Saturday, August 7, 2010

మా బాబు - MS ఆర్టూ

మొన్న ఆమధ్య - రాత్రి పదకొండు గంటలప్పుడు అనుకుంటా.. నా  బ్లాగు  కార్యక్రమాన్ని చూస్తున్నాను. అప్పుడే  మొదటి తరగతి చదివిన మా బాబు వచ్చాడు..
"ఏంట్రా.. నిద్రరావటం లేదారా!.." అని అడిగాను.
"లేదు డాడీ!.." అన్నాడు.
మొఖం చూస్తే నిద్ర మొఖం లేదు. వచ్చి నా సిస్టం దగ్గరకి కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు.
"పడుకుంటే  కాదా? రేపు ఊరికి వెళ్ళాలిగా.." అన్నాను - వాడిని అక్కడినుండి పంపించేసి నా బ్లాగు పని చూసుకుందామనే ఉద్దేశ్యముతో.
"రేపు సండే కదా.." అన్నాడు.
వాడలా కూర్చున్నప్పుడు బ్లాగు కోసమని ఒక ఫోటో MS పెయింట్ లో ఎడిట్ చేస్తున్నాను.
"ఇది ఇలా చేస్తారా.." అని అడిగాడు..
"అవును" అని చెప్పాను.

వాడు ఆసక్తి చూపిస్తున్నప్పుడే చెప్పాలి - ఇనుము వేడయ్యినప్పుడే ఎలా అంటే అలా వంగుతుంది అనే సూక్తి గుర్తుకవచ్చి - "సరే నేర్చుకుంటావా?.. చెబుతాను.." అని ఏమి బొమ్మ వెయ్యాలో అడిగాను.
"జంతువుల బొమ్మలు" అని చెప్పాడు.
జంతువుల బొమ్మలు వెయ్యటం వాడికి కష్టమని నేనే "బస్సుల ఫోటో ఎలా వెయ్యాలో నేర్పుతాను నేర్చుకుంటావా.. లేక నిద్రవస్తున్నదా? పడుకుంటావా?.." అని అడిగాను.
"చెప్పు డాడ్!.." అన్నాడు.

సరేనని మొదలెట్టాను. ఒక్కక్కటీ వివరిస్తూ ఎలా వెయ్యాలో చూపాను. నిజానికీ నాకూ MS పెయింట్ ని ఊరికే ఫోటోల మీద పేర్లు వ్రాయటానికి వాడటం మాత్రమే తెలుసు. బొమ్మలు వేసేటంత అనుభవం, పాటవం గానీ నాలో లేవు. ఒక్కమాటలో చెప్పాలీ అంటే అప్పటికప్పుడు ఒక్కో పద్దతీ, టూల్స్ గురించీ తెలుసుకుంటూ, నేర్చుకుంటూ వాడికి బొమ్మలు ఎలా వెయ్యాలో చూపాను. నిజానికి  MS పెయింట్ వాడి ఇంత అందమైన బొమ్మలు వెయ్యోచ్చనీ నాకు తెలీదు. నాకు మొదటగా దాన్ని చూపిన అతను కేవలం గీతలు ఎలా కొట్టాలో, డబ్బాలు ఎలా గీయాలో నేర్పాడు అంతే. దానికే "అబ్బో! నాకు చాలా వచ్చేసిందే..!" అని చాలారోజులు ఫీలయ్యా. అలా వాడికి - స్కూల్ బస్ బొమ్మ వేస్తూ ఎలా వెయ్యాలో చూపించాను.. వేస్తున్నా కొద్దీ ఇంకా అందముగా  వెయ్యొచ్చు.. అని తెలుస్తూనే ఉంది. కాని వాడి తెలివికి ఇదే సరిపోతుందని సగములోనే ఆపేసి, రంగులూ, హంగులూ అద్దాను. అందులోనే పిల్లల ఫోటోలూ కాపీ, పేస్ట్ చేసి అతికాను. ఒక ముప్పావు  గంటలో  ఇలా  వేసేశాను..

ఆ తరవాత నేను బాత్రూం కి వెళ్లి వచ్చేసరికి, వాడు సిస్టం ముందు కూర్చొని, నేను వేసిన బొమ్మనే - ఇప్పుడు తను గీయటం మొదలెట్టాడు. నేను హాశ్చర్యపడిపోయాను. ఏమీ అనలేదు. ఇప్పుడు నేను వాడి స్థానములో కూర్చొని చూస్తూ పోయాను. వాడేలా గీసినా ఏమీ అనటం లేదు. ఎందుకంటే వాడి ఊహాశక్తికి నేను అడ్డుపడదలచుకోలేదు. అలా పడితే వాడు ఇక తనలోని సృజనని, బయటకి తీయడేమోనని నా భయం.

మధ్యలో ఏదైనా టూల్స్ గురించి అడిగితేనే - చెప్పాను. ఎక్కడా జోక్యం చేసుకోలేదు. మొత్తం వేశాక గుడ్ అని వాడి వీపు తట్టాను. ఇక చాలు రేపు వేసుకుందువు గానీ.. రేపు సండేనే కదా.." అని చెప్పాను వాడితో. పుత్రోత్సాహము వల్ల నేను ఏమీ చెప్పను.. చెబితే ఆయుక్షీణం అంటారుగా. వాడేలా గీశాడో మీరే చెప్పాలి. ఇదిగో వాడు వేసింది చూడండి. 

ఇక్కడ ఒక విషయం చెబుతాను. నేను అలా వాడికి నేర్పించక ముందు వాడు "అద్భుత చిత్రకళా నైపుణ్యం" చూపేవాడు. అవి క్రింద చూపిస్తున్నాను. అవీ చూడండి ఇక్కడ. ఇలా వేసేవాడు ఆ రాత్రి నేర్పినదానితో బాగా వేయటం మొదలెట్టాడు.

అబ్బా!.. ప్లీజ్.. నవ్వకండీ.. వాడు ఫీల్ అవుతాడు..

4 comments:

రాధిక(నాని ) said...

బాబు చాలా వేసాడండి.

రాధిక(నాని ) said...

బాబు చాలా బాగా వేసాడండి

Raj said...

చాలా కృతజ్ఞతలు..

Manjusha kotamraju said...

బాగా వెసాడు బొమ్మలు

Related Posts with Thumbnails