Sunday, May 9, 2010

నీటి ప్యాకెట్స్ - ఒక అనుభవం.

ప్రయాణాలప్పుడు గమనిస్తూ ఉంటాను.. బస్ ఆగగానే "వాటర్.. వాటర్" అని చెవి తెగిన మేకల్లా అరిచే అబ్బాయిలు.. వారి జబ్బాలకి చిన్న చిన్న చేతి సంచులతో, లేదా ప్లాస్టిక్ కవర్లో చిన్న చిన్న నీటి సంచులు వేసుకొని బెల్లం చుట్టూ ఈగల్లా, బస్  చుట్టూ చేరుతారు. బస్ ఇంకా ఫ్లాట్ ఫాం మీదకి రాకుండానే అదే స్పీడులో బస్ ఎక్కేస్తారు. అలాగే నూనెలో గోలించిన / వేయించిన వడియాల వంటి ఫ్రయమ్స్, పాప్కార్న్ ప్యాకెట్లు పట్టుకొని ఇంకోడూ బస్ లోకి ఎక్కేస్తాడు. దిగేవారు అడ్డమున్నా, వారి ఈసడింపులు వీరికి పట్టవు. వారి బిజినెస్ వారిదే! ఒక్కడు బస్ ఎక్కితే మిగతా వారు ఎక్కరు.వారు ఇంకో బస్ కోసం ఎదురుచూస్తారు. లేదా ఆ బస్ కిటికీల వద్దకి చేరి ప్యాకెట్లను అమ్ముతూ ఉంటారు.

ఈ నీటి ప్యాకెట్స్ అంటూ రాక మునుపు మొదట్లో అందరూ నీళ్ళు కావాలంటే ఒక బాటిలో లేదా దగ్గరలోని హోటల్లోని గ్లాసో పట్టుకుని నీరు త్రాగేవారు. అలా ఉన్న తరుణములో గ్లాసులతో నీరు త్రాగటం ఇబ్బందిగా ఉండనిపించిందేమో గాని.. అప్పుడే  ప్యాకెట్లు  మొదలయ్యాయి అనుకుంటా.. అప్పట్లో సారా ప్యాకెట్లు కూడా ఇలాగే, ఇదే సైజులో ఉండెను. అప్పుడు మొదట్లో ఎవరైనా ఆ ప్యాకెట్ పళ్ళతో చించి నీరు త్రాగుతూ  ఉంటే "ఏరా! సారా త్రాగుతున్నావా.." అని సరదాగా ఆట పట్టించేవాళ్ళు. ఈ కారణం వల్లనేమో మొదట్లో చాలామంది ఆ నీటిని త్రాగటానికి సందేహించేవారు..

అప్పట్లో మంచి మంచి కంపనీలు ఆ ప్లాస్టిక్ చిన్ని చిన్ని సంచుల్లో నీటిని నింపి, కూలింగ్ చేసి మరీ బస్తాన్డుల్లో అమ్మేవారు. పెద్దా, చిన్నా కంపనీలు అని తేడా లేకుండా చాలా కంపనీల నీటి ప్యాకెట్స్ అమ్ముడుబోయేటివి. అప్పట్లో ఆ ప్యాకెట్లకి ISI మార్కూ  ఉండేడిది. అలాగే తయారీ తేదీ వేసేవారు. ఆ తేదీ నుండి వారం రోజుల వరకూ ఆ నీటిని త్రాగొచ్చు అని ప్రింట్  చేసెడివారు.

అదేమిటో గాని, మన భారతీయులు.. ముఖ్యముగా తెలుగువారు చాలా చాలా విషయాల్లో అంతా ముగుస్తున్నప్పుడు, వాటికోసం  వేలంవెర్రిగా వెంపర్లాడటం చాలా సందర్భాల్లో గమనించాను. ఇక్కడా అంతే! ఇలా ప్యాకేజ్ డేట్ + ISI మార్కు  ఉన్నప్పుడు చాలా తక్కువ మంది ఆ నీటి సంచుల నీరు త్రాగారు. సారా త్రాగుతున్నామని  ప్రయాణికులు అంటున్నారని  ఏమో గాని, మరే ఇతర కారణాల వల్ల గాని ఆ నీటి సంచుల అమ్మకాలు దారుణముగా పడిపోయాయి. కేవలం ఎండాకాలము లోనే ఈ అమ్మకాలు  మొదలయ్యి, ఆ కాలము ముగియగానే అమ్మకాలు నిలిచిపోయేటివి.

అలా కొంతకాలము గడిచింది. ఆ తరవాత ఆ బిజినెస్ లో పోటీవల్లనో, సరిగా అమ్మా స్టాకు మిగిల్పోవటం వల్లనో గాని, లేక నష్టాలు వస్తున్నాయని కావచ్చు.. లేదా ప్రజల అత్యాశ వల్లనో గాని (తక్కువ ధరకి రావాలని), అధికారుల, ప్రజల నిర్లక్ష్యమో గాని.. ఆ డేట్ అయిపోయిన ఆ నీటి ప్యాకేట్లని మాంచి కూలింగ్ లో పెట్టి మరీ అమ్ముతున్నారు. ఇంకో విషయం కూడా గమనించాను. నాకు బాగా గుర్తే!.. ఇవి వచ్చిన క్రొత్తలో డేట్ అయిపోయిన నీటి సంచులని అదే బస్టాండులోని బస్ టైర్ల క్రింద వేసి వాడరాకుండా చేసెడి వారు. వాటి మీద నుండి టైర్లు వెళ్ళినప్పుడు అవి చిన్నపాటి శబ్దముతో పగిలి.. నీరంతా కారిపోయేటివి. అలా ఆ సంచులని పనికిరాకుండా చేసెడివారు. ఆ ఖాళీ సంచులని రద్దీ పేపర్లు ఏరుకునే పిల్లలు వాటిని ఎరుకొనేడివారు.

ఇప్పుడు ఈ పాకెట్ అమ్మకాలు చాలా బాగున్నాయి. ఖరీదు తక్కువ అనో, ప్రయాణీకుల ఉదార స్వభావామో గాని.. లేదా చల్లగా నీరుండటం వల్లనేమో గాని మరే ఇతర కారణాల వల్లే గాని కావచ్చు.. ప్రయాణికులు మాత్రం బాగా ఈ మధ్య ఆదరిస్తున్నారు. నేను మాత్రం కొన్ని విషయాలని గమనించాను.

మొదట్లో ISI మార్క్ ఉన్నప్పుడు బాగా దాహం వేసినపుడు మాత్రమే రెండూ, మూడు ప్యాకెట్ల నీరు మాత్రమే త్రాగాను. ఆ తర్వాత ఎపుడూ ఒక నీళ్ళ బాటిల్తో ప్రయాణాలు చేసేడివాడిని. మొన్నోసారి ప్రయాణము లో ఆ రోజు నీటి బాటిల్ మరిచా.. దిగి కొందామంటే వీలు లేదు. ఫుల్లు జనం. ఇటేమో నోరు పిడచగట్టుతున్నది.* ఒక ప్యాకెట్ కొన్నాను. యధాలాపముగా ప్యాకెట్ ని పరిశీలించాను. చల్లగా ఉంది. కాని దానిపైన ISI మార్కూ గాని, తయారు తేదీ గాని లేదు. "ఇలా అనుకుంటూ, చూసుకుంటూ ఉంటే కలలు తేలేసేలా ఉన్నాను.." అనిపించటముతో ఇక ఆలస్యం చేయకుండా ఆ ప్యాకెట్ ని కొరికి, చించి అందులోని నీటిని నా గొంతులోన పోసాను.

"హాబ్బా! ఛీ యాక్!!" అంటూ నోట్లోని నీటిని బయటకి వూసేసాను. అంతా ప్లాస్టిక్ వాసనా. నీటి రుచి కూడా ప్లాస్టిక్కే..  ప్రయాణికులు ఒక్కక్కరు రెండేసి ప్యాకెట్లు ఎలా త్రాగుతున్నరబ్బా! అనుకుంటూ ఆ మిగిలిన నీటి ప్యాకెట్ ని బయటకి విసిరేసాను.  మార్గమధ్యం లో ఒక స్టేజి వద్ద బాటిల్ కొని ఆవురావురా త్రాగి ఆ బాటిల్ ఖతం చేసాను. అప్పటిదాకా అలాగే గొంతు పిడచతో* ఉండిపోయింది. అ ప్యాకెట్ నీరు ఏమిటో గాని, నా గొంతు ఎండిపోయి అలా అయిందేమో గానీ రెండురోజులు బొంగురు గొంతు తోనే పని కానిచ్చేశాను.
________________________________________________
* పిడచ అంటే = పూరిల్లు లోని నేలని ఎర్రమన్ను నీటిలో గాని, ఆవుపేడ కల్లాపిలో గాని ఒక బట్టను ముంచి నేలకు రంగుపూసినట్లుగా రుద్దితే, ఆ బట్టని పిడచ అంటారు. పిడచ గట్టడం అంటే ఈ బట్ట పిడచ ఎండకి ఎండితే గట్టిగా మారుతుంది. అలా ఉందని పద ప్రయోగం.

1 comment:

Anonymous said...

Baagaa cheppaaru.. ilaanti anubhavam naakoo edurayyindi..

Related Posts with Thumbnails