Friday, May 14, 2010

బైక్ మీద భద్రాచలం - అన్నవరం టూర్ (1)

నాకు అసలు లాంగ్ డ్రైవ్స్ అంటే అసలే తెలీదు.. ఏదో అలా 100 కిలోమీటర్లు అలా వేల్లోస్తే అదే పెద్దగా ఫీల్ అయ్యేవాడిని.. అని ఇందాకే ఒక పోస్టులో మీకు చెప్పుకున్నాను. అలా గొప్పగా ఫీల్ అవుతున్న సమయములో నాకు కనువిప్పుగా మా దగ్గర నుండి తిరుపతికి, శ్రీశైలం కి మోటార్ బైకుల మీద అలా వేల్లోచ్చారని తెలిసినది. అసలు నమ్మలేదు.. అంతా అబద్దమని అనుకున్నాను.  ఆ తరవాత నా స్నేహితుడు యమహా బైకు మీద అతడూ అతడి స్నేహితుడూ కలసి షిరిడీ, శని శింగనాపూర్ కి వెళ్లి వచ్చారు. ఆ విషయం తెలిసి అప్పుడు నమ్మాను. నేనూ బైకు మీద అలా వెళ్లి రావాలని, జీవితములో ఆ కోరికను ఎందుకు పెండింగ్ లో పెట్టాలి.. అనుకున్నాను.

ఒకరోజు మా బంధువు శ్రీను మామ నన్ను కలవటానికి బైకు మీద నా దగ్గరికి వచ్చాడు. అలా వచ్చి వెళ్ళుతున్న సమయములో "మామా! నేనూ మా తమ్ముడు కలసి రేపు భద్రాచలం వెలుతున్నాము.. బైకుల మీద" అన్నాడు. నా కోరిక నేరవేర్చుకోవటానికి ఇదే సరియైన సమయం అనుకొని నేనూ వస్తాను అన్నాను. సరే అన్నారు. నాకు ఒక కంపనీగా ఇంకొకరిని కూడా వారే అరేంజ్ చేసారు. అలా వెళ్లి వచ్చాను. కాకపోతే అప్పుడు నిండు వేసవి. ఆ లాంగ్ డ్రైవ్ లో చాలా ఎండవేడిమి.. రోడ్డు పక్కన ఎండిన చెట్లు.. ఎందుకో ఆ ఒక్క విషయములో తప్పించి మిగతా అంతా బాగానిపించింది. ఇంటికి వచ్చేసరికి నల్లగా బొగ్గు ముక్కలా మారాను. అప్పుడు గురైన ఎండదెబ్బకి నా శరీరరంగు ఇంకా మామూలుగా రాలేదు.

అలా మొదలైన నా లాంగ్ డ్రైవ్ కోరిక మొత్తం అదే రూట్లో నాలుగుసార్లు జరిగింది. అందులో బాగా నచ్చింది, మాంచి సహాసోపేతమైన యాత్ర అంటే వర్షాకాలము వెళ్ళిందే. ఎండాకాలములో అడవి అంతా బోసిపోయినట్లు ఉంటుంది. వర్షాకాలములో అయితే కొద్దిగా గుండె నిబ్బరం ఎక్కువ అవసరం. నిజానికి అడవిని, లాంగ్ డ్రైవ్ ని సంపూర్ణముగా అనుభవించాలంటే కార్లలోనో, బస్సుల్లోనో వేల్లేదానికన్నా బైకు మీద వెళ్ళిందే బాగానిపిస్తుంది. నిజానికి అది చాలా సాహాసము తో కూడుకున్నది. ఎందుకంటే మన ముందు ఏ అడ్దంకి ఉండదు. అడవిలో యే రక్షణ లేకుండా అలా వెళ్ళటం అదొక మధురానుభూతి. నేనేదో చేసాను అని గొప్పకోసం చేశాను అని చెప్పుకోవటం లేదు. ఈ మధురానుభూతిని గ్రంధస్తం చేయటానికి మాత్రమే ఇక్కడ వ్రాసుకుంటున్నాను.

ఆ లాంగ్ డ్రైవ్ ని ఇలా నా బ్లాగులో వ్రాసుకుంటాను, ఇలా ఫొటోస్ అవసరమని నాకు అప్పట్లో తెలీదు. కాని అప్పటికి డిజిటల్ కెమరా కూడా తీస్కెల్లలేదు. నాతో వచ్చిన అతనికి ఇలా ఫొటోస్  తీయటం నచ్చలేదు. అతనికి తెలీకుండా తీసుకున్నాను. నా ఫోన్ కెమరా చాలా స్లో. ఫోటో తీసినప్పటి నుండి సేవ్ అయ్యేదాకా ఏమాత్రం కదిపినా ఆ ఫోటో రాదు.. వచ్చినా అంతా షేక్ అయినట్లు రావటం.

నేను వెళ్ళిన లాంగ్ డ్రైవ్ లలో నాకు నచ్చినదీ, సాహాసోపేతమయినదీ వర్షాకాలములో వెల్లినప్పటిది. అప్పుడు నేను, మా శ్రీను మామ కలిసి ఇద్దరమే బైక్ మీద వెళ్ళాము. నేను వెళ్ళిన లాంగ్ డ్రైవ్ లలో ఇదే గొప్పది.. మీరు ఒకవేళ ఇంతకన్నా గొప్ప లాంగ్ డ్రైవ్ వెళ్లుంటే మన్నించండి.

వర్షాకాలము అన్న పేరే కాని వర్షాలు ఆలస్యమయ్యాయి. నా దినచర్య అంతా బోరుగా ఉంది. ఏమి చెయ్యాలో తోచటం లేదు. దీన్ని ఎలాగైనా బ్రేక్ చెయ్యాలనుకున్నాను. మా మామకి చెప్పాను. సరే వెళదాం అని అన్నాడు. అంతలోగా నాయకుడు ఎవరో చనిపోయారని అంతా బంద్. మరుసటి రోజు ఆదివారం.. తరవాతి రోజు ఏదో సెలవుదినం.. వరుసగా మూడు రోజులు సెలవు. ఇంకేం! మంచి ముహూర్తం అనుకున్నాను. వెంటనే తనని రమ్మని కబురుచేసాను.. వచ్చాడు. ఒక గంట సేపట్లో మా టూర్ మొదలు. ఒక జత డ్రెస్ బ్యాగులో పెట్టుకొని మేము హీరో హోండా మీద బయలుదేరాము. అన్నీ ఇక దారిలో కొనుక్కుంటూ వెళ్ళడమే అని డిసైడ్ అయ్యాము.

హైదరాబాద్ నుండి వరంగల్ కి వచ్చేసరికి చీకటయ్యింది. దారిలో నేను బండి నడుపుతున్నప్పుడు ఒక్కసారిగా మా బండికి ఒక అడుగు దూరములో నుండి ఒక జంతువు రోడ్డుకి అడ్డముగా వెళ్ళింది. బండి వెలుతురులో సరిగా కనిపించలేదు. (కాని వచ్చాక వారం రోజులకి తెలిసింది. ఆది "అడవి మనుబోతు" అని. అలా దారికి అడ్డముగా చాలా బండ్లకి వచ్చిందంట! అలా ఒక బండికి అడ్డం వచ్చి ఆ బండి తగిలి మరణించింది.) అలా స్టార్టింగ్ లోనే ఇలా జరిగింది ఏమిటా ని కొద్దిగా శకునం గురించి భయపడ్డాము. కాని తప్పదుగా బయలు దేరాక వెనక్కి రాబుద్ది కాలేదు. ముందుకే వెళ్లాలని అనుకున్నాము. కాని అప్పుడే నాకు అనిపించింది. ఇలాంటివి ఈ టూర్ లో ఎన్నో జరగబోతాయని.

వరంగల్ కి వచ్చే సరికే రాత్రి 9:30 అయ్యింది.. ఇంకాసేపట్లో అయితే హోటల్స్ అన్నీ బంద్ అవుతాయని (ఆంధ్రప్రదేశ్ లో రాత్రి పది అయితే భోజనం దొరకటం కష్టం.) ఒక చిన్న హోటల్ చూసుకున్నాము. మామూలుగా స్టార్ హోటల్ కి వెళ్ళొచ్చు. కాని మామూలు హోటల్లో ఉన్న రుచి అందులో ఉండవు. అలాని మామూలు హోటల్లు.. కాస్త రుచీ, శుచీ, శుభ్రం ఉన్న హోటల్లని ఎన్నుకుంటాము. ముందుగా ఇద్దరిలో ఒకరమే మాత్రమే భోజనానికి కూర్చుంటాము. వారు భోజనము మొదలు పెట్టి, కాస్త తినగానే బాగుంది లేనిదీ చిన్నగా సైగ చేస్తాడు. దానిని బట్టి అక్కడ మిగతావారం తినేదీ లేనిదీ నిర్ణయం అయిపోతుంది. నేను  ఈ పద్ధతిని ఒక లాంగ్ డ్రైవ్ లో నేర్చుకున్నాను. అలా  భోజనాలు అయ్యేసరికి రాత్రి 10:30 కి అయ్యాయి. ఇక మళ్ళీ మా ప్రయాణం మొదలు.


భద్రాచలం చాలా దూరములో ఉన్నప్పుడు బహుశా రాత్రి పదకొండు కావచ్చు - ఆ చీకట్లో భద్రాచలం ఎంత దూరం ఉందని చూసాము. ఇంకా 50 కిమీ. చేరేసరికి ఇంకా గంటన్నర పట్టొచ్చు. కష్టమే.. సింగిల్ లైన్ రహదారి. దానికి తోడూ బండి యొక్క గుడ్డి వెలుతురు. ఆ దారిలో మాకు తోడుగా వచ్చే వాహనాలు ఏమీ లేవు! పైగా ఎదురువచ్చే వాహనాలు అంతంతే.. రాత్రివరకు భద్రాచలములో ఉన్దామనుకున్నా శరీరం బాగా అలసిపోతుంది - మరుసటిరోజు న ఉన్న పెద్ద అడవి గుండా ప్రయాణానికి కష్టం అవుతుందని అలోచించి... ఇక లాభం లేదని డోర్నకల్ లో మామకి బావ ఉన్నాడు అంటే అక్కడకి వెళ్ళాము. ఆయన రైల్వే లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రమోషన్ కోసమని కొద్దికాలం కోసం అక్కడ ఉన్నాడు. అక్కడికి చేరేసరికి అర్ధరాత్రి  12:30 అయ్యింది. రాత్రి అక్కడే పడుకున్నాము.



మళ్ళీ ప్రొద్దునే సూర్యుడు రాకముందే / వేకువ ఝామున్నే లేచి మళ్ళీ టూర్ మొదలు. భద్రాచలం చేరేసరికి ఉదయం ఎనిమిదిన్నర అయ్యింది. గోదావరి వంతెన మీదనుండి గుడికి చేరేదారిలో హనుమంతులవారి విగ్రహం చూసేసరికి ప్రాణం లేచ్చోచ్చింది. అప్పటిదాకా చేసిన ప్రయాణం బడలిక ఇలా తీసేసినట్లనిపించింది.






అలా వచ్చాక గుడి ముందున్న ఒక షాప్ వద్ద బండిని వదిలి, స్నానానికి అవసరమైన సామానులు కొన్నాము. 




తరవాత స్నానాల ఘాట్ కి వెళ్ళాము. గోదావరి నదిలో స్నానం పుణ్యం అనుకొని (కొంత చాదస్తమే అనుకోండి) హాయిగా గోదావరి నదిలో పుణ్య స్నానం చేసాము.  నేను మొదట చూసినప్పుడు ఈ స్నానాల ఘాట్ ఇలా లేకుండెను. ఇప్పుడు చాలా అందముగా టైల్స్ తో మార్చారు.



వేసవికాలము గనుక, ఇంకా వర్షాలు పడలేదు గనుక నదిలో ఇంకా నీరు రాలేదు. ఇలా గట్టు నుండి లోపలికి ఉన్నాయి. అయినా వెళ్లి స్నానాలు కానిచ్చేశాము. 



అలా స్నానాలు కానిచ్చేసి.. దర్శనానికి గుడికి వెళ్ళాము. గట్టుమీద గోదావరి మాత విగ్రహం కనిపించింది. దర్శనం చేసుకున్నాను. పూజారీలు ఎవరూ లేరక్కడ. ఆ తరవాత గుడికి వెళ్ళాము. 





అలా మా దర్శనం అయిపొయింది. భక్త రామదాసు సినిమా వచ్చాక ఈ భద్రాచలం రాములోరి గుడికి భక్తులు వెల్లువెత్తుతున్నారు.  రామదాసు అప్పట్లో బాగా కట్టించాడు. ఆ పనితనం చాలా బాగుంది. ఇదే గుడిని నల్ల గ్రానైట్ లో కడితే ఎంతో బాగుందేమో! అలా మా దర్శనం ముగిశాక బహుశా పది అయ్యుండవచ్చు. క్రిందికి వచ్చి హోటల్లో భోజనం చేశాము.  అప్పటికే మధ్యాహ్నం అయ్యింది. ఇక ఇప్పుడు రాజమండ్రికి ఏమి బయలు దేరుతామని అనుకున్నాము. ఒకవేళ వెళ్ళినా అడవి దాటేసరికి బాగా లేట్ అవుతుందని ఊరుకొని దగ్గరలోని పర్ణశాల కి వెళ్ళాము. అక్కడనుండి 33 కిలోమీటర్ల దూరం. అలా వెళ్ళాము. చూడడానికి అక్కడ ఏమీ లేకున్నా అయినా వెళ్ళాము.  

 (కొనసాగింపు.. 2 లో )

No comments:

Related Posts with Thumbnails