదు. మాట్లాడుతుంటే పెరిగేది.

వెనకటికి ఒక సామెత - వస్తూ పోతుంటేనే బంధుత్వాలు అనే సామెతని కాస్త మార్చుకుంటే, స్క్రాప్స్ వ్రాస్తూ ఉంటేనే గదా స్నేహాలు అని ఇక్కడ ఫిక్స్ అయిపోవచ్చును. మనం చిన్నప్పుడు క్లాసుల్లో ఈ విషయాన్ని స్పష్టముగా గమనిస్తాము. ఎవరితో మనం ఎక్కువగా మాట్లాడుతుంటే వారితో బాగా క్లోజ్ గా ఉంటాము. మనం మాట్లాడించినా, వారు మాట్లాడకపోతే అక్కడ వారిని వదిలేసి ఇంకొకరితో ఎలా ఉంటామో ఇక్కడా అంతే!. అది అక్కడ అనుభవమే. అప్పుడే ఈ సోషల్ సైట్స్ బోర్ అనిపిస్తుంటాయి. ఇది కాదనుకొని ఇంకో సైట్లలోకి వెళుతుంటారు. అక్కడా ఇలాంటివారు తగులుకుంటూనే ఉంటారుగా. అందుకే మొదటి నుండీ చెబుతున్నాను. ఈ ఆన్లైన్ లో స్నేహితుల ఎంపికని జాగ్రత్తగా ఎన్నుకోండి. దాని వలన మీకు మానసిక శాంతి, మంచి సజ్జన సాంగత్యం, మంచి మిత్రులూ, మంచి ఆహ్లాదకరమైన స్నేహం చవిచూస్తారు.

ఆడ్ అయ్యాక వారి వివరాలు అన్నీ చూశారుగా. అలాగే ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాడు, ఎలాంటి స్క్రాప్స్ వారి మధ్య నడుస్తున్నాయి అనేది చూడండి. "మీ స్నేహితుల గురించి చెప్పండి మీ గురించి చెబుతాను.." అన్న ప్రవచనం ప్రకారం వారి మిత్రుల గురించి చూస్తే చాలు. ఈమధ్య కాలములో ఒక ఆడ్ రిక్వెస్ట్ వస్తే పరిశీలించాను. అన్నీ ఉన్నాయి. ఫుల్ డిటైల్స్, హాబీస్, అతని ఫొటోస్.. ఇలా అన్నీ ఉన్నాయి. వీడియోలకి, స్క్రాప్ బుక్ కీ తాళం ఉంది. అన్ని విధాల అర్హుడే!. ఓకే చేశాను. తీరా స్క్రాప్ బుక్ లోపల ఏమున్నాయా అని జెనరల్ గా చూద్దామని వెళ్ళా - అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుందో, అతని స్నేహితులు ఎలాంటివారో, అతనికి ఎలా స్క్రాప్స్ పంపిస్తున్నారో అనీ! లోపల చూడగానే నిజముగా నేను షాక్ కి గురయ్యాను. నిజమా అనుకున్నాను. నిజమే. డీపీ గా అమ్మాయి ఫోటో, అమ్మాయి పేరు పెట్టుకొని పంపిన ఒకరి స్క్రాప్స్ చాలా ఉన్నాయి. అవన్నీ నగ్న చిత్రాల తాలూకు వీడియోలూ, బొమ్మలకి సంబందించినవి. అవంటే అతనికి బాగా ఇష్టములా ఉన్నాయిలా ఉంది. చాలావరకూ అవే. ఓపెన్ గా స్క్రాప్స్ లోనే ఇలా ఉంటే, ఇక లాక్ వేసిన వీడియోలలో ఇంకెన్ని ఉన్నాయో! అవన్నీ అతనికి ఇష్టములా ఉంది అనుకొని, ఆ వెంటనే అతన్ని రిజెక్ట్ చేసి, బ్లాక్ లిస్టులో పెట్టేశాను. అతన్ని నేను అలాగే ఫ్రెండ్ గా ఉంచేసుకుంటే నేనూ అలాంటివాడినేమో అనుకొనే ప్రమాదం ఉంది. ఈ టపా వ్రాయటానికి కారణమూ అయ్యింది. అందుకే అన్నీ చూడమని అంటున్నాను. అలా  అయ్యాకే మీ స్నేహితునిగా ఆడ్ చేసుకోండి అని చెప్పేది.


ఇది ఆ స్క్రాప్ బుక్ లోని పేజీ యే!.. ఫ్రీ పబ్లిసిటీ, బ్లాగ్ రేటింగ్స్ పెంచుకోవటానికి, ఆడవారినీ కించపరిచేలా, ఇతరులపై నిందలు మోపుతున్నానని.. ఇలాంటివి కామెంట్స్ రాకుండా ఉండటానికి ఇలా మొత్తం పేజీయే చాలా అస్పష్టముగా మార్చి పెడుతున్నాను. నిజానికి ఈ ఫోటో పెట్టొద్దు అని అనుకున్నాను. కాని చాలా తర్జన భర్జన తరవాత ఇలా చేసి పెట్టాను. నేను చెప్పే టపాలు ఊహించి కాల్పానిక కథ అని కాకుండా ఉండాలని, దానికో ఆధారం చూపాలని అనుకొని, ఈ సోషల్ సైట్లలో ఇలా జాగ్రత్తగా ఉండాలని చెప్పే భాగములో ఇలా పెట్టడం జరిగింది. ఒకవేళ అలా కాకుండా చూపాలీ అనుకుంటే ఏ ఆటవికునిలా అంతా స్పష్టముగా కనిపించేలా పెట్టేసేవాడినే. ఇక్కడ ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి చెప్పట్లేదు. ఇక్కడ కేవలం విషయ పరిచయం చేస్తున్నాను. అంతే!.

అవతలివారు ఆడ్ అయ్యాక మనకి ఎంత త్వరగా రిప్లై ఇస్తున్నారో గమనించండి. వారు వ్రాసే పద్ధతినీ గమనించండి. చాలా మంది ఆడ్ అయ్యాక ఎలా మాట్లాడాలో తెలీకనో, ఇంకేచేతనో సరిగా వ్రాయరు. అలా వ్రాయని వారి విషయం తెలుసుకోవాలని ఉంటే చిన్న కిటుకు ద్వారా తెలుసుకోవచ్చును. అది చాలా సింపుల్. ఏమిటంటే వారి స్క్రాప్ బుక్ లోని మొదటి రెండు పేజీలలో ఏమేమి స్క్రాప్ వచ్చాయో అవి ఎన్ని రోజుల తేడాతో ఉన్నాయో చూడండి. అవతలి వారు ఆక్టివ్ గా ఉన్నట్లయితే ఆ స్క్రాప్స్ డేట్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి. దాన్ని బట్టి వారు ఎన్నిరోజులకి ఒకసారి వస్తున్నారో ఎదుటి వారు తేలికగా తెలుసుకోవచ్చును. అలా వారి స్క్రాప్ బుక్ లో ఉంటే "వీరు ఇన్ని రోజులకి ఒకసారి వస్తుంటారు.." అని మీరు ఒక నిర్ణయానికి రావచ్చును. అంతే అనుకోండి గానీ, డెలీట్  చెయ్యటానికి వెళ్ళకండి. ఎందుకో చెబుతాను వినండి.

కాని ఇక్కడ మీరు మరచిపోలేని ఒక విషయం చెబుతాను. కనిపించేవన్నీ నిజాలు అని అనుకోవద్దు. నిజానికి వారు ఏ హాస్పిటల్ పనిమీదో, లేదా ఏ డెడ్ లైన్ పెట్టుకొని సాఫ్ట్ వేర్ డెవలపింగ్ పనిలో ఉండొచ్చును. అంతమాత్రాన అలా స్క్రాప్ బుక్ చూసి ఒక నిర్ణయానికి రాకండి. అది ఎన్నడూ మంచిది కాదు. ఇక్కడ ఏమీ కనపడదు. అక్షరాలే కనిపిస్తాయి. వాటిని చూసి ఒకరిని జడ్జ్ ఎన్నడూ చెయ్యలేం!. వారిని గమనించాల్సి ఉంటుంది. అవతలి వ్యక్తి ఎలాంటివాడు, ఎదుటివారితో ఎలా ఉంటున్నాడూ అనేది బాగా పరిశీలించాక నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైన పధ్ధతి అంటే - వారినే డైరెక్ట్ గా అడగటమే! అలా చేస్తేనే అన్ని విషయాలకి సమాధానాలు దొరుకుతాయి. అవతలివారి సమస్య ఏమిటో, ఎందుకు ఆన్ లైన్ కి రావటం లేదో తెలుస్తుంది. తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రావటం ఎంత తప్పో ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ముగిస్తాను.

నా ఆన్లైన్ మిత్రురాలు ఒకరు రెండు సంవత్సరాల క్రింటే పరిచయం. ఆవిడ గారు అప్పట్లో బాగా మాట్లాడేవారు. ఆ తరవాత వారు ఇల్లు కట్టుకొని, ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఇల్లు కట్టే సమయములో ఆవిడకి ఆడ్ అయిన మిత్రులకి ఈ విషయం తెలీదు. ఈవిడగారు ఆడ్ చేసుకొని నాతో మాట్లాడటం లేదు అని నాకు కంప్లైంట్ చేస్తే, చెప్పాను తన పరిస్థితి. తనకి ఆన్లైన్ లోకి వీలున్నప్పుడు వస్తారు. జాబ్ చేస్తున్నారు అనీ. వారు అర్థం చేసుకున్నారు. ఇంకో మిత్రుడు ఉద్యోగం వచ్చిందని అసలు ఆన్ లైన్ కి రావటమే లేదు. ఎప్పుడో ఒకసారి వస్తుంటాడు. ఈ విషయం అతని లిస్టు లో ఉన్న మిత్రులకి తెలీక నన్ను అడిగితే చెప్పాను ఇలా అనీ. ఇంకొకరు హాస్పిటల్ లో ఉన్నారు. తన మిత్రురాలు అడిగితే చెప్పాను. తనకు జ్వరం - త్వరలో వస్తారు అనీ. ఇక్కడ కామన్ గా గమనించాల్సిన విషయం ఏమిటంటే - అవతలివారు నన్ను పట్టించుకోవటం లేదు కాబట్టి వారిని నా ఫ్రెండ్ లిస్టు నుండి తీసేస్తాను అనేది. తెలీక అన్నీ అలా నిజమే అనుకుంటే ఎలా.?

పోరపోచ్చాలు రావటం ఆన్లైన్ లో అతి సహజం. దాన్ని పెద్దగా చేసుకొని డెలీట్ వరకూ పోతే ఎలా.? అసలు విషయం తెలిశాక - సారీ చెప్పినా వినే స్థితిలో వారు ఉండరు. నిజం. ఇలా నాకు ఒక అనుభవం జరిగింది కూడా. ఒక రచయిత్రి విషయములో అలాగే జరిగింది. చాలారోజులుగా ఆవిడ గారు నా స్క్రాప్స్ కి జవాబులు ఇవ్వటంలేదు అని తీసేశా. తరవాత ఏదో సందర్భములో ఇంకో మిత్రురాలు చెప్పారు (తనకి తరవాత చెప్పారట) - తనకి చాలా మేజర్ ఆపరేషన్స్ జరిగాయనీ, అందువల్లే ఆన్లైన్ లోకి రాలేకపోయారనీ.. హయ్యో అదా విషయం అనుకోని నేను సారీ చెబుతూ, ఆడ్ రిక్వెస్ట్ పెడితే రిజెక్ట్ చేశారు. మళ్ళీ సారీ చెబుతూ స్క్రాప్ పెట్టబోయాను గానీ, మిత్రులు కాని వారు వ్రాయకుండా సెట్టింగ్స్ ఉన్నాయి. అలా చాలా గొప్ప స్నేహాన్ని వదులుకున్నాను. ఇలాంటివి మీకు ఎదురు కావద్దని ఇదంతా మరియు నా వైఫల్యాలూ చెబుతున్నాను. కనీసం మీరైనా జాగ్రత్తల్లో ఉంటారనీ!.

అంతకు ముందూ, మొన్న వరల్డ్ కప్ ఫైనల్ అప్పుడు, కొద్దిమంది మిత్రులు అడిగారు - చిట్ చాట్ గా. ఇంతగా అందరికీ ఎందుకు ఇంత కష్టపడి ఎందుకు వివరముగా చెబుతున్నారు అనీ!. పైన ఉన్న మూడో  పేరాలోని ఆ విషయం చెప్పాను. ఇంకో విషయమూ వారికి చెప్పాను - అది ఏమిటంటే పైన చెప్పిన ఉదాహరణ లాగానే!. నేను వారి లాగానే ఇంకొద్ది రోజులవరకూ వారిలాగా ఆన్ లైన్ కి వచ్చేది. అతనికి అర్థం కాలేదు. నిజానికి ఇది ఈ సీరీస్ చివరలో చెప్పాలి. చెబుతాను కూడా.

అయినా ఇక్కడ కాస్త చెబుతాను. వారికి ప్రైవేట్ గా చెప్పొచ్చు, కాని ఎలాగూ చివరలో ఓపెన్ గా చెప్పాలి కాబట్టి కాస్త ఇక్కడ చెప్పేస్తున్నా. ఏమిటీ! అని షాక్ అయ్యారా? నిజమే! జూన్ 2010 లో అనుకున్నాను. ఆగస్ట్ 15 వరకూ అనీ. ఆ తరవాత కొందరు నిజమైన మిత్రుల విషయములో ఆన్లైన్ కి వచ్చాను. (ఈ విషయం నా ముగ్గురు మిత్రురాళ్ళకీ, ఒక మిత్రుడికి మాత్రమే తెలుసు. ఇందులో ఒకరికి ఆ జూన్ లోనే తెలుసు.) ఇప్పుడు ఇంకా కొద్దిరోజుల గడువు అంతే! ఆ తరవాత నా బీజీ లైఫ్ లో మునిగిపోతాను. అలా ఎందుకు అంటే - నా మిత్రురాళ్ళు, మిత్రులూ కొంతమంది ఆన్లైన్ లో ఎదురు దెబ్బలు తినడం చూసి, నన్ను సలహాలు అడిగితే చెప్పేవాడిని. నేను వెళ్ళిపోతే ఎలా అంటే - వారి సూచన మేరకు నాకు తెలిసిన విషయాలని (ఈ బ్లాగ్ హెడ్ లైన్ లో చెప్పినట్లు) ఇక్కడ ఒక మాన్యువల్ గా వ్రాస్తున్నాను. ఇంకా నాలుగో ఐదో పోస్ట్స్ ఉన్నాయి. (ఈ చివరి పోస్ట్స్ తప్పక చూడండి. దయచేసి మిస్ అవకండి. అవే మీకు బాగా ఉపయోగపడేవి.) అది అసలు విషయం. అందులోని చివరి పోస్ట్ లో ఈ విషయం వివరముగా చెబుతాను. అందుకే నా అనుభవాలన్నింటినీ గుది గుచ్చి, కష్టపడి మీకు అందించటం.

First updated on : 7-March-2010 Morning

No comments:

Related Posts with Thumbnails