Friday, May 14, 2010

బైక్ మీద భద్రాచలం - అన్నవరం టూర్ (3)

..అలా అన్ని చూసుకొని, ఉదయం 9:30 కి బయలుదేరాము. నా మిత్రునితో ఒక చిన్ని ఒప్పందం! అడవిలో అంతా నేనే బండి నడుపుతాను అని. ఇందులో నా స్వార్థం ఏమిటంటే - అడవిని ఇలా ఎదురుగా ఉండి చూడొచ్చని. అలాని చెప్పాక అడవి వచ్చేవరకూ తనే నడిపాడు. కొద్దిదూరం వచ్చాక దారి తప్పాము. మధ్యలో ఒక ఊరు వస్తుంది. అక్కడి నుండి ఎడమకి వెల్లాలిసింది తిన్నగా వెళ్ళిపోయాము. అలా చాలా దూరం వెళ్ళాక పెద్ద వంతెన. మేము అంతకు ముందు వచ్చినప్పుడు ఇలాంటి దారి వంతెన మాకు ఎదురవ్వలేదు. ఇదెప్పుడు కట్టారో అనుకొన్నాము. పోయిన సారి వచ్చినప్పుడు వంతెన లేదు అప్పుడే ఎలా కట్టారు? మన దేశములో ఇంత తొందరగా వంతెన కడుతారా? ఇప్పుడు ఎలా? అనుకొని ఒకడిని అడిగితే ఇది "కిన్నెరసాని వంతెన" అని చెప్పాడు. రాజమండ్రికి ఎలా వెళ్ళాలి అని అడిగాము. " మీరు అక్కడే దారి తప్పారు.. కానీయండి.. ఇలా తిన్నగా వెళ్ళినా దారి వస్తుంది.. వెళ్ళండి" అని చెప్పాడు. ఇంకోతన్ని అడిగాము - సెకండ్ ఒపీనియన్ కోసమని. అతడూ అలాగే చెప్పేసరికి అలాగే ముందుకు సాగిపోయామువారు చెప్పినట్లుగానే మొదటి దారిలోకి కలిసాము. నాకది ఇప్పటికీ చిత్రముగానే ఉంటుంది. అక్కడ నుండి ముందుకు సాగాక ఒక దగ్గర చిన్న మూడు రోడ్ల జంక్షన్ వస్తుంది. ఒకటేమో భద్రాచలం వైపుకి, ఇంకోటేమో రాజమండ్రికి, ఇంకోటి వైజాగ్ కి వెళతాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండక పోతే అంతే సంగతి! ఎటో వెళ్లిపోతాము. అక్కడ ఒక బోర్డు తప్పించి మరే ఆధారమూ ఉండదు.

మధ్యలో ఎన్నో చిన్న చిన్న తండాలు, గూడెం లు అనబడే నివాస స్థలాలు చాలా కనపడతాయి. చాలావరకు అవన్నీ తాటాకుల గుడిసేలే! ఎక్కడో కొండక చోట పెంకుటిల్లులు ఉంటాయి. ఈమధ్య స్లాబులతో ఇల్లులు కట్టుకుంటున్నారు. ఇక్కడ ఆశ్చర్యకర సంఘటన ఏమిటంటే! నీరు కావాలంటే దొరకదు. అది పరిశుభ్రముగా ఉండదు. లోటాలు, గ్లాసులు చూసి మనకి త్రాగేయ బుద్ధి కాదు. గోదారి ప్రక్కనే కాబట్టి అలానే పట్టుకొని త్రాగుతారన్నమాట. అక్కడక్కడా బోర్లు ఉన్నాయి. ఎందుకోనీరు త్రాగాలనిపించలేదు. త్రాగితే ఆరోగ్యం ఏమైనా అవచ్చని మానుకున్నాము. ఇంత ఇబ్బంది ఉన్ననూ చిన్న చిన్న తండాలల్లో నీరు దొరకడం కష్టమేమో గాని, కూల్ డ్రింకులు మాత్రం బాగా దొరుకుతాయి. ఏమి చేస్తాము.. వారి నీటికి వంక పెట్టి, ఎప్పుడో చేసిన పురుగుల మందు అవక్షేపాల కూల్డ్రింకులు త్రాగాము.

ఇక్కడి వరకూ బాగా ఎండలో వచ్చాము. చెమటలు పట్టాయి. అక్కడ నుండి బయలు దేరగానే కాసేపటికే బాగా వర్షం మొదలయ్యింది. పెద్ద పెద్ద వర్షపు చినుకులతో, మొఖాన్ని కొడుతూ ఉంటే ఒక చెట్టు క్రింద ఆగాము. ఒక వైపు ఎండ, మరో వైపు వర్షం.. ఆహా! ఎంత బాగుంది అనుకున్నాము. మేము పోయి పోయి దగ్గరలో యే చెట్లూ లేని ప్రదేశములో ఉండటముతో వర్షానికి బాగా నానినాము. దగ్గరలోని చెట్లవద్దకి పోదామన్నా ఇంత తెరపి ఇవ్వకుండా ఒక్కసారిగా వర్షం పడింది. బండిని ఇలా చెట్టుక్రింద పెట్టి, మేము వర్షానికి నానాల్సి వచ్చింది. (అప్పటికే బండి ఇంజను చాలా వేడి మీద ఉండటముతో ఆ పని చెయ్యాల్సివచ్చింది. ) 



అలా పడటం కూడా మాకు మంచిదే అయ్యింది. ఎండదెబ్బ నుండి తప్పించుకోవటానికి బాగా ఉపయోగపడింది. అలా ముందుకు సాగాము. వర్షానికేమో చెట్ల సందుల్లోంచి ఒక అందమైన దృశ్యం దోబూచులాడింది. అది బాగాకనపడే వరకు ప్రయాణించి, అక్కడ ఒక ఫోటో తీసుకున్నాను



ఎండ వేడికి, ఆ తరవాత పడ్డ వర్షానికి - భూమిలోంచి వచ్చిన ఆవిరి అనుకుంటాను.. అలా మేఘములా మారి ఆకాశములో పాములా, కొండలకి ఒక పయ్యేదలాగా ఉన్నట్లు అనిపించింది. అలాంటి మనోహర దృశ్యం నేను అంతకు మునుపెన్నడూ చూడలేదు. డిజిటల్ కమెరా ఎందుకు తెచ్చుకోలేనందులకి నామీద నాకే చాలా కోపం వచ్చింది. నా పార్టనర్ కి ఇలా ఫొటోస్ తీయటం నచ్చలేదు. చాలా వరకు బండి రన్నింగ్ లో ఉన్నప్పుడు తీశాను గాని అవన్నీ షేకులతో బాగా రాలేదు. కాసేపట్లో అడవి మొదలయ్యింది. అలాగే వర్షపు కారు మబ్బులు కూడా.. విషయాన్ని పై ఫోటోలలో కూడా గమనించవచ్చును


నేను చూసినా వాటిల్లో ఇదే భయంకరమైన అడవి. ఇంత కన్నా పెద్ద అడవిని నేను చూస్తే ఇది నాకు చిన్నదిగా అనిపించేడిది. ఆకాశాన్ని తాకుతున్నాయా అనిపించినట్లుండే చెట్లు, కావలించుకొని ఉంటే చేతులు అందనంత లావాటి కాండాలు గల రక్షిత అడవి అది. మామూలుగానే అడవి అంటే భయంకరముగానే ఉంటుంది. రోజు అంతకు ముందు నుంచే వర్షాలు పడ్డట్టు ఉన్నాయి - చెట్లన్నీ మళ్ళీ పచ్చని రూపు సంతరించుకున్నాయి. పైగా అడవిలో అక్కడక్కడ క్రొత్త నీరు ప్రవహిస్తున్నది. ఇంకా మమ్మల్ని భయపెట్టుటకా అన్నట్లు ఆకాశం పట్టపగలే నల్లని కారుమబ్బులుతో నిండి ఉండి, అప్పటిదాకా కూలింగ్ గ్లాసులు పెట్టుకున్న నేను, తీసెయ్యాల్సి వచ్చింది. పైగా స్పష్టముగా కనిపించే ఏమైనా అద్దాలు ఉంటే అవి పెట్టుకోవాలి అనిపించేలా వాతావరణం. అంటే పట్టపగలే (ఒంటిగంట కే) అక్కడక్కడ - చెట్లు దట్టముగా ఉన్న చోట్ల చీకటి. రోడ్డు అంతా సింగల్ రోడ్డే! ఇంత అడవి మధ్యలో నుండి రోడ్డుని ఎంత ప్రయాసలకు లోని వేసారో అని అనుకున్నాను. అంతా సన్నని మార్గాలే.. ఒక బస్ వస్తే రోడ్డు దిగాల్సిందే! అక్కడక్కడా మలుపులు ఎంత భయంకరముగా ఉన్నాయి అంటే 20 కిలోమీటర్ల స్పీడుతో ఉంటేనే గాని బండిని మలపలేము. వర్షాలకి రోడ్డు ప్రక్క చెట్లు మొలచి రోడ్డు మీదకి వచ్చాయి. తారు రోడ్డు పోసిన మేరకు భూమి. మిగతాది అంతా గుబురు చెట్లే! కొన్ని మలపుల్లో ఏముందో కూడా కనపడదు. ఏదైనా ఎదురయినా సడన్గా వెనక్కి తిరగలేని పరిస్థితి. కంటికి మానవుడేవడూ కనపడడు. మొబైల్ సిగ్నల్స్ ఉండవు. ఎక్కడైనా ఒక మనిషి కనపడితే వాడి చేతిలో ఒక కర్ర గాని, కత్తి గాని ఉంటున్నది. (అడవి జంతువుల నుండి రక్షణ కోసం) కొంపదీసి మనల్ని ఎసేయ్యడు గదా! అని మదిలో అనుమానం. ఇంత దూరం వచ్చి.. వాడి చేతిలో ఏమైనా జరిగితే మా ఆచూకి కూడా దొరకదు ఇక. అక్కడక్కడా చెట్లు బాగా గుబురుగా ఉండి సంధ్యా సమయములో ఉన్నామా అనిపిస్తుంది. ఒకవైపు బండి నడపటం,, మరోవైపు ప్రకృతి అస్వాదన.. జుగల్బందీ చేస్తున్నాను. అలా చేయటం ఏమిటో గాని నాలుగు సార్లు అయినా బండి లోయలోకి పడిపోయేదే. మిత్రుడి హెచ్చరికతో ఆస్వాదన నుండి బయటకి వచ్చి.. ఇంకా లోకములో నాకు మిగిలున్న నూకలను పొందాను. నిజమే! అనంత గిరి కొండల్లో చేసిన మార్గాలు నిజముగా డ్రైవింగ్ కి పరీక్షే! ఇటు ఆస్వాదన, అటు మంచి డ్రైవింగ్ పాటవం చూపడం కష్టమే! ఎన్నో అడవి ప్రకృతి రమణీయ దృశ్యాలు చాలా చూశాను. నేనే డ్రైవింగ్ లో ఉండటం మూలాన ఫోటోలు తీయలేక పోయాను. అక్కడక్కడా మంచి రోడ్లు, మరోచోట అడుగు లోతు గుంటలు.. చాలా చోట్ల భారీ వర్షాలకి మట్టి కొట్టుక పోయి చెట్ల వ్రేళ్ళు బయటకి వచ్చి, బ్యాలన్స్ కాక కూలిపోయాయి. మాముందు వెళ్ళిన వాహనాలు ఎవరో గాని వాటిని ప్రక్కకి తోసుకుంటూ వెళ్ళారు. అలా మేమూ ఇబ్బంది లేకుండా బయట పడ్డాము. కొన్ని చోట్లలో అయితే కూలనా, కూలనా అని మనల్ని ఆడుగుతున్నట్లు అనిపించేట్లు ఉన్నాయా భ్రమపడతాము. సింగిల్ రోడ్డులో గుంతలూ, పడిపోయిన చెట్లనీ తొలగించుకుంటూ.. ఒక ప్రక్క కొండ, మరో ప్రక్క లోయ ఉన్న దారిలో ఆస్వాదనా, ఇటు జాగ్రత్తగా రావటం ఎంత కష్టమో ఆలోచించండి. ముందే చిన్న దారి అంటే ఇంకా అందులో భారీ ట్రక్కులు కూడా ఇదే మార్గాన కనిపిస్తాయి. అవి దారి మలపుల్లో ఎలా తిరుగుతాయో చూడాలన్పించింది గాని.. అప్పటికే సమయం లేదు గనుక ముందుకు సాగాల్సివచ్చింది. ఇది చూడండి.


ఇలాంటి  దారిల్లోంచి అందరమూ వెళ్ళక తప్పలేదు. ఇది అంత తేలికగా ఉందనిపించలేదు. ఒక కర్ర తీసుకొని గుంట లోతు చూసాను. ఏమంత ఎక్కువ లేదు అనుకొని దాటాము. ఇలాంటిదే ఇంకో దగ్గర కనపడితే అలాగే ఉంటుందని అనుకున్నాము. అది ఇంకా లోతు గుంటలతో ఉన్నాయి. అప్పటికే అక్కడ రెండు భారీ ట్రక్కులు దాటేందుకై సిద్ధముగా ఉన్నాయి. అవి దాటబోయి మధ్యలో ఇరుకుతాయేమో నని అనుమానముతో మేము వెళ్ళాక వారిని వెళ్ళమని రిక్వెస్ట్ చేశాను. అవి మధ్యలోకి వచ్చి ఆగిపోతే ఇక వేరే దారే ఉండదిక అనే ఆలోచనతో అలా చెప్పాను. ఎందుకంటే మరోవైపు కొండ, ఇంకోవైపు సుమారు ఇరవై అడుగులలోతు లోయ. నేనే బండిని నడిపాను. కాని గుంట మధ్యలో లోతు ఎక్కువ ఉండి.. బండి పికప్ / రైజింగ్ సరిపోక మధ్యలో మా బండే ఆగింది. కాలు భూమ్మీద ఆనించలేనంతగా లోతు. పడబోయాము.. కాని ఇద్దరం ఒకేసారి బురద నీళ్ళలో కాలు పెట్టి ఆపాము. ఫలితముగా మా ప్యాంట్ లకి ఇంకో రంగు.. నాది నీలి రంగు జీన్స్ అయితే సగం మొకాలివరకూ ఎర్రని బురద రంగు. అడవిలో ఎవడూ చూడటానికి లేదు గనుక అలాగే ముందుకు సాగిపోయాను. కొంత దూరం పోయాక మంచి వర్షము నీరు కనపడితే అక్కడ శుభ్రముగా కడుక్కున్నాము


ఆదారి లో ఒక్కో చోట ఒక్కో అనుభవం. ఒక దగ్గర ఆనందం వేస్తే, ఇంకో చోట భయం, మరోచోట సంభ్రమం.. కొన్నింటి చోట్ల V ఆకారము లో రోడ్లు. ఇంకొన్ని చోట్ల ఒక వైపు లోతైన లోయ, ఇంకోవైపు నాలుగైదు అంతస్థుల ఎత్తుండే కొండ. ఇంకొన్ని చోట్ల మొదటి గేరులోనే ఎక్కాల్సిన ఎత్తు - అప్పుడు ఫుల్లు త్రోటిల్ ఇవ్వక తప్పదు. చెప్పాగా జుగల్బందీ చేసుకుంటూ ఇందులోంచి వెళ్ళటం కష్టం అని. మధ్యలో ఒక కొండ ఎక్కి దిగాలి ఇలాగే. అక్కడే ఉంటుంది సుమారు ఒక పది అంతస్థుల సైజులోని కొండ. మీద పడుతుందా అన్నట్లుగా నిట్టనిలువుగా ఉంటుంది అది. మొత్తానికిది చాలా డేంజరస్ రోడ్డు. సింగల్ రోడ్, అడవి, ఎత్తైన కొండలు, V షేపులో రోడ్లూ, మధ్యలో ఎపుడో గాని ఎదురవని వాహనాలు, మన బండికి ఏమైనా అయ్యిందా ఎవడూ రక్షించలేడు. టెంటు వేసుకొని కూడా ఉండలేము. పంక్చర్ అయితే ఇక మన బాధ వర్ణనాతీతం. మళ్ళీ జన్మలో టూర్ కి ఇలా అడవి వైపుకి రాకూడదు అనిపిస్తుంది.

ఇలాంటి దారిలో రోడ్డును దాటుతున్నప్పుడు ఒక మలుపులో రూపాయలు 20 + 5 + 2 నాణెం దొరికాయి నా మిత్రునికి. వాటిని ఉంచుకోవద్దు అనే సెంటిమెంటుతో, ఎక్కడైనా గుడి కనపడితే అందులో వేసేద్దాం అన్నాడు. అడవిలో గుళ్ళు ఎక్కడ ఉంటాయి? అందుకే టీ త్రాగేద్దాం అన్నాడు. సరేనని నేనూ అన్నాను. ఆలా టీ దుకాణం వెదుకుతూ ప్రయాణం సాగించాము.

అక్కడనుండి ముందుకి సాగిన మా ప్రయాణం చివరకి సాయంత్రం ఐదు గంటల ప్రాంతములో ఒక వంతెన వద్దకి వచ్చాము. అక్కడ కాసేపు రెస్టు. అక్కడ కొన్ని చిన్న చిన్న 3, 4 గుడిసెలు ఉన్నాయి. లారీలు, వ్యానూ ఆగి ఉంటే టీ త్రాగుదామని వెళ్ళాము. అక్కడి వారి చూపులు అదోలా ఉన్నాయి. పట్టించుకోక రెండు టీలు చెప్పాము. మాకు టీ కాసే అబ్బాయి ని పక్కకి నెట్టి ఒక ఆమె టీ చేస్తూ అదే పనిగా మమ్మల్నే చూస్తున్నది. ఆమె చూపులూ, దేహ భాష, కట్టూ బొట్టూ, తలలో పూలు, కాటుక కళ్ళూ అన్నీ "అవే"! (అర్థం చేసుకోండి) ఆమె టీ చేసేలోగా మాడా టైపులో ఉన్న ఒక అబ్బాయి మా వెంట పడ్డాడు.. "ఏమైనా ఇవ్వు.. ఏదైనా పని చెప్పు పనైనా చేస్తా.." అని అంటే పోనీలే అని .. దొరికిన దాంట్లోంచి వాడికో ఐదు రూపాయలు ఇచ్చాము. వాడు ప్లేట్ ఫిరాయించి "మీరు చాలా అందముగా ఉన్నారు.. మీకు ఏమి కావాలో చెప్పండి. ఏదైనా సరే పట్టుకొస్తా.. ...లాంటిదైనా సరే.." వత్తి మరీ చెప్పాడు. టీ చిన్నది మా కేసే ఆశగా చూస్తున్నది. ఐదు నిముషాల్లో అందించే టీ ని అరగంట చేసింది. వేల్లిపోదామంటే "అయిపోయింది అయిపోయింది.." అంటూ ఆపారు. (ఏమిటో అయిపోయింది?) టీ అందించే దశలో కావాలనే పైటను తప్పించి, మాకు గ్లాసు అందిస్తూ కావాలని మా చేతులని తాకుతూ టీ ఇచ్చింది. ఇలా ఉంటుందనుకుంటే అసలు అక్కడ బండి ఆపే వారిమే కాదు. నాతో వచ్చిన మిత్రుడు ప్రొద్దున నుండీ టీ త్రాగక నాలుక చేదేక్కింది అంటే ఆపాను. నాకేం తెలుసు. ముందుగా అతడు త్రాగాక బాగుందంటే నేనూ ఇంకో టీ త్రాగాను - సెక్యూరిటీ ప్రాబ్లం కదా. ఈసమయములో ఇద్దరూ మమ్మల్ని చూపులతో ఆట ఆడుకున్నారు. ఏదో ఇంత టీ త్రాగి బయట పడ్డాము. (మళ్ళీ వెళ్ళిన టూర్ లో వారు కనిపించలేదు.. వారి కోసం ఆశ పడకండి. నేను అందుకోసమే మళ్ళీ వెళ్లాను అనుకోకండి - రామ రామ..)





ఇక్కడ ప్రకృతి బాగా అనిపించి వీడియో తీశాను. (అది చూసి వారి టీ కోసం వెదుక్కుంటూ వెళ్ళేరు.. చెప్పాగా లేరని. ఉన్న ప్రపంచములో మందులేని జబ్బు అంటడం ఖాయం. అంటే - పులిరాజా అవటం ఖాయం)



చూశారా! ఇలా ఉంది అక్కడి ప్రకృతి రమణీయత! ఇంకా దీనికన్నా మంచి సీనులు దారిలో మిస్ అయ్యాను - నా డ్రైవింగ్ ఉండటముతో. అక్కడ నుండి రాజమండ్రికి బయలు దేరాము. అప్పటికే చిమ్మని చీకటి.. బండి వెలుతురుకి పురుగులు రావటం మొదలయ్యింది. కాసేపయ్యాక ఆ బాధ పోయింది. ఫారెస్ట్ నుండి బయటకి వచ్చేసరికి రాత్రి పావు తక్కువ పది అయ్యింది. అక్కడ పోలీస్ చెకింగ్. ప్రశ్నలూ, సమాధానాలు అయ్యాక, అన్ని రుజువులూ చూపాక అక్కడ నుండి బయలుదేరి అంతా మగవారు ఉన్న ఒక హోటల్ వద్ద ఆపాము. అక్కడ టీ త్రాగుతూ తరవాతి ప్రోగ్రాం సంగతి ఆలోచించాము.

అన్నవరనానికి ఆ రాత్రే చేరాలని డిసైడ్ అయ్యాము. మళ్ళీ ప్రయాణం మొదలు. ఈసారి మెల్లగా కాకుండా బాగానే స్పీడుగా మొదలెట్టాము. అన్నవరానికి చేరేసరికి రాత్రి పావు తక్కువ పన్నెండు. దేవాలయ సత్రం తీసుకున్నాము. బయటకొచ్చి తినడానికి ఏమైనా ఉన్నాయి అని చూస్తే కేవలం చపాతీలే దొరికాయి. అవే తినేసి సత్రం గదికి వచ్చి హాయిగా పడుకున్నాము. మరుసటి రోజు ఉదయాన్నే లేచి దైవ దర్శనం చేసుకున్నాము. పెద్దగా ఉండే ఇక్కడి సత్యదేవుడు క్రింది, పై అంతస్థుల నుండి దర్శనం చేసుకోవాలి.. చేసుకున్నాము. అక్కడి ప్రసాదం చాలా బాగుంటుంది. అది తిన్నాక మా ప్రయాణం బడలిక చాలా వరకు పోయింది. తొందరగానే దర్శనం అయిపోయింది.. ప్రసాదం తనివితీరా తిన్నాము. దేశములో అక్కడ తప్ప మరెక్కడా ఆ ప్రసాదం దొరకదు. కాసేపు గుడి అంతా తిరిగి చూసాను. ఫొటోస్ తీద్దామంటే ఫోన్ మెమొరీ కార్డ్ అప్పటికే ఫుల్ అయ్యింది.

ఒక గుడి సెక్యూరిటీ గార్డు అతని పేరు ఏదో ఉండి సరిగా కనపడలేదు.. గుడిలోని పుస్తక విక్రయ కేంద్రం ఎదురుగా మేము కూర్చున్నప్పుడు అతను వచ్చి షాప్ వాడికి ఒకటి అని సైగ చేశాడు. ఆ షాప్ వాడు అటూ ఇటు చూసి అదేదో మామూలు వస్తువు ఇచ్చినట్లు చాటుగా ఇచ్చాడు. కొద్దిగా కనపడింది.. అది సిగరెట్. అది జేబులో  అలాగే పెట్టుకొని అలా గుడిలోనికి పోయాడు.. నేను అతన్ని ఫాలో అయ్యాను. చాలా దూరం వెంటాడాను - గుడి చూస్తున్నట్లుగా వెళుతూ. చివరికి ఒక ఆఫీస్ రూం లోకి పోతూ వెనక్కి చూశాడు.. నేను తల తిప్పాను. మళ్ళీ వెదికితే దొరకలేదు. గుడిలో ఇలా సిగరెట్లు దొరుకుతాయని అదే మొదలు మరియు ఆఖరిగా చూడటం. నేను ఎన్ని గుళ్ళు తిరిగినా ఇంతటి మహత్తర సీను చూడలేదు. నా చేతిలో కెమరా ఉన్నా, నా ఫ్రెండ్ దగ్గరలో ఉన్నా ఆ రోజు వాడిని పట్టిచ్చేవాడినే! ఇలా స్వామి వారి వద్ద ఉంటూ ఆ స్వామి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారు కొందరు దుర్మార్గులు.

భోజనం చేసుకొని పదకొండు గంటలకి మళ్ళీ ప్రయాణం - ఈసారి సింహాచలం కి. తొందరగా చేరుకున్నాము. దర్శనం క్యూ బాగుంది. స్పెషల్ టికెట్స్ తీసుకొని దర్శనం చేసుకున్నాము. కప్ప స్థంభం కి కట్టుకొని మ్రోక్కుకున్నాను. సింహాచల ఆలయ శిల్ప సంపద చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో బాగా శిల్పకళ ఉన్నవాటిల్లో అదొకటి. గ్రానైట్ మీద బాగా చెక్కారు. అక్కడ నరసింహ మూర్తికి ఒక పచ్చల పేరు ఉండేడిది. అది చాలా విలువైనది, విలువ కట్టే షరాబు ఎవరూ లేరు, అలాంటి దాన్ని ఎవరో తస్కరించారు. తరవాత అది దొరికిందని విన్నాను.. కాని అది ఎంత వరకు నిజమో తెలీదు. నరసింహస్వామి మూర్తి చుట్టూ అన్నీ సాలిగ్రామ శిలలే! చాలా బాగా శక్తివంతమైనవి అవి.

ఆలయ దర్శనం తరవాత వైజాగ్ కి వెలదామనుకున్నాము. కాని మళ్ళీ బండి నడుపుకుంటూ మళ్ళీ చాలా దూరం రావాలి. అబ్బో! అనుకొని.. తిరుగు ప్రయాణం మొదలెట్టాము. రాత్రి అవటముతో ఒకదగ్గర పడుకున్నాము.. ఎక్కడో సరిగా గుర్తుకు రావటం లేదు. అక్కడినుండి వెకువఝామున్నె బయలుదేరి విజయవాడకి వచ్చేశాము. అక్కడ దుర్గామాతని దర్శించుకున్నాము. అదయ్యాక నేరుగా నా స్వస్థాలాలకి వచ్చేశాము. అనుకోకుండా బయలుదేరటముతో టూర్ బాగా సాగింది. చాలా ఆనందం కలిగించింది. అలా అనుకోకుండా వెళితేనే నిజముగా ఆనందం వస్తుంది అని నా టూర్ల విషయ సంగ్రహం.

ఎక్కడా బండి ఇబ్బంది పెట్టలేదు. లీటరు పెట్రోల్ కి 68 కిలోమీటర్ల మైలేజి ఇచ్చింది. మేము మొత్తం తిరిగిన దూరం = పదిహేను వందల కిలోమీటర్లు. మొత్తం ఖర్చు / ఇద్దరం వేసుకుంటే ఒక్కొక్కరికి ఎనిమిది వందల అరవై అయిదు రూపాయలు (అన్ని ఖర్చులూ ఉన్నాయి ఆఖరికి వక్కపోడితో కలుపుకొని). ఈ సంవత్సరం తిరుపతి వైపు వెళదామని అనుకున్నాము. కాని అతను గత డిసెంబర్ లో రోడ్డు ప్రమాదములో మరణించాడు. తోడూ లేక టూర్లు ఆగిపోయాయి. భద్రాచలం వద్ద తీసిన ఫోటోలలో ఒక షాప్ వద్ద అతని ఫోటో కూడా ఉంది.

ఇదీ నా మోటార్ సైకిల్ మీద లాంగ్ డ్రైవ్. మీరు ఒక్కసారి అలా చాలా దూరం వెళ్లి రండి. అందులోని ఆనందం మీకే తెలుస్తుంది. మళ్ళీ లాంగ్ డ్రైవ్ ఎప్పుడు వెళదామా అన్నట్లు ఉంటారు. ఖర్చు తక్కువ ఉండి, అన్ని పరిస్థుతులని తట్టుకునేవారే వెళ్ళడం మంచిది. ముందుకే వెళదాం అన్నవారితోనే వెళ్ళండి.. పక్కా రూటుని నిర్ణయించుకొని వెళ్ళండి. అన్ని సాధక భాధకాలని ఊహించి వెళ్ళండి. ఒకసారి వెళ్ళిరండి అలా. ఎన్నో ఏళ్ళు మీకు ఆ సంఘటనలు గుర్తుండిపోతాయి. నా అభిప్రాయం చెప్పాలంటే - సిటీ మాల్స్ లో, పబ్ లలో, బార్ లలో ఒకసారి ఖర్చు మీది కాదనుకుంటే ఎన్నో అనుభూతులు మీ స్వంతం..  100 % గ్యారంటీ!

ఇంత చెప్పి సుత్తి కొట్టానా..  ఏమి చేస్తాము.. ఎన్నో రోజుల నుండి వ్రాయాలనుకున్నాను. ఇవాల్టికి తీరింది.

"ఎద లోతులో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయీ.. గుర్తుకొస్తున్నాయి.."

( అయిపోయింది. )

6 comments:

tankman said...

chala baaga rasaru raj.....

voleti said...

Thanks for recollecting my long tour with Moped in the year 1984 from Bhadrachalam to Tirupathi.. I love Bhadrachalam.. Such a great experience and days will not come back again..Sorry for your friends death.. Kurra vayassulo manaki teleedu gani.. andariki ee anubhavam raadu..

Raj said...

మీరూ బాగా టూర్ చేశారు. దానికి మీకు అభినందనలు. నిజానికి ఆ అనుభూతి ఇంకా మరవలేకున్నాను. మా ఫ్రెండ్ ఈ పాటికి బ్రతికే ఉంటే ఎన్నెన్నో టూర్లు వేసుకునేవారం, అవన్నీ ఇలా గ్రంధస్తం చేసేవాడినేమో. మీరన్నట్లే ఇప్పటి కుర్రకారుకి ఇందులోని మజా ఏమి తెలుసు?

voleti said...

సరిగ్గా మీకు జరిగినట్లు గానే.. మాకు కూడ ఓ సంఘటన జరిగింది. మేము ఒంగోలులో రెస్ట్ తీసుకిని పొద్దుటే బయలుదెరి వెళ్ళి గూడూరు లో లంచ్ కి అగాము. అప్పటికే మా మొఖాలు నల్లగా అయ్యాయి. ఆ విషయం మాకు తెలీదు. ఆ హొటల్లూ వాళ్ళు మ వైపు వింతగా చూడ్దం .. ఏం అడుగుతున్నా ముందు డబ్బులు ఇవ్వండి అని అడగడం.. నాకైతే చాలా చిరాకు వచ్చింది.. నాకు పెరుగు అంటే చాలా ఇస్థం. వాణ్ని ఎక్ష్త్రా పెరుగు ఇవ్వరా అంటే ఇవ్వడు.. ఇలా నేను వాడితో వాదిస్తుండగా మా ఫ్రెండు, చెయ్య కడుక్కుని వస్తూ తెగ నవ్వుతున్నాడు.. ఏటి అని అడిగితే ఒక్కసారి మీ ముఖం అద్దం లొకి చూసుకుని రండి అన్నడు.. తీరా చూద్దును కదా తెల్లగా ఉండే నా ముఖారవిందం సింగరెణి బొగ్గులా నల్లగ అయ్యింది.. ఇహ ఒకటే నవ్వులు.. ఎలగో ఒకలాగ అక్కడ్నుంచి బయటపడి.. దార్లో ఓ మంచి మోటారు బావి వద్ద తనివితీరా స్నానం చేసాం.. ఆ అనుభూతి .. ఓ తీపి జ్ఞాపకంగా ఈ జన్మ ఉన్నంతవరకూ నా తోనే

Narsimha Kammadanam said...

chala baga undi mee anubhavam,gata koddi rojuluga mee blog follow avutunna,intiki dooranga kolkatha lo unna naku maanchi telugu vindu with goppa anubhavalatho mee blog dvara labhistondi,krutagnatalu.

Raj said...

నా బ్లాగ్ ఫాలో అవుతున్నందులకు చాలా సంతోషం.. మరియు కృతజ్ఞతలు. మీకు నా బ్లాగ్ బాగా నచ్చినందులకు ఆనందముగా ఉంది.

Related Posts with Thumbnails